భద్రాచలంఅర్బన్: ఈ రోజుల్లో ప్రేమ పెళ్లిళ్లు సాధారణం అయ్యాయి. ఇందులో కులాంతర వివాహాలే ఎక్కువగా ఉంటున్నాయి. చాలా మంది తల్లిదండ్రులు ఈ పెళ్లిళ్లను అంగీకరించకపోవడంతో ఇల్లు వదిలి బయట జీవిస్తున్న జంటలే అధికం. అలాంటి వారికి ప్రభుత్వం అండగా నిలుస్తోంది. కుల రహిత సమాజాన్ని నిర్మించేందుకు ఇలాంటి పెళ్లిళ్లను ప్రోత్సహిస్తోంది. అయితే దంపతుల్లో ఒకరు తప్పకుండా దళితులై ఉండాలి. అలా చేసుకున్న వారికి రూ.2.50 లక్షల నగదు అందిస్తోంది. గతంలోరూ.50 వేల సాయం అందించేవారు.
గత నవంబర్‌లో ప్రభుత్వం ఈ మొత్తాన్ని పెంచింది. అయితే జిల్లాలో ఇలాంటి వివాహాలు చేసుకున్న వారు చాలా మంది ఉన్నా.. దీని గురించి తెలియక దరఖాస్తు చేసుకోవడం లేదు.ఈ పథకం 1980 నుంచే అమల్లో ఉంది. నాడు కులాంతర వివాహం చేసుకున్న జంటలకు రూ. 3,000 అందించేవారు. 1993లో రూ.10 వేలకు పెంచారు. 2011లో రూ.50 వేలు చేశారు. గత నవంబర్ నుంచి రూ. 2.50 లక్షలు అందిస్తున్నారు. పెళ్లయిన మూడేళ్ల తర్వాత ఈ మొత్తాన్ని లబ్ధిదారులకు అందజేస్తారు. ప్రభుత్వ సాయాన్ని రూ.50 వేలకు పెంచిన తర్వాత జిల్లాలో 84 జంటలు దరఖాస్తు చేసుకోగా, 73 జంటలకు సాయం అందింది. ఇంకా 11 జంటలకు రావాల్సి ఉంది. ప్రభుత్వ సాయం రూ. 2.50 లక్షలకు పెంచిన తర్వాత 15 దరఖాస్తులు రాగా, 2 జంటలు ఈ పథకం ద్వారా లబ్ధి పొందాయి.
కులాంతర వివాహం చేసుకున్న జంటకు బాండ్ అందజేస్తున్న ఇల్లెందు ఎమ్మెల్యే హరిప్రియ (ఫైల్)
దరఖాస్తు చేయడం ఎలా..?
ఈ పథకం కోసం దంపతులు తగిన ఆధారాలతో దరఖాస్తు చేసుకోవాలి. వధూవరుల ఫొటోలు, ఇద్దరి కుల, ఆదాయ, వయస్సు, వివాహ ధ్రువీకరణ పత్రాలు, బ్యాంక్ జాయింట్ అకౌంట్, వివాహానికి సాక్షులుగా ఉన్నవారి వివరాలను జతచేస్తూ ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేయాలి. ఆ తర్వాతే అదే దరఖాస్తును జిల్లా కేంద్రంలోని షెడ్యూల్డ్ కులాల అభివృద్ధి కార్యాలయంలో అందించాలి. అధికారులు వాటిని పరిశీలించి అర్హులైన జంటలను గుర్తించి ప్రభుత్వానికి నివేదిక అందజేస్తారు. అనంతరం లబ్ధిదారులకు రూ. 2.50 లక్షల ఫిక్స్‌డ్ డిపాజిట్ బాండ్ అందిస్తారు. మూడేళ్ల తర్వాత డబ్బులు చేతికొస్తాయి.
అవగాహన కల్పిస్తున్నాం
కులాంతర వివాహాలు చేసుకున్న వారికి ప్రభుత్వం అందించే ప్రోత్సాహకం గురించి ప్రజలకు ఎప్పటికప్పుడు అవగాహన కల్పిస్తున్నాం. ఈ మొత్తాన్ని రూ.2.50 లక్షలకు పెంచిన తర్వాత రాష్ట్రంలో మొదట లబ్ధి పొందిన జంట మన జిల్లావారే. గత నవంబర్ నుంచి ఇప్పటివరకు మొత్తం 15 దరఖాస్తులు వచ్చాయి. అందులో రెండు జంటలకు ప్రోత్సాహక ఫిక్స్‌డ్ డిపాజిట్ బాండ్‌లు అందించాం. మూడేళ్ల తర్వాత నగదు తీసుకోవచ్చు.– వెంకటేష్, జిల్లా షెడ్యూల్డ్ కులాలఅభివృద్ధి అధికారి.
Comments
Please login to add a commentAdd a comment