కలెక్టర్ పిల్లలు కలెక్టర్, హీరో పిల్లలు హీరో, రాజకీయ నాయకుడు పిల్లలు రాజకీయ నాయకులు కావాలని కోరుకుంటే, ఇక మధ్యతరగతి తల్లిదండ్రులు... తమలా తమ పిల్లలు ఇబ్బందులు పడకూడదని, తిని, తినక ఒక్కోరూపాయి పోగుచేసి, కష్టపడి చదివించి పిల్లలను విదేశాలకు పంపిస్తున్నారు.
పంటలు పండించి అందరి ఆకలి తీర్చే రైతన్నలు మాత్రం తమ పిల్లలు తమలా రైతులు కావాలని అస్సలు కోరుకోవడం లేదు. ‘‘పెద్దయ్యాక రైతును అవుతాను’’ అని కూడా ఎవరూ చెప్పరు. ‘‘మేము వ్యవసాయం చేస్తాం, ఎంతోమందికి ఆదర్శంగా నిలిచాం. ఇప్పుడు ప్రపంచ దేశాధ్యక్షులు సైతం మేము చెప్పబోయేది ఆసక్తిగా వినబోతున్నారు అదీ వ్యవసాయం గొప్పతనం’’ అని చాటిచెబుతున్నారు ఇద్దరు మహిళా రైతులు.
అవును గొప్పగొప్ప చదువులు చదివినవారికంటే..తమ పూర్వీకుల నాటి నుంచి ఆచరిస్తోన్న పద్ధతులతో వ్యవసాయం చేస్తూ అందరి దృష్టి తమవైపు తిప్పుకున్న రైతులకు జీ–20 సదస్సుకు ఆహ్వానాలు అందాయి. పెద్దపెద్ద డిగ్రీలు, హోదాలు లేకపోయినప్పటికీ.. కేవలం వ్యవసాయం చేస్తున్నారన్న ఒక్క కారణంతో ... ప్రపంచ దేశాధ్యక్షులు పాల్గొనే ‘జీ–20 సమితి’లో పాల్గొనే అవకాశం ఇద్దరు మహిళా రైతులకు దక్కింది. ఒడిశాకు చెందిన గిరిజన మహిళా రైతులు ౖ‘రెమతి ఘురియా, సుబాసా మోహన్తా’లకు ఈ అరుదైన గౌరవం లభించింది. సంప్రదాయ, గిరిజన చిరుధాన్యాల (మిల్లెట్స్) సాగు పద్ధతులను జీ–20 వేదికపై ఈ ఇద్దరు ప్రపంచ దేశాలకు వివరించనున్నారు.
కోరాపుట్ జిల్లాలోని నౌగుడా గ్రామానికి చెందిన రైతే 36 ఏళ్ల రైమతి ఘురియా. భూమియా జాతికి చెందిన రైమతికి ముగ్గురు పిల్లలు. మొదటి నుంచి వ్యవసాయం మీద ఆధారపడి జీవిస్తోంది. ఏళ్లపాటు వరిధాన్యాలు పండించే రైమతి... చిరుధాన్యాల సాగు మెళుకువలు నేర్చుకుని మిల్లెట్స్ సాగు మొదలు పెట్టింది. అధునాతన సాంకేతికతను జోడించి పంటలో అధిక దిగుబడిని సాధిస్తోంది. సాగులోలేని 72 దేశీయ వరి రకాలు, ఆరు చిరుధాన్యాలతో కలిపి మొత్తం 124 రకాల ధాన్యాలను అంతరించిపోకుండా కాపాడుతోంది. మంచి దిగుబడితో సాధిస్తున్న రైతుగానేగాక, తోటి గిరిజన రైతులకు చిరుధాన్యాల సాగులో సాయం చేస్తూ వారికీ జీవనోపాధి కల్పిస్తోంది.
సంప్రదాయ పంటలైన వరి, మిల్లెట్ రకాలను పండిస్తూనే తన గిరిజన మహిళలెందరికో ఆదర్శంగా నిలుస్తూ... మిల్లెట్ సాగును ప్రోత్సహిస్తోంది. పంటమార్పిడి, అంతర పంటలు, సేంద్రియ పంటల్లో తెగులు నివారణ మెళకువల గురించి, స్కూలును ఏర్పాటు చేసి ఏకంగా 2500 మంది రైతులకు శిక్షణ ఇచ్చింది. చిరుధాన్యాల సాగులో రైమతి చేసిన కృషికిగా గుర్తింపుగా అనేక ప్రశంసలు కూడా అందుకుంది. 2012లో జీనోమ్ సేవియర్ కమ్యునిటీ అవార్డు, 2015లో జమ్‌షెడ్జీ టాటా నేషనల్ వర్చువల్ అకాడమీ ఫెలోషిప్ అవార్డు, టాటా స్టీల్ నుంచి ‘బెస్ట్ ఫార్మర్’ అవార్డులేగాక, ఇతర అవార్డులు అందుకుంది.
చిరుధాన్యాల సాగులో అనుసరిస్తోన్న పద్ధతులు, దిగుబడి, తోటి రైతులను ఆదుకునే విధానమే రైమతిని జీ20 సదస్సుకు వెళ్లేలా చేసింది. ఈ సదస్సు లో ఇండియన్ అగ్రికల్చరల్ రిసెర్చ్ ఇనిస్టిట్యూట్ ఏర్పాటు చేసే ఎగ్జిబిషన్‌లో వివిధ రకాల చిరుధాన్యాలు, ఈ ధాన్యాలతో చేసిన విభిన్న వంటకాలు, చిరుధాన్యాలతో వేసిన ముగ్గులను ప్రదర్శించనుంది. చిరుధాన్యాల సాగులో తాను ఎదుర్కొన్న పరిస్థితులు, అధిక దిగుబడి కోసం అవలంబిస్తోన్న విధానాలు వివరించనుంది. మిల్లెట్ సాగులో అనుసరించాల్సిన అధునాతన సాంకేతికత, దాని ఉపయోగాల గురించి ఎమ్‌ఎస్ స్వామినాథన్ రిసెర్చ్ సెంటర్ ఇచ్చిన శిక్షణ సంబంధిత అంశాలను ప్రస్తావించనుంది.
సుబాసా మొహన్తా
మయూర్‌భంజ్ జిల్లాలోని గోలి గ్రామానికి చెందిన చిరుధాన్యాల రైతే 45 ఏళ్ల సుబాసా మొహన్తా. తన జిల్లాలో ఎవరికీ చిరుధాన్యాల సాగుపై ఆసక్తి ఏమాత్రం లేదు. 2018లో ఒడిశా ప్రభుత్వం రైతులను చిరుధాన్యాల సాగు చేయమని మిల్లెట్ మిషన్‌ను తీసుకొచ్చింది. కానీ ఎవరూ ముందుకు రాలేదు. అలాంటి పరిస్థితుల్లో ధైర్యం చేసి ముందుకొచ్చింది సుబాసా. ఏళ్లనాటి గిరిజన సాగుపద్ధతులను ఉపయోగిస్తూ రాగుల సాగును ప్రారంభించింది. అప్పటి నుంచి మిల్లెట్స్‌ను పండిస్తూ అధిక దిగుబడిని సాధిస్తోంది. ఇది చూసిన ఇతర రైతులు సైతం సుబాసాను సాయమడగడంతో వారికి సాగు పద్ధతులు, మెళకువలు నేర్పిస్తూ మిల్లెట్ సాగును విస్తరిస్తోంది. సుబాసాను ఎంతోమంది గిరిజన మహిళలు ఆదర్శంగా తీసుకుని చిరుధాన్యాలు సాగుచేయడం విశేషం. సుబాసా కృషిని గుర్తించిన రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాలు అవార్డులతో సత్కరించాయి.
జీ20 సదస్సుకు హాజరవుతున్నందుకు చాలా సంతోషంగా ఉంది. చిరుధాన్యాల సాగు, ఈ ధాన్యాల ప్రాముఖ్యత గురించి అందరికీ చెబుతాను. గిరిజన మహిళగా గిరిజన సాగు పద్ధతులను మరింత విపులంగా అందరికీ పరిచయం చేస్తా్తను.
– రైమతి ఘురియా
చిరుధాన్యాలు ఆరోగ్యానికి ఎంతో మంచిచేస్తాయి. ఇవి అనేక రకాల వ్యాధులు రాకుండా కాపాడతాయి. ఒకప్పుడు గిరిజనుల ప్రధాన ఆహారం చిరుధాన్యాలు. కానీ ఇప్పుడు పొలాల నుంచి దాదాపు కనుమరుగయ్యాయి. నేను ధాన్యాలు పండించడం మొదలు పెట్టిన తరువాత నన్ను చూసి చాలామంది రైతులు చిరుధాన్యాలు సాగుచేయడం ప్రారంభించారు. ఇతర రైతులకు వచ్చే సందేహాలు నివృత్తిచేస్తూ, సలహాలు ఇస్తూ ప్రోత్సహించాను. వరికంటే చిరుధాన్యాల సాగులో అధిక దిగుబడులు వస్తుండడంతో అంతా ఈ సాగుకే ప్రాధాన్యం ఇస్తున్నారు.
– సుబాసా మోహన్తా
Comments
Please login to add a commentAdd a comment