గడ్డినే కాదు, జీవులనూ చంపుతుంది! | Sakshi Guest Column On Pesticides | Sakshi
Sakshi News home page

గడ్డినే కాదు, జీవులనూ చంపుతుంది!

Published Fri, Jul 19 2024 12:58 AM | Last Updated on Fri, Jul 19 2024 12:58 AM

Sakshi Guest Column On Pesticides

విశ్లేషణ

ఒక ఉత్పత్తి గురించి అనేక దేశాలు గోస పడుతున్నాయి. అయినా దాని మీద శాశ్వత నిషేధం విధించడం లేదు. కలుపు సంహారక సమ్మేళనం గ్లైఫోసేట్‌ (గడ్డి మందు) వల్ల పర్యావరణం మీద, వ్యవసాయ కార్మికుల మీద, గ్రామీణ ప్రజల ఆరోగ్యం మీద దుష్ప్రభావాలు పెరుగుతున్నాయి. నేరుగా క్యాన్సర్‌ కలుగజేసే దీన్ని ఆహార పంటల క్షేత్రాలలో వినియోగించడం చాలా ప్రమాదకరం. దీన్ని పిచికారీ చేసిన పంట వ్యర్థాలను తిని గొర్రెలు, మేకలు, ఇతర పశువులు కూడా చనిపోయాయి. అయినా దీన్ని వినియోగం ఆపడం, ఉత్పత్తిని నిలిపివేయడం, అడ్డుకోవడం సవాలుతో కూడుకున్నదని స్పష్టమవుతోంది. వివిధ దేశాల రాజకీయ సంకల్పం పెద్ద కంపెనీల గణనీయమైన లాబీయింగ్‌ శక్తి ముందు దిగదుడుపే అని అర్థమవుతోంది.

2015లో గ్లైలఫోసేట్‌ నిషేధాన్ని ఆమోదించి, అమలుచేసిన మొట్టమొదటి దేశం శ్రీలంక. కానీ ఈ నిషేధాన్ని 2018లో పాక్షికంగా మార్చవలసి వచ్చింది. 2022లో పూర్తిగా ఉపసంహరించబడింది. 2014లో ఒక స్థానిక శాస్త్రవేత్త గ్లైలఫోసేట్‌ వలన ‘క్రానిక్‌ కిడ్నీ డిసీజ్‌ ఆఫ్‌ అన్నోన్‌ ఆరిజిన్‌’ వస్తున్నదని పరిశోధించి చెప్పిన దరిమిలా శ్రీలంక నాయకత్వం దీని మీద దృష్టి పెట్టింది. 2015లో ఎన్నికైన మైత్రిపాల సిరిసేన ప్రభుత్వం ఈ నిషేధాన్ని ఆమోదించింది. ఈ నిషేధం అధ్యక్ష ఎన్నికల ప్రచారంలో బౌద్ధ సన్యాసి రథనా థెరో మద్దతు కొరకు ఇచ్చిన వాగ్దానం. కానీ తర్వాత నిషేధంలో వెనక్కి తగ్గడం, తరువాత పూర్తిగా ఎత్తి వేయడం జరిగింది. ఈ లాబీయింగ్‌ వెనుక అమెరికా ప్రభుత్వం, బేయర్‌ కంపెనీ (అప్పట్లో మోన్‌శాంటో) ఉన్నదని అందరికీ తెలుసు. 

డిసెంబర్‌ 2023లో, నెలల తరబడి తర్జనభర్జనల తర్వాత, ఐరోపా కూటమి దేశాలలో కొన్ని నిషేధించాలని కోరినా, దీని లైసెన్స్‌ను పునరుద్ధరించాలని యూరోపియన్‌ కమిషన్‌ నిర్ణయించింది. మరో పదేళ్లపాటు వినియోగాన్ని ఆమోదించింది. ఆస్ట్రియా, ఫ్రాన్స్‌, నెదర్లాండ్స్, బెల్జియం, లక్సెంబర్గ్, జర్మనీ వంటి కొన్ని యూరప్‌ దేశాలు కొన్ని ప్రాంతాల్లో, ఇళ్లల్లో దీని వాడకంపై పాక్షిక నిషేధాలనో, పరిమితులనో విధిస్తున్నాయి.

గ్లైఫోసేట్‌ ఒక రసాయన ఉత్పత్తి. ఇదివరకు మోన్‌శాంటో, తరువాత దానిని కొన్న బేయర్‌ కంపెనీ అంతర్జాతీయ గుత్తాధిపత్య కంపెనీ. చాలా శక్తిమంతమైన ఐరోపా కూటమి కూడా ఈ కంపెనీ ఒత్తిడికి తలొగ్గి జీవరాశికి, మానవాళికి ప్రమాదకరంగా పరిణమించిన గ్లైఫో సేట్‌ వాడకం ఆపలేకపోయింది. సాంకేతిక, మార్కెట్, నియంత్రణ వ్యవస్థల మధ్య ఏర్పడిన ఒక సంక్లిష్టమైన పరస్పర అవగాహన వల్ల ఆధునిక వ్యవసాయంలో గ్లైఫోసేట్‌కు ప్రోత్సాహం లభించిందని ఒక ఆధ్యయనం చెబుతున్నది. 

ఇందులో 4 కీలక విషయాలు ఇమిడి ఉన్నాయి. (1) జన్యుమార్పు పంటల మీద ఉపయోగం కోసం గ్లైఫో సేట్‌ వినియోగం; (2) కొత్త వ్యవసాయ వినియోగాలను ప్రోత్సహించడం ద్వార ప్రపంచవ్యాప్త సాధారణ గ్లైఫోసేట్‌ మార్కెట్‌ పెరుగుదల; (3) గ్లైఫోసేట్‌ వాడకంతో మిళితం చేసే డిజిటల్‌ వ్యవసాయం, జీనోమ్‌ ఎడిటింగ్‌ వంటి కొత్త సాంకేతిక ప్రోత్సాహం; (4) కార్పొరేట్‌ మార్కెట్‌ శక్తి పెరుగుదల వల్ల వ్యవసాయ పరిశోధన కార్యక్రమాల్లో ప్రభుత్వ పెట్టుబడి తగ్గి హెర్బిసైడ్‌ రహిత కలుపు నియంత్రణ మీద పరిశోధనలు ఆగిపోవడం.

మన దేశంలో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్రల్లో ప్రభుత్వాలు ఆ మధ్య వరుసగా ఒక మూడు సంవత్సరాలు దీనిమీద 60 రోజులు పాటు నిషేధం ప్రకటించాయి. ఈ తాత్కాలిక నిషేధం ఉద్దేశ్యం చట్టవిరుద్ధమైన, హెర్బిసైడ్‌–తట్టుకునే బీటీ పత్తి విత్తనాలను ఉపయోగించకుండా అరికట్టడానికి అని చెప్పారు. ఈ తాత్కాలిక నిషేధం కూడా కాగితాలకే పరిమితం అయ్యింది. ఆ పరిమిత నిషేధ కాలంలో కూడా బహిరంగంగానే అమ్మకాలు జరిగాయి. 

పురుగు మందుల నియంత్రణ చట్టం, 1968 ప్రకారం రాష్ట్రాలు విష రసాయనాలను 60 రోజుల వరకు మాత్రమే నిషేధించవచ్చు. కేంద్ర ప్రభు త్వానికి మాత్రమే శాశ్వతంగా నిషేధించే అధికారం ఉంది. వివిధ రాష్ట్రాలు కోరినా కేంద్రం నిషేధం గురించి స్పందించడం లేదు. కేరళ, సిక్కిం రాష్ట్రాలు మాత్రం కొన్ని అధికరణలను ఉపయోగించి శాశ్వత నిషేధం విధించాయి. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రాలు కేంద్రానికి రాసి మిన్నకున్నాయి. ఇతర విషయాలలో అధ్యయనాలకు బృందాలను పంపే రాష్ట్రాలు మరి కేరళ, సిక్కిం ఎట్లా సాధించాయో తెలుసు కునే ప్రయత్నం చేయలేదు.

2019–21 మధ్య స్వదేశీ జాగరణ్‌ మంచ్‌ అవగాహన కార్య క్రమాలు చేపట్టి, గ్లైఫోసేట్‌ను పూర్తిగా నిషేధించాలని కోరుతూ రెండు లక్షల మంది సంతకాలతో కూడిన మెమోరాండంను కేంద్ర వ్యవసాయ, రైతు సంక్షేమ శాఖ మంత్రికి సమర్పించింది. స్వదేశీ జాగరణ్‌ మంచ్‌ ఆర్‌ఎస్‌ఎస్‌ అనుబంధ సంస్థ. అనేక విషయాలలో ఆర్‌ఎస్‌ఎస్‌ అనుకూల నిర్ణయాలు తీసుకుంటున్నదని ఆరోపణ ఎదురుకుంటున్న కేంద్ర ప్రభుత్వం, గ్లైఫోసేట్‌ మీద మాత్రం ఆ సంస్థ కోరిన నిషేధం విధించలేకపోతున్నది. రాజకీయ ఒత్తిడులలో ఉండే అధికార క్రమం ఇక్కడ స్పష్టంగా కనపడుతున్నది. 

అక్టోబర్‌ 2020లో, పెస్టిసైడ్‌ యాక్షన్‌ నెట్‌వర్క్‌ ఇండియా మరియు పాన్‌ ఆసియా పసిఫిక్‌ సంయుక్తంగా ‘స్టేట్‌ ఆఫ్‌ గ్లైఫోసేట్‌ యూజ్‌ ఇన్‌ ఇండియా’ నివేదికను విడుదల చేశాయి. దీని వాడకం విచ్చలవిడిగా ఉందని నివేదించాయి. దీని వల్ల పర్యావరణం మీద, వ్యవసాయ కార్మికుల మీద, గ్రామీణ ప్రజల ఆరోగ్యం మీద దుష్ప్ర భావాలు పెరుగుతున్నాయని పేర్కొంది. నేరుగా క్యాన్సర్‌ కలుగజేసే దీన్ని ఆహార పంటల క్షేత్రాలలో వినియోగించడం ప్రమాదకరం.

ప్రజల నుంచి, సంస్థల నుంచి వచ్చిన ఒత్తిడుల నేపథ్యంలో నిషేధించకుండా కేంద్ర ప్రభుత్వం 2020లో కొన్ని ఆంక్షలు ప్రకటించింది. దీని ప్రకారం పెస్ట్‌ కంట్రోల్‌ ఆపరేటర్ల ద్వారా తప్ప ఏ వ్యక్తి కూడా దీన్ని పిచికారీ చేయరాదు. అంటే సాధారణ రైతులు ఉప యోగించరాదు. కేవలం రసాయన పిచికారి చేసే సంస్థల ద్వారానే ఉపయోగించాలని కొత్త నిబంధన తెచ్చింది. తదుపరి కంపెనీ నుంచి వచ్చిన ఒత్తిడికి తలొగ్గి ఈ ఆంక్షలను సవరించారు. శిక్షణ పొందిన వారు ఎవరైనా ఉపయోగించవచ్చు అని చెప్పారు. ఆ శిక్షణ ఇవ్వడానికి ఒక కేంద్ర పరిశోధన సంస్థకు అప్పజెప్పితే వారు కొన్ని ఆన్‌లైన్‌ తరగతులు నిర్వహించి ఒక సర్టిఫికెట్‌ ఇస్తున్నారు.

రైతులలో పూర్తి అవగాహన లేకపోవడం, పురుగుమందు / విత్తన కంపెనీల మార్కెట్‌ మాయాజాలం, కొరవడిన ప్రభుత్వ  నియంత్రణ వంటి కారణాల వల్ల, రైతులు దీన్ని వాడుతున్నారు. రైతులు తాము కొన్నవి గ్లైఫోసేట్‌ తట్టుకునే విత్తనాలు అనుకుని, కాయ కాసిన తరుణంలో, గడ్డిని తొలగించటానికి దీన్ని వాడటం వల్ల, మొత్తం పంట మాడిపోయి నష్టపోయిన ఉదంతాలు ఉన్నాయి. దీని వాడకం మీద ఆంక్షలు ఉండడంతో, ప్రభుత్వం నుంచి పరిహారం కోరే అవకాశం కూడా లేకుండా పోయింది. 

గ్లైఫోసేట్‌ పిచికారీ చేసిన గడ్డి అని తెలియక దాన్ని నోట్లో పెట్టుకున్న ఒక అమ్మాయి చనిపోయింది. అనేక విధాలుగా గ్రామాలలో అమాయకులు ఈ విష రసాయనాల బారిన పడి అనారోగ్యం పాలవుతున్నారు. పంట ఎండపెట్టడానికి ఓపిక లేని రైతులు పంట కోతకోచ్చే సమయానికి దీన్ని వాడు తున్నారు. దాని వల్ల మొక్క మాడుతుంది, చచ్చిపోతుంది. అట్లాంటి పంట వ్యర్థాలు విషపూరితం అవుతాయి. దీన్ని పిచికారీ చేసిన పంట వ్యర్థాల్నితిని గొర్రెలు, మేకలు, ఇతర పశువులు కూడా చనిపోయాయి.

క్యాన్సర్‌ ప్రమాదాల గురించి వినియోగదారులను హెచ్చరించడంలో కంపెనీ విఫలమైందని పేర్కొంటూ మో¯Œ శాంటో (ఇప్పుడు బేయర్‌ యాజమాన్యంలో ఉంది)తో సహా గ్లైఫోసేట్‌తో సంబంధం ఉన్న రౌండప్‌ తయారీదారులపై అమెరికాలో వేలకొద్దీ కోర్టు వ్యాజ్యాలు దాఖలైనాయి. 2019 నాటికి ఇవి 42,700. ఇతర దేశంలో గ్లైఫోసేట్‌ మీద ఈగ వాలితే అమెరికా ప్రభుత్వం వాలిపోతుంది. అదే అమెరికాలో వేల కొద్ది వ్యాజ్యాలను ఆ కంపెనీ ఎదుర్కుంటున్నది.

మానవాళికి, జీవకోటికి ప్రమాదకరంగా పరిణమించిన ఈ వ్యాపార వస్తువును నిషేధించలేని పాలనా వ్యవస్థలను, అందులోని లోపాలను అధ్యయనం చేయాలి. ఒక వ్యాపార వస్తువుని నియంత్రించలేని దేశాధినేతల బలహీనతలు ఇక్కడే తేలిపోతున్నవి. ప్రజా రోగ్యాన్ని దెబ్బ తీస్తూ, పర్యావరణానికి దీర్ఘకాల హాని చేసే రసాయనాల నియంత్రణ మీద ఒక వైపు అంతర్జాతీయ చర్చలు జరుగు తుంటే మన దేశంలో మాత్రం ఏ చర్యా లేదు. ఇది మారాలి. ఈ పరిస్థితి మారాలంటే మన రాజకీయం మారాలి.
 

డా‘‘ దొంతి నరసింహా రెడ్డి 
వ్యాసకర్త వ్యవసాయరంగ నిపుణులు  

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement