నర్సమ్మ, లక్ష్మమ్మ, స్వరూపమ్మ, రూతమ్మ, శోభమ్మ, రాణెమ్మ, చిన్ననర్సమ్మ, సూరమ్మ, బాలమ్మ, పుణ్యమ్మ, మొల్లమ్మ, మంజుల, కవిత, శకుంతల.. ఏంటీ ఈ లిస్టంతా అనుకుంటున్నారా..? ఏముందిలే ఏ రేషన్ కార్డులకో, పింఛన్లకో, ఇల్లు మంజూరు కోసమో దరఖాస్తు చేసుకున్న వారి పేర్లు కావచ్చని భావిస్తున్నారా..? అస్సలే కాదు.. మహిళా లోకానికే ఆదర్శంగా నిలుస్తున్న డాక్యుమెంటరీ చిత్రాల దర్శక, నిర్మాతలు వీరు. ఏంటీ నమ్మకం కలగడం లేదా..? అయితే చదవండి మరి.. ఇల్లు, పొలం తప్ప ఇంకేమీ తెలియని నిరుపేద మహిళలు వీడియోలు, కెమెరాలు పట్టుకుని ప్రపంచాన్ని చుట్టి వస్తున్నారు.
దక్కన్ డెవలప్‌మెంట్ సొసైటీ (డీడీఎస్) ఏర్పాటు చేసిన సంఘాల్లోని సభ్యులైన వీరు వీడియో చిత్రీకరణలో మంచి ప్రతిభ చాటుతున్నారు. కొడవలి పట్టి చేలు కోయాల్సిన వీరు మెగాఫోన్ పట్టుకుని యాక్షన్ వన్.. టూ.. త్రీ రెడీ.. అంటూ చిత్రాలను రూపొందిస్తున్నారు. ప్రతీ అంశంపై డాక్యుమెంటరీలు చిత్రీకరిస్తున్నారు. ముఖ్యంగా వ్యవసాయం, సంప్రదాయ పంటల సాగు. బీటీ విత్తనాల వల్ల కలిగే దుష్పరిణామాలు, రసాయన ఎరువుల వాడకం వల్ల కలిగే అనర్థాలపై రైతులు, గ్రామీణ ప్రజలకు అవగాహన కల్పిస్తున్నారు. బీటీ పత్తి మూలంగా కలిగే దుష్పరిణామాల గురించి గ్రామీణ ప్రజలకు వివరిస్తున్నారు. సేంద్రియ ఎరువుల వాడకం, వర్మీ కంపోస్టు తయారీ ఇలా ప్రతి అంశాన్ని తీసుకుని డాక్యుమెంటరీలు నిర్మిస్తున్నారు.
శతచిత్రాల నిర్మాత చిన్న నర్సమ్మ...
జహీరాబాద్ మండలం పస్తాపూర్ గ్రామానికి చెందిన చిన్న నర్సమ్మ 15 సంవత్సరాలుగా డీడీఎస్‌లో పని చేస్తున్నారు. వీడియో చిత్రీకరణలో శిక్షణతో పాటు పాత పంటలపై పూర్తి అవగాహన పెంపొందించుకున్నారు. పలు దేశాల్లో పాత పంటల ప్రాధాన్యత గురించి వివరించేందుకు అవకాశం రావడంతో పాటు అక్కడ జరిగే కార్యక్రమాలను కూడా చిత్రీకరించే చాన్‌స ఈమెకు లభించింది. సెనెగల్, లండన్, శ్రీలంక, పెరూ, ఇండోనేషియా, పాకిస్థాన్, నేపాల్, బంగ్లాదేశ్, దక్షిణాఫ్రికా, ఫ్రాన్స్, మాలి జర్మనీ, కంబోడియా దేశాలను పర్యటించింది.
అక్కడి వ్యవసాయ విధానం, సాగు చేస్తున్న పంటలు, సాంస్కృతిక విధానం, మహిళల జీవన విధానం, వారు పడుతున్న ఇబ్బందులు తదితర అంశాలపై షార్‌టఫిల్మ్‌లు రూపొందించారు. ఇలా సుమారు వందకు పైగా డాక్యుమెంటరీ చిత్రాలు నిర్మించి అందరినీ ఆశ్చర్యానికి గురిచేశారు. హుమ్నాపూర్‌కు చెందిన లక్ష్మమ్మ, ఈదులపల్లికి చెందిన మంజుల సైతం విదేశాల్లో పర్యటించి పలు అంశాలపై డాక్యుమెంటరీలు రూపొందించారు.
దశాబ్ద కాలంగా...
పస్తాపూర్‌కు చెందిన చిన్న నర్సమ్మ, హుమ్నాపూర్‌కు చెందిన లక్ష్మమ్మ, జహీరాబాద్‌కు చెందిన పుణ్యమ్మ, ఇప్పపల్లికి చెందిన మొల్లమ్మ, పస్తాపూర్ కవిత, ఈదుపల్లి మంజుల, మాటురు శకుంతల, ఏడాకులపల్లి స్వరూప దశాబ్ద కాలం క్రితం వీడియో చిత్రీకరణలో శిక్షణ పొందారు. శిక్షణ అనంతరం ఏడాది కాలం పాటు తమకు నచ్చిన అంశాలపై పలు కార్యక్రమాలు నిర్వహించారు. అనంతరం డాక్యుమెంటరీలను చిత్రీకరించారు. చిన్న నర్సమ్మ, పుణ్యమ్మ, మంజుల ఇప్పటికీ డాక్యుమెంటరీలను రూపొందిస్తున్నారు.
కొత్త తరం వారికి అవకాశం...
పాత తరం వారికి వయసు పైబడుతున్నందున కొత్త తరం మహిళలు కూడా వీడియో చిత్రీకరణ రంగంలోకి అడుగు పెట్టారు. చిత్రీకరణలో శిక్షణ పొందారు. ఏడాది కాలంగా వీరు కూడా డాక్యుమెంటరీలను నిర్మిస్తున్నారు. రేజింతల్ గ్రామానికి చెందిన శోభమ్మ, రాణెమ్మ, రీనా, సంగాపూర్‌కు చెందిన రూతమ్మ, ఇప్పపల్లి సరోజమ్మ, బుజ్జమ్మ, ఎల్గోయికి చెందిన భవాని, బుజ్జమ్మలు పలు అంశాలపై షార్‌టఫిల్మ్‌లు తీస్తూ సత్తా చాటుతున్నారు.
డాక్యుమెంటరీలతో సత్తాచాటుతున్న దళిత మహిళలు
Published Sat, Nov 15 2014 11:48 PM | Last Updated on Sat, Sep 2 2017 4:31 PM
Advertisement