
పది విషయాలు నేర్చుకున్నప్పుడు కూడా... నేర్చుకోవడానికి మరో పది విషయాలు రెడీగా ఉంటాయి. ‘నేర్చుకోవడానికి నేను రెడీ’ అనుకుంటే మీరే విజేత. అలాంటి ఒక విజేత... బి. ప్రవల్లిక. ఒకటి కాదు రెండు కాదు ఏకంగా 175 ఆన్‌లైన్ కోర్సులు పూర్తి చేసి ‘ఔరా’ అనిపించింది...
విశాఖ జిల్లా భీమిలిలోని ‘కస్తూర్బా గాంధీ విద్యాలయం’లో పదవ తరగతి చదువుతున్న బి. ప్రవల్లిక చదువులో ముందుండడమే కాకుండా పలు కోర్సులలో విశేష ప్రతిభ చూపుతూ ప్రశంసలు అందుకుంటోంది. అనకాపల్లి జిల్లా అచ్యుతాపురానికి చెందిన ప్రవల్లిక తండ్రి కోవిడ్ వల్ల చనిపోయారు. తల్లి ప్రైవేటు కంపెనీలో పని చేస్తోంది.
ఆన్‌లైన్ కోర్సుల హవా...
గతంలో సమగ్ర శిక్ష అభియాన్ ప్రాజెక్ట్ కోఆర్డినేటర్‌గా పని చేసిన బి.శ్రీనివాసరావు ఇక్కడి విద్యార్థినులు ఆధునిక కోర్సులు నేర్చుకుంటే భవిష్యత్తులో వారికి ఎంతో ఉపయోగకరంగా ఉంటుందనే ఉద్దేశంతో ఇన్ఫోసిస్ వారి సహకారాన్ని తీసుకున్నారు. కోర్సుల కోసం 20 మందిని ఎంపిక చేశారు. ఇన్ఫోసిస్ స్ప్రింగ్ బోర్డు ఆన్‌లైన్ ప్లాట్‌ఫారం ద్వారా కోర్సులను ఎంపిక చేసుకోవలసి ఉంటుంది.
ఎంపిక చేసుకున్న కోర్సులకు సంబంధించిన సమాచారం, సూచనలు అందిస్తారు. ఆ తరువాత ఆన్ లైన్ లో నిర్వహించే పరీక్షల్లో పాల్గొనాలి. సాఫ్ట్‌వేర్, హార్డ్‌వేర్, రోబోటిక్స్, ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్, డేటాబేస్, డ్రోన్ ... మొదలైన వాటితోపాటు మొత్తం 175 కోర్సులు పూర్తి చేసింది ప్రవల్లిక. కోర్సును బట్టి కొన్ని గంటలు లేదా ఒకటి, రెండు రోజుల్లో నేర్చుకుని పరీక్షల్లో పాల్గొంటూ మంచి మార్కులు పొదుతూ సర్టిఫికెట్లు సాధించింది.
నాడు... నేడు
గత ప్రభుత్వ హయాంలో జరిగిన ‘నాడు–నేడు’ పనుల ద్వారా ఎన్నో సదుపాయాలు అందుబాటులోకి రావడం వల్ల ఆన్ లైన్ కోర్సుల అభ్యసనకు వీలు కలిగింది. రూ. 51 లక్షలతో అదనపు గదులు, విద్యార్థినులు ప్రశాంతంగా చదువుకోవడానికి పెద్ద షెడ్డు, అవసరమైన ఇతర సదుపాయాల కల్పన జరిగింది.
‘ఆసక్తి ఉన్నచోటే ప్రతిభ ఉంటుంది. ప్రవల్లికకు కొత్త విషయాలపై ఎంతో ఆసక్తి ఉంది. ఆ ఆసక్తే ఆమెను 175 కోర్సులు పూర్తి చేసేలా చేసింది. భవిష్యత్తులో తన చదువుకు ఈ కోర్సులు ఎంతగానో ఉపయోగపడతాయి. 175 కోర్సులు పూర్తి చేయడం అనేది ఆమెకే కాదు విద్యాలయానికి గర్వకారణం’ అంటుంది కేజీబీవీ ప్రిన్సిపాల్ గంగా కుమారి.
టార్గెట్... ఐఏఎస్
ఎంతోమంది ఐఏఎస్ అధికారుల విజయగాథలను క్లాస్‌రూమ్‌లో వింటున్నప్పుడు ప్రవల్లిక మదిలో ‘ఐఏఎస్’ కలకు బీజం పడింది. ‘లక్ష్యసాధనకు మన ఆర్థిక స్థితిగతులతో పనిలేదు. కడు పేదరికంలో పుట్టిన వారు కూడా ఎంతో కష్టపడి తమ లక్ష్యాన్ని నెరవేర్చుకున్నారు. మనకు కావాల్సింది సాధించాలనే పట్టుదల మాత్రమే’... ఇలాంటి మాటలు ఎన్నో ప్రవల్లికకు స్ఫూర్తినిచ్చి ‘ఐఏఎస్’ లక్ష్యానికి బలాన్ని ఇచ్చాయి. – సింగారెడ్డి రమణప్రసాద్, సాక్షి, భీమిలి
Comments
Please login to add a commentAdd a comment