Sakshi Special Story Maduru Village In YSR District Pulivendula - Sakshi
Sakshi News home page

మాంసం ముట్టకూడదు.. మద్యం సేవించ కూడదు.. మార్పు మంచిదే..

Published Fri, Jan 27 2023 4:07 AM | Last Updated on Fri, Jan 27 2023 9:45 AM

Sakshi Special Story Maduru Village At YSR District Pulivendula

మడూరు గ్రామం వ్యూ

మాంసం ముట్టకూడదు.. మద్యం సేవించ కూడదన్నది ఆ ఊరివాళ్ల ఆచారం. అలాంటి ఆచారాన్ని పాటించే వారితోనే పెళ్లి సంబంధాలు కుదుర్చుకోవాలని పూర్వమే నిర్ణయించారు. దానినే ఆచారంగా.. కట్టుబాటుగా నిన్నమొన్నటి వరకు పాటిస్తూ వచ్చారు. తమ కులం వారు తగినంత మంది లేకపోవడం.. దూర ప్రాంతా­ల్లో అదే కులానికి చెందిన వ్యక్తులు ఉన్నప్పటికీ వారు మాంసం, మద్యం ముట్టుకుని ఉంటారేమోననే భయం వారిని మేనరిక వివాహాల చట్రంలోకి నెట్టేసింది. ఫలితంగా ఉన్న  ఊళ్లోనే దశాబ్దాలుగా మేనరికం వివాహాలు చేసుకుంటున్నారు. ఇదే భావితరాలకు శాపంగా పరిణమించింది. ఇప్పుడా గ్రామంలోని యువతరం మారుతోంది.. తమ కులస్తుల బతుకులను మార్చేందుకు కృషి చేస్తోంది.

సాక్షి ప్రతినిధి, కడప: ఆ ఊరి పేరు మడూరు. వైఎస్సార్‌ జిల్లా పులివెందుల నియోజకవర్గ పరిధిలోని తొండూరు మండలంలో ఉంది. గ్రామంలో 200 గడపలు ఉండగా.. 1,200 మందికి పైగా జనాభా ఉంది. అంతా సాతాని (బీసీ–డీ) కుటుంబాల వారే. అక్కడ ఒక్కరు కూడా మాంసం ముట్టరు. మద్యం సేవించరు. అది పూర్వం నుంచీ వస్తున్న ఆచారం. కట్టుబాటు తప్పితే కుటుంబం అభివృద్ధి చెందదనేది వారి భయం. ఇప్పటికీ గ్రామంలోకి మాంసాన్ని అను­మతించరు. మద్యాన్ని కూడా సేవించరు.

మాంసం తినే ఇతర సామాజిక వర్గాల వారు గ్రామంలోకి వచ్చినా.. వారిని ఇంట్లోకి రానివ్వరు. మంచాలపై కూర్చోనివ్వరు. బయట నుంచే మాట్లాడి పంపేస్తారు. తమ జీవిత భాగస్వాము­లు­గా వచ్చే­వారు.. వారి కుటుంబాలు కూడా మద్యం, మాంసాన్ని ముట్టకూడ­దన్నది వారి నియమం. సాతాని కులస్తులు రాష్ట్రవ్యాప్తంగా ఎక్కడా తగినంత మంది లేకపోవడం.. ఒకవేళ ఉన్నా బయటి ప్రాంతాల వారైతే మాంసం ముట్టుకుని ఉంటారేమోనన్న భ­యం వారిని వెంటాడుతోంది.

దీంతో ఉన్న ఊళ్లోనే దశాబ్దాల తరబడి మేనరికం వివాహాలు చేసుకుంటున్నారు. ఇదే భావితరాలకు శాపంగా మా­రింది. మేనరికాల వల్ల బిడ్డలు బుద్ధి మాంద్యం, అంధత్వం, ఇతర వైకల్యాలతో పుడుతున్నారు. గ్రామంలో ప్రతి ఇంట్లో ఒకరు లేదా ఇద్దరు ఏదో ఒక వైకల్యంతో బాధపడుతున్నవారే.

ఎవరెన్ని చెప్పినా..
మేనరికం వల్లే బిడ్డలు వైకల్యం బారినపడుతున్నా­రని వైద్య, ఆరోగ్య సిబ్బంది ఎన్నిసార్లు చెప్పినా గ్రామస్తులెవరూ వినిపించుకోలేదు. ప్రభుత్వం ప్రత్యేక కార్యక్రమాలు చేపట్టినా పెడచెవిన పెడుతూ వచ్చారు. దీంతో ఆ కుటుంబాల్లో పుట్టిన బిడ్డల జీవితాలు బుగ్గి పాలయ్యాయి. కొందరు మంచానికే పరిమితం కాగా.. మరికొందరు ఏ పనీ చేయలేక జీవచ్ఛవాలుగా మారారు. చూపు కోల్పోయినవారు కొందరైతే.. మాట్లాడలేని.. మాటలు వినలేని వారు ఇంకొందరు. పులివెందుల, కడప, కర్నూలు, అనంతపురం, హైదరాబాద్, చెన్నై ప్రాంతాల్లోని ఎన్ని ఆస్పత్రులు తిరిగినా.. ఎంత సొమ్ము వెచ్చించినా వారి సమస్యలు నయం కాలేదు.

ఓ ఇంట్లోఇద్దరు సోదరులు చనిపోగా.. మరో ఇంట్లో 22 ఏళ్ల వయసులో నిర్జీవంగా పడివున్న ప్రశాంత్‌.. ఇంకో కుటుంబంలో పుట్టుకతోనే చూపు కోల్పోయిన స్వర్ణలత.. వరలక్ష్మి, వెంకటశేషయ్య, మూగవారిగా బతుకీడుస్తున్న సంతోష్, కల్యాణి, వైకల్యంతో అవస్థలు పడుతూ బీటెక్‌ చదువుతున్న అరుణ్, పుట్టుకతోనే బుద్ధిమాంద్యంతో బతుకీడుస్తున్న ఐదేళ్ల ఐశ్వర్య, 26 ఏళ్ల వయసొచ్చినా చిన్నపిల్లాడిగానే కనిపించే సాయిరామ్‌ వంటి వారెందరో గ్రామంలో ఉన్నారు. వారిలో ఏ ఒక్కరిని చూసినా మనసు చెదిరిపోతుంది. గుండె తరుక్కుపోతుంది. 

ఇప్పుడిప్పుడే మార్పొస్తోంది
నాలుగైదు సంవత్సరాలుగా మడూరు యువత­లో మార్పు కనిపిస్తోంది. కొందరు చదువు­కున్న యువకులు బయట ప్రాంతాల వారిని వివాహం చేసుకుంటున్నారు. మరికొందరు కులాంతర వివాహాల వైపు మొగ్గు చూపుతున్నారు. గ్రామానికి చెందిన వెంకట నారాయణ, పల్లె ఎద్దులకొండ­య్య, పల్లె సూర్యనారాయణ, జి.రామానాయుడు, ఎ.రమేష్, పల్లె నవీన్, పల్లె శ్రేష్ట, ఎం.నాగలక్ష్మి తదితరులు ఉన్నత చదువులు చదివారు. వీరిలో కొందరు బయటి ప్రాంతాల వారిని వివాహం చేసుకున్నారు.

తమ గ్రామానికి చెందిన కొందరు కులాంతర వివాహాలు సైతం చేసుకుంటున్నారని గ్రామస్తులు చెబుతున్నారు. ప్రస్తుతం ఎవరిపైనా ఆంక్షలు పెట్టడం లేదని బయటి ప్రాంతాల్లోని సాతాని కులస్తులను వివాహం చేసుకున్నా.. చివరకు కులాంతర వివాహాలు చేసుకున్నా అనుమతిస్తున్నామని మాజీ సర్పంచ్‌  ప్రకాశరావు చెప్పారు.

నెల్లూరు నుంచి వచ్చా
మాది నెల్లూరు జిల్లా వెంకటగిరి మండలం మిట్టపాలెం గ్రామం. తొండూరు మండలం మడూరు గ్రామానికి చెందిన శివగణేష్‌ నన్ను వివాహం చేసుకున్నారు. నేను దూర ప్రాంతం నుంచి వచ్చినా.. చాలా బాగా చూసుకుంటున్నారు. గతంలో మడూరు గ్రామంలోనే వివాహాలు చేసుకునే వారు. పుట్టిన పిల్లలు వైకల్యం బారిన పడుతుండటంతో బయటి ప్రాంతాల వారిని వివాహాలు చేసుకుంటున్నారు.     
– ఎస్‌.పవిత్ర, యువతి, మడూరు

కలిసికట్టుగా ఉంటాం
మేమంతా ఒకే కులస్తులం. అందరం కలిసికట్టుగా ఉంటాం. గతంలో అందరూ ఇక్కడి వారినే వివాహాలు చేసుకునేవారం. ఏదైనా సమస్య వచ్చినా ఓర్పుతో కలిసికట్టుగా కూర్చుని చర్చించుకుని పరిష్కరించుకుంటాం. గతంలో మేనరిక వివాహాలు చేసుకోవడం వల్ల గ్రామంలో దాదాపు 50శాతం వైకల్యం ఉండేది. ఇప్పుడు దూర ప్రాంతాలైన నెల్లూరు, చిత్తూరు, అనంతపురం, కర్నూలు తదితర ప్రాంతాల వారిని వివాహాలు చేసుకోవడం వల్ల వైకల్యం తగ్గింది.     
– గోపాల్, సర్పంచ్, మడూరు 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement