Deccan Development Society
-
క్లైమెట్ ఎమర్జెన్సీ కాలంలో సరికొత్త పరిష్కారాలు వెతకాలి
సాక్షి, హైదరాబాద్: మారిన వాతావరణ పరిస్థితులు, రైతుల ఆకాంక్షల నేపథ్యంలో వ్యవసాయ రంగంలో ఎదురవుతున్న సరికొత్త సవాళ్లకు పాత కాలపు ఆలోచనలతో కూడిన పరిష్కారాలు సరిపడవని, క్లైమెట్ ఎమర్జెన్సీ కాలంలో సరికొత్త పరిష్కారాలు వెతకాల్సిన అవసరం ఉందని సుప్రసిద్ధ వ్యవసాయ శాస్త్రవేత్త, సుస్థిర వ్యవసాయ కేంద్రం ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ డాక్టర్ జీవీ రామాంజనేయులు పిలుపునిచ్చారు. సెంటర్ ఫర్ ఎకనమిక్ అండ్ సోషల్ స్టడీస్ (సెస్) మినీ ఆడిటోరియంలో మిల్లెట్ నెట్వర్క్ ఆఫ్ ఇండియా, డెక్కన్ డెవలప్మెంట్ సొసైటీ (డీడీఎస్) సంయుక్త ఆధ్వర్యంలో సోమవారం జరిగిన చర్చాగోష్టిలో ఆయన మాట్లాడారు.చిరుధాన్యాలపై అనేక రాష్ట్రాల్లో పనిచేస్తున్న సామాజిక కార్యకర్తలు, శాస్త్రవేత్తలు, స్వచ్ఛంద సంస్థల బాధ్యులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ‘క్లైమెట్ ఛేంజ్, మిల్లెట్స్, ఎకోసిస్టమ్ సర్వీసెస్’ అనే అంశంపై జరిగిన చర్చాగోష్టికి రామాంజనేయులు సమన్వయకర్తగా వ్యవహరించారు. రైతులకు వెన్నుదన్నుగా నిలిచేందుకు 30 ఏళ్ల నాడు పాలకులు ఏర్పాటు చేసిన మద్దతు వ్యవస్థలు ఇప్పటి సవాళ్లను ఎదుర్కోవటానికి పనికిరావని, కొత్త తరహా మద్దతు వ్యవస్థలను అమల్లోకి తెచ్చుకోవాల్సిన అవసరం ఉందని డా. రామాంజనేయులు సూచించారు. రైతుబంధు వంటి పథకాలను కొత్త సవాళ్ల వెలుగులో సమీక్షించుకోవాలన్నారు. రైతులకు ప్రభుత్వాలు అండగా నిలవాలిపర్యావరణ సేవలకు చెల్లింపులు అవసరం అజిమ్ ప్రేమ్‌జీ యూనివర్సిటీ అధ్యాపకురాలు డాక్టర్ మంజుల మేనన్ మాట్లాడుతూ.. రసాయనిక ఎరువులు, పురుగుమందులు వాడకుండా ప్రకృతి/ సేంద్రియ వ్యవసాయ పద్ధతుల్లో చిరుధాన్యాలు, పప్పుధాన్యాలు, నూనెగింజలు వంటి మిశ్రమ పంటలు సాగు చేసే రైతులకు ప్రభుత్వాలు అండగా నిలవాలన్నారు. వారు ప్రభుత్వం నుంచి ఎరువులకు సంబంధించి ఎటువంటి సబ్సిడీలు పొందటం లేదు. ప్రకృతికి అనుగుణమైన సాగు పద్ధతి వల్ల పర్యావరణానికి, సమాజానికి ఎన్నో విధాలుగా ప్రయోజనం ఒనగూడుతున్నది. ఈ పర్యావరణ సేవలకు గుర్తింపుగా ఈ రైతులకు ప్రత్యేక చెల్లింపులు చేయాల్సిన అవసరం ఉందని మంజుల సూచించారు.ఇది కొత్త భావన కాదని, ఇప్పటికే అనేక దేశాల్లో అమల్లో ఉన్నదేనన్నారు. డీడీఎస్ మాదిరి రసాయన రహిత జీవవైవిధ్య సాగు వల్ల భూసారాన్ని పెంపొందించటం, సాగు నీరు ఆదా అవుతుంది, పోషక విలువలతో కూడిన ఆహారం ప్రజలకు అందుతుంది కాబట్టి ఈ రైతులకు ప్రత్యేక మద్దతు వ్యవస్థను నెలకొల్పాల్సిన ఆవశ్యకత ఉందన్నారు. వ్యవసాయానికి ప్రభుత్వం కేటాయిస్తున్న నిధుల్లో 6% అదనపు నిధులతోనే ఈ మద్దతు వ్యవస్థను అందుబాలోకి తేవచ్చని తమ అధ్యయనంలో వెల్లడైందని మంజుల అన్నారు. రైతులు ఎందుకు నష్టపోవాలి?సీనియర్ పాత్రికేయుడు డాక్టర్ కెవి కూర్మనాధ్ మాట్లాడుతూ వాతావరణ మార్పుల వల్ల రైతులకు ఎదురవుతున్న సరికొత్త సమస్యలను పాలకులు గుర్తించకపోవటం విడ్డూరంగా ఉందన్నారు. కుండపోత వర్షాలు, అకాల వర్షాల వల్ల పత్తి, ధాన్యంలో అధిక మోతాదులో తేమ ఉంటే అందుకు రైతులు ఎందుకు నష్టపోవాలని ప్రశ్నించారు. వాతావరణ మార్పుల నేపథ్యంలో నిబంధనలు సడలించి రైతులకు అండగా నిలవాల్సిన అవసరాన్ని ప్రభుత్వం ఎందుకు గుర్తెరగటం లేదన్నారు.చిరుధాన్యాల సాగును ప్రోత్సహించాలిరైతు స్వరాజ్య వేదిక నేత కన్నెగంటి రవి మాట్లాడుతూ, తెలంగాణ ఏర్పాటైన తర్వాత మద్దతు ధర, సేకరణ సదుపాయాల్లేక రాష్ట్రంలో చిరుధాన్యాల సాగు మరింత దిగజారిందన్నారు. అధిక బ్యాంకు రుణాలు పొందటం కోసం చిరుధాన్యాలు సాగు చేసే రైతులు కూడా తాము పత్తి, వరి వంటి పంటలు సాగు చేస్తున్నామని అధికారులతో చెబుతున్నారని, అందుకే చిరుధాన్యాల వాస్తవ సాగు విస్తీర్ణం కూడా గణాంకాల్లో ప్రతిఫలించటం లేదన్నారు. అత్యంత కాలుష్యానికి కారణమయ్యే ఇథనాల్ పరిశ్రమలు మరో 30 రాష్ట్రంలో రానున్నాయని, వీటికి ముడిసరుకు అందించటం కోసమే ప్రభుత్వం వరి సాగును ప్రత్యేక బోనస్ ప్రకటించి మరీ ప్రోత్సహిస్తున్నదన్నారు. మూడు చిరుధాన్య పంటలకు మద్దతు ధర ప్రకటించినా, జొన్నలను మాత్రమే కోర్టు ఆదేశించినప్పుడే ప్రభుత్వం సేకరిస్తోందన్నారు. పర్యావరణానికి, ప్రజారోగ్యానికి మేలు చేసే చిరుధాన్యాల సాగును ప్రోత్సహించేదుకు ప్రభుత్వం తన విధానాలను మార్చుకోవాలని రవి కోరారు. -
Sai Priyanka pagadala: అమ్మలాంటి అన్నదాత కోసం...
తల్లి తన ఆకలి గురించి పట్టించుకోదు. పిల్లల కడుపు నిండిందా లేదా అనేదే ఆమెకు ముఖ్యం. రైతులు కూడా అమ్మలాంటి వారే. అందుకే వారిపై దృష్టి పెట్టింది సాయిప్రియాంక. తాను పండించే పంటల ద్వారా ఎంతోమందికి పోషకాహార శక్తిని అందిస్తున్న రైతు ఆ శక్తికి ఎంత దగ్గరలో ఉన్నాడు? ఎంత దూరంలో ఉన్నాడు... అనే ఆసక్తితో పరిశోధన బాట పట్టింది. తన పరిశోధన అంశాలను కొలంబోలో జరిగే అంతర్జాతీయ సదస్సులో వివరించడానికి సిద్ధం అవుతోంది.సాయిప్రియాంక చదువుకున్నది పట్టణాల్లో అయినా ఆమెకు పల్లెలు అంటేనే ఇష్టం. పల్లెల్లో పచ్చటి పొలాలను చూడడం అంటే ఇష్టం. ఆ ఇష్టమే వ్యవసాయం గురించి తెలుసుకోవాలనే ఆసక్తికి కారణం అయింది. ఆ ఆసక్తే తనను ‘అగ్రికల్చరల్ సైంటిస్ట్’ను చేసింది.ఇంటర్నేషనల్ ఫుడ్ పాలసీ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ (ఐఎఫ్పీఆర్ఐ) అనేది వాషింగ్టన్ కేంద్రంగా పనిచేస్తున్న అంతర్జాతీయ వ్యవసాయ పరిశోధనా కేంద్రం. పోషకాహార లోపానికి సంబంధించి పరిశోధన ఆధారిత పరిష్కారాలను అందించే సంస్థ ఇది. ప్రపంచ వ్యాప్తంగా ఉన్న ఇతర సంస్థలతో కలిసి ఈ సంస్థ ‘డెలివరింగ్ ఫర్ న్యూట్రిషన్ ఇన్ సౌత్ ఏషియా: కనెక్టింగ్ ది డాట్స్ ఎక్రాస్ సిస్టమ్స్’ అనే అంశంపై కొలంబోలో డిసెంబర్ 3,4,5 తేదీలలో అంతర్జాతీయ సదస్సు ఏర్పాటు చేస్తోంది. పోషకాహారం దాని ప్రభావిత అంశాల గురించి చర్చించడానికి ప్రపంచ వ్యాప్తంగా వివిధ రంగాలకు చెందిన నిపుణులు, విధానకర్తలు, పరిశోధకులను ఏకతాటిపై తీసుకు వస్తోంది.మన దేశం నుంచి ఆరుగురు ప్రతినిధులు ఈ ప్రతిష్ఠాత్మకమైన సదస్సులో పాల్గొనబోతున్నారు. వారిలో సాయి ప్రియాంక ఒకరు. తన పరిశోధనకు సంబంధించిన అంశాలను ఈ అంతర్జాతీయ సదస్సులో ప్రియాంక వివరించనుంది. ప్రత్యేక గ్రామాలు తెలంగాణ రాష్ట్రంలోని సంగారెడ్డి జిల్లా పస్తాపూర్, అర్జున్ నాయక్ తాండా, బిడకన్నె గ్రామాలకు వ్యవసాయ పరంగా ప్రత్యేకత ఉంది. వీటిని ‘ప్రత్యేక గ్రామాలు’ అనుకోవచ్చు. కొర్రలు, సామలు, ఊదలులాంటి సిరిధాన్యాలతో పాటు సుమారు 20 రకాల ఆకుకూరలు సాగు చేస్తుంటారు అక్కడి రైతులు. రసాయనాలు వినియోగించకుండా సేంద్రియ పంటలను పండిస్తున్నారు. దక్కన్ డవలప్మెంట్ సొసైటీ (డీడీఎస్)లాంటి సంస్థల ప్రోత్సాహంతో ఈ గ్రామాల్లోని రైతులు పౌష్టికాహారాన్ని ఇచ్చే ప్రత్యేక పంటలు సాగు చేస్తున్నారు.పత్తి, సోయా, చెరుకు లాంటి వాణిజ్య పంటలు సాగు చేసే గ్రామాలతో పోల్చితే ఈ ప్రత్యేక గ్రామాల్లోని ప్రజలకు పౌష్టికాహారం ఏ మేరకు అందుతోందనే అంశంపై ఎంతోమంది రైతులతో మాట్లాడింది సాయిప్రియ.‘అగ్రి న్యూట్రీ స్మార్ట్ విలేజెస్’ పేరుతో క్షేత్రస్థాయిలో పరిశోధనలు చేస్తోంది. రైస్, పప్పులులాంటి ఒకేరకమైన ఆహారంతో పాటు ఆకు కూరలు, సిరిధాన్యాలు తీసుకోవడం ద్వారా ఆ మూడు గ్రామాల ప్రజలు మెరుగైన పౌష్టికాహారం పొందగలుగుతున్నారని ఆమె పరిశోధనల్లో తేలింది. ఈ గ్రామాలతో పాటు హరియాణా, ఉత్తర్‌ప్రదేశ్‌లోని గ్రామాల్లో కూడా పరిశోధనలు చేస్తోంది.ఐఏఆర్ఐలో పీహెచ్డీఖమ్మం పట్టణానికి చెందిన పగడాల సాయి ప్రియాంక పదో తరగతి వరకు ఖమ్మంలో, ఇంటర్ విజయవాడలో చదువుకుంది. తల్లిదండ్రులు రాజరాజేశ్వరి, నర్సింహరావులు ఇద్దరూ ప్రభుత్వ ఉద్యోగులే. ‘డాక్టర్ కావాల్సిందే’ ‘ఇంజనీర్ కావాల్సిందే’లాంటి సగటు తల్లిదండ్రుల ఆలోచనకు దూరంగా కూతురుకి వ్యవసాయ రంగంపై ఉన్న ఆసక్తిని ప్రోత్సహించారు.వ్యవసాయ పరిశోధనపై ఎంతో ఆసక్తి ఉన్న సాయి ప్రియాంక అశ్వారావుపేటలో బీఎస్సీ అగ్రికల్చర్, మేఘాలయలోని సెంట్రల్ అగ్రికల్చర్ యూనివర్సిటీలో ఎమ్మెస్సీ పూర్తి చేసింది. ఢిల్లీలోని ఐఏఆర్ఐ (ఇండియన్ అగ్రికల్చర్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్)లో పీహెచ్డీ చేస్తోంది. ప్రస్తుతం జహీరాబాద్ ‘కృషి విజ్ఞాన కేంద్రం’లో అగ్రికల్చర్ ఎక్స్టెన్షన్ సైంటిస్ట్‌గా పనిచేస్తోంది.‘ఇవి మాత్రమే మనం చేరుకోవాల్సిన గమ్యాలు’ అని యువతరం ఒకే వైపు దృష్టి సారించినప్పుడు ఎన్నో రంగాలు మూగబోతాయి. ఆ రంగాలలో పరిశోధనలు ఉండవు. ప్రగతి ఉండదు. విభిన్న ఆలోచనలు ఉన్న సాయిప్రియాంక లాంటి అమ్మాయిలు తాము కొత్త దారిలో ప్రయాణించడమే కాదు ‘మనం ప్రయాణించడానికి, అన్వేషణ కొనసాగించడానికి ఒకే దారి లేదు. ఎన్నో దారులు ఉన్నాయి’ అనే విషయాన్ని చెప్పకనే చెబుతున్నారు. ఈ కోణంలో సాయిప్రియాంక ‘కృషి’ యువతరంలో ఎంతోమందికి స్ఫూర్తిగా నిలుస్తుంది.సంతోషంగా ఉంది‘అగ్రి న్యూట్రీ స్మార్ట్ విలేజ్’ అనే ్రపాజెక్ట్పై మూడు ప్రత్యేక గ్రామాల్లో నా పరిశోధనలు కొనసాగుతున్నాయి. ‘గ్లోబల్ హంగర్ ఇండెక్స్’లాంటి వాటి ఆధారంగా ఈ గ్రామాల్లో ఫుడ్ సెక్యూరిటీ ఇండెక్స్‌ను తయారు చేస్తున్నాము. ఇతర గ్రామాలతో పోల్చితే ఈ ప్రత్యేక గ్రామాల్లో కాస్త మెరుగైన పౌష్టికాహారం అందుతోంది. దక్షిణ ఆసియా దేశాలకు చెందిన సుమారు 600 మంది ప్రతినిధులతో కొలంబోలో జరిగే అంతర్జాతీయ సదస్సులో పాల్గొనే అవకాశం లభించినందుకు ఎంతో సంతోషంగా ఉంది.– సాయి ప్రియాంక, వ్యవసాయ శాస్త్రవేత్త పాత బాల ప్రసాద్, సాక్షి, సంగారెడ్డి -
అమ్మాయిలను కాపాడుకుందాం...
గ్రామీణ మహిళలను నిత్యం కలుస్తూ వారి సంక్షేమానికి కృషి చేస్తూ పరిష్కారాలను సూచిస్తూ మహిళా రైతుల అభివృద్ధికి చేయూతనిస్తున్నారు డాక్టర్ రుక్మిణీ రావు. ఏళ్ల తరబడి సామాజిక సేవా కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు ఆమె. డెక్కన్ డెవలప్మెంట్ సొసైటీ డైరెక్టర్‌గానూ, వందకు పైగా మహిళా రైతు సంఘాలతో కూడిన జాతీయవేదిక మకాం సహ వ్యవస్థాపకులుగానూ ఉన్నారు. నారీ శక్తి పురస్కార గ్రహీత, హైదరాబాద్ వాసి, సామాజిక కార్యకర్త రుక్మిణీరావుతో మాట్లాడినప్పుడు స్త్రీ సంక్షేమానికి సంబంధించిన ఆసక్తికర విషయాలను ఆమె ఇలా మనముందుంచారు. ‘‘ఒక మార్గాన్ని ఎంచుకున్నప్పుడు ఎన్ని ఒడిదొడుకులు ఎదురైనా, ఆపకూడదు, ఆగకూడదు. ఈ రోజుల్లో మన అమ్మాయిలను కాపాడుకోవాల్సిన అవసరం చాలా ఉంది. మేం తెలంగాణలోని నల్లగొండ జిల్లాలో 50 గ్రామాల్లోని 8 నుంచి 17 ఏళ్ల వయసు లోపు అమ్మాయిల సంక్షేమానికి గ్రామ్య రిసోర్స్ సెంటర్లో భాగంగా వర్క్ చేస్తున్నాం. మహిళల సంక్షేమానికి కృషి చేద్దామని చేసిన ప్రయత్నంలో ఎన్నో సంఘటనలు వెలుగు చూస్తున్నాయి. ఇటీవల 15–16 ఏళ్ల లోపు అమ్మాయిలు తెలిసిన, తెలియని అబ్బాయిల మాటలు నమ్మి ఇల్లు వదిలి వెళ్లిన ఘటనలను ఎక్కువ చూస్తున్నాం. దీంతో స్కూల్ నుంచి డ్రాపౌట్ అయిన వాళ్లకు, ఇల్లు వదిలి బయటకు వెళ్లిన వాళ్లను తిరిగి వచ్చేలా, కౌన్సెలింగ్స్ చేస్తున్నాం. ఇద్దరు చిన్నపిల్లలను వారి తల్లిదండ్రులు అమ్మడం గురించి తెలిసి మా స్నేహితురాలు జమునతో కలిసి నేనూ అక్కడకు వెళ్లాను. ఆ అమ్మకం కార్యక్రమాన్ని అడ్డుకుని, వారికి సహాయం చేయాలనుకున్నప్పుడు ‘గ్రామ్య రిసోర్స్ సెంటర్ ఫర్ ఉమెన్స్’’ని ప్రారంభించాం. ఈ సంస్థకు 30 ఏళ్లు పూర్తయ్యాయి. ఆరు మండలాల్లో దాదాపు 800 మంది మహిళలు తమ జీవనోపాధిని మెరుగుపరచుకోవడానికి, ఆడపిల్లల పట్ల వారి వైఖరిని పునరాలోచించడానికి వర్క్ చేస్తున్నాం. ఏళ్లుగా ఆడ శిశుహత్యలతో పాటు అంతర్జాతీయ దత్తత ద్వారా కూడా ఆడపిల్లల అక్రమ రవాణాకు విస్తృతమైన నెట్వర్క్ ఉందని కనుక్కొన్నాం. ప్రచార పద్ధతిలో పని చేస్తూ, అనేక అక్రమ దత్తత కేంద్రాలను మూసివేయించాం. వివక్ష లేని చోట పెంపకం నా చిన్నతనంలో మా అమ్మమ్మ, అమ్మ, అత్తల మధ్య పెరిగాను. ఆ విధంగా ఇంటిని నడిపే సమర్థ మహిళల గురించి నాకు తెలుసు. మా ఇంట్లో అబ్బాయిలు, అమ్మాయిలు అనే వివక్ష ఉండేది కాదు. నేను బాగా చదువుకోవాలన్నది అమ్మ ఆలోచన. ఉస్మానియా యూనివర్శిటీ ఆర్ట్స్ కాలేజీ నుండి సైకాలజీలో మాస్టర్స్ పూర్తి చేశాను. చదువు చెప్పాలనే ఆలోచనతో హైదరాబాద్‌లోని సెయింట్ ఫ్రాన్సిస్ కాలేజ్ ఫర్ ఉమెన్స్ లో టీచింగ్ చేశాను. ఆ తర్వాత ఢిల్లీలో సైకాలజీలో పీహెచ్డీ చేశాను. 1970 – 1980ల మధ్య వరకు ఢిల్లీలోని నేషనల్ లేబర్ ఇన్స్ స్టిట్యూట్, పబ్లిక్ ఎంటర్ప్రైజ్ సెంటర్ ఫర్ కంటిన్యూయింగ్ ఎడ్యుకేషన్స్ లో కెరియర్ స్టార్ట్ చేశాను. అప్పుడే జీవితం ఒక మలుపు తీసుకుందనిపిస్తుంది. వరకట్న మరణాలు తీవ్ర సమస్యగా ఉన్న రోజులవి. ఇది సమాజానికే అనారోగ్యం అనిపించేది. మా స్నేహితులతో కలిసి ఎడతెగని చర్చలు జరిపేవాళ్లం. వరకట్న వ్యతిరేక ప్రదర్శనలలో విస్తృతంగా పాల్గొన్నాం. అప్పుడు 1981లో మహిళల కోసం ‘సహేలీ రిసోర్స్’ సెంటర్‌ను ఏర్పాటు చేశాం. అక్కణ్ణుంచి ఈ మార్గంలో ఏళ్లుగా ప్రయాణిస్తున్నాను. నాతో పాటు ఎన్నో అడుగులు తోడయ్యాయి. సేవా కార్యక్రమాలు చేసేవారితో నేనూ కలుస్తున్నాను. సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా... పదేళ్లక్రితం ఒక విషయం మమ్మల్ని కదిలించింది. కౌమార దశలో గ్రామాల్లో ఉన్న అమ్మాయిలకు సర్వైకల్ క్యాన్సర్ వ్యాక్సిన్ ఇచ్చారు. దానివల్ల వచ్చిన సైడ్ ఎఫెక్ట్స్ మీద ఎవరూ దృష్టి పెట్టలేదు. అక్కడ ఆ అమ్మాయిలు ఎలాంటి సమస్యలు ఎదుర్కొన్నారో మేం స్వయంగా చూశాం. దీంతో ఇది సరైన పద్ధతి కాదని మా ఇద్దరు ఫ్రెండ్స్‌తో కలిసి సుప్రీం కోర్టులో కేసు వేశాం. విదేశాలలో ఒక వ్యాక్సిన్ గురించి నిర్ణయం తీసుకుంటే వాళ్లు సెంటర్‌ను ఏర్పాటు చేస్తారు. అలాంటిది మన దగ్గర లేదు. ఇప్పుడు వ్యాక్సిన్ ఖరీదు తగ్గిందన్నారు. వ్యాక్సిన్ వేయాలంటున్నారు. డాక్టర్లు చెప్పిన ఆలోచన కూడా బాగుంది. అయితే, ఆ తర్వాత వచ్చే సమస్యలపైన కూడా దృష్టి పెట్టమని, మెడికల్ సిస్టమ్‌ను కరెక్ట్ చేయమని ప్రభుత్వాలను కోరుతున్నాం. అప్పుడే, ఈ డ్రైవ్‌ను ముందుకు తీసుకెళితే బాగుంటుంది’’ అని తన అభిప్రాయలను వెలిబుచ్చారు రుక్మిణీరావు. గ్రామీణ మహిళలతో కలిసి... 1989లో ఢిల్లీ నుంచి తిరిగి హైదరాబాద్‌కు వచ్చేశాను. పుట్టిపెరిగిన ప్రాంతం, పరిచయమున్న సాంçస్కృతిక నేపధ్యంలో సమర్థంగా పని చేయగలనని భావించాను. న్యాయం కోసం కోర్టులకు వచ్చే మధ్యతరగతి మహిళలకు సహాయం చేయడం ప్రారంభించాం. వారి స్థితి చూశాక ఇంకా ఎంతో చేయాల్సింది ఉందనిపించింది. అక్కణ్ణుంచి గ్రామీణ మహిళల సంక్షేమానికి శ్రద్ధ వహించాల్సిన అవసరం గుర్తించి అటువైపుగా అడుగులు వేశాం. 30 ఏళ్లుగా మహిళా రైతుల హక్కులను ప్రోత్సహించడానికి డెక్కన్ డెవలప్మెంట్ సొసైటీతో కలిసి పనిచేస్తున్నాను. సంస్థలో మహిళా నాయకత్వాన్ని అభివృద్ధి చేయడం, వర్క్‌షాప్‌ల నిర్వహణ ముఖ్యంగా తీసుకున్నాను. సొసైటీలో డైరెక్టర్, బోర్డ్ మెంబర్‌గా ఉన్నాను. ఇవి కాకుండా దేశవ్యాప్తంగా ఉన్న మహిళా రైతులతో ‘మకాం’ అనే వేదిక ద్వారా విస్తృత కార్యక్రమాలు చేస్తున్నాం. రైతు అనగానే ట్రాక్టర్‌పైన మగవాళ్లు ఉండటమే కనిపిస్తుంది. కానీ, ఇప్పుడు ఆడవాళ్లు కూడా ట్రాక్టర్లు నడపడం, వ్యవసాయం, ఆహార ఉత్పత్తుల తయారీలో అగ్రభాగాన ఉండేలా కృషి చేస్తున్నాం. ఒంటరి మహిళల కోసం సమాఖ్యను ఏర్పాటు చేశాం. ఇందులో సంఘాలున్నాయి. తెలంగాణలోని 10 జిల్లాల నుంచి కో ఆర్డినేషన్ చేస్తున్నాం. లెప్రసీ వ్యాధి అనేది దాదాపుగా కనుమరుగైందని అంతా అనుకుంటున్నారు. కానీ, లెప్రసీతో బాధపడుతున్న వారిని మేం గుర్తించాం. ఈ వ్యాధి ముదరకుండా ముందస్తు నివారణకు సాయం అందిస్తున్నాం. – నిర్మలా రెడ్డి ఫొటో: అనిల్ కుమార్ మోర్ల -
మహిళల ఘన విజయం: విత్తనం పరిరక్షణకు‘చిరు’యత్నం
‘ఇంటర్నేషనల్ సీడ్ డే’... ఇలాంటి ఓ రోజు ఉందా! ఉంది... అయితే ప్రచారమే పెద్దగా ఉండదు. ఇది గ్లామర్ మార్కెట్ వస్తువు కాకపోవడమే కారణం. ఈ రోజును రైతు మహిళలు నిర్వహించారు. ‘చిరు’సాగు చేసి కళ్లాల్లో రాశులు పోసిన చేతులవి. విత్తనాన్ని కాపాడాలనే ముందుచూపున్న చేతలవి. రాగి ముద్ద స్టార్ హోటల్ మెనూలో కనిపిస్తోంది. స్మార్ట్‌గా ఆర్డర్ చేస్తే అందమైన ప్యాక్‌తో ఇంటిముందు వాలుతోంది. అలాగే సజ్జ ఇడ్లీ, ఊదల దోసె, కొర్రల కర్డ్ మీల్, జొన్న రొట్టె, మిల్లెట్ చపాతీ, మిల్లెట్ పొంగలి... ఇలా బ్రేక్ ఫాస్ట్ సెంటర్లు కొత్త రూపుదిద్దుకున్నాయి. ఎక్కడో మారుమూల గ్రామాల్లో నీటి వసతి లేని నేలను నమ్ముకుని బతికే వాళ్ల ఆకలి తీర్చిన చిరుధాన్యాలు ఇప్పుడు బెంజ్‌కారులో బ్రేక్‌ఫాస్ట్‌కి వెళ్లే సంపన్నుల టేబుల్ మీదకు చేరాయి. ఒకప్పుడు చిన్న చూపుకు గురైన చిరుధాన్యాలు నేడు సిరిధాన్యాలుగా మన దైనందిన జీవితంలో ప్రధాన భూమికను పోషిస్తున్నాయి. వీటి వెనుక నిరుపేద మహిళల శ్రమ ఉంది. పాతికేళ్లుగా ఈ నిరుపేద మహిళలు చిరుధాన్యాలతోనే జీవించారు, చిరుధాన్యాల పరిరక్షణ కోసమే జీవించారు. సేంద్రియ సేద్యంతో చిరుధాన్యాల జీవాన్ని నిలిపారు. అంతర్జాతీయ విత్తన దినోత్సవం (ఏప్రిల్ 26) సందర్భంగా బుధవారం వీరంతా మెదక్ జిల్లా, జహీరాబాద్ మండలం, పస్తాపూర్‌లో తమ దగ్గరున్న పంటల విత్తనాలను సగర్వంగా ప్రదర్శించారు. హైబ్రీడ్ వంగడాల మాయలో పడకుండా మన విత్తనాలను మనం కాపాడుకోవాలని ఒట్టు పెట్టుకున్నారు. ఈ సందర్భంగా హైదరాబాద్ కేంద్రంగా పని చేస్తున్న దక్కన్ డెవలప్మెంట్ సొసైటీ బోర్డు సభ్యులు రుక్మిణీరావు సాక్షితో పంచుకున్న వివరాలివి. ఈ నేల... ఈ విత్తనం... మన సొంతం ‘‘చిరుధాన్యాల పట్ల అవగాహన కోసం ఈ ఏడాదిని ‘ఇంటర్నేషనల్ ఇయర్ ఆఫ్ మిల్లెట్స్’ నిర్వహించుకుంటున్నాం. ఈ ఏడాది సీడ్ డే రోజున మేము చిరుధాన్యాల విత్తనాల పరిరక్షణ, ప్రదర్శన నిర్వహించాం. పస్తాపూర్ కేంద్రంగా జరిగిన ఈ కార్యక్రమంలో 26 పరిసర గ్రామాల నుంచి వందకు పైగా మహిళలు వారు పండించి, పరిరక్షించిన విత్తనాలను తీసుకువచ్చారు. చిరుధాన్యాలతోపాటు పప్పుధాన్యాలు, నూనె గింజల విత్తనాలు మొత్తం యాభైకి పైగా పంటల విత్తనాలకు ఈ ప్రదర్శన వేదికైంది. ఇవన్నీ సేంద్రియ సేద్యంలో పండించినవే. ఆహారం –ఆకలి! ఆహారం మన ఆకలి తీర్చాలి, దేహానికి శక్తినివ్వాలి. ‘వరి అన్నం తిని పొలానికి వెళ్తే పని మొదలు పెట్టిన గంట సేపటికే మళ్లీ ఆకలవుతుంది. రొట్టె తిని వెళ్తే ఎక్కువ సేపు పని చేసుకోగలుగుతున్నాం. అందుకే మేము కొర్రలు, జొన్నలు తింటున్నాం’ అని ఈ మహిళలు చెప్పిన మాటలను తోసిపుచ్చలేదు సైంటిస్టులు. వారి అనుభవం నుంచి పరిశోధన మొదలు పెట్టారు. అందుకే మిల్లెట్స్‌లో దాగి ఉన్న శక్తిని ప్రపంచ వేదికల మీద ప్రదర్శించగలిగారు. అలాగే ఈ మహిళలు విదేశాల్లో రైతు సదస్సులకు హాజరై తమ అనుభవాలను వారితో పంచుకున్నారు. భూగోళం ఎదుర్కొంటున్న మరో విపత్తు క్లైమేట్ చేంజ్. ఈ పంటలైతే వాతావరణ ఒడిదొడుకులను ఎదుర్కుని పంటనిస్తాయి. పదిహేను రోజులు నీరు అందకపోయినప్పటికీ జీవాన్ని నిలుపుకుని ఉంటాయి. చిరుధాన్యాలకు గాను మన ముందున్న బాధ్యత ఈ విత్తనాలను కాపాడుకోవడం. ఎట్టి పరిస్థితుల్లోనూ వీటి మీద హక్కులను కార్పొరేట్ సంస్థలు తన్నుకుపోకుండా చూసుకోవాలి. అవసరమైతే ఉద్యమించాలి. ఇదే మనం డీడీఎస్ స్థాపకులు మిల్లెట్ మ్యాన్ పీవీ సతీశ్‌గారికి ఇచ్చే నివాళి’’ అన్నారు రుక్మిణీరావు. చిరుధాన్యాలను పండించడంలో ముందడుగు వేసేశాం. ఇక మన ముందున్న బాధ్యత ఈ విత్తనాలను కాపాడుకోవడం. ఈ విత్తనాల మీద పూర్తి హక్కులు ఈ పేద రైతు మహిళలవే. – రుక్మిణీరావు, బోర్డు సభ్యులు, దక్కన్ డెవలప్మెంట్ సొసైటీ – వాకా మంజులారెడ్డి -
పాతపంట.. కొత్త సంబురం
జహీరాబాద్: అంతరించిపోతున్న పాతపంటల పరిరక్షణకు ఏటా మాదిరిగానే ఈసారీ పస్తాపూర్‌లోని డీడీఎస్ (డెక్కన్ డెవలప్మెంట్ సొసైటీ) ఆధ్వర్యంలో పాత పంటల జాతరను నిర్వహించేందుకు ఏర్పాట్లు పూర్తి చేశారు. సంక్రాంతి పర్వదినమైన జనవరి 14న ఎడ్లబండ్లలో పాత పంటల ధాన్యంతో జాతరను సంగారెడ్డి జిల్లా న్యాల్కల్ మండలంలోని శంశల్లాపూర్ గ్రామంలో ప్రారంభిస్తారు. నెల తరువాత ఫిబ్రవరి 15న ఝరాసంగం మండలం మాచ్నూరులో నిర్వహించే కార్యక్రమంతో జాతర ముగుస్తుంది. పాతపంటల ప్రాధాన్యత గురించి వివరిస్తూ అంతరించిపోతున్న పంటలను పరిరక్షించుకుని పల్లె వ్యవసాయాన్ని కాపాడుకునే విధానంపై ప్రచారం నిర్వహిస్తారు. జాతరలో అందంగా అలంకరించిన 16 ఎడ్లబండ్లలో పాతపంటల ధాన్యాన్ని ప్రదర్శిస్తారు. వానాకాలం, యాసంగి కోసం విత్తనాల నిల్వలు జహీరాబాద్ ప్రాంత రైతాంగానికి ప్రభుత్వం సరఫరా చేసే విత్తనాల కోసం ఎదురు చూడకుండా అవసరమైన విత్తనాలను ముందే నిల్వ చేసి ఉంచుతారు. రైతులు తాము పండించిన పంట చేతికందగానే పంటలోని నాణ్యమైన ధాన్యాన్ని విత్తనం కోసం సేకరించి పెడతారు. ఆ విత్తనాన్ని ఈత ఆకులతో చేసిన బుట్టల్లో పోసి పైభాగంలో మట్టి, పేడ కలిపి మూసివేస్తారు. విత్తనం ధాన్యంలో వేపాకు, బూడిద, పురుగు పట్టకుం డా మందు కలుపుతారు. విత్తనాలు నాటే సమయం రాగానే వాటిని బయటకు తీస్తారు. నియోజకవర్గంలోని దాదాపు 68 గ్రామాల్లో మహిళ లు విత్తన బ్యాంకులను ఏర్పాటు చేసుకున్నారు. డీడీఎస్ ఆధ్వర్యంలో విత్తన బ్యాంకులను నిర్వహిస్తున్నారు. ఈ విత్తనాలు సుమారు 10 వేల ఎకరాలకుపైగా సాగు చేసేందుకు ఉపయోగపడు తాయి. రైతులు 20 నుంచి 30 రకాల విత్తనాలను అందుబాటులో పెట్టుకుంటారు. -
తిరిగొచ్చిన చెల్లెండ్లు
సాక్షి, జహీరాబాద్: పర్యావరణ పరిరక్షణే ధ్యేయంగా పెట్టుకుని ముందుకు సాగుతున్న డీడీఎస్(డెక్కన్ డెవలప్మెంట్ సొసైటీ) మహిళా సంఘం సభ్యులు మొగులమ్మ, అనసూయమ్మలు ఐక్యరాజ్య సమితి అవార్డును అందుకుని స్వస్థలాలకు తిరిగి వచ్చారు. శనివారం వారు జహీరాబాద్ చేరుకున్నారు. మూడు దశాబ్దాల కాలంగా డీడీఎస్ మహిళా సంఘం సభ్యులు చేస్తున్న పర్యావరణ హిత కార్యక్రమాలను గుర్తించిన ఐక్యరాజ్య సమితి అనుబంధ సంస్థయిన యునైటెడ్ నేషన్స్ డెవలప్మెంట్ ప్రోగ్రాం(యూఎన్ డీపీ)‘ఈక్వేటారి’ అవార్డుకు ఎంపిక చేసింది. డెక్కన్ డెవలప్మెంట్ సొసైటీ మహిళా సంఘం(చిరు ధాన్యాల చెల్లెండ్ల సమాఖ్య) సభ్యులు ఈ అవార్డును అందుకున్నారు. ఈనెల 19 నుంచి 26వ తేదీ వరకు అమెరికాలోని న్యూయార్క్‌లో ఐక్యరాజ్య సమితి అనుబంధ సంస్థ అవార్డుల ప్రదానం కార్యక్రమం నిర్వహించింది. 25న అవార్డు ఈ వేదికపై నుంచి డెక్కన్ డెవలప్మెంట్ సొసైటీ(డీడీఎస్) మహిళా సంఘం సభ్యులు అనసూయమ్మ, మొగులమ్మలు అవార్డు అందుకున్నారు. 2019 సంవత్సరానికి గాను జహీరాబాద్ మండలంలోని పస్తాపూర్‌లో ఉన్న డీడీఎస్ మహిళా సంఘానికి ఈక్వెటారి అవార్డు దక్కింది. డీడీఎస్ మహిళా సంఘానికి వచ్చిన అవార్డును అందుకునేందుకు పస్తాపూర్ గ్రామానికి చెందిన అనుసూయమ్మ, పొట్పల్లి గ్రామానికి చెందిన మొగులమ్మలను సంస్థ ఎంపిక చేసింది. గత 17 సంవత్సరాల కాలంగా యూఎన్డీపీ ప్రతి సంవత్సరం ప్రపంచ స్థాయిలో అందజేస్తున్న అవార్డులు ఇప్పటి వరకు మన దేశంలో 9 సంస్థలకు మాత్రమే దక్కాయి. ఈ సారి డీడీఎస్ మహిళా సంఘం 10వ అవార్డుకు ఎంపికైంది. సేంద్రియ వ్యవసాయంపై మొగులమ్మ ప్రసంగం డీడీఎస్ మహిళా సంఘం అధ్యక్షురాలు పొట్పల్లి మొగులమ్మ సేంద్రియ వ్యవసాయం, భూసారాన్ని పెంచడం, చిరు ధాన్యాల సాగు, కలిపి పంటల సాగు వల్ల కలిగే ప్రయోజనాలను న్యూయార్క్‌లో జరిగిన వేదికపై ప్రస్తావించింది. ప్రస్తుతం రసాయన ఎరువుల వాడకం వల్ల ఎదురవుతున్న అనర్థాలు, మానవ మనుగడకు ముంచుకు వస్తున్న ముప్పును వివరించింది. సేంద్రియ వ్యవసాయం, చిరుధాన్యాల ఆహారంతోనే భవిష్యత్తు ఉందని, దీన్ని అన్ని దేశాల ప్రజాప్రతినిధులు, అధికారులు గుర్తించాలని చెప్పుకొచ్చారు. పర్యావరణ వ్యవసాయంతో ఎంతో ముందడుగు సాధించామని, ఇది తమకు అవార్డును తెచ్చిపెట్టిందన్నారు. ఇన్నేళ్లకైనా తమ సంస్థకు ఈక్వేటారి అవార్డు రాడంతో జీవితంలో గుర్తిండిపోతుందని వేదికపై సంతోషం వ్యక్తం చేశారు. అడవులు పెంచడంపై అనసూయమ్మ ప్రసంగం మొక్కలు నాటడం, అడవుల పెంపకం ప్రాధాన్యతపై డీడీఎస్ మహిళా సంఘం ప్రతినిధి అనసూయమ్మ తన అభిప్రాయాన్ని అంతర్జాతీయ వేదికపై వినిపించింది. అడవులను పెంచడం ద్వారా పర్యావరణాన్ని కాపాడిన వాళ్లమవుతామని, అంతే కాకుండా పర్యావరణానికి పొంచి ఉన్న ముప్పును ఎదుర్కోవడం చెట్ల పెంపకం ద్వారానే సాధ్యమని చెప్పారు. తాను తోటి మహిళలతో కలిసి అడవిని పెంచానని, ఇప్పుడు ఇది ఎంతో ఫలితాలను ఇస్తోందన్నారు. ప్రతి దేశం కూడా అడవులను పెంచాల్సిన ఆవశ్యకతపై ప్రస్తావించి అందరి నుంచి అభినందనలు అందుకున్నారు. తాము చేసిన పనులకు గుర్తింపు లభించడం సంతోషంగా ఉందని, డీడీఎస్ మహిళా సంఘానికి వచ్చిన ఈక్వేటారి అవార్డు అందుకోవడం కూడా జీవితంలో మర్చిపోలేని అనుభూతినిచ్చిందని వేదికపై పేర్కొంది. -
'అరుదైన' అవకాశానికి అవరోధం
సాక్షి, జహీరాబాద్: ఐక్యరాజ్య సమితి ఎంపిక చేసిన ‘ఈక్వేటారి’ అవార్డును అందుకునే అవకాశం దూరం కావడం పట్ల డెక్కన్ డెవలప్మెంట్ సొసైటీ మహిళా సంఘం(చిరు ధాన్యాల చెల్లెండ్ల సమాఖ్య) సభ్యులు తీవ్ర నిరాశకు గురయ్యారు. ఈనెల 19 నుంచి 26వ తేదీ వరకు అమెరికాలోని న్యూయార్కులో ఐక్యరాజ్య సమితి అనుబంధ సంస్థ అయిన యునైటెడ్ నేషన్స్ డెవలప్మెంట్ కార్యక్రమం (యూఎన్డీపీ) ప్రతిష్టాత్మక ఈక్వేటారి అవార్డుల ప్రధానోత్సవ కార్యక్రమాన్ని నిర్వహిస్తోంది. ఇదే వేదిక నుంచి డెక్కన్ డెవలప్మెంట్ సొసైటీ(డీడీఎస్) మహిళా సంఘం సభ్యులు అవార్డును అందుకోవాల్సి ఉంది. ఇందు కోసం ఐక్యరాజ్య సమితి నుంచి సంస్థ సభ్యులకు ఆహ్వానం సైతం లభించింది. అయినా అవార్డును అందుకునేందు కోసం వెళ్లే మహిళలు వీసా కోసం దరఖాస్తు చేసుకోగా తిరస్కరణకు గురి అయింది. ఇది సంఘం సభ్యులను ఎంతో నిరాశ పర్చింది. ప్రపంచ వ్యాప్తంగా పనిచేసే పర్యావరణ వేత్తలు, వారి సంస్థలకు ఐక్యరాజ్య సమితి ఈక్వేటారి అవార్డులను ఇస్తూ వస్తోంది. 2019 సంవత్సరానికి గాను జహీరాబాద్ మండలంలోని పస్తాపూర్‌లో గల డీడీఎస్ మహిళా సంఘానికి ఈ అవార్డుకు చోటు దక్కింది. గత 30 సంవత్సరాల కాలంగా అవిశ్రాంతంగా పర్యావరణ మేలు కోసం డీడీఎస్ మహిళా సంఘాలు చేస్తున్న కృషి, పనులను గుర్తించిన ఐక్యరాజ్య సమితి అనుబంధ సంస్థ అయిన యునైటెడ్ నేషన్స్ డెవలప్మెంట్ ప్రోగ్రాం డీడీఎస్ మహిళా సంఘానికి అవార్డుకు ఎంపిక చేసింది. డీడీఎస్ మహిళా సంఘానికి వచ్చిన అవార్డును అందుకునేందుకు గాను పస్తాపూర్ గ్రామానికి చెందిన అనుసూయమ్మ, పొట్పల్లి గ్రామానికి చెందిన మొగులమ్మలను సంస్థ ఎంపిక చేసింది. వారికి ట్రాన్స్లేటర్లుగా జయశ్రీ, మయూరిలను ఎంపిక చేశారు. గత 17 సంవత్సరాల కాలంగా యూఎన్డీపీ ప్రతి సంవత్సరం ప్రపంచ స్థాయిలో అందజేస్తున్న అవార్డులకు గాను ఇప్పటి వరకు భారత దేశంలో 9 సంస్థలు మాత్రమే ఈ అవార్డుకు ఎంపికయ్యాయి. ఈ సారి డీడీఎస్ మహిళా సంఘం 10వ అవార్డుకు ఎంపికైంది. గత మూడు దశబ్దాల కాలంగా అవిశ్రాంతంగా పర్యావరణ మేలు కోసం డీడీఎస్ సంఘాలు చేస్తున్న పనిలో సామాజిక అటవుల కమ్యూనిటీ నియంత్రిత పీడీఎస్ ద్వారా బీడు భూములకు పచ్చ దుప్పటి కప్పడం, గ్రామల పక్కన ఉండే ఖాళీ స్థలాల్లో మొక్కలు నాటి హరిత వనాలను పెంచడం, కనుమరుగవుతున్న మందు చెట్లను కాపాడి వాటిని అభయారణ్యం లాంటి స్థావరాలుగా రూపుదిద్దడం, అంతరించి పోతున్న చిరు ధాన్యాలను పరిరక్షించి విస్తరింప జేయడం, కమ్యూనిటీ విత్తనాల బ్యాంకులను స్థాపించడం లాంటి కార్యక్రమాలను డీడీఎస్ మహిళా సంఘాల సభ్యులు తీసుకుని విజయం సాధించడంలాంటి అద్భుతమైన పనులకు గుర్తింపుగా ఈక్వేటారి అవార్డు దక్కింది. ప్రపంచ వ్యాప్తంగా 127 దేశాలకు చెందిన 847 నామినేషన్లు ఐక్యరాజ్య సమితి అవార్డుకోసం దాఖలయ్యాయి. వీటన్నింటిని పరిశీలించిన అనంతరం 20 మంది విజేతలను యూఎన్డీపీ ఎంపిక చేసింది. వీటిలో డీడీఎస్ మహిళా సంఘానికి అరుదైన చోటు దక్కింది. ఈ అవార్డును అందుకునేందుకు గాను వెళ్లేందుకు ఎంపికైన మహిళా సంఘం సభ్యులు అనుసూమ్మ, మొగులమ్మలతో పాటు ట్రాన్స్లేటర్లుగా జయశ్రీ, మయూరిలను పంపేందుకు నిర్ణయించారు. ఈ మేరకు వీసా కోసం దరఖాస్తు చేసుకున్నారు. వీసా దరఖాస్తులు తిరస్కరణకు గురికావడంతో మహిళా సంఘం సభ్యులు తీవ్ర నిరాశకు గురయ్యారు. మేము చేసిన పనులు చెప్పుకోవాలనుకున్నా గత మూడు దశాబ్దాల కాలంగా డీడీఎస్ మహిళా సంఘాల సభ్యులు పర్యావరణాన్ని కాపాడేందుకు చేస్తున్న కా>ర్యక్రమాలను చెప్పుకోవాలనుకున్నా. ఇందు కోసం పూర్తిగా సిద్ధం అయ్యా. అవార్డును అందుకునేందుకు చేసుకున్న వీసా దరఖాస్తు తరస్కరణకు గురు కావడం తీవ్ర ఆవేదనకు గురి చేసింది. మే ం సాధించిన విషయాలను ఐక్యరాజ్య సమితి వేదికగా ప్రపంచ వ్యాప్తంగా వచ్చే పర్యావరణ పరిరక్షకులకు వినిపించి మరింత విస్తరింపజేసేలా వివరించాలనుకున్నా. వీసా రాక పోవడం ఎంతో బాధను కలిగించింది. –అనుసూయమ్మ, మహిళా సంఘం సభ్యురాలు వీసా తిరస్కరణ తీవ్ర నిరాశకు గురి చేసింది ఐక్యరాజ్య సమితి అనుబంధ సంస్థ అయిన యునైటెడ్ నేషన్స్ డెవలప్మెంట్ ప్రోగ్రాం(యూఎన్డీపీ) ప్రతిష్టాత్మక ఈక్వేటారి అవార్డు పొందేందుకు గాను నూయార్కు వెళ్లేందుకు అవసరమైన వీసా లభించక పోవడం తీవ్ర నిరాశకు గురి చేసింది. పర్యావరణ పరిరక్షణతో పాటు అంతరించి పోతున్న పాత పంటల సాగు విస్తరణ కోసం తాము చేస్తున్న కృషి ఎనలేనిది. మహిళా రైతులకు లభించిన అవకాశం వీసా తరస్కరణ రూపంలో దక్కక పోవడం తీవ్ర మానసిక వేదనకు గురి చేసింది. – మొగులమ్మ, మహిళా రైతు, చిరు ధాన్యాల చెళ్లెళ్ల సమాఖ్య అధ్యక్షురాలు, పొట్పల్లి చదవండి: ఆహ్వానం అందినా..వీసా ఇవ్వలేదు -
చిరుధాన్యాల రైతుల్ని ప్రోత్సహించాలి
సాక్షి, హైదరాబాద్: ‘వెనక్కి ప్రయాణిద్దాం, ప్రగతి సాధిద్దాం. మనిషి జీవనశైలి వందేళ్లు వెనక్కి వెళ్లాలి. అప్పుడే ఆరోగ్యవంతమైన, శక్తిమంతమైన సమాజం తయారవుతుంది. ఆధునిక మానవుడు అనుసరించాల్సింది ఇదే. ఈ దిశగా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి, ఆ చర్యలను ఎన్నికల మేనిఫెస్టోలో చేర్చాలి’’అని దక్కన్ డెవలప్మెంట్ సొసైటీ(డీడీఎస్) డైరెక్టర్ పీవీ సతీశ్ అన్నారు. సోమవారం ఇక్కడ నిర్వహించిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ తెలంగాణ ప్రభుత్వం రాగి, జొన్నలు, కొర్రలు, సామలు వంటి చిరుధాన్యాల రైతులకు ఎకరాకు పదివేల రూపాయల చొప్పున ఇచ్చి ప్రోత్సహించాలని సూచించారు. ‘చిరుధాన్యాల సేద్యానికి తక్కువ నీరు సరిపోతుంది. వరిసాగుకు పనికిరాని భూముల్లో కూడా ఇవి పండుతాయి, వాతావరణ సంక్షోభాన్ని తట్టుకుని మనుగడ సాగించే ఈ పంటలకు ప్రభుత్వం అండగా నిలిస్తే రాబోయే తరాలు ఆరోగ్యవంతంగా, శక్తిమంతంగా మారుతాయి’అని పేర్కొన్నారు. చిరుధాన్యాల సాగు పూర్తిగా సేంద్రియ వ్యవసాయమేనం టూ సిక్కిం మాదిరిగా తెలంగాణ ప్రభు త్వం కూడా ఒక విధానం ప్రకటించాలని సతీశ్ కోరారు. ‘చిరు’రేషన్ ఇవ్వండి రేషన్ దినుసుల్లో చిరుధాన్యాలను చేర్చాలని సతీశ్ సూచించారు. జాతీయ ఆహారభద్రత చట్టం ప్రకారం ప్రతి రేషన్‌కార్డు మీద కనీసం ఏడు కిలోల చిరుధాన్యాలను పంపిణీ చేయాలని, ఇవి పోషకాహారలోపం తో బాధపడుతున్న వారికి వరం అవుతాయన్నారు. ఆయా రాజకీయ పార్టీల అనుబంధ రైతు సంఘాలు ముందుకు వస్తే చిరుధాన్యాలపై ప్రభుత్వాలు స్పందిస్తాయని దిశ సంస్థ నిర్వాహకులు సత్యనారాయణరాజు అన్నారు. ‘ఇప్పుడు సమాజాన్ని పీడిస్తున్న డయాబెటిస్ వంటి వ్యాధులకు దూరంగా ఉండడానికి చిరుధాన్యాలు ఎంతో దోహదం చేస్తాయనే చైతన్యం చాలామందిలో వచ్చింది. అయితే, వాటిని రోజూ ఉడికించి తినడానికి మొహం మొత్తడంతో ఆపేస్తున్నారు. అందుకోసమే పోషకాహార నిపుణులను సంప్రదించి చిరుధాన్యాలను ఎన్నిరకాలుగా వండవచ్చనే అంశం మీద డీడీఎస్ పరిశోధించింది. రాగి, జొన్నలు, కొర్రలు, సామలుతో నలభై రకాల వంటకాలను రూపొందించింది’అని సతీశ్ చెప్పారు. ఈ సందర్భంగా తినడానికి సిద్ధంగా(రెడీ టు ఈట్) జొన్న, రాగి, సజ్జ మురుకులు, కారప్పూస, కొర్ర బూందీ, గవ్వలు, పప్పు చెక్కలు, జొన్న అటుకుల లడ్డు, కారం కాజాలు, రాగి లడ్డు, జొన్న లడ్డు వంటి సంప్రదాయ వంటకాలను ప్రదర్శించారు. -
ప్రాణం పోసేది పాతపంటలే!
నిలువునా రైతుల ప్రాణాలు తీసే పంటలు మాకొద్దు.. మెట్ట పాంతాల్లోని చిన్న, సన్నకారు రైతుల ప్రాణాలు నిలిపేవి సంప్రదాయ పాత పంటలేనని మెదక్ జిల్లా జహీరాబాద్ ప్రాంతానికి చెందిన చిన్న, సన్నకారు మహిళా రైతులు ఎలుగెత్తి చాటారు. డెక్కన్ డెవలప్మెంట్ సొసైటీ ఆధ్వర్యంలో 16వ పాత పంటల(అంటే.. అనాదిగా స్థానికంగా పండిస్తున్న చిరుధాన్యాలు, పప్పుధాన్యాలు, నూనెగింజల పంటల సాగు) పండుగ జాతర ముగింపు ఉత్సవం జహీరాబాద్ సమీపంలోని మాచునూర్‌లో ఇటీవల కన్నుల పండువగా జరిగింది. సంక్రాంతి రోజు నుంచి నెల రోజుల పాటు పాత పంటల ప్రాధాన్యాన్ని గ్రామాల్లో ప్రచారం చేస్తూ బయోడైవర్సిటీ ఫెస్టివల్ సాగింది. ఈ ఏడాది ముగింపు ఉత్సవంలో వినూత్నంగా నిర్వహించిన ‘ప్రాణం తీసే పంటల’ దిష్టిబొమ్మ దహనం, ‘ప్రాణం పోసే పంటల’కు ఊయల సేవ అతిథులను ఎంతగానో ఆకట్టుకుంది. వర్షాధారంగా పాతకాలం నుంచి మెట్ట రైతులు సొంత విత్తనాలతో పండిస్తున్న జొన్న, సజ్జ, కొర్ర వంటి చిరుధాన్యాలు, కందులు, మినుములు, పెసలు, అలసందలు, కుసుమ వంటి జీవ వైవిధ్య పంటలే అన్నదాతల ప్రాణాలను కాపాడుతాయని మహిళా రైతులు చెప్పారు. అధిక పెట్టుబడి, అధిక నీరు అవసరమయ్యే పత్తి, సోయాబీన్, చెరకు, మొక్కజొన్న వంటి వాణిజ్య పంటలు రైతుల ‘ప్రాణాలు తీసే’ పంటలను నిరసిస్తూ పత్తి దిష్టిబొమ్మను దగ్ధం చేయడం విశేషం. కరువును తట్టుకొని బడుగు రైతుల చింత తీర్చే చిరుధాన్యాల రాష్ట్రంగా తెలంగాణను ప్రకటించాలని డీడీఎస్ మహిళా రైతు సంఘాలు ఇటీవల ప్రభుత్వానికి సూచించాయి. -
డాక్యుమెంటరీలతో సత్తాచాటుతున్న దళిత మహిళలు
నర్సమ్మ, లక్ష్మమ్మ, స్వరూపమ్మ, రూతమ్మ, శోభమ్మ, రాణెమ్మ, చిన్ననర్సమ్మ, సూరమ్మ, బాలమ్మ, పుణ్యమ్మ, మొల్లమ్మ, మంజుల, కవిత, శకుంతల.. ఏంటీ ఈ లిస్టంతా అనుకుంటున్నారా..? ఏముందిలే ఏ రేషన్ కార్డులకో, పింఛన్లకో, ఇల్లు మంజూరు కోసమో దరఖాస్తు చేసుకున్న వారి పేర్లు కావచ్చని భావిస్తున్నారా..? అస్సలే కాదు.. మహిళా లోకానికే ఆదర్శంగా నిలుస్తున్న డాక్యుమెంటరీ చిత్రాల దర్శక, నిర్మాతలు వీరు. ఏంటీ నమ్మకం కలగడం లేదా..? అయితే చదవండి మరి.. ఇల్లు, పొలం తప్ప ఇంకేమీ తెలియని నిరుపేద మహిళలు వీడియోలు, కెమెరాలు పట్టుకుని ప్రపంచాన్ని చుట్టి వస్తున్నారు. దక్కన్ డెవలప్మెంట్ సొసైటీ (డీడీఎస్) ఏర్పాటు చేసిన సంఘాల్లోని సభ్యులైన వీరు వీడియో చిత్రీకరణలో మంచి ప్రతిభ చాటుతున్నారు. కొడవలి పట్టి చేలు కోయాల్సిన వీరు మెగాఫోన్ పట్టుకుని యాక్షన్ వన్.. టూ.. త్రీ రెడీ.. అంటూ చిత్రాలను రూపొందిస్తున్నారు. ప్రతీ అంశంపై డాక్యుమెంటరీలు చిత్రీకరిస్తున్నారు. ముఖ్యంగా వ్యవసాయం, సంప్రదాయ పంటల సాగు. బీటీ విత్తనాల వల్ల కలిగే దుష్పరిణామాలు, రసాయన ఎరువుల వాడకం వల్ల కలిగే అనర్థాలపై రైతులు, గ్రామీణ ప్రజలకు అవగాహన కల్పిస్తున్నారు. బీటీ పత్తి మూలంగా కలిగే దుష్పరిణామాల గురించి గ్రామీణ ప్రజలకు వివరిస్తున్నారు. సేంద్రియ ఎరువుల వాడకం, వర్మీ కంపోస్టు తయారీ ఇలా ప్రతి అంశాన్ని తీసుకుని డాక్యుమెంటరీలు నిర్మిస్తున్నారు. శతచిత్రాల నిర్మాత చిన్న నర్సమ్మ... జహీరాబాద్ మండలం పస్తాపూర్ గ్రామానికి చెందిన చిన్న నర్సమ్మ 15 సంవత్సరాలుగా డీడీఎస్లో పని చేస్తున్నారు. వీడియో చిత్రీకరణలో శిక్షణతో పాటు పాత పంటలపై పూర్తి అవగాహన పెంపొందించుకున్నారు. పలు దేశాల్లో పాత పంటల ప్రాధాన్యత గురించి వివరించేందుకు అవకాశం రావడంతో పాటు అక్కడ జరిగే కార్యక్రమాలను కూడా చిత్రీకరించే చాన్స ఈమెకు లభించింది. సెనెగల్, లండన్, శ్రీలంక, పెరూ, ఇండోనేషియా, పాకిస్థాన్, నేపాల్, బంగ్లాదేశ్, దక్షిణాఫ్రికా, ఫ్రాన్స్, మాలి జర్మనీ, కంబోడియా దేశాలను పర్యటించింది. అక్కడి వ్యవసాయ విధానం, సాగు చేస్తున్న పంటలు, సాంస్కృతిక విధానం, మహిళల జీవన విధానం, వారు పడుతున్న ఇబ్బందులు తదితర అంశాలపై షార్టఫిల్మ్లు రూపొందించారు. ఇలా సుమారు వందకు పైగా డాక్యుమెంటరీ చిత్రాలు నిర్మించి అందరినీ ఆశ్చర్యానికి గురిచేశారు. హుమ్నాపూర్‌కు చెందిన లక్ష్మమ్మ, ఈదులపల్లికి చెందిన మంజుల సైతం విదేశాల్లో పర్యటించి పలు అంశాలపై డాక్యుమెంటరీలు రూపొందించారు. దశాబ్ద కాలంగా... పస్తాపూర్‌కు చెందిన చిన్న నర్సమ్మ, హుమ్నాపూర్‌కు చెందిన లక్ష్మమ్మ, జహీరాబాద్‌కు చెందిన పుణ్యమ్మ, ఇప్పపల్లికి చెందిన మొల్లమ్మ, పస్తాపూర్ కవిత, ఈదుపల్లి మంజుల, మాటురు శకుంతల, ఏడాకులపల్లి స్వరూప దశాబ్ద కాలం క్రితం వీడియో చిత్రీకరణలో శిక్షణ పొందారు. శిక్షణ అనంతరం ఏడాది కాలం పాటు తమకు నచ్చిన అంశాలపై పలు కార్యక్రమాలు నిర్వహించారు. అనంతరం డాక్యుమెంటరీలను చిత్రీకరించారు. చిన్న నర్సమ్మ, పుణ్యమ్మ, మంజుల ఇప్పటికీ డాక్యుమెంటరీలను రూపొందిస్తున్నారు. కొత్త తరం వారికి అవకాశం... పాత తరం వారికి వయసు పైబడుతున్నందున కొత్త తరం మహిళలు కూడా వీడియో చిత్రీకరణ రంగంలోకి అడుగు పెట్టారు. చిత్రీకరణలో శిక్షణ పొందారు. ఏడాది కాలంగా వీరు కూడా డాక్యుమెంటరీలను నిర్మిస్తున్నారు. రేజింతల్ గ్రామానికి చెందిన శోభమ్మ, రాణెమ్మ, రీనా, సంగాపూర్కు చెందిన రూతమ్మ, ఇప్పపల్లి సరోజమ్మ, బుజ్జమ్మ, ఎల్గోయికి చెందిన భవాని, బుజ్జమ్మలు పలు అంశాలపై షార్టఫిల్మ్లు తీస్తూ సత్తా చాటుతున్నారు. -
జాబ్స్, అడ్మిషన్స్ అలర్ట్స్ ప్రత్యేకం..
దక్కన్ డెవలప్మెంట్ సొసైటీ పోస్టులు: ప్రోగ్రామ్ కోఆర్డినేటర్ -1 అర్హత: అగ్రికల్చరల్ ఇంజనీరింగ్‌లో పీహెచ్డీ ఉండాలి. సంబంధిత విభాగంలో ఆరు నుంచి ఎనిమిదేళ్ల అనుభవం ఉండాలి. సబ్జెక్ట్ మ్యాటర్ స్పెషలిస్టు-6 విభాగాలు: ఆగ్రోనమీ, అగ్రికల్చరల్ ఎక్స్టెన్షన్, హార్టీకల్చర్, యానిమల్ హజ్బెండ్రీ, ప్లాంట్ ప్రొటెక్షన్, హోమ్ సైన్స్. అర్హత: సంబంధిత విభాగంలో మాస్టర్స్ డిగ్రీ ఉండాలి. ప్రోగ్రామ్ అసిస్టెంట్ (సాయిల్ సెన్సైస్)-1 అర్హత: సంబంధిత విభాగంలో డిగ్రీ ఉత్తీర్ణులై ఉండాలి. జూనియర్ స్టెనోగ్రాఫర్-1 అర్హత: ఇంటర్ ఉత్తీర్ణులై ఉండాలి. టైపింగ్‌లో తగిన అనుభవం ఉండాలి. ఎంపిక: ఇంటర్వ్యూ ద్వారా. దరఖాస్తుల స్వీకరణకు చివరితేది: జూలై 21 వెబ్సైట్: http://ddsindia.com ఉస్మానియా యూనివర్సిటీ కోర్సు: పీహెచ్‌డీలో ప్రవేశానికి పీహెడ్డీ ఎలిజిబిలిటీ టెస్ట్ అర్హతలు: సంబంధిత సబ్జెక్టుతో కనీసం 55 శాతం మార్కులతో మాస్టర్స్ డిగ్రీ ఉత్తీర్ణులై ఉండాలి. యూజీసీ నెట్/సీఎస్ఐఆర్ నెట్/ ఏపీసెట్/ జెస్ట్ అర్హత ఉన్నవారు, ఉస్మానియా వర్సిటీ నుంచి రెగ్యులర్ విధానంలో ఎంఫిల్ చేస్తున్న అభ్యర్థులు, అలైడ్ సబ్జెక్టులతో పీహెచ్డీ చేస్తున్నవారు ప్రవేశ పరీక్ష రాయాల్సిన అవసరం లేదు. ఆన్లైన్ రిజిస్ట్రేషన్: జూలై 10 - ఆగస్టు 10 వెబ్సైట్: www.osmania.ac.in ఉస్మానియా విశ్వవిద్యాలయం దూర విద్యా కేంద్రం కోర్సు: డిప్లొమా ఇన్ బయోఇన్ఫర్మాటిక్స్ వ్యవధి: ఏడాది రెగ్యులర్ కోర్సు అర్హతలు: కనీసం 50 శాతం మార్కులతో సైన్స్/ అగ్రికల్చర్/ వెటర్నరీ/ మెడిసిన్/ ఫార్మసీ/ ఇంజనీరింగ్/ టెక్నాలజీలో గ్రాడ్యుయేషన్ ఉత్తీర్ణులైనవారు అర్హులు. దరఖాస్తులకు చివరితేది: ఆగస్టు 22 వెబ్సైట్: www.oucde.ac.in నేషనల్ పవర్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ కోర్సులు: పీజీ డిప్లొమా ఇన్ థర్మల్ పవర్ ప్లాంట్ ఇంజనీరింగ్ పీజీ డిప్లొమా ఇన్ ట్రాన్స్మిషన్ అండ్ డిస్ట్రిబ్యూషన్ కాలపరిమితి: ఏడాది అభ్యర్థులకు నోటిఫికేషన్లో నిర్దేశించిన అర్హతలు ఉండాలి. ఎంపిక: మెరిట్ ఆధారంగా దరఖాస్తులకు చివరి తేది: ఆగస్టు 8 వెబ్సైట్: http://npti.in/ -
నేటి నుంచి పాతపంటల జాతర
జహీరాబాద్, న్యూస్‌లైన్: సంప్రదాయ పాత పంటలను పరిరక్షించడమే లక్ష్యంగా మండలంలోని పస్తాపూర్‌లో గల డీడీఎస్(డెక్కన్ డెవలప్మెంట్ సొసైటీ) సంక్రాంతి పర్వదినం రోజు నుంచి పాత పంటల జాతరను నిర్వహించేందుకు ఏర్పాట్లు చేసింది. జనవరి 14వ తేదీన జహీరాబాద్ మండలం అల్గోల్ గ్రామంలో ప్రారంభించనున్న ఈ జాతర ఫిబ్రవరి 13వ తేదీన ఝరాసంగం మండలంలోని మాచ్నూరు గ్రామంలో ముగియనుంది. జాతర సందర్భంగా పాత పంటల ప్రాధాన్యత గురించి వివరిస్తారు. అంతరించి పోతున్న పాత పంటలను పరిరక్షించుకుని పల్లె వ్యవసాయాన్ని కాపాడుకునే విధానం గురించి ప్రచారం నిర్వహిస్తారు. సేంద్రియ విధానంలో వ్యవసాయం చేయడం గురించి రైతులకు అవగాహన కల్పిస్తారు. జాతరలో అందంగా అలంకరించిన 16 ఎడ్లబండ్లలో పాత పంటల ధాన్యం, ఆ ధాన్యంతో తయారు చేసిన వంటకాలను ఈ సందర్భంగా ప్రదర్శిస్తారు. గ్రామ గ్రామానా సాంస్కృతిక ప్రదర్శనలు నిర్వహిస్తారు. సొంతంగానే విత్తనాల తయారీ ఖరీఫ్, రబీ సీజన్లలో జహీరాబాద్ ప్రాంత రైతాంగం ప్రభుత్వం అందించే విత్తనాల కోసం ఆశపెట్టుకోరు. రైతులు తమ పొలాల్లో పండించుకున్న పంటల్లో నుంచి నాణ్యమైన విత్తనాలను సేకరిస్తారు. ఆ విత్తనాలను ఈత కట్టెతో అల్లిన బుట్టల్లో పోసి, పైభాగంలో మట్టి, పేడ కలిపి మూసివేస్తారు. విత్తనం ధాన్యంతోపాటు వేపాకు, బూడిద కలుపుతారు. విత్తనాలు నాటే సమయం రాగానే వాటిని బయటకు తీసి నాటేందుకు వీలుగా శుభ్రం చేస్తారు. రైతులు విత్తనాలు నాటుకోగా మిగిలిన విత్తనాలను ఇతర రైతులకు ఇచ్చి సహాయ పడతారు. ఈ పద్ధతి కొన్ని సంవత్సరాలుగా సంప్రదాయంగా వస్తోంది. నియోజకవర్గంలోని జహీరాబాద్, కోహీర్, ఝరాసంగం, రాయికోడ్, న్యాల్కల్ మండలాల్లో 68 గ్రామాల్లో మహిళలు డీడీఎస్ ఆధ్వర్యంలో విత్తన బ్యాంకులను ఏర్పాటు చేసుకున్నారు. ప్రముఖుల రాక జాతర ప్రారంభ ఉత్సవాలకు పలువురు ప్రముఖులు హాజరు కానున్నారని డీడీఎస్ డెరైక్టర్ పి.వి.సతీష్ వివరించారు. రాష్ట్ర ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి శ్యామూల్, బెంగళూరు వ్యవసాయ విశ్వవిద్యాలయ వ్యవసాయ శాఖ ప్రొఫెసర్‌గా పనిచేసిన డాక్టర్ టి.ఎన్.ప్రకాష్, జాతీయ వ్యవసాయ సంశోధన మేనేజ్మెంట్ అకాడమీ జాయింట్ డెరైక్టర్ కల్పన శాస్త్రి, ఆనికో ఉద్యమ నాయకుడు పాండురంగ హెగ్డె, రాష్ట్ర జీవ వైవిద్య మండలి అధ్యక్షుడు డాక్టర్ హంపయ్య, సభ్యుడు జాదవ్, సీనియర్ శాస్త్రవేత్త జి.ఉమాపతి, అల్గోల్ గ్రామ సర్పంచ్ గౌతంరెడ్డి కార్యక్రమంలో పాల్గొననున్నారు. జాతర ఏ రోజు..ఎక్కడంటే పాతపంటల జాతర 14న అల్గోల్‌లో ప్రారంభం అవుతుంది. 15న రాయికోడ్ మండలం పొట్పల్లి, ఎల్గోయి, 16న న్యాల్కల్ మండలంలోని రేజింతల్, గుంజోటి, 17న మెటల్‌కుంట, మల్గి, 18న బసంత్‌పూర్, మిరియంపూర్, 19న కల్బేమల్, చీకుర్తి, అమిరాబాద్, 20న గణేష్‌పూర్, హూసెళ్లి, హుమ్నాపూర్, 22న న్యాల్కల్లో, 23న హుల్గెర, రాఘవాపూర్, 24న టేకూర్, మాటూరు, ఖాంజమాల్‌పూర్, 25న ఇటికెపల్లి, శంశొద్దీన్‌పూర్, 26న నాగ్వార్, 27న రాయికోడ్, 28న గుంతమర్పల్లి, పీపడ్పల్లి, 29న జీర్లపల్లి, ఇందూర్, 30న చీలమామిడి, సంగాపూర్, 31న ఏడాకులపల్లి, కంబాలపల్లి గ్రామాల్లో జరుగుతుంది. ఫిబ్రవరి 1న బిడకన్నె గ్రామంలో, 4న రాయిపల్లి, చిన్నహైదరాబాద్, 5న క్రిష్ణాపూర్, హోతి(బి), 6న పస్తాపూర్, ఇప్పపల్లి, 7న ఖాశీంపూర్, 8న జహీరాబాద్, 13న మాచ్నూరు గ్రామాల్లో జాతర ఉత్సవాలు నిర్వహించనున్నారు. అవగాహన కల్పించేందుకే.. చిరుధాన్యాల ప్రాధాన్యాన్ని చాటి చెప్పేందుకే పాత పంటల జాతరను నిర్వహిస్తున్నామని డీడీఎస్ డెరైక్టర్ పి.వి.సతీష్ పేర్కొన్నారు. సోమవారం ఆయన మండలంలోని పస్తాపూర్ గ్రామంలోని డీడీఎస్ కార్యాలయంలో విలేకరులతో మాట్లాడారు. నెల రోజుల పాటు జాతరను నిర్వహిస్తున్నట్లు తెలిపారు. భారత దేశంలోనే గ్రామీణ సమాజాలు, మహిళా రైతులు, చిన్న సన్నకారు రైతుల ఆధ్వర్యంలో నడిచే పండుగల్లో ఇది ప్రపంచంలోనే మొట్టమొదటిదన్నారు. తమ సంస్థ స్పూర్తితో ప్రస్తుతం ఒరిస్సా, నాగాలాంగ్, గుజరాత్ రాష్ట్రాల్లో సైతం ఇలాంటి జీవవైవిద్య పండుగలు ప్రారంభమయ్యాయన్నారు.