అరిక పంట
సిరిధాన్యాలు(అరికలు, అండుకొర్రలు, కొర్రలు, సామలు, ఊదలు) తింటే ఎంతటి జబ్బులనైనా పారదోలి సంపూర్ణ ఆరోగ్యాన్ని అందించేవన్న చైతన్యం వ్యాపిస్తున్న కొద్దీ.. వీటి సాగుపై రైతులు, ముఖ్యంగా మెట్ట పొలాలున్న రైతులు దృష్టిసారిస్తున్నారు. విత్తనం నేలలో తేమ ఉన్నప్పుడు వేయాలి. మొలిస్తే చాలు బెట్టను కూడా తట్టుకొని చక్కని దిగుబడినివ్వగలిగే మెట్ట రైతుల మిత్ర పంటలివి. వీటి సాగులో కష్టం, ఖర్చూ రెండూ తక్కువే. ఎట్టిపరిస్థితుల్లోనూ రైతుకు రూపాయి కూడా నష్టం రాకుండా చూసే గ్యారంటీ పంటలు సిరిధాన్యాలు.
ఈ 5 రకాలలో అరికలు ఒక్కటే ఆరు నెలల పంట. మిగతావి 3 నెలల్లోపు పంటలే. కాబట్టి, అరికలను వర్షాకాలం ప్రారంభంలోనే విత్తుకోవాలి. ఒకట్రెండు వర్షాలు పడి వాతావరణం చల్లబడిన తర్వాత ఆరుద్ర కార్తె(జూన్ ఆఖరు)లో అరికలు విత్తుకుంటే నిశ్చింతగా ఎకరానికి ఎటువంటి భూమిలోనైనా 8 క్వింటాళ్లు పండుతాయని కడప జిల్లా వేంపల్లెకు చెందిన రైతు శాస్త్రవేత్త విజయకుమార్ ‘సాక్షి సాగుబడి’తో చెప్పారు. అరికలతోపాటు అంతర పంటలను విత్తుకునే విధానాన్ని ఆయన వివరించారు.
సిరిధాన్యాల సాగుకు భూమిని మే నెలలోనే చదును చేసుకోవాలి. ముంగారి (తొలి) చినుకులకు తొలి దుక్కి చేయాలి. తర్వాత వర్షాలకు కలుపు గింజలు మొలుస్తాయి. ఆ తర్వాత రెండో దుక్కి చేసుకుంటే మున్ముందు కలుపు సమస్య అంతగా ఉండదు. పశువుల ఎరువు వేయాలి. అవకాశం ఉంటే గొర్రెలు/పశువుల మంద కట్టుకోవాలి. పంటలు ఏవైనా తూర్పు– పడమర సాళ్లుగా విత్తుకుంటే చీడపీడల బెడద తప్పుతుంది. అరికలు 6 నెలల దీర్ఘకాలిక పంట. అరిక పంటను వర్షాధారంగానే సాగు చేయాలి.
నీటి తడి పెడితే దిగుబడి తగ్గుతుంది. ఆరుద్ర కార్తెలోనే విత్తుకుంటే చలి రావడానికి ముందే పొట్ట దశ దాటిపోతుంది.. అరిక పొట్ట మీద ఉన్నప్పుడు చలి తగిలితే కాటుక తెగులు వస్తుంది.ఎకరానికి 3 కిలోల విత్తనం కావాలి. అరికలు 6 సాళ్లు విత్తిన తర్వాత ఒక సాలు కంది విత్తాలి. మళ్లీ 6 సాళ్లు అరకలు విత్తిన తర్వాత మరో సాలులో 5 రకాల(ఆముదాలు, అలసందలు/బొబ్బర్లు, అనుములు, గోగులు, సీతమ్మ జొన్నలు) విత్తనాలు కలిపి విత్తాలి. అంటే.. 6 సాళ్లు అరికలు – ఒకసాలు కందులు– 6 సాళ్లు అరికలు– ఒక సాలు 5 రకాల విత్తనాలు– మళ్లీ 6 సాళ్లు అరికలు... ఇలా మంచి పదునులో విత్తుకోవాలి.
కొన్ని రకాలు కలిపి విత్తడం వల్ల ఏకదళ, ద్విదళ పంటలు పొలం నిండా ఉంటాయి. పంటల జీవివైవిధ్యం వల్ల చీడపీడలు నియంత్రణలో ఉంటాయి. అంతేకాదు.. షుగర్‌ను, ఊబకాయాన్ని తగ్గించే ఆరోగ్యకరమైన, ఎంతో రుచికరమైన అరికలతోపాటు తినడానికి పప్పులు కూడా అందివస్తాయి. సేంద్రియ పద్ధతుల్లో సాగు చేస్తే అరికల ధాన్యం ఎకరానికి ఎట్లా కాదన్నా 7–8 క్వింటాళ్ల దిగుబడి వస్తుంది. క్వింటా రూ. 3 వేలనుకున్నా రూ. 24 వేలు వస్తాయి. మిగతావి కూడా కలుపుకుంటే.. ఎకరానికి రూ. 40 వేలకు తగ్గకుండా రైతులకు ఆదాయం వస్తుందని సిరిధాన్యాల సాగులో అనుభవం ఉన్న విజయకుమార్ చెబుతున్నారు.
మెట్ట పొలాలను రెండు సార్లు దున్ని విత్తనాలు చల్లి.. ఒకటి రెండు సార్లు పైపాటు/అంతర సేద్యం చేస్తే చాలు. అరికలు మొలిచిన చోట గడ్డి కూడా మొలవదు. ఒక్కసారి మొలిస్తే చాలు వర్షం సరిగ్గా కురిసినా లేకపోయినా మొండిగా పెరిగే పంట అరిక. ఎకరానికి ట్రాక్టర్ అరిక గడ్డి వస్తుంది. గడ్డి అమ్ముకుంటే సాగుకు అయిన ఖర్చు కన్నా ఎక్కువే ఆదాయం వస్తుంది. రైతుకు నష్టం రానే రాదు. ఎత్తు పల్లాల భూమిలో వర్షాలకు మట్టి కొట్టుకుపోకుండా అరిక పంట బాగా ఉపయోగపడుతుందని విజయకుమార్ వివరించారు. ఆయనను 79814 07549 నంబరులో సంప్రదించవచ్చు. ఏపీ రైతులు ఉ. 5–9 గం. మధ్య, కర్ణాటక రైతులు మ. 1–3 గం. మధ్య, తెలంగాణ రైతులు సా. 6–9 గం. మధ్య ఫోన్ చేయవచ్చు.
Comments
Please login to add a commentAdd a comment