‘‘ఓ ఉత్తమమైన ప్రదేశంగా ప్రపంచాన్ని మార్చే శక్తి సినిమా మాధ్యమానికి ఉంది’’ అని అక్కినేని అమల అన్నారు. గోవాలో జరుగుతున్న 55వ ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ ఆఫ్ ఇండియా (ఇఫీ)లో అన్నపూర్ణ కాలేజ్ ఆఫ్ ఫిల్మ్ అండ్ మీడియాకు చెందిన విద్యార్థులు తీసిన షార్ట్ ఫిల్మ్ ‘రోడ్ నెం 52’ని ప్రదర్శించారు. ఈ సందర్భంగా అమల విలేకరులతో మాట్లాడారు. ‘‘దేశంలోఎందరో ప్రతిభావంతులైన యువత సినీ రంగంలో రాణించేందుకు కృషి చేస్తున్నారని, వారిని తీర్చిదిద్దే పనిలో తాము పూర్తి స్థాయిలో సహకారాన్ని అందిస్తున్నామని చెప్పారు.
కొన్నేళ్లుగా వందలాది మందికి తమ అన్నపూర్ణ సంస్థ శిక్షణ అందించిందని, ఇప్పటికే పలువురు సినిమా రంగంలో పని చేస్తున్నారని వివరించారు. మహారాష్ట్రకు చెందిన యువకులు అచ్చ తెలుగు కథాంశం ఎంచుకుని అద్భుతమైన రీతిలో తెరకెక్కించారని ‘రోడ్ నెం 52’ రూపకర్తల్ని అభినందించారు అమల. ‘రోడ్ నెం 52’ రచయిత– దర్శకుడు సరోజ్, డైరెక్టర్ ఆఫ్ ఫొటోగ్రఫీ అథర్వ మహేష్ గాగ్ తమ అనుభవాలు పంచుకున్నారు.
నటీమణుల పాత్రల నిడివి పెరగాలి
‘‘నటీమణులకు తెరపై పోషించే పాత్రల నిడివి పెరిగితే తెరవెనుక గౌరవం కూడా పెరుగుతుంది’’ అనే అభిప్రాయం ‘ఇఫీ’లో నిర్వహించిన సదస్సులో వ్యక్తమైంది. సినీ పరిశ్రమలో మహిళా భద్రత అనే అంశంపై జరిగిన చర్చలో నటి–నిర్మాత వాణీ త్రిపాఠి టికూ మోడరేట్ చేసిన ఫ్యానెల్ పాల్గొంది. నటి సుహాసినీ మణిరత్నం మాట్లాడుతూ– ‘‘సినిమాల్లో ఏదో ఇలా వచ్చి అలా పోయేవి కాకుండా మహిళలు తాము నటించే పాత్రలు బలంగా ఉండేలా చూసుకోవాలి’’ అన్నారు.
‘‘లొకేషన్లో మహిళలు వేధింపులకు గురి కాకూడదు. వారికి తాము చేసే పని వాతావరణంలో భద్రత, గౌరవం తప్పనిసరిగా ఉండాలి’’ అని దర్శకుడు ఇంతియాజ్ అలీ పేర్కొన్నారు. ‘‘వినోదంపై దృష్టి సారిస్తూనే సమానత్వానికిప్రా ధాన్యం ఇవ్వడంతో పాటు బాధ్యతాయుతమైన చిత్రనిర్మాణం సాగాలి’’ అని ఖుష్బూ అన్నారు. మహిళలు తెరపై గౌరవప్రదంగా, తెరవెనుక సురక్షితంగా ఉండాలని, మహిళల భద్రతకి సినిమా ఉదాహరణగా ఉండాలనే పిలుపుతో ఫ్యానెల్ ముగిసింది.
Comments
Please login to add a commentAdd a comment