
ప్రాణం తీసిన వానరం! ∙ఇంటి నుంచి టీ ప్యాకెట్ పట్టుకుపోయి..
మందు గుళికల ప్యాకెట్ తెచ్చి పడేసిన కోతి
∙ఆ ప్యాకెట్‌తో టీ కాచుకుని తాగిన వృద్ధులు మృతి
రాజానగరం: ఓ కోతి చేసిన పనికి వృద్ధ దంపతులు కన్నుమూశారు. రాజానగరం మండలంలోని పల్లకడియం గ్రామానికి చెందిన వెలుచూరి గోవిందు (75), అప్పాయమ్మ (70) దంపతులకు ఒక కుమారుడు, ముగ్గురు ఆడపిల్లలు ఉన్నారు. కుమారుడు తన పిల్లల చదువు కోసం కుటుంబంతో సహా రాజమహేంద్రవరంలో ఉంటున్నారు. ముగ్గురు కుమార్తెలకు వివాహాలు చేశారు. గోవిందు, అప్పాయమ్మ మాత్రమే తమ ఇంట్లో ఉంటున్నారు. ఈ నేపథ్యంలో గురువారం ఉదయం గోవిందు, అప్పాయమ్మల ఇంటి నుంచి ఒక టీ పొడి ప్యాకెట్‌ను కోతి ఎత్తుకుపోయింది.
మరుసటి రోజు శుక్రవారం ఉదయం వేరొక ఇంటి నుంచి పంటలకు ఉపయోగించే విష గుళికల మందు ప్యాకెట్‌ను తీసుకువచ్చి వీరి ఇంటి పెరటిలో పడేసింది. కళ్లు సరిగా కనిపించని అప్పాయమ్మ పెరటిలో పడి ఉన్న ప్యాకెట్‌ను తన ఇంటి నుంచి కోతి తీసుకువెళ్లిందేనని భావించి దానితో టీ పెట్టింది. ఆ టీని తన భర్తకు ఇచ్చి, తాను కూడా తాగింది. కొద్దిసేపటికే వారిద్దరూ నోటి నుంచి నరుగులు కక్కుతూ పడిపోయారు. ఇరుగు పొరుగువారు చూసి హుటాహుటిన రాజమహేంద్రవరం ఆస్పత్రికి తీసుకువెళ్లగా, అప్పటికే మరణించారు. ఈ మేరకు రాజానగరం పోలీసులు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నారు. మృతదేహాలకు శనివారం పోస్టుమార్టం నిర్వహించి కుటుంబ సభ్యులకు అప్పగించారు.
Comments
Please login to add a commentAdd a comment