మహిళల ఘన విజయం: విత్తనం పరిరక్షణకు‘చిరు’యత్నం | International Seeds Day 2023: Women farmers exhibit over 50 varieties of kharif seeds | Sakshi
Sakshi News home page

మహిళల ఘన విజయం: విత్తనం పరిరక్షణకు‘చిరు’యత్నం

Published Thu, Apr 27 2023 12:29 AM | Last Updated on Thu, Apr 27 2023 12:29 AM

International Seeds Day 2023: Women farmers exhibit over 50 varieties of kharif seeds - Sakshi

విత్తనాల ప్రదర్శనలో రైతు మహిళలు; రుక్మిణీరావు

‘ఇంటర్నేషనల్‌ సీడ్‌ డే’... ఇలాంటి ఓ రోజు ఉందా! ఉంది... అయితే ప్రచారమే పెద్దగా ఉండదు. ఇది గ్లామర్‌ మార్కెట్‌ వస్తువు కాకపోవడమే కారణం. ఈ రోజును రైతు మహిళలు నిర్వహించారు.
‘చిరు’సాగు చేసి కళ్లాల్లో రాశులు పోసిన చేతులవి. విత్తనాన్ని కాపాడాలనే ముందుచూపున్న చేతలవి.

రాగి ముద్ద స్టార్‌ హోటల్‌ మెనూలో కనిపిస్తోంది. స్మార్ట్‌గా ఆర్డర్‌ చేస్తే అందమైన ప్యాక్‌తో ఇంటిముందు వాలుతోంది. అలాగే సజ్జ ఇడ్లీ, ఊదల దోసె, కొర్రల కర్డ్‌ మీల్, జొన్న రొట్టె, మిల్లెట్‌ చపాతీ, మిల్లెట్‌ పొంగలి... ఇలా బ్రేక్‌ ఫాస్ట్‌ సెంటర్‌లు కొత్త రూపుదిద్దుకున్నాయి. ఎక్కడో మారుమూల గ్రామాల్లో నీటి వసతి లేని నేలను నమ్ముకుని బతికే వాళ్ల ఆకలి తీర్చిన చిరుధాన్యాలు ఇప్పుడు బెంజ్‌కారులో బ్రేక్‌ఫాస్ట్‌కి వెళ్లే సంపన్నుల టేబుల్‌ మీదకు చేరాయి.

ఒకప్పుడు చిన్న చూపుకు గురైన చిరుధాన్యాలు నేడు సిరిధాన్యాలుగా మన దైనందిన జీవితంలో ప్రధాన భూమికను పోషిస్తున్నాయి. వీటి వెనుక నిరుపేద మహిళల శ్రమ ఉంది. పాతికేళ్లుగా ఈ నిరుపేద మహిళలు చిరుధాన్యాలతోనే జీవించారు, చిరుధాన్యాల పరిరక్షణ కోసమే జీవించారు.

సేంద్రియ సేద్యంతో చిరుధాన్యాల జీవాన్ని నిలిపారు. అంతర్జాతీయ విత్తన దినోత్సవం (ఏప్రిల్‌ 26) సందర్భంగా బుధవారం వీరంతా మెదక్‌ జిల్లా, జహీరాబాద్‌ మండలం, పస్తాపూర్‌లో తమ దగ్గరున్న పంటల విత్తనాలను సగర్వంగా ప్రదర్శించారు. హైబ్రీడ్‌ వంగడాల మాయలో పడకుండా మన విత్తనాలను మనం కాపాడుకోవాలని ఒట్టు పెట్టుకున్నారు. ఈ సందర్భంగా హైదరాబాద్‌ కేంద్రంగా పని చేస్తున్న దక్కన్‌ డెవలప్‌మెంట్‌ సొసైటీ బోర్డు సభ్యులు రుక్మిణీరావు సాక్షితో పంచుకున్న వివరాలివి.


ఈ నేల... ఈ విత్తనం... మన సొంతం
‘‘చిరుధాన్యాల పట్ల అవగాహన కోసం ఈ ఏడాదిని ‘ఇంటర్నేషనల్‌ ఇయర్‌ ఆఫ్‌ మిల్లెట్స్‌’ నిర్వహించుకుంటున్నాం. ఈ ఏడాది సీడ్‌ డే రోజున మేము చిరుధాన్యాల విత్తనాల పరిరక్షణ, ప్రదర్శన నిర్వహించాం. పస్తాపూర్‌ కేంద్రంగా జరిగిన ఈ కార్యక్రమంలో 26 పరిసర గ్రామాల నుంచి వందకు పైగా మహిళలు వారు పండించి, పరిరక్షించిన విత్తనాలను తీసుకువచ్చారు. చిరుధాన్యాలతోపాటు పప్పుధాన్యాలు, నూనె గింజల విత్తనాలు మొత్తం యాభైకి పైగా పంటల విత్తనాలకు ఈ ప్రదర్శన వేదికైంది. ఇవన్నీ సేంద్రియ సేద్యంలో పండించినవే.  

ఆహారం –ఆకలి!
ఆహారం మన ఆకలి తీర్చాలి, దేహానికి శక్తినివ్వాలి. ‘వరి అన్నం తిని పొలానికి వెళ్తే పని మొదలు పెట్టిన గంట సేపటికే మళ్లీ ఆకలవుతుంది. రొట్టె తిని వెళ్తే ఎక్కువ సేపు పని చేసుకోగలుగుతున్నాం. అందుకే మేము కొర్రలు, జొన్నలు తింటున్నాం’ అని ఈ మహిళలు చెప్పిన మాటలను తోసిపుచ్చలేదు సైంటిస్టులు. వారి అనుభవం నుంచి పరిశోధన మొదలు పెట్టారు. అందుకే మిల్లెట్స్‌లో దాగి ఉన్న శక్తిని ప్రపంచ వేదికల మీద ప్రదర్శించగలిగారు. అలాగే ఈ మహిళలు విదేశాల్లో రైతు సదస్సులకు హాజరై తమ అనుభవాలను వారితో పంచుకున్నారు.

భూగోళం ఎదుర్కొంటున్న మరో విపత్తు క్లైమేట్‌ చేంజ్‌. ఈ పంటలైతే వాతావరణ ఒడిదొడుకులను ఎదుర్కుని పంటనిస్తాయి. పదిహేను రోజులు నీరు అందకపోయినప్పటికీ జీవాన్ని నిలుపుకుని ఉంటాయి. చిరుధాన్యాలకు గాను మన ముందున్న బాధ్యత ఈ విత్తనాలను కాపాడుకోవడం.  ఎట్టి పరిస్థితుల్లోనూ వీటి మీద హక్కులను కార్పొరేట్‌ సంస్థలు తన్నుకుపోకుండా చూసుకోవాలి. అవసరమైతే ఉద్యమించాలి. ఇదే మనం డీడీఎస్‌ స్థాపకులు మిల్లెట్‌ మ్యాన్‌ పీవీ సతీశ్‌గారికి ఇచ్చే నివాళి’’ అన్నారు రుక్మిణీరావు.

చిరుధాన్యాలను పండించడంలో ముందడుగు వేసేశాం. ఇక మన ముందున్న బాధ్యత ఈ విత్తనాలను కాపాడుకోవడం. ఈ విత్తనాల మీద పూర్తి హక్కులు ఈ పేద రైతు మహిళలవే.
– రుక్మిణీరావు, బోర్డు సభ్యులు, దక్కన్‌ డెవలప్‌మెంట్‌ సొసైటీ

 – వాకా మంజులారెడ్డి
 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement