నేటి నుంచి పాతపంటల జాతర | old crops jathara from today | Sakshi
Sakshi News home page

నేటి నుంచి పాతపంటల జాతర

Published Mon, Jan 13 2014 11:34 PM | Last Updated on Sat, Sep 2 2017 2:36 AM

old crops jathara from today

జహీరాబాద్, న్యూస్‌లైన్: సంప్రదాయ పాత పంటలను పరిరక్షించడమే లక్ష్యంగా మండలంలోని పస్తాపూర్‌లో గల డీడీఎస్(డెక్కన్ డెవలప్‌మెంట్ సొసైటీ) సంక్రాంతి పర్వదినం రోజు నుంచి పాత పంటల జాతరను నిర్వహించేందుకు ఏర్పాట్లు చేసింది. జనవరి 14వ తేదీన జహీరాబాద్ మండలం అల్గోల్ గ్రామంలో ప్రారంభించనున్న ఈ జాతర ఫిబ్రవరి 13వ తేదీన ఝరాసంగం మండలంలోని మాచ్‌నూరు గ్రామంలో ముగియనుంది.

 జాతర సందర్భంగా పాత పంటల ప్రాధాన్యత గురించి వివరిస్తారు. అంతరించి పోతున్న పాత పంటలను పరిరక్షించుకుని పల్లె వ్యవసాయాన్ని కాపాడుకునే విధానం గురించి ప్రచారం నిర్వహిస్తారు. సేంద్రియ విధానంలో వ్యవసాయం చేయడం గురించి రైతులకు అవగాహన కల్పిస్తారు. జాతరలో అందంగా అలంకరించిన 16 ఎడ్లబండ్లలో పాత పంటల ధాన్యం, ఆ ధాన్యంతో తయారు చేసిన వంటకాలను ఈ సందర్భంగా ప్రదర్శిస్తారు. గ్రామ గ్రామానా సాంస్కృతిక ప్రదర్శనలు నిర్వహిస్తారు.

 సొంతంగానే విత్తనాల తయారీ
 ఖరీఫ్, రబీ సీజన్‌లలో జహీరాబాద్ ప్రాంత రైతాంగం ప్రభుత్వం అందించే విత్తనాల కోసం ఆశపెట్టుకోరు. రైతులు తమ పొలాల్లో పండించుకున్న పంటల్లో నుంచి నాణ్యమైన విత్తనాలను సేకరిస్తారు. ఆ విత్తనాలను ఈత కట్టెతో అల్లిన బుట్టల్లో పోసి, పైభాగంలో మట్టి, పేడ కలిపి మూసివేస్తారు. విత్తనం ధాన్యంతోపాటు వేపాకు, బూడిద కలుపుతారు. విత్తనాలు నాటే సమయం రాగానే వాటిని బయటకు తీసి నాటేందుకు వీలుగా శుభ్రం చేస్తారు. రైతులు విత్తనాలు నాటుకోగా మిగిలిన విత్తనాలను ఇతర రైతులకు ఇచ్చి సహాయ పడతారు. ఈ పద్ధతి కొన్ని సంవత్సరాలుగా సంప్రదాయంగా వస్తోంది. నియోజకవర్గంలోని జహీరాబాద్, కోహీర్, ఝరాసంగం, రాయికోడ్, న్యాల్‌కల్ మండలాల్లో 68 గ్రామాల్లో మహిళలు డీడీఎస్ ఆధ్వర్యంలో విత్తన బ్యాంకులను ఏర్పాటు చేసుకున్నారు.

 ప్రముఖుల రాక
 జాతర ప్రారంభ ఉత్సవాలకు పలువురు ప్రముఖులు హాజరు కానున్నారని డీడీఎస్ డెరైక్టర్ పి.వి.సతీష్ వివరించారు. రాష్ట్ర ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి శ్యామూల్, బెంగళూరు వ్యవసాయ విశ్వవిద్యాలయ వ్యవసాయ శాఖ ప్రొఫెసర్‌గా పనిచేసిన డాక్టర్ టి.ఎన్.ప్రకాష్, జాతీయ వ్యవసాయ సంశోధన మేనేజ్‌మెంట్ అకాడమీ జాయింట్ డెరైక్టర్ కల్పన శాస్త్రి, ఆనికో ఉద్యమ నాయకుడు పాండురంగ హెగ్డె, రాష్ట్ర జీవ వైవిద్య మండలి అధ్యక్షుడు డాక్టర్ హంపయ్య, సభ్యుడు జాదవ్, సీనియర్ శాస్త్రవేత్త జి.ఉమాపతి, అల్గోల్ గ్రామ సర్పంచ్ గౌతంరెడ్డి కార్యక్రమంలో పాల్గొననున్నారు.

 జాతర ఏ రోజు..ఎక్కడంటే
 పాతపంటల జాతర 14న అల్గోల్‌లో ప్రారంభం అవుతుంది. 15న రాయికోడ్ మండలం పొట్‌పల్లి, ఎల్గోయి, 16న న్యాల్‌కల్ మండలంలోని రేజింతల్, గుంజోటి, 17న మెటల్‌కుంట, మల్గి, 18న బసంత్‌పూర్, మిరియంపూర్, 19న కల్‌బేమల్, చీకుర్తి, అమిరాబాద్, 20న గణేష్‌పూర్, హూసెళ్లి, హుమ్నాపూర్, 22న న్యాల్‌కల్‌లో,  23న హుల్గెర, రాఘవాపూర్, 24న టేకూర్, మాటూరు, ఖాంజమాల్‌పూర్, 25న ఇటికెపల్లి, శంశొద్దీన్‌పూర్, 26న నాగ్వార్, 27న రాయికోడ్, 28న గుంతమర్పల్లి, పీపడ్‌పల్లి, 29న జీర్లపల్లి, ఇందూర్, 30న చీలమామిడి, సంగాపూర్, 31న ఏడాకులపల్లి, కంబాలపల్లి గ్రామాల్లో జరుగుతుంది.  ఫిబ్రవరి 1న బిడకన్నె గ్రామంలో, 4న రాయిపల్లి, చిన్నహైదరాబాద్, 5న క్రిష్ణాపూర్, హోతి(బి), 6న పస్తాపూర్, ఇప్పపల్లి, 7న ఖాశీంపూర్, 8న జహీరాబాద్, 13న మాచ్‌నూరు గ్రామాల్లో జాతర ఉత్సవాలు నిర్వహించనున్నారు.

  అవగాహన కల్పించేందుకే..
 చిరుధాన్యాల ప్రాధాన్యాన్ని చాటి చెప్పేందుకే పాత పంటల జాతరను నిర్వహిస్తున్నామని డీడీఎస్ డెరైక్టర్ పి.వి.సతీష్ పేర్కొన్నారు. సోమవారం  ఆయన మండలంలోని పస్తాపూర్ గ్రామంలోని డీడీఎస్ కార్యాలయంలో విలేకరులతో మాట్లాడారు. నెల రోజుల పాటు జాతరను నిర్వహిస్తున్నట్లు తెలిపారు. భారత దేశంలోనే గ్రామీణ సమాజాలు, మహిళా రైతులు, చిన్న సన్నకారు రైతుల ఆధ్వర్యంలో నడిచే పండుగల్లో ఇది ప్రపంచంలోనే మొట్టమొదటిదన్నారు. తమ సంస్థ స్పూర్తితో ప్రస్తుతం ఒరిస్సా, నాగాలాంగ్, గుజరాత్ రాష్ట్రాల్లో సైతం ఇలాంటి జీవవైవిద్య పండుగలు ప్రారంభమయ్యాయన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement