Siri grains
-
మహిళల ఘన విజయం: విత్తనం పరిరక్షణకు‘చిరు’యత్నం
‘ఇంటర్నేషనల్ సీడ్ డే’... ఇలాంటి ఓ రోజు ఉందా! ఉంది... అయితే ప్రచారమే పెద్దగా ఉండదు. ఇది గ్లామర్ మార్కెట్ వస్తువు కాకపోవడమే కారణం. ఈ రోజును రైతు మహిళలు నిర్వహించారు. ‘చిరు’సాగు చేసి కళ్లాల్లో రాశులు పోసిన చేతులవి. విత్తనాన్ని కాపాడాలనే ముందుచూపున్న చేతలవి. రాగి ముద్ద స్టార్ హోటల్ మెనూలో కనిపిస్తోంది. స్మార్ట్‌గా ఆర్డర్ చేస్తే అందమైన ప్యాక్‌తో ఇంటిముందు వాలుతోంది. అలాగే సజ్జ ఇడ్లీ, ఊదల దోసె, కొర్రల కర్డ్ మీల్, జొన్న రొట్టె, మిల్లెట్ చపాతీ, మిల్లెట్ పొంగలి... ఇలా బ్రేక్ ఫాస్ట్ సెంటర్లు కొత్త రూపుదిద్దుకున్నాయి. ఎక్కడో మారుమూల గ్రామాల్లో నీటి వసతి లేని నేలను నమ్ముకుని బతికే వాళ్ల ఆకలి తీర్చిన చిరుధాన్యాలు ఇప్పుడు బెంజ్‌కారులో బ్రేక్‌ఫాస్ట్‌కి వెళ్లే సంపన్నుల టేబుల్ మీదకు చేరాయి. ఒకప్పుడు చిన్న చూపుకు గురైన చిరుధాన్యాలు నేడు సిరిధాన్యాలుగా మన దైనందిన జీవితంలో ప్రధాన భూమికను పోషిస్తున్నాయి. వీటి వెనుక నిరుపేద మహిళల శ్రమ ఉంది. పాతికేళ్లుగా ఈ నిరుపేద మహిళలు చిరుధాన్యాలతోనే జీవించారు, చిరుధాన్యాల పరిరక్షణ కోసమే జీవించారు. సేంద్రియ సేద్యంతో చిరుధాన్యాల జీవాన్ని నిలిపారు. అంతర్జాతీయ విత్తన దినోత్సవం (ఏప్రిల్ 26) సందర్భంగా బుధవారం వీరంతా మెదక్ జిల్లా, జహీరాబాద్ మండలం, పస్తాపూర్‌లో తమ దగ్గరున్న పంటల విత్తనాలను సగర్వంగా ప్రదర్శించారు. హైబ్రీడ్ వంగడాల మాయలో పడకుండా మన విత్తనాలను మనం కాపాడుకోవాలని ఒట్టు పెట్టుకున్నారు. ఈ సందర్భంగా హైదరాబాద్ కేంద్రంగా పని చేస్తున్న దక్కన్ డెవలప్మెంట్ సొసైటీ బోర్డు సభ్యులు రుక్మిణీరావు సాక్షితో పంచుకున్న వివరాలివి. ఈ నేల... ఈ విత్తనం... మన సొంతం ‘‘చిరుధాన్యాల పట్ల అవగాహన కోసం ఈ ఏడాదిని ‘ఇంటర్నేషనల్ ఇయర్ ఆఫ్ మిల్లెట్స్’ నిర్వహించుకుంటున్నాం. ఈ ఏడాది సీడ్ డే రోజున మేము చిరుధాన్యాల విత్తనాల పరిరక్షణ, ప్రదర్శన నిర్వహించాం. పస్తాపూర్ కేంద్రంగా జరిగిన ఈ కార్యక్రమంలో 26 పరిసర గ్రామాల నుంచి వందకు పైగా మహిళలు వారు పండించి, పరిరక్షించిన విత్తనాలను తీసుకువచ్చారు. చిరుధాన్యాలతోపాటు పప్పుధాన్యాలు, నూనె గింజల విత్తనాలు మొత్తం యాభైకి పైగా పంటల విత్తనాలకు ఈ ప్రదర్శన వేదికైంది. ఇవన్నీ సేంద్రియ సేద్యంలో పండించినవే. ఆహారం –ఆకలి! ఆహారం మన ఆకలి తీర్చాలి, దేహానికి శక్తినివ్వాలి. ‘వరి అన్నం తిని పొలానికి వెళ్తే పని మొదలు పెట్టిన గంట సేపటికే మళ్లీ ఆకలవుతుంది. రొట్టె తిని వెళ్తే ఎక్కువ సేపు పని చేసుకోగలుగుతున్నాం. అందుకే మేము కొర్రలు, జొన్నలు తింటున్నాం’ అని ఈ మహిళలు చెప్పిన మాటలను తోసిపుచ్చలేదు సైంటిస్టులు. వారి అనుభవం నుంచి పరిశోధన మొదలు పెట్టారు. అందుకే మిల్లెట్స్‌లో దాగి ఉన్న శక్తిని ప్రపంచ వేదికల మీద ప్రదర్శించగలిగారు. అలాగే ఈ మహిళలు విదేశాల్లో రైతు సదస్సులకు హాజరై తమ అనుభవాలను వారితో పంచుకున్నారు. భూగోళం ఎదుర్కొంటున్న మరో విపత్తు క్లైమేట్ చేంజ్. ఈ పంటలైతే వాతావరణ ఒడిదొడుకులను ఎదుర్కుని పంటనిస్తాయి. పదిహేను రోజులు నీరు అందకపోయినప్పటికీ జీవాన్ని నిలుపుకుని ఉంటాయి. చిరుధాన్యాలకు గాను మన ముందున్న బాధ్యత ఈ విత్తనాలను కాపాడుకోవడం. ఎట్టి పరిస్థితుల్లోనూ వీటి మీద హక్కులను కార్పొరేట్ సంస్థలు తన్నుకుపోకుండా చూసుకోవాలి. అవసరమైతే ఉద్యమించాలి. ఇదే మనం డీడీఎస్ స్థాపకులు మిల్లెట్ మ్యాన్ పీవీ సతీశ్‌గారికి ఇచ్చే నివాళి’’ అన్నారు రుక్మిణీరావు. చిరుధాన్యాలను పండించడంలో ముందడుగు వేసేశాం. ఇక మన ముందున్న బాధ్యత ఈ విత్తనాలను కాపాడుకోవడం. ఈ విత్తనాల మీద పూర్తి హక్కులు ఈ పేద రైతు మహిళలవే. – రుక్మిణీరావు, బోర్డు సభ్యులు, దక్కన్ డెవలప్మెంట్ సొసైటీ – వాకా మంజులారెడ్డి -
ప్లేట్లో మెనూ మారింది
కర్నూలు: నగరంలోని బుధవారపేటకు చెందిన రామాంజనేయులు ఓ ప్రైవేటు సంస్థలో పనిచేస్తాడు. ఆయన పదేళ్లుగా షుగర్ జబ్బుతో బాధపడుతున్నాడు. గతంలో మెనూలో అన్నాన్ని తప్పకుండా తీసుకునేవాడు. కానీ షుగర్ తగ్గకపోవడంతో వైద్యుల సూచన మేరకు అన్నాన్ని పూర్తిగా మానేశాడు. దాని స్థానంలో రాగులు, జొన్నలతో చేసిన ఆహారాన్ని తింటున్నాడు. నెలరోజుల్లోనే ఆయన షుగర్ స్థాయిలు సాధారణ స్థితికి వచ్చాడు. ఆయనతో పాటు ఆయన భార్యకూ ఇలాగే ఆహార నియమాలు పాటిస్తున్నాడు. ఇద్దరికీ షుగర్ సాధారణ స్థితికి రావడంతో వైద్యులు ఆ రిపోర్ట్లు పరిశీలించి మందుల డోసు తగ్గించాడు. నంద్యాలకు చెందిన రఘురామయ్యకు ఎంతకూ షుగర్ నియంత్రణలోకి రాకపోవడంతో ఆహారంలో సిరిధ్యానాలు చేర్చుకున్నాడు. మూడురోజులకు ఒక సిరిధాన్యాన్ని మార్చి మార్చి వివిధ వంటకాలు తయారు చేయించుకుని తినసాగాడు. కొన్ని రోజులకే అతని షుగర్ నియంత్రణలోకి వచ్చేసింది. వీరే కాదు జిల్లాలో అనేక మంది మెనూలో అన్నాన్ని తగ్గించడమో లేదా పూర్తిగా మానేయడమో చేస్తున్నారు. కాఫీ, టీలు తాగినా చక్కెర లేకుండా తాగుతున్నారు. తమ అలవాట్లలోనూ మార్పులు చేసుకుంటున్నారు. పాతకాలం నాటి ఆహార పద్దతులైన కొర్రలు, సజ్జలు, రాగులు, సామలు, గోదుమలతో చేసిన వంటకాలను తినేందుకు ఇష్టపడుతున్నారు. జీవనశైలిలో మార్పుల వల్ల వచ్చిన జబ్బులకు ఆహారంలో మార్పులే విరుగుడని ప్రజలు భావించి ప్లేట్లో మెనూనే మార్చుకుంటున్నారు. బీపీ, షుగర్, కీళ్లనొప్పులు, ఊబకాయం, గ్యాస్ట్రబుల్, గుండెజబ్బులు వంటివన్నీ జీవనశైలిలో మార్పుల వల్ల వచ్చే జబ్బులే. జిల్లా జనాభా 45లక్షలకుపైగానే ఉంది. ఇందులో 20శాతం ప్రజలు బీపీ, షుగర్, థైరాయిడ్ వంటి జీవనశైలి జబ్బులతో బాధపడుతున్నారు. తలనొప్పి, కళ్లు తిరగడం, ఒళ్లునొప్పులు, నీరసం, మూత్రం ఎక్కువసార్లు వెళ్లడం వంటి లక్షణాలుండి వైద్యుల వద్దకు వెళ్లే ప్రతి ముగ్గురిలో ఇద్దరికి బీపీ, షుగర్ ఉన్నట్లు నిర్దారిస్తున్నారు. విజ్ఞతగల వైద్యులు ముందుగా ఆహారపు అలవాట్లు మార్చుకోవాలని, వ్యాయామం చేయాలని సూచిస్తున్నారు. అప్పటికీ వారిలో మార్పు రాకపోతే మందులకు వెళ్తున్నారు. కానీ జిహ్వాచాపల్యాన్ని చంపుకోలేని వారు మందులపైనే ఎక్కువగా ఆధారపడుతున్నారు. ఫలితంగా ప్రతి సంవత్సరం వారు వాడే మందుల డోసు పెరుగుతుందే గానీ వ్యాధి నయం కావడం లేదు. దీనికంతటికీ విరుగుడు మళ్లీ పాత రోజుల్లోని ఆహారపు అలవాట్లకు వెళ్లాల్సిందేనని అధిక శాతం భావిస్తున్నారు. ఈ మేరకు వారు ఆహారపు అలవాట్లు మార్చుకుంటున్నారు. బజార్లో రొట్టెలకు భలే గిరాకీ ఇటీవల కాలంలో కర్నూలుతో పాటు నంద్యాల, ఆదోని లాంటి పట్టణ ప్రాంతాల్లో సాయంత్రం కాగానే జొన్నరొట్టెలు, పుల్కాలు, చపాతీలు, కర్రీలు విక్రయించే వ్యాపార కేంద్రాలు తెరుచకుంటున్నాయి. సాయంత్రం నుంచి రాత్రి వరకు అక్కడ జొన్నరొట్టెలు కొడుతూనే ఉంటారు. వేడివేడిగా రొట్టెలు ఇలా వస్తూనే అలా విక్రయాలు జరిగిపోతున్నాయి. కర్నూలులోని గాంధినగర్, వెంకటరమణ కాలని, నరసింహారెడ్డి నగర్, రైల్వేస్టేషన్ రోడ్, అశోక్‌నగర్, మద్దూర్‌నగర్, నంద్యాల రోడ్డు, గణేష్‌నగర్, సి.క్యాంపు, నాగిరెడ్డి రెవిన్యూ కాలని, బుధవారపేట, శ్రీరామనగర్ ఇలా దాదాపు అన్ని కాలనీల్లో రొట్టెలు విక్రయించే దుకాణాలు విస్తృతంగా వెలిశాయి. ఒక జొన్న రొట్టె, చపాతీలు ఒక్కోటి రూ.12ల నుంచి రూ.15ల వరకు విక్రయిస్తున్నారు. వీటిలోకి కర్రీలు కావాలంటే అదనంగా రూ.10 నుంచి రూ.15లు చెల్లించాల్సి ఉంటుంది. అయితే ప్రజల అవసరాన్ని ఆసరాగా చేసుకున్న కొందరు వ్యాపారులు తక్కువ సమయంలో లాభార్జన చేసేందుకు గాను జొన్న పిండిలో బియ్యం పిండి కలిపి రొట్టెలు చేస్తున్నారు. దీనివల్ల ప్రజలు తమ ఆహారాన్ని మార్చుకున్నా ఉపయోగం ఉండటం లేదు. రెస్టారెంట్లలోనూ మారిన మెనూలు ప్రజల ఆహారపు అలవాట్లు మారడంతో రెస్టారెంట్లలోనూ మెనూలో మార్పులు తీసుకొచ్చారు. నగరంలో 30కి పైగా చిన్నా, పెద్దా రెస్టారెంట్లు ఉన్నాయి. ఇందులో అధిక శాతం తందూరి రోటీ, చపాతి, పుల్కాలు, జొన్న రొట్టెలు ఆర్డర్ ఇస్తున్నారు. అందులో ఏదో ఒక కర్రీని ఆహారంగా తీసుకుంటున్నారు. చివరగా ఒక బిర్యానిని ముగ్గురు కలిసి ఆర్డర్ ఇచ్చి తింటున్నారు. గతంలో ఒక్కో బిర్యానిని ఒక్కొక్కరు తినేవారు. ఇప్పుడు బిర్యాని స్థానంలో రొట్టెలు వచ్చి చేరాయి. దీంతో పాటు రెస్టారెంట్లలో రాగి ముద్ద, రాగిసంకటి, కొర్ర అన్నం కూడా వండి పెడుతున్నారు. ఐదురోడ్ల కూడలిలో కేవలం సిరిధాన్యాలతో వండిన ఆహారపదార్థాలను విక్రయించడం విశేషం. సిరిదాన్యాలకు భలే గిరాకి జీవనశైలి వ్యాధులకు సిరిదాన్యాలే మందు అని ఇటీవల పలు సామాజిక మాధ్యమాల్లో సమాచారం చక్కర్లు కొడుతోంది. దీంతో ప్రజలు కొర్రలు, సామలు, అరికెలు, సజ్జలు కొనేందుకు ముందుకు వస్తున్నారు. 40 ఏళ్ల క్రితం ఇవి పేదల ఆహారంగా ఉండేవి. అప్పట్లో ధనవంతులు మాత్రమే వరి అన్నాన్ని భుజించేవారు. ఈ కారణంగా అప్పట్లో బీపీ, షుగర్ జబ్బులు అధిక శాతం ధనవంతులకు మాత్రమే వచ్చేవి. ఇప్పుడు వరి అన్నం అందరికీ అందుబాటులోకి రావడంతో 30 ఏళ్లుగా ఇదే ప్రధాన ఆహారంగా మారింది. అయితే వరిదాన్యాన్ని తెల్లగా పాలిష్ పట్టడంతో దానిపై ఉన్న పోషకాలు పోయి పిప్పిగా మారుతోంది. దీన్ని వండుకుని తినడంతో నేరుగా గ్లూకోజ్ మన శరీరంలోకి వెళ్తుందని వైద్యులు చెబుతున్నారు. ఈ కారణంగా ఇప్పుడు ఆహారంపై అవగాహన పెంచుకుని అలవాట్లను మార్చుకుంటున్నారు. ప్రస్తుతం మార్కెట్లో జొన్నలు(రాయచూరు) రూ.55లు, కొర్రలు రూ.60లు, సామలు, అరికెలు రూ.80లకు పైగానే విక్రయిస్తున్నారు. ఇక సేంద్రీయ ఎరువులతో పండించిన సిరిదాన్యాలు కిలో రూ.110లకు పైగానే పలుకుతున్నాయి. గతంలో వీటిని కొనేవారు లేక పశువులకు పెట్టేవారంటే అతిశయోక్తి కాదు. ఆహారపు అలవాట్లతో వ్యాధులు దూరం –డాక్టర్ జి.రమాదేవి,డైటీషియన్, కర్నూలు గతంలో ప్రతి ఒక్కరి ఆహారంగా జొన్నరొట్టెలు, కొర్ర అన్నం ఉండేది. కూరల్లో నూనె శాతం కూడా తక్కువగా ఉండేది. పండుగల సమయంలో మాత్రమే బజ్జీలు తినేవారు. ఇప్పుడు బియ్యాన్ని ఎక్కువగా పాలిష్ చేయడంలో వల్ల అందులోని విటమిన్స్ పోతున్నాయి. కార్బొహైడ్రేట్స్ ఎక్కువ కావడం వల్ల స్థూలకాయం వస్తోంది. ఆకలేస్తే పిజ్జాలు, బర్గర్లు తినడం వల్ల కొవ్వు శాతం అధికమైపోయి గుండెపోటుకు దారి తీస్తోంది. పలుమార్లు కాచిన నూనెలో చేసిన బజ్జీలు తినడం, కూల్‌డ్రింక్స్, నిల్వ ఉంచిన బిస్కట్లు తినడం వల్ల క్యాన్సర్ వస్తోంది. వీటన్నింటికీ విరుగుడూ ఆహారంలో మార్పులే. ఈ దిశగా ప్రస్తుతం ప్రజలు ముందుకు వెళ్లడం శుభపరిమాణం. సిరిదాన్యాలతో వ్యాధులకు చెక్ –డాక్టర్ ప్రభాకర్‌రెడ్డి, ప్రభుత్వ ఆయుర్వేద వైద్యులు, కర్నూలు కొర్రలు, అంటుకొర్రలు, రాగులు, సజ్జలు, సామలు, అరికెలు, వరిగెలు లాంటి సిరిదాన్యాలను సక్రమంగా వినియోగిస్తే చాలా జబ్బులకు పరిష్కారం దొరుకుతుంది. స్థూలకాయం, షుగర్, బీపీ, థైరాయిడ్, క్యాన్సర్ వంటి జబ్బులకు ఇదే మందు. వీటిలో పీచు పదార్థం ఎక్కువగా ఉంటుంది. వరి, గోదుమల్లో 2 శాతంలోపే పీచు ఉంటుంది, సిరిదాన్యాల్లో 6 నుంచి 8 శాతం వరకు పీచు ఉంటుంది. దీనివల్ల త్వరగా జీర్ణం గాక నిదానంగా శరీరంలోకి గ్లూకోజు విడుదల అవుతుంది. రక్తప్రసరణ మెరుగుపడుతుంది. మలబద్దకం పోతుంది. సిరిదాన్యాలతో తయారు చేసిన కషాయాలు సేవించడం వల్ల చాలా దీర్ఘకాలిక వ్యాధులు తగ్గుతాయి. సిరిదాన్యాలు తక్కువ వర్షపాతంలోనూ పండుతాయి. క్రిమిసంహారక మందులు, ఎరువులు వాడాల్సిన అవసరం లేదు. అధికారులు వీటిని ప్రోత్సహిస్తే వారికి ఉపయోగం ఉంటుంది. అన్నం పూర్తిగా మానేశాను –వి. ప్రసాద్, కర్నూలు నాకు 12 ఏళ్లుగా షుగర్ జబ్బు ఉంది. ఈ వ్యాధి వల్ల నేను అనేక ఇబ్బందులు పడ్డాను. చివరకు వైద్యుల సలహా మేరకు నా మెనూలో మార్పులు చేసుకున్నాను. ఇప్పుడు చాలా తక్కువ పరిమాణంలో ఆహారాన్ని తీసుకుంటున్నాను. తెల్ల అన్నాన్ని పూర్తిగా మానేశాను. జొన్నరొట్టెలు, పుల్కాలు, రాగి సంకటి వంటివి తింటున్నాను. ఈ కారణంగా ప్రస్తుతం షుగర్ కంట్రోల్లో ఉంటోంది. -
‘సిరి’ దారిలో ప్రజా వైద్య సేద్యం!
వైద్యుడు అనారోగ్యాన్ని తగ్గించడం గురించి మాత్రమే కాదు, ఆరోగ్యాన్ని అందించే సరైన ఆహారం గురించి, ఆ ఆహారం పండించే పద్ధతుల గురించి కూడా పట్టించుకోవాలంటున్నారు డాక్టర్ ధర్మకారి రాంకిషన్. మహబూబ్‌నగర్ ప్రభుత్వ ఆసుపత్రి సూపరింటెండెంట్‌గా పనిచేస్తున్న ఆయన చాలాకాలంగా నల్లమల ప్రాంత చెంచుల గ్రామాల్లోకి వెళ్లి వైద్య శిబిరాలు నిర్వహిస్తూ ఉంటారు. గత రెండేళ్లుగా సిరిధాన్యాలనే ఆహారంగా తింటూ.. వందలాది మంది రోగులకూ ఈ ఆహారాన్ని అలవాటు చేసి దీర్ఘవ్యాధుల నుంచి వారిని విముక్తం చేస్తున్నారు. అంతేకాదు.. స్వయంగా 20 ఎకరాల్లో సిరిధాన్యాలను వర్షాధారంగా పండిస్తున్నారు. మహబూబ్‌నగర్, నాగర్‌కర్నూల్ జిల్లాల్లో కొందరు చెంచులు, ఇతర రైతులను ప్రోత్సహించి ఈ ఖరీఫ్ సీజన్లో 200 ఎకరాల్లో సిరిధాన్యాలను సాగు చేయిస్తున్నారు. చెంచులోకం స్వచ్ఛంద సంస్థకు గౌరవాధ్యక్షుడు కూడా అయిన ఆయన ఐటీడీఏ తోడ్పాటుతో చెంచులతో సిరిధాన్యాల ప్రాసెసింగ్ యూనిట్లు, విక్రయ కేంద్రాలు ఏర్పాటు చేయించబోతున్నారు. వచ్చే ఏడాది వెయ్యి ఎకరాల్లో సాగు చేయించాలని, సిరిధాన్యాల విత్తన బ్యాంకులను నిర్మించాలన్న దృఢ సంకల్పంతో ఉన్నారు. ఇందుకోసం ‘రైతు లోకం ఫౌండేషన్’ను రిజిస్టర్ చేయించి టోల్ ఫ్రీ నంబరు ద్వారా సిరిధాన్యాలు ఆహార, ఆరోగ్య, వ్యవసాయ సంబంధమైన శాస్త్రీయ అవగాహనను ప్రజలకు అందించాలని అభిలషిస్తూ ఇతరులకు స్ఫూర్తినిస్తున్నారు. మెట్ట రైతుల పక్షపాతి, సిసలైన ప్రజావైద్యుడు డాక్టర్ రామ్‌కిషన్‌కు వందనాలు! అరుదైన ప్రజా వైద్యుడు డాక్టర్ ధర్మకారి రామ్‌కిషన్. వృత్తి రీత్యా ఆయన ఎముకల శస్త్రచికిత్సా నిపుణుడు. వైద్య విద్యార్థులకు 20 ఏళ్లుగా పాఠాలు చెబుతున్న ప్రొఫెసర్. ప్రస్తుతం మహబూబ్‌నగర్ ప్రభుత్వ ఆసుపత్రి సూరపింటెండెంట్గా సేవలందిస్తున్నారు. ప్రవృత్తి రీత్యా అట్టడుగు వర్గమైన నల్లమల చెంచులకు ఆప్తుడు. చెంచులోకం స్వచ్ఛంద సంస్థకు గౌరవాధ్యక్షుడిగా చెంచుల పెంట(గూడేల)ల్లో వైద్య శిబిరాలు పెడుతూ వారికి అండదండగా ఉంటుంటారు. గత రెండేళ్లుగా వరి, గోధుమలను తినటం నిలిపివేసి పూర్తిగా వర్షాధారంగా పండించిన సిరిధాన్యాలనే తింటున్నారు. ప్రజావైద్యంలో సిరిధాన్యాలను మిళితం చేసి వందలాది మంది దీర్ఘ రోగులను సంపూర్ణ ఆరోగ్యం దిశగా నడిపిస్తున్నారు. బంధు మిత్రుల కుటుంబాలను కూడా కొర్రలు, సామలు, ఆరికలు, ఊదలు, అండుకొర్రలనే ముఖ్య ఆహారంగా, అంబలిగా, అల్పాహారంగా, చిరుతిండ్లుగా తీసుకోవడం.. రోజూ 7–10 కిలోమీటర్లు నడవడం ద్వారా దీర్ఘరోగాల నుంచి కూడా విముక్తి పొంది సంపూర్ణ ఆరోగ్యం సంతరించుకోవచ్చని సూచిస్తూ సత్ఫలితాలు సాధిస్తున్నారు. స్వయంగా తాను 20 ఎకరాల్లో సాగు చేస్తున్నారు. అంతగా ఆదాయం లేక అల్లాడుతున్న వర్షాధార వ్యవసాయదారులను నాలుగు వర్షాలు పడితే నిశ్చింతగా పండే ఈ సిరిధాన్యాల సాగుకు చెంచులను, ఇతర వర్గాల రైతులను ప్రోత్సహిస్తున్నారు. స్వతంత్ర శాస్త్రవేత్త డా. ఖాదర్ వలితో కూడా అనేక సదస్సులు నిర్వహించారు. పత్తి పొలాల మధ్య సిరిధాన్యాల సాగు నాగర్‌కర్నూల్ జిల్లా తాడూరు మండలం ఇంద్రకల్ డాక్టర్ రామ్‌కిషన్ సొంత గ్రామం. అక్కడే ఆయనకు రెండెకరాల పొలం ఉంది. మరో 18 ఎకరాల నల్లరేగడి భూమి కౌలుకు తీసుకొని మొదటి సారిగా ఈ ఏడాదే 5 రకాల సిరిధాన్యాలు – కొర్రలు, సామలు, ఆరికలు, ఊదలు, అండుకొర్రల–ను పండిస్తున్నారు. గొర్రు/ట్రాక్టర్‌తో సాళ్లుగా వెద పెట్టించారు. పంట 5 అడుగుల ఎత్తు ఏపుగా ఎదిగి కంకి దశలో కనువిందు చేస్తోంది. మరో నెల రోజులకు కోతకు వస్తుంది. ఎకరానికి 10 క్వింటాళ్లకు పైగానే దిగుబడి వస్తుందని, కొన్ని చోట్ల 15 క్వింటాళ్ల వరకు కూడా దిగుబడి రావచ్చని ఆయన సంతోషంగా చెప్పారు. చుట్టూ పత్తి పొలాల మధ్యలో తమ సిరిధాన్యాల పంటలు చూస్తుంటే ముచ్చటగా ఉందని ఆయన సంబరపడుతున్నారు. విత్తనం చల్లటం తప్ప చేసిందేమీలేదు. కలుపు కూడా ఉంది. కానీ, అది పంట ఎదుగుదలకు ఆటంకం కాలేదని డా. రామ్ కిషన్ చెప్పారు. ఉచితంగా సిరిధాన్యాల విత్తనాలు సిరిధాన్యాల సాగులో అనుభవం లేనందున వైఎస్సార్ కడప జిల్లాకు చెందిన విఆర్డిఎస్ స్వచ్ఛంద సంస్థ వ్యవస్థాపకుడు, రైతు శాస్త్రవేత్త కొమ్ములూరి విజయకుమార్‌ను డా. రామ్‌కిషన్ తమ ప్రాంతానికి ఆహ్వానించి ఆయన సహాయ సహకారాలు తీసుకున్నారు. రెండు నెలల క్రితం విజయకుమార్ ఈ ప్రాంతంలో పర్యటించి డాక్టర్ రామ్‌కిషన్ చెంచులు, మెట్ట రైతుల అభ్యున్నతికి చేస్తున్న కృషికి ముగ్ధుడయ్యారు. 50 ఎకరాల్లో సిరిధాన్యాల సాగుకు అవసరమైన సేంద్రియ విత్తనాలను విజయకుమార్ డా. రామ్‌కిషన్ ద్వారా ఉచితంగా అందించి, సిరిధాన్యాల సాగులో మెలకువలను తెలియజెప్పారు. వంద ఎకరాలకు విత్తనాన్ని ఐటిడిఏ ఉచితంగా పంపిణీ చేసింది. వీరి సహకారంతో తాడూరు మండలం ఇంద్రకల్‌కు చెందిన ఇంజినీరింగ్ పట్టభద్రుడు ప్రశాంత్ తొలి సారిగా ఈ ఏడాది 30 ఎకరాల్లో సిరిధాన్యాలు సాగు చేస్తున్నారు. ఎక్కువ విస్తీర్ణంలో అండుకొర్రలు, సామలు, అరికలు సాగు చేస్తున్నారు. అదేవిధంగా తాడూరు మండలం యాదిరెడ్డి కాలనీకి చెందిన మర్రెడ్డి, శౌర్రెడ్డి, అనిల్ తలా ఒక రెండెకరాల్లో ప్రయోగాత్మకంగా సిరిధాన్యాలు సాగు చేశారు. పత్తి, వరి సాగు చేసే అలవాటు ఉన్న ఈ రైతులు సిరిధాన్యాల పంట ఎదుగుతున్న తీరు, పది క్వింటాళ్లకు పైగా దిగుబడి వచ్చే అవకాశం ఉండటంతో సంతోషిస్తున్నారు. అధిక పెట్టుబడులతో జూదంగా మారిపోయిన పత్తి కన్నా సిరిధాన్యాల సాగు మేలన్న భావనతో వచ్చే ఏడాది మరిన్ని ఎకరాల్లో సాగు చేస్తామని వారు చెబుతున్నారు. మహబూబ్‌నగర్ మండలం తాటికొండ శివారులో వరి రైతు శంకర్ తొలిసారిగా 6 ఎకరాల్లో సిరిధాన్యాలను సాగు చేస్తూ ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు. లింగాల మండలం అప్పాయపల్లి, శ్రీరంగాపురంలలో కూడా డా. రామ్‌కిషన్, విజయకుమార్ ప్రోత్సాహంతో కొందరు రైతులు సిరిధాన్యాల సాగుకు శ్రీకారం చుట్టారు. ఆముదం, వరి సాగు చేసే అలవాటున్న చెంచు మహిళా రైతు శీతమ్మ ఈ ఏడాది 3 ఎకరాల్లో సిరిధాన్యాలు సాగు చేస్తున్నారు. లింగాల మండలం దారారంలో చెంచు రైతు కాట్రాజ శ్రీనివాస్ 12 ఎకరాల్లో కొర్రలు సాగు చేస్తున్నారు. వనపర్తి జిల్లా పెబ్బేరు మండలం శ్రీరంగాపురంలో శ్రీనివాస్ అనే రైతు 5 ఎకరాల్లో కొర్రలు సాగు చేస్తున్నారు. జోగులాంబ గద్వాల జిల్లా ఐజ గ్రామ శివారులో రామకృష్ణ 8 ఎకరాల్లో కొర్రలు సాగు చేస్తున్నారు. ఈ విధంగా సుమారు 200 ఎకరాల్లో ఈ ఏడాది డా. రామ్‌కిషన్ ప్రోత్సాహంతో రైతులు సిరిధాన్యాల సాగును ప్రారంభించారు. గ్రామాల్లో 40–50 చోట్ల రైతుల గ్రూప్ మీటింగ్‌లు ఏర్పాటు చేసి వర్షాధారంగా సిరిధాన్యాల సాగు ఆవశ్యకత గురించి రైతులను చైతన్యవంతం చేయడం విశేషం. ఎకరానికి కనీసం 10 క్వింటాళ్ల దిగుబడి వస్తుందని అంచనా వేశామని, కనీసం రూ. 30 వేల ఆదాయం వస్తుందన్నారు. ఎకరానికి రూ. 50 వేలు పెట్టుబడి పెట్టి 6 నెలల పంటకాలం ఉండే పత్తి వేసి నానా బాధలు పడేకన్నా స్వల్ప పెట్టుడితో 100 రోజుల్లో చేతికి వచ్చే సిరిధాన్యాల వర్షాధార సాగు మేలని రైతులు సంతృప్తిగా చెబుతున్నారని డా. రామ్‌కిషన్ తెలిపారు. చెంచులతో ప్రాసెసింగ్ యూనిట్లు సిరిధాన్యాల పంట సంతృప్తికరంగా ఉన్నందున కోత, కోత అనంతర ప్రాసెసింగ్ విషయాలపై దృష్టి సారిస్తున్నారు. ఐటీడీఏ తోడ్పాటుతో రెండు చోట్ల చెంచు రైతుల ఆధ్వర్యంలో సిరిధాన్యాల శుద్ధి యంత్రాలను ఏర్పాటు చేసేందుకు ప్రయత్నిస్తున్నానని డా. రామ్‌కిషన్ తెలిపారు. అంతేకాదు, వర్షాధారంగా, సేంద్రియ పద్ధతుల్లో సాగు చేసే సిరిధాన్యాల విక్రయానికి ప్రత్యేక బ్రాండ్‌ను రిజిస్టర్ చేయించి, ప్రత్యేక దుకాణాల ద్వారా విక్రయం చేపట్టాలని ఆలోచిస్తున్నామన్నారు. బోరు నీటితో భార ఖనిజాల బెడద బోరు నీటితో పండించిన వరి, గోధుమలు తినటం మానేసి వర్షాధారంగా పండించిన సిరిధాన్యాల ఆహారం తీసుకోవడంతో రక్తపోటు, సుగర్, ఊబకాయం, మానసిక ఆందోళన తదితర ఆరోగ్య సమస్యలు ఉపశమిస్తున్నాయని డా. రామ్‌కిషన్ తెలిపారు. తనకు తెలిసిన కనీసం వెయ్యి మంది రోగులు ఆహారం మార్చుకోవడంతోపాటు రోజూ నడవడం ద్వారా ఆరోగ్యవంతులుగా మారుతున్నారన్నారు. ఆహారం ద్వారానే కాకుండా నడక ద్వారా మనిషిలో రోగనిరోధక శక్తిని పెంచే యాంటీ ఆక్సిడెంట్లు పెరుగుతాయన్నారు. బోరు నీటితో పండించే వరి తదితర పంట దిగుబడుల్లో భార ఖనిజాలు ఉంటాయని, ఆ బియ్యం తిన్న వారికి కిడ్నీ జబ్బులు వస్తున్నాయని ఆయన తెలిపారు. సిరిధాన్యాలు నాలుగు వర్షాలు పడితే పండుతాయని, వీటి ద్వారా సంపూర్ణ ఆరోగ్యం చేకూరుతుందన్నారు. 300 లోపు టిడిఎస్(టోటల్ డిసాల్వుడ్ సాలిడ్స్) ఉన్న నీరు తాగడానికి, 400 లోపు టీడీఎస్ ఉన్న నీరు సాగుకు పనికివస్తుందన్నారు. అయితే, నల్లగొండ, మహబూబ్‌నగర్ జిల్లాల్లో బోరు నీటిలో 800–1300 మేరకు టీడీఎస్ ఉంటున్నదన్నారు. ఇందువల్లే కిడ్నీ రోగుల సంఖ్య పెరుగుతోందన్నారు. అందువల్ల సిరిధాన్యాలు వంటి నాలుగు వర్షాలతో పండే పంటలే ఆరోగ్యదాయకమని గుర్తించాలని డా. రామ్‌కిషన్ కాలికి బలపం కట్టుకొని ప్రచారం చేస్తున్నారు. ఇన్పుట్స్ : జమ్ముల దామోదర్, సాక్షి, బిజినేపల్లి బోరు నీటితో పండించే వరి తదితర పంట దిగుబడుల్లో భార ఖనిజాలు ఉంటాయి. ఆ బియ్యం తిన్న వారికి కిడ్నీ జబ్బులు వస్తున్నాయి. సిరిధాన్యాలు నాలుగు వర్షాలు పడితే పండుతాయి. వీటి ద్వారా సంపూర్ణ ఆరోగ్యం చేకూరుతుంది. బోరు నీటిలో 800–1300 మేరకు టీడీఎస్ ఉంటున్నది. ఈ నీటితో పండించే పంటల దిగుబడుల్లో, బియ్యంలో భారఖనిజాలు నిక్షిప్తమై ఉంటాయి. వీటిని తిన్న వారు కిడ్నీ, తదితర జబ్బులకు గురవుతున్నారు. అందువల్ల సిరిధాన్యాలు వంటి నాలుగు వర్షాలతో పండే పంటలే ఆరోగ్యదాయకమని గుర్తించాలి. ఉచిత ఫోన్ సదుపాయం సిరిధాన్యాలను వర్షాధారంగా సేంద్రియ పద్ధతుల్లో సాగు చేసే పద్ధతులు, ప్రాసెసింగ్, సిరిధాన్యాల ఆహార పదార్థాలు, సంపూర్ణ ఆరోగ్యం పొందే పద్ధతులపై రైతులు, ప్రజల్లో వ్యక్తమవుతున్న సందేహాలను శాస్త్రీయ సమాచారంతో నివృత్తి చేయడానికి ఉచిత ఫోన్ (టోల్ ఫ్రీ) నంబరును ప్రారంభించాలని భావిస్తున్నట్లు డా. రామ్‌కిషన్ తెలిపారు. సిరిధాన్యాల విత్తన బ్యాంకులను సైతం గ్రామాల్లో విరివిగా ఏర్పాటు చేయనున్నామన్నారు. తొలి ఏడాది రైతులకు ఉచితంగా విత్తనాలు ఇస్తామని, వారు పండించిన పంటలో నుంచి రెట్టింపు పరిమాణంలో తిరిగి విత్తన బ్యాంకుకు జమచేయాల్సి ఉంటుందన్నారు. ఈ పనులన్నిటినీ చేపట్టేందుకు ‘రైతు లోకం ఫౌండేషన్’ను నెలకొల్పనున్నట్లు వివరించారు. (డా. రామ్‌కిషన్‌ను 94407 12021 నంబరులో సంప్రదించవచ్చు) – పంతంగి రాంబాబు, సాగుబడి డెస్క్ -
27,28,29 తేదీల్లో డా. ఖాదర్‌వలి ప్రసంగాలు
సిరిధాన్యాలు–కషాయాలతో సంపూర్ణ ఆరోగ్యం పొందే మార్గాలు, సిరిధాన్యాలను రసాయన రహిత పద్ధతుల్లో పండించుకోవడంపై జనవరి మూడో వారంలో తెలుగు రాష్ట్రాల్లో వివిధ చోట్ల ప్రముఖ స్వతంత్ర శాస్త్రవేత్త, ఆహార, ఆరోగ్య నిపుణులు డాక్టర్ ఖాదర్ వలి ప్రసంగించనున్నారు. ప్రవేశం ఉచితం. జనవరి 27 (ఆదివారం)న ఉ. 10 గం. నుంచి సా. 4 గం. వరకు విజయవాడలోని సిద్ధార్థ హోటల్ మేనేజ్మెంట్ కాలేజ్ గ్రౌండ్ (పిన్నమనేని పాలీక్లినిక్ రోడ్డు)లో సిరిధాన్యాలపై రాష్ట్రస్థాయి సదస్సులో డా. ఖాదర్ వలి ప్రసంగిస్తారు. గోఆధారిత ప్రకృతి వ్యవసాయదారుల సంఘం, రైతునేస్తం ఫౌండేషన్ సంయుక్త ఆధ్వర్యంలో ఈ సదస్సు జరగనుంది. వివరాలకు.. 98481 23050, 99632 32104, 98493 12629. జనవరి 28 (సోమవారం) ఉ. 10– మ. 1 గం. వరకు ఖమ్మంలోని ఇ.ఆర్.ఆర్. రిసార్ట్స్ (మమతా ఆసుపత్రి రోడ్డు)లో తెలంగాణ విశ్రాంత ఇంజినీర్ల సంఘం, రైతునేస్తం ఫౌండేషన్, ఇ.ఆర్.ఆర్. రిసార్ట్స్ సంయుక్త ఆధ్వర్యంలో జరిగే సభలో డాక్టర్ ఖాదర్ వలి ప్రసంగిస్తారు. వివరాలకు.. 98490 01725, 70939 73999 జనవరి 28 (సోమవారం)న సా. 4 గం.– రా. 7 గం. వరకు నల్లగొండలోని లక్ష్మీ గార్డెన్స్ (హైదరాబాద్ రోడ్డు)లో డాక్టర్ ఖాదర్ వలి ప్రసంగిస్తారు. తెలంగాణ విశ్రాంత ఇంజినీర్ల సంఘం, రైతునేస్తం ఫౌండేషన్, లయన్స్ క్లబ్ సంయుక్త ఆధ్వర్యంలో ఈ సభను నిర్వహిస్తున్నాయి. వివరాలకు.. 98486 99282, 70939 73999. జనవరి 29 (మంగళవారం)న ఉ. 10 గం. – మ. 1 గం. వరకు హైదరాబాద్ మెహిదీపట్నంలోని అశోక గార్డెన్స్, కొణిజేటి ఎన్క్లేవ్ (ఎక్స్‌ప్రెస్ హైవే పిల్లర్ 83 వద్ద)లో డాక్టర్ ఖాదర్ వలి సిరిధాన్యాల సాగు, అటవీ చైతన్య ద్రావణం తయారీ, సిరిధాన్యాలను మిక్సీలతో శుద్ధి చేయడంపై తదితర అంశాలపై ప్రసంగిస్తారు. తెలంగాణ విశ్రాంత ఇంజినీర్ల సంఘం, రైతునేస్తం ఫౌండేషన్, కొణిజేటి గార్డెన్స్ సంయుక్త ఆధ్వర్యంలో ఈ సభను నిర్వహిస్తున్నాయి. వివరాలకు.. 94419 27808, 70939 73999. 26న చెవుటూరులో ప్రకృతి సేద్యంపై శిక్షణ కృష్ణా జిల్లా జి. కొండూరు మండలం చెవుటూరులోని గోసేవా క్షేత్రంలో ఈ నెల 26 (శనివారం) ఉ. 9 గం.– సా. 4 గం. వరకు ప్రకృతి వ్యవసాయంపై రైతులకు అనంతపురం జిల్లా బసంపల్లికి చెందిన ప్రకృతి వ్యవసాయదారుడు తాడిమర్రి నాగరాజు చేత శిక్షణా కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు గోసేవా క్షేత్రం నిర్వాహకులు పోకూరి బాలకృష్ణ, ఇందిరారాణి తెలిపారు. ప్రవేశం ఉచితం. వివరాలకు.. 91826 71819, 94407 46074. గోపాలనపై 4 రోజుల సర్టిఫికెట్ కోర్సు గోపాలనలో వివిధ అంశాలపై బెంగళూరులోని ఆర్ట్ ఆఫ్ లివింగ్‌కు చెందిన ఎస్.ఎస్.ఐ.ఏ.ఎస్.టి. ఆధ్వర్యంలో జనవరి 31 నుంచి ఫిబ్రవరి 3 వరకు 4 రోజుల సర్టిఫికెట్ కోర్సు నిర్వహిస్తున్నట్లు ట్రస్టు బాధ్యులు ఉమామహేశ్వరి తెలిపారు. వివిధ దేశీ జాతులకు చెందిన వెయ్యి ఆవులతో కూడిన గోశాలను ప్రామాణికంగా నిర్వహిస్తున్న బెంగళూరులోని ఆర్ట్ ఆఫ్ లివింగ్ ఆశ్రమంలో శిక్షణ ఇస్తారు. దేశీ ఆవుల విశిష్టత, వాటి ఆలన – పాలన, సేంద్రియ మేత, ఎ2 పాల ఉత్పత్తి, గోమయం, గోమూత్రాలతో ఫినాయిల్, విభూది, అగర్బత్తీ, పంచగవ్య వంటి ఉత్పత్తుల తయారీపై శిక్షణ ఇస్తారు. కోర్సు చందా: రూ. 5 వేలు. రిజిస్ట్రేషన్ ఇతర వివరాలకు.. 90004 08907, 79937 95246, 93810 25358. -
28న హైదరాబాద్‌లో డా. ఖాదర్ వలి ప్రసంగాలు
‘సిరిధాన్యాలు – అమృతాహారం’ అనే అంశంపై ఈ నెల 28(ఆదివారం) ఉ. 10 గం. నుంచి మ. 1.30 గం. వరకు హైదరాబాద్ హైటెక్ సిటీలోని శిల్పారామం సంప్రదాయ వేదికలో ప్రగతి రిసార్ట్స్ రజతోత్సవాల సందర్భంగా జరిగే సభలో ప్రముఖ స్వతంత్ర శాస్త్రవేత్త, ఆహార ఆరోగ్య నిపుణులు డాక్టర్ ఖాదర్ వలి ప్రారంభోపన్యాసం చేస్తారు. జాతీయ గ్రామీణాభివృద్ధి సంస్థ డైరెక్టర్ జనరల్ డబ్ల్యూ.ఆర్.రెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొంటారని ప్రగతి గ్రూప్ సీఎండీ డా. జీబీకే రావు తెలిపారు. అందరూ ఆహ్వానితులే. వివరాలకు.. 84990 78294. అదేరోజు సా. 4 గం. నుంచి 7 గం. వరకు శిల్పారామం సంప్రదాయ వేదికలోనే డాక్టర్ ఖాదర్‌వలి దేశీ ఆహారంతో వ్యాధుల్లేని జీవనంపై ప్రసంగిస్తారని రైతునేస్తం ఫౌండేషన్ చైర్మన్ యడ్లపల్లి వేంకటేశ్వరరావు తెలిపారు. వివరాలకు.. 040–23395979. 29న మెహదీపట్నంలో.. వర్షాధారంగా సిరిధాన్యాలు సాగుచేసుకొని, మిక్సీతో శుద్ధి చేసుకొని తినటం ద్వారా ఆధునిక రోగాల నుంచి విముక్తి పొంది సంపూర్ణ ఆరోగ్యం పొందే పద్ధతులపై ఈనెల 29న సా. 5.30 గం. నుంచి 7.30 గం. వరకు హైదరాబాద్‌లోని మెహదీపట్నంలో ప్రముఖ స్వతంత్ర శాస్త్రవేత్త డాక్టర్ ఖాదర్ వలి ప్రసంగిస్తారు. పిల్లర్ నం. 83 దగ్గర పల్లవి గార్డెన్స్ కొణిజేటి ఎన్‌క్లేవ్‌లో ఉచిత అవగాహన కార్యక్రమం జరుగుతుందని రైతునేస్తం ఫౌండేషన్ చైర్మన్ వెంకటేశ్వరరావు తెలిపారు. వివరాలకు.. 9676797777. -
అరికెలు... ఆరుద్ర కార్తెలోనే విత్తాలి!
సిరిధాన్యాలు(అరికలు, అండుకొర్రలు, కొర్రలు, సామలు, ఊదలు) తింటే ఎంతటి జబ్బులనైనా పారదోలి సంపూర్ణ ఆరోగ్యాన్ని అందించేవన్న చైతన్యం వ్యాపిస్తున్న కొద్దీ.. వీటి సాగుపై రైతులు, ముఖ్యంగా మెట్ట పొలాలున్న రైతులు దృష్టిసారిస్తున్నారు. విత్తనం నేలలో తేమ ఉన్నప్పుడు వేయాలి. మొలిస్తే చాలు బెట్టను కూడా తట్టుకొని చక్కని దిగుబడినివ్వగలిగే మెట్ట రైతుల మిత్ర పంటలివి. వీటి సాగులో కష్టం, ఖర్చూ రెండూ తక్కువే. ఎట్టిపరిస్థితుల్లోనూ రైతుకు రూపాయి కూడా నష్టం రాకుండా చూసే గ్యారంటీ పంటలు సిరిధాన్యాలు. ఈ 5 రకాలలో అరికలు ఒక్కటే ఆరు నెలల పంట. మిగతావి 3 నెలల్లోపు పంటలే. కాబట్టి, అరికలను వర్షాకాలం ప్రారంభంలోనే విత్తుకోవాలి. ఒకట్రెండు వర్షాలు పడి వాతావరణం చల్లబడిన తర్వాత ఆరుద్ర కార్తె(జూన్ ఆఖరు)లో అరికలు విత్తుకుంటే నిశ్చింతగా ఎకరానికి ఎటువంటి భూమిలోనైనా 8 క్వింటాళ్లు పండుతాయని కడప జిల్లా వేంపల్లెకు చెందిన రైతు శాస్త్రవేత్త విజయకుమార్ ‘సాక్షి సాగుబడి’తో చెప్పారు. అరికలతోపాటు అంతర పంటలను విత్తుకునే విధానాన్ని ఆయన వివరించారు. సిరిధాన్యాల సాగుకు భూమిని మే నెలలోనే చదును చేసుకోవాలి. ముంగారి (తొలి) చినుకులకు తొలి దుక్కి చేయాలి. తర్వాత వర్షాలకు కలుపు గింజలు మొలుస్తాయి. ఆ తర్వాత రెండో దుక్కి చేసుకుంటే మున్ముందు కలుపు సమస్య అంతగా ఉండదు. పశువుల ఎరువు వేయాలి. అవకాశం ఉంటే గొర్రెలు/పశువుల మంద కట్టుకోవాలి. పంటలు ఏవైనా తూర్పు– పడమర సాళ్లుగా విత్తుకుంటే చీడపీడల బెడద తప్పుతుంది. అరికలు 6 నెలల దీర్ఘకాలిక పంట. అరిక పంటను వర్షాధారంగానే సాగు చేయాలి. నీటి తడి పెడితే దిగుబడి తగ్గుతుంది. ఆరుద్ర కార్తెలోనే విత్తుకుంటే చలి రావడానికి ముందే పొట్ట దశ దాటిపోతుంది.. అరిక పొట్ట మీద ఉన్నప్పుడు చలి తగిలితే కాటుక తెగులు వస్తుంది.ఎకరానికి 3 కిలోల విత్తనం కావాలి. అరికలు 6 సాళ్లు విత్తిన తర్వాత ఒక సాలు కంది విత్తాలి. మళ్లీ 6 సాళ్లు అరకలు విత్తిన తర్వాత మరో సాలులో 5 రకాల(ఆముదాలు, అలసందలు/బొబ్బర్లు, అనుములు, గోగులు, సీతమ్మ జొన్నలు) విత్తనాలు కలిపి విత్తాలి. అంటే.. 6 సాళ్లు అరికలు – ఒకసాలు కందులు– 6 సాళ్లు అరికలు– ఒక సాలు 5 రకాల విత్తనాలు– మళ్లీ 6 సాళ్లు అరికలు... ఇలా మంచి పదునులో విత్తుకోవాలి. కొన్ని రకాలు కలిపి విత్తడం వల్ల ఏకదళ, ద్విదళ పంటలు పొలం నిండా ఉంటాయి. పంటల జీవివైవిధ్యం వల్ల చీడపీడలు నియంత్రణలో ఉంటాయి. అంతేకాదు.. షుగర్‌ను, ఊబకాయాన్ని తగ్గించే ఆరోగ్యకరమైన, ఎంతో రుచికరమైన అరికలతోపాటు తినడానికి పప్పులు కూడా అందివస్తాయి. సేంద్రియ పద్ధతుల్లో సాగు చేస్తే అరికల ధాన్యం ఎకరానికి ఎట్లా కాదన్నా 7–8 క్వింటాళ్ల దిగుబడి వస్తుంది. క్వింటా రూ. 3 వేలనుకున్నా రూ. 24 వేలు వస్తాయి. మిగతావి కూడా కలుపుకుంటే.. ఎకరానికి రూ. 40 వేలకు తగ్గకుండా రైతులకు ఆదాయం వస్తుందని సిరిధాన్యాల సాగులో అనుభవం ఉన్న విజయకుమార్ చెబుతున్నారు. మెట్ట పొలాలను రెండు సార్లు దున్ని విత్తనాలు చల్లి.. ఒకటి రెండు సార్లు పైపాటు/అంతర సేద్యం చేస్తే చాలు. అరికలు మొలిచిన చోట గడ్డి కూడా మొలవదు. ఒక్కసారి మొలిస్తే చాలు వర్షం సరిగ్గా కురిసినా లేకపోయినా మొండిగా పెరిగే పంట అరిక. ఎకరానికి ట్రాక్టర్ అరిక గడ్డి వస్తుంది. గడ్డి అమ్ముకుంటే సాగుకు అయిన ఖర్చు కన్నా ఎక్కువే ఆదాయం వస్తుంది. రైతుకు నష్టం రానే రాదు. ఎత్తు పల్లాల భూమిలో వర్షాలకు మట్టి కొట్టుకుపోకుండా అరిక పంట బాగా ఉపయోగపడుతుందని విజయకుమార్ వివరించారు. ఆయనను 79814 07549 నంబరులో సంప్రదించవచ్చు. ఏపీ రైతులు ఉ. 5–9 గం. మధ్య, కర్ణాటక రైతులు మ. 1–3 గం. మధ్య, తెలంగాణ రైతులు సా. 6–9 గం. మధ్య ఫోన్ చేయవచ్చు. -
సిరిధాన్యాల విత్తనాలు ఉచితం!
అరిక.. 5 నెలల పంట. దీన్ని ఖరీఫ్‌లో ఆరుద్ర కార్తెలో మాత్రమే విత్తుకోవాలి. కొర్ర, అండుకొర్ర, ఊద, సామ, బరిగలు 3 నెలల పంటలు. వీటిని ఖరీఫ్‌లోను, రబీలోనూ సాగు చేసుకోవచ్చని డా.వైఎస్సార్ కడప జిల్లాకు చెందిన రైతు శాస్త్రవేత్త విజయకుమార్ వివరించారు. ఆయన ‘సాగుబడి’కి అందించిన వివరాలు.. ► ఎకరానికి 3 కిలోల విత్తనం అవసరం. పొలాన్ని మడులుగా విభజించి.. ఈ చిరుధాన్యాలన్నిటినీ ఒక ఎకరంలో సాగు చేసుకోవచ్చు. అవి కలిసిపోకుండా కందిని సరిహద్దు పంటగా వేసుకోవచ్చు. ► మూడు తడులు ఇవ్వడానికి నీటి సదుపాయం ఉంటే.. ఎకరానికి 8 క్వింటాళ్ల వరకూ సేంద్రియ సిరిధాన్యాలను పండించుకోవచ్చు. ఎకరానికి రూ. 2,300 ఖర్చు అవుతుంది. ► సాలు దున్నిన తర్వాత సిరిధాన్యాలు విత్తుకొని, విత్తనాలపైకి మట్టి పడేలా ఇరవాలు దున్నాలి. 5 సెం.మీ. లోతు దున్నితే చాలు. అంతకంటే లోతులో పడిన సిరిధాన్య విత్తనాల మొలక పైకి రాలేదు. ► విత్తిన వెంటనే తడి ఇవ్వాలి. రెండో తడి 30 రోజులకు, మూడో తడి 60 రోజులకు ఇస్తే చాలు. డ్రిప్, స్ప్రింక్లర్, పారించడం.. ఏ పద్ధతిలోనైనా తడి ఇవ్వొచ్చు. ► వరి కోసిన పొలాల్లో, వేరుశనగ పీకిన పొలాల్లో, కూరగాయలు పండించిన పొలాల్లో.. ఎటువంటి భూమి అయినా.. పంటల మార్పిడి కోసం ఈ రబీలో సిరిధాన్యాలను సాగు చేసుకోవచ్చు. కోతలు పూర్తయిన తర్వాత మోళ్లను భూమిలో కలియదున్నితే భూమి సారవంతమవుతుంది. ► సిరిధాన్యాల పంట నుంచి ఎకరానికి రెండు ట్రాక్టర్ల నాణ్యమైన, పశువులు బాగా ఇష్టపడే గడ్డి వస్తుంది. ► సిరిధాన్యాలను నూర్చే టప్పుడు ప్లాస్టిక్ బరకాలను ఉపయోగించి, ఇసుక, మట్టి కలవకుండా జాగ్రత్తపడాలి. ► అరిక, కొర్ర, అండుకొర్ర, ఊద, సామ, బరిగల ప్రత్యేకత ఏమిటంటే.. పొట్టు తీయని ధాన్యాలను రెండేళ్ల వరకు నిల్వ చేసుకోవచ్చు. పురుగు రాదు. రెండేళ్లు నిల్వ ఉన్నవి కూడా విత్తనానికి నిక్షేపంగా పనికొస్తాయి. విత్తనాలను గోనె సంచుల్లోనే గాలి, వెలుతురు తగిలే చోట నిల్వ చేయాలి. ప్లాస్టిక్ సంచుల్లో నిల్వచేస్తే.. ఉక్కిపోయి మొలక శాతం తగ్గవచ్చు. ► సిరిధాన్యాల బియ్యానికి మాత్రం రెండు, మూడు నెలల తర్వాత సన్న పురుగు వస్తుంది. మిక్సీతో అవసరం ఉన్నప్పుడు పొట్టు తీసుకునే మెలకువ తెలిసింది కాబట్టి, ఒకేసారి ఎక్కువ మొత్తంలో మిల్లు పట్టించుకొని అమ్ముకోలేక తిప్పలు పడాల్సిన అవసరం లేదు. ► సిరిధాన్యాలను రైతులు వెంటనే అమ్మేయకుండా.. నిల్వ చేసుకోవాలి. మిక్సీతో శుద్ధి చేసి తయారు చేసిన బియ్యాన్ని రైతు కుటుంబాలు ఇంటిల్లపాదీ అన్ని వయసుల వారూ తిని పూర్తి ఆరోగ్యవంతులుగా మారాలి. తమ గ్రామాలు, దగ్గర్లోని పట్టణాలు, నగరాల్లో వినియోగదారులకు ఏడాది పొడవునా నేరుగా అమ్ముకునే ఏర్పాట్లు చేసుకుంటే.. రైతులు అధిక నికరాదాయం పొందవచ్చు. ► రసాయనిక ఎరువులు వాడనవసరం లేదు. యూరియా ఎక్కువ వేస్తే పంట అతిగా పెరిగి పడిపోతుంది. పడిపోయిన పంటను కోయటం అధిక శ్రమ, ఖర్చుతో కూడిన పని. పైగా పడిపోయిన కంకుల్లో నుంచి గింజలను అన్ని రకాల పక్షులూ సులువుగా తినేస్తాయి. కాబట్టి రైతుకు చేతికి వచ్చే దిగుబడి బాగా తగ్గిపోతుంది. ► నిలబడి ఉన్న చిరుధాన్య పంట గింజలను జీనిగ, బుల్బుల్ వంటి అతి చిన్న పిట్టలు మాత్రమే తినగలవు. ఇవి ఎంత ఎక్కువ తిన్నా ఎకరానికి క్వింటాకు మించి తినలేవు. 7 క్వింటాళ్ల దిగుబడి మనకు వస్తుంది. ► వర్షాకాలపు పంటలో జొన్న, కొర్రలకు ఎర్రదిమ్మ తెగులు వస్తుంది. కానీ, రబీలో ఇవేవీ రావు. వరికి వచ్చే కాండం తొలిచే పురుగు, తెల్లమచ్చ(మజ్జిగ) తెగులు సిరిధాన్య పంటల జోలికి రావు. ► డ్వాక్రా మహిళా సంఘాలు, చిరు వ్యాపారులు సిరిధాన్యాలతో టిఫిన్లు, రకరకాల పిండివంటలు తయారు చేసి అమ్ముకుంటే మంచి పౌష్టికాహారాన్ని జనానికి అందించినట్టవుతుంది. మంచి ఆదాయమూ పొందవచ్చు. సిరిధాన్య వంటలకు వరిపిండి, శనగపప్పు పిండితో చేసే పిండివంటలకు ఖర్చయ్యే నూనెలో సగం సరిపోతుంది. ► రాబోయే ఖరీఫ్ కోసమైతే.. ఎకరానికి 2.5 కిలోల సిరిధాన్యాల విత్తనాలు, అరకిలో నాటు రకం కంది విత్తనాలను రైతులకు ఉచితంగా ఇప్పుడే ఇస్తాను. 2019 నాటికి తెలుగు రాష్ట్రాల్లో అన్ని ఊళ్లలో ఐదారు రకాల సిరిధాన్యాలు పండాలి. అందరూ తినాలి. ఆసుపత్రులు వద్దు.. సిరిధాన్యాలు ముద్దు.. ► సిరిధాన్యాల ఉచిత విత్తనాలు, సాగు మెలకువల కోసం విజయకుమార్ (వెలమవారిపాలెం, వేంపల్లె మండలం, డా.వైఎస్సార్ కడప జిల్లా)ను సంప్రదించాల్సిన ఫోన్: 98496 48498. సేకరణ: పంతంగి రాంబాబు, సాగుబడి డెస్క్ ‘మిక్సీ.. సిరిధాన్యాల మిల్లు’ కథనానికి విశేష స్పందన ‘మిక్సీ.. సిరిధాన్యాల మిల్లు’ శీర్షికతో గత మంగళవారం ‘సాగుబడి’లో ప్రచురించిన కథనానికి రైతుల నుంచి విశేష స్పందన లభిస్తోంది. సిరిధాన్యాలను సాగు చేసినప్పటికీ తగిన ప్రాసెసింగ్ మిల్లులు అందుబాటులో లేక నానా ఇబ్బందులు పడుతున్న రైతులకు అందుబాటులో ఉండే మిక్సీ ప్రత్యామ్నాయం గొప్ప ఊరట కలిగింది. కేవలం మిక్సీ ద్వారా సిరిధాన్యాల బియ్యాన్ని ఇంటిపట్టునే కావాలనుకున్నప్పడు సిద్ధం చేసుకునే అవకాశం ‘బుచ్చి పద్ధతి’ ద్వారా అందుబాటులోకి వచ్చినందుకు చాలా మంది రైతులు సంబరపడుతున్నారు. సిరిధాన్యాలలోని విశిష్ట ఔషధ గుణాల గురించి డాక్టర్ ఖాదర్ ప్రచారం చేస్తుండడంతో వినియోగదారుల్లో వీటి పట్ల ఆసక్తి పెరిగింది. ఈ నేపథ్యంలో సిరిధాన్యాల శుద్ధికి మిక్సీ ఉంటే చాలన్న సమాచారం రైతుల్లో పెద్ద సంచలనమే కలిగించింది. డాక్టర్ ఖాదర్, బాలన్, మహబున్నీలకు అనేక మంది ఫోన్ చేసి కృతజ్ఞతలు తెలుపుతున్నారు. కొర్ర తదితర ఐదు రకాల సిరిధాన్యాల విత్తనాలు కావాలని, ఈ రబీలోనే సాగు చేస్తామని రైతులు ముందుకు వస్తుండటం విశేషం. అటవీ వ్యవసాయ పద్ధతిలో సిరిధాన్యాలు, పప్పుధాన్యాలు, నూనెగింజల సాగు, బుచ్చి పద్ధతిలో సిరిధాన్యాల శుద్ధిపై సంక్రాంతి తర్వాత తెలుగునాట రైతు శిక్షణా శిబిరం నిర్వహిస్తామని, విత్తనాలను అందుబాటులోకి తెస్తామని బాలన్ తెలిపారు. ఇదిలాఉండగా, ఎకరంలో విత్తడానికి సరిపోయే 3 కిలోల సిరిధాన్యాల విత్తనాలను రైతులకు ఉచితంగా ఇస్తానని డా. వైఎస్సార్ కడప జిల్లాకు చెందిన రైతు శాస్త్రవేత్త విజయకుమార్ ప్రకటించారు. ఎంత మంది రైతులకైనా ఎకరానికి విత్తనం ఉచితంగా ఇస్తానని, అంతకు మించి కావాలనుకుంటే కిలో రూ. 40కి ఇస్తాననటం విశేషం. -
‘సిరి’ధాన్యాలే నిజమైన ఆహార పంటలు!
► కర్ణాటకలో సంప్రదాయ ప్రకృతి సేద్య పద్ధతి ‘అటవీ కృషి’ (కాడు కృషి) పునరుద్ధరణ ► ‘కాడు చైతన్యం’ పేరిట ద్రవరూప ఎరువే అటవీ కృషికి మూలాధారం ► రసాయనాల్లేకుండా వర్షాధారంగానే చిరుధాన్యాలు, పప్పుధాన్యాలు, నూనెగింజల మిశ్రమ సాగే అసలైన వ్యవసాయమని ప్రచారోద్యమం ► కొర్రలు, అండుకొర్రలు, అరికలు, ఊదలు, సామలు వంటి సిరిధాన్యాలు తింటే కేన్సర్, మధుమేహం తదితర జబ్బులన్నీ వాటికవే నయమవుతాయంటున్న అరుదైన స్వతంత్ర శాస్త్రవేత్త ► అమెరికాలో పెద్ద ఉద్యోగం వదిలి వచ్చి మైసూరు ప్రాంతంలో స్థిర నివాసం.. ► 20 ఏళ్లుగా ఊరూరా తిరిగి ప్రచారం చేస్తూ జన్మ సార్థకం చేసుకుంటున్నడాక్టర్ ఖాదర్ స్వతంత్ర శాస్త్రవేత్త డాక్టర్ ఖాదర్ గురించి ఒక్కమాటలో చెప్పాలంటే.. వ్యక్తి కాదు.. శక్తి!! ప్రజల ఆహారపు అలవాట్లను, రైతుల సాగు పద్ధతిని రసాయన రహితంగా, పంటల సరళిని అత్యంత ఆరోగ్యదాయకమైన రీతిలోకి, ప్రకృతికి అనుగుణమైన పద్ధతుల్లోకి మార్చేందుకు గత రెండు దశాబ్దాలుగా విశేష కృషి చేస్తున్నారు డాక్టర్ ఖాదర్. వర్షాధారంగా కొద్దిపాటి నీటి(200 ఎం.ఎం.)తో పండే చిరుధాన్యాలే అసలైన ఔషధ విలువలున్న ఆహార పదార్థాలని, మానవాళిని పీడిస్తున్న ఈ కాలపు సకల రోగాలకు ఈ ‘సిరి’ధాన్యాలే ప్రకృతి మనకు ప్రసాదించిన సంపూర్ణ ఆహారమంటూ డాక్టర్ ఖాదర్ ప్రచారోద్యమం చేపట్టారు. కడప జిల్లా ప్రొద్దుటూరులో పేద కుటుంబంలో జన్మించినప్పటికీ శ్రద్ధగా చదువుకొని ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్సెస్‌లో స్టెరాయిడ్స్పై పీహెచ్డీ పూర్తి చేశారు. అమెరికా వెళ్లి పర్యావరణ సంబంధమైన అంశాలపైన, రసాయనాలకు విరుగుడు కనుగొనే అంశాలపైన వివిధ కంపెనీలలో పదేళ్ల పాటు పనిచేశారు. ఆధునిక మానవ సమాజం తినకూడనివి తింటూ దారుణమైన రోగాల పాలు కావడంతోపాటు.. భూమాతను రసాయనిక వ్యవసాయంతో నాశనం చేసుకుంటూ ఉండటం ఆయనను అమెరికాలో నిలువనీయకుండా చేసింది. 1997లో తిరిగి వచ్చి మైసూరులో స్థిరనివాసం ఏర్పరచుకున్నారు. పురాతన భారతీయ ప్రకృతి సేద్య పద్ధతి అయిన ‘అటవీ కృషి’ (కాడు కృషి)ని పునరుద్ధరించి, కాలికి బలపం కట్టుకొని ఊరూరా తిరిగి రైతులకు, గిరిజనులకు పరిచయం చేస్తున్నారు. 2009 నుంచి స్వయంగా 7 ఎకరాల్లో కొర్రలు, అండుకొర్రలు, ఊదలు, సామలు, అరికలు వంటి సిరిధాన్యాలతోపాటు నూనెగింజలు, పప్పుధాన్య పంటలను కలిపి పండిస్తూ ఎకరానికి 10 క్వింటాళ్ల దిగుబడి సాధిస్తున్నారు. మధుమేహం, కేన్సర్, థైరాయిడ్ తదితర దీర్ఘకాలిక జబ్బులతోపాటు రైతుల ఆత్మహత్యలను సైతం పారదోలే వజ్రాయుధాలు ‘సిరిధాన్యాలే’నని ఎలుగెత్తి చాటుతున్నారు! వేలాది మంది రైతులు, రోగులకు ఆపద్బాంధవుడిగా మారారు. ఇటీవల విజయవాడ విచ్చేసిన డా. ఖాదర్‌తో ‘సాగుబడి’ ముఖాముఖిలో ముఖ్యాంశాలు.. ► శాస్త్రవేత్తగా అమెరికాలో పదేళ్లు పని చేసి, కర్ణాటకలోని మైసూరుకు తిరిగి వచ్చి ‘కాడు కృషి’ అనే అటవీ వ్యవసాయ పద్ధతికి రూపకల్పన చేశారు. అంతరించిపోతున్న ‘సిరి ధాన్యాలను స్వయంగా సాగు చేస్తూ.. ప్రచారోద్యమం నిర్వహిస్తున్నారు కదా.. వీటి గురించి వివరిస్తారా..? భారతదేశంలో మానవులంతా వెయ్యేళ్ల క్రితం నుంచే మన ముందు తరాల వాళ్లు అద్భుతమైన ‘సిరిధాన్యాల’ను రోజువారీ ప్రధాన ఆహారంగా తింటూ వచ్చారు. కొర్రలు, అండు కొర్రలు, ఊదలు, సామలు, అరికలు.. ఈ ఐదూ దేవుడు ప్రసాదించిన అత్యద్భుతమైన నిజమైన ఆహార ధాన్యాలు. అందుకే వీటికి నేను ‘సిరి ధాన్యాలు’ అని పేరుపెట్టాను. ఇవే పండించుకొని మరీ తింటున్నాను. కర్ణాటకలోని గ్రామాల్లో తిరిగి రైతులను స్వయంగా కలిసి వారికి వీటి విత్తనాలు ఇచ్చి, పండించమని ప్రోత్సహిస్తున్నాను. కనీసం వెయ్యి చోట్లకు వెళ్లి మీటింగ్‌లు పెట్టి చెప్పాను. ఇప్పుడు కర్ణాటక అంతటా సిరిధాన్యాలు పెంచడం, వాడకం పెరిగాయి. మానవులు ఆధునికత పేరిట ఇవ్వాళ కంపెనీల మాటలు విని తినకూడనివి తింటున్నారు. ఇవ్వాళ మధుమేహం, కేన్సర్, ఊబకాయం, మోకాళ్ల నొప్పులు, థైరాయిడ్ వంటి ఎన్నో జబ్బులు ప్రజలను పీల్చిపిప్పి చేస్తున్నాయి. పండించకూడని పంటలు రసాయనిక పద్ధతుల్లో పండిస్తున్నారు. హరితవిప్లవం వల్ల 48 శాతం పంట భూములు పూర్తిగా నిర్జీవమై నిస్సారమై మరుభూములుగా మారిపోతున్నాయి. అమెరికాలో శాస్త్రవేత్తగా పనిచేస్తూ నిశితంగా అధ్యయనం చేసి.. తినే తిండికి కొత్త జబ్బులకు ప్రత్యక్ష సంబంధం ఉందని గ్రహించాను. ఈ గ్రహింపు వచ్చినదే తడవుగా ‘నేను చేయాల్సింది ఉద్యోగం కాదు స్వదేశంలో రైతులు, ప్రజలతో కలిసి పనిచేయాలి’ అనిపించింది. అంతే.. ఉద్యోగం వదిలేసి వచ్చి 20 ఏళ్లుగా మైసూరు ప్రాంతంలో స్వతంత్రంగా పనిచేస్తున్నాను. అంతరించిపోతున్న సిరిధాన్యాల విత్తనాలను సేకరించి రైతులకిచ్చి సాగుచేయించాను. 2009లో 7.5 ఎకరాల బంజరు కొని నేను కూడా ‘అటవీ కృషి’ చేస్తున్నాను. ► సిరిధాన్యాల ప్రాధాన్యం ఏమిటి? సిరిధాన్యాలు మన దేశంలో మాత్రమే ఇప్పటికీ అందుబాటులో ఉన్నాయి. బ్రిటిష్ వాళ్లు మన దేశానికి వచ్చిన తర్వాత వీటిని చిన్నచూపు చూడడం ప్రారంభమైంది. చిరుధాన్యాలని, తృణధాన్యాలని అంటూ వీటిని తినాల్సిన అవసరం లేదన్న భావన కల్పించడం వల్ల ఈ పంటలు అంతరించిపోయే పరిస్థితి ఏర్పడింది. కేవలం 128 ఏళ్ల నుంచి మాత్రమే మనం వరి బియ్యం తింటున్నాం. నీటి వసతి బాగా ఉన్న దగ్గరే వరి, గోధుమ పండేవి. మొదట్లో అడపాదడపా పండుగలకో పబ్బాలకో తినే వాళ్లం. వరి, గోధుమలు, చెరకు వంటి అధికంగా నీరు అవసరమయ్యే పంటలను రసాయనాలతో పండిస్తున్నాం. కిలో వరి బియ్యం పండించడానికి 8 వేల లీటర్ల నీరు అవసరం. అడవుల నరికివేత కారణంగా నదులు, రిజర్వాయర్లు ఖాళీ అయిపోతున్నాయి. ఇంకెన్నాళ్లీ దుర్గతి? కానీ, కిలో కొర్రలు పండించడానికి 200 లీటర్ల నీరు చాలు. నాలుగు వర్షాలు పడితే చాలు 3 నెలల్లో పంట పండుతుంది. అండు కొర్రలు 75 రోజుల్లోనే పంట చేతికొస్తుంది. ► మీ ‘అటవీ వ్యవసాయం’ ప్రత్యేకత ఏమిటి? కన్నడలో కాడు అంటే అడవి అని అర్థం. వ్యవసాయం అనే మాట నాకు ఇష్టం లేదు. అడవిని నాశనం చేసి వ్యవసాయం చేస్తున్నాం. వ్యవసాయం పేరుతో, ఆధునిక పద్ధతుల పేరుతో వాణిజ్య పంటలను కంపెనీల మాటలు విని రసాయనిక ఎరువులు, పురుగుమందులు, కలుపుమందులు కుమ్మరించి సాగు చేస్తున్నారు. తక్కువ సమయంలో ఎక్కువ డబ్బు సంపాదన ఆశ చూపించి బీటీ పత్తి, చెరకు, వరి, గోధుమ వంటి అధిక నీరు అవసరమయ్యే ఏక పంటలను రైతుల చేత సాగు చేయిస్తున్నారు. భూమి తల్లిని సర్వనాశనం చేస్తున్నాం, మనల్ని మనం సర్వనాశనం చేసుకుంటున్నాం. ఇప్పటికే 38 శాతం సాగు భూములు మరుభూములుగా మారాయి. భూమి తల్లి ఆరోగ్యంగా ఉంటేనే మనం కూడా ఆరోగ్యంగా ఉంటాం. ఇది అందరూ తెలుసుకోవాలి. అందుకే వ్యవసాయం అనే మాట నాకు ఇష్టం లేదు. అటవీ కృషి అని అంటున్నాను. నిజమైన ఆహార పంటలు పండించుకుంటూనే భూమి తల్లిని, జంతుజాలాన్ని కాపాడుకోవడానికి అటవీ కృషిని ప్రారంభించాం. గుప్పెడు అడవి మట్టితో తయారు చేసి వాడుకునే ‘అటవీ చైతన్యం’ అనే ద్రవరూప ఎరువు.. ప్రతి రైతూ తన సాగు భూమిలో కనీసం 20% విస్తీర్ణంలో పొలం పక్కనే అడవిని పెంచడం.. ఆకులు, అలములు పొలంలో వేసుకోవటం ముఖ్యమైన విషయాలు. ఒకే పంటను పండిస్తే చీడపీడల సమస్యలు తలెత్తుతాయి. కొర్రలు తదితర 5 రకాల సిరిధాన్యాలు (ఏకదళ పంటలు), పప్పుధాన్యాలు (ద్విదళ పంటలు), నూనె గింజ పంటలను మిశ్రమ సేద్యం చేయాలి. మా పొలంలో 12 పంటలు కలిపి పండిస్తున్నాం. చీడపీడల సమస్యే రాలేదు. ► ప్రతి రైతూ పొలం పక్కనే 20 శాతం విస్తీర్ణంలో తానే అడవిని పెంచుకోవాలని మీరు చెబుతున్నారు. కేవలం ఎకరం, రెండకరాలున్న రైతులకు ఇదెలా సాధ్యం? 7.5 ఎకరాల బీడు భూమిని 2009లో కొనుగోలు చేసి, 3 ఎకరాల్లో అడవిని, 4.5 ఎకరాల్లో పంటలను పెంచుతున్నాను. 3 ఎకరాల అడవి 10 ఎకరాల్లో పంటను కాపాడుతుంది. అడవిలో చెట్లకు రాలే ఆకులు, రెమ్మలను ఏరి ఎండాకాలంలో తెచ్చి పొలంలో వేసుకోవాలి. అడవిలో చెట్ల ఆధారంగా కొన్ని పక్షులు, చిన్నా చితకా జంతువులు కూడా పెరుగుతాయి. ఆకులు అలములను వీటి మలమూత్రాల్లోని సూక్ష్మజీవులు సహజ ఎరువుగా మార్చుతాయి. అందుకే దీన్ని ‘అటవీ ప్రసాదం’ అంటున్నాం. దీన్ని తెచ్చి వేసవిలో పొలంలో వేసుకోవాలి. సిరిధాన్య పంటలు పొలంలో వేస్తే కంకులు కోతకొచ్చే సమయంలో 15 రోజులపాటు పక్షుల గుంపులు మన పొలంలోకి పిలవని అతిథులుగా వచ్చేస్తాయి. కొంతమేరకు పంటను అవి తినేస్తాయి. అయినా, పర్వాలేదు. ఎందుకంటే.. అవి తినే గింజల ఖరీదు కన్నా అవి మన పొలంలో వేసే రెట్టలు ఎంతో విలువైన పోషకాలతో భూమిని సారవంతం చేస్తాయి. ఎక్కడో ఒక రైతు సిరిధాన్యాలు పండిస్తే పక్షుల వల్ల నష్టం ఎక్కువగానే ఉంటుంది. కానీ, ఆ ప్రాంతంలో కొందరు రైతులు సిరిధాన్యాలు వేస్తే రైతుకు నష్టం తెలియనంత తక్కువగా ఉంటుంది. పొలంలో అక్కడక్కడా చిన్న, చిన్న నీటి కుంటలు తవ్వుకుంటే.. అందులోకి చేరే నీటిలోకి ఈ పక్షుల రెట్టల్లోంచి వచ్చి చేరే సూక్ష్మజీవరాశి ఆ నీటిని పోషక జలంగా మార్చేస్తాయి. పక్షులు పురుగులను ఏరుకొని తినేస్తాయి. అడవి పక్కన ఉండే పొలంలో చీడపీడల బెడదే ఉండదు. ఎకరం, రెండెకరాలున్న చిన్న రైతులు కూడా తమ భూమిలో కనీసం 20 శాతం విస్తీర్ణంలోనైనా అడవిని కూడా పెంచుకోవాలి. అప్పుడు అడవిని ప్రత్యేకంగా ఎక్కడో పెంచాల్సిన అవసరం ఉండదు. ప్రకృతిలో పరస్పరాధారిత జీవనచక్రాన్ని మనమే తెంపేశాం. రసాయనిక ఎరువులు, పురుగుమందులు, కలుపుమందులు వాడకుండా దీన్ని తిరిగి మనమే నిర్మించుకోవాలి. ‘అటవీ కృషి’ పద్ధతి మూలసూత్రం ఇదే. కర్ణాటకలో వందల వేల రైతులు ఈ పద్ధతిలో ఎకరానికి 10 క్వింటాళ్ల దిగుబడి సాధిస్తున్నారు. ► సిరిధాన్యాల సాగు రైతుల ఆత్మహత్యలు ఆపగలదా? సిరిధాన్యాల సాగు చాలా సులువు. తెలుగు రైతులు సిరిధాన్యాల సాగును పెద్ద ఎత్తున చేపట్టినా తగినంత మార్కెట్ ఉంది. కేవలం ఆహారం వల్లనే హైదరాబాద్‌లో నూటికి 38 మందికి మధుమేహం వచ్చింది. వచ్చే ఐదేళ్లలో ఇది 60 శాతానికి చేరుతుంది. వీరికి సిరిధాన్యాల గురించి తెలిస్తే బ్రహ్మాండమైన మార్కెట్ ఇక్కడే ఏర్పడుతుంది. పేద రైతులు పండించే సిరిధాన్యాలను మంచి ధరకు పట్నవాసులు కొనుగోలు చేయకపోతే ఆత్మహత్యలు ఎలా ఆగుతాయి? ప్రభుత్వాలు కంపెనీలతో కలసి పనిచేస్తున్నాయి. కాబట్టి ప్రభుత్వాల మీద ఆధారపడితే రైతులు స్వావలంబన దిశగా ముందుకు వెళ్లలేరు. కొన్నాళ్లకు ప్రభుత్వ వ్యవస్థలో కూడా మార్పు వస్తుంది. ∙ (డాక్టర్ ఖాదర్‌ను 094485 61472, , musk123rt@gmail.com ద్వారా సంప్రదించవచ్చు. ఆయన సాధారణంగా రైతుల సమావేశాల్లో, హోమియో వైద్యంలో బిజీగా ఉంటారు..) సిరిధాన్యాలకు ఆ ఔషధ గుణాలెలా వచ్చాయి? జొన్నలు, సజ్జలు, రాగులు ఈ పరిధిలోకి రావా? ఏదైనా ఒక ఆహారపదార్థం ఎంత ఆరోగ్యకరమైనది, ఎంత ఔషధగుణం కలిగినది అనేది చూడాలంటే.. అందులో పీచుపదార్థం (ఫైబర్) ఎంత ఉంది? పిష్టపదార్థం (కార్బోహైడ్రేట్లు) –పీచుపదార్థం మధ్య నిష్పత్తి ఎంత ఉంది? అనే విషయాలు చూడాలి. వరి బియ్యం, గోధుమలు తింటూ ఉంటే ఆరోగ్యం బాగుపడదు. వరి బియ్యంలో పీచు 0.2 శాతం. పిష్టపదార్థం 79 శాతం. పీచుపదార్థం – పిష్టపదార్థం నిష్పత్తి 385. ముడిబియ్యం తిన్నా ఈ నిష్పత్తిలో పెద్దగా తేడా ఉండదు. 5 రకాల సిరిధాన్యాల్లో పీచు 8 నుంచి 12.5 శాతం వరకు.. పిష్టపదార్థం 60 – 69 శాతం వరకు ఉంది. వీటి నిష్పత్తి 5.5 నుంచి 8.8 మధ్యలో ఉంటుంది. ఇది 10 కన్నా తక్కువగా ఉంటే రోగాలను సైతం తగ్గించే శక్తిగల ఆహారంగా భావించాలి. తిన్న తర్వాత నెమ్మదిగా 6–8 గంటల్లో సమతుల్యంగా గ్లూకోజ్‌ను రక్తంలోకి విడుదల చేస్తాయి. అవసరానికి మించి గ్లూకోజ్ రక్తంలోకి విడుదల చేయకపోవడం, అనేక సూక్ష్మపోషకాలు, ప్రొటీన్లు కలిగి ఉండటం వీటి విశిష్టత. సిరిధాన్యాలను తిన్న వారికి వ్యాధి తీవ్రతను బట్టి.. మధుమేహం, కేన్సర్, ఊబకాయం వంటి మొండి జబ్బులు కూడా 6 నెలల నుంచి 2 ఏళ్లలోగా వాటంతట అవే తగ్గిపోతాయి. సిరిధాన్యాలు పోషకాలను పుష్కలంగా అందించడమే కాకుండా దేహంలో నుంచి రోగకారకాలను తొలగించి శుద్ధి చేస్తాయి. సిరిధాన్యాల్లో పీచు ఎక్కువ కాబట్టి కనీసం 2 గంటలు నానబెట్టి వండుకొని తినాలి. ఈ 5 రకాల సిరిధాన్యాలను రోజుకు ఒక రకం చొప్పున మార్చి మార్చి తింటే చాలు. 2 గంటలు నానబెట్టడం వల్ల సిరిధాన్యాల బియ్యంతో అన్నం బాగా ఒదుగుతుంది. కిలో వండితే పది మందికి సరిపోతుంది. జొన్నలు, రాగులు, సజ్జలు తటస్థ ధాన్యాలు. వీటిల్లో పీచు శాతం 4–6 శాతం. తిన్న 2 గంటల్లోనే గ్లూకోజ్ రక్తంలో కలిసిపోతుంది. అందువల్ల ఆరోగ్యసిరినిచ్చే సిరిధాన్యాలే నిజమైన ఆహారం. ‘అటవీ చైతన్యం’ ద్రావణం తయారీ ఎలా? ‘అటవీ చైతన్యం’ తయారీకి కావలసిన పదార్థాలు: 1. అభయారణ్యంలో నుంచి తెచ్చిన గుప్పెడు మట్టి 2. ఐదు రకాల సిరిధాన్యాల పిండి పావు కిలో 3. పప్పుధాన్యాల పిండి పావు కిలో 4. తాటి బెల్లం 50 గ్రాములు 5. 30 లీటర్ల నీరు మట్టి కుండను కుతిక వరకు నేలలో పాతిపెట్టి.. అందులో 30 లీటర్ల నీటిని పోసి మట్టి, పిండి, తాటిబెల్లం కలిపి.. కుండపై మూత పెట్టాలి. కుండపై నేరుగా ఎండ పడకుండా నీడను కల్పించాలి. రోజూ కలియదిప్పాల్సిన పని లేదు. 5 రోజులకు అటవీ చైతన్యం వాడకానికి సిద్ధమవుతుంది. 6వ రోజు నుంచి 21వ రోజు వరకు దీన్ని వాడుకోవచ్చు. అప్పటి వరకు సూక్ష్మజీవరాశి పుష్కలంగా ఉంటుంది. అటవీ చైతన్యం తయారీ కోసం ప్రతిసారీ అభయారణ్యంలోకి వెళ్లి మట్టి తేనవసరం లేదు. అటవీ చైతన్యం ద్రావణాన్ని ఒక లీటరు తీసి పక్కన పెట్టుకొని.. 21 రోజుల లోగా.. మళ్లీ తయారు చేసుకోవాలి. మట్టికి బదులు ఈ ద్రావణాన్ని కుండలో వేసుకోవాలి. అంటే సిరిధాన్యాల పిండి, పప్పుల పిండి, తాటి బెల్లం మళ్లీ కలుపుకొని.. ఈ లీటరు అటవీ చైతన్యం ద్రావణాన్ని కలుపుకుంటే చాలు. 5 రోజుల తర్వాత అది వాడకానికి సిద్ధమవుతుంది. ఇలా ఎన్ని సంవత్సరాలైనా జీవితాంతం తిరిగి కలుపుకుంటూ ఉండవచ్చు. మైసూరు దగ్గరలోని మా క్షేత్రాన్ని సందర్శించే వారికి ఒక లీటరును ఉచితంగా ఇస్తున్నాం. పిచికారీ పద్ధతి: ద్రవ రూప ఎరువు ‘అటవీ చైతన్యం’ ఒక లీటరు తీసుకొని 20 లీటర్ల నీటిలో కలిపి.. ఆ ద్రావణాన్ని ఎకరం పొలంలో మట్టిపైన, సూర్యాస్తమయం సమయంలో, పిచికారీ చేయాలి. కొత్త స్ప్రేయర్‌తో పిచికారీ చేయవచ్చు లేదా చేతితోనైనా చల్లవచ్చు. వారానికి రెండు సార్లు చల్లాలి. ఇలా 6 వారాలు చేస్తే.. భూమి సారవంతమై పంటల సాగుకు అనువుగా మారుతుంది. రసాయనిక వ్యవసాయం వల్ల బాగా పాడైపోయిన భూమిని కూడా ఇలా తిరిగి పునరుజ్జీవింపచేసుకోవచ్చు. ఎటువంటి రసాయనిక ఎరువులు, కలుపుమందులు చల్లకుండా.. వరుసగా రెండేళ్లు అటవీ చైతన్యాన్ని ఇలా పిచికారీ చేస్తే ఇక ఆ భూమిలో చల్లకపోయినా పర్వాలేదు. భూమిని సారవంతం చేయడానికే కాదు.. పంటలపైన పిచికారీ చేసినా సరిపోతుంది. వందల ఎకరాలు సాగు చేసే రైతులు అందుకు అవసరమైనన్ని కుండల్లో అటవీ చైతన్యాన్ని తయారు చేసుకోవచ్చు. తొలి దశలో నాగలితో భూమిని దున్నాలి. భూమి గుల్లబారిన తర్వాత నేలను కుళ్లగించే చేతి పరికరాలతో నేలను తవ్వితే సరిపోతుంది. అటవీ చైతన్యాన్ని క్రమం తప్పకుండా చల్లుతూ ఉంటే 3 నుంచి 6 నెలల్లోగా ఎటువంటి బీడు భూమినైనా పంటల సాగుకు అనువుగా మార్చుకోవచ్చు. – ఇంటర్వ్యూ: పంతంగి రాంబాబు, సాగుబడి డెస్క్ ఫొటో: కందుల చక్రపాణి, ఫొటో జర్నలిస్టు, విజయవాడ