
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో వచ్చే వానాకాలం సీజన్‌కు సంబంధించి వ్యవసాయ శాఖ పంటల ప్రణాళికను ఖరారు చేసింది. ఇందులో భాగంగా కోటిన్నర ఎకరాల్లో పంటలు సాగయ్యేలా చూడాలని నిర్ణయించింది. అత్యధికంగా 60 లక్షల ఎకరాల్లో వరి సాగు చేయాలని ప్రతిపాదించింది. ఇక 55 లక్షల ఎకరాల్లో పత్తి సాగు చేయాలని వ్యవసాయశాఖ రైతులకు పిలుపునిచ్చింది.
కంది, మొక్కజొన్న 8 లక్షల ఎకరాల చొప్పున, సోయాబీన్ 5 లక్షల ఎకరాలు, పెసర లక్ష ఎకరాలు, మినుములు 50 వేల ఎకరాల్లో సాగును ప్రతిపాదించారు. మొత్తం సాగుకు ప్రతిపాదించిన కోటిన్నర ఎకరాల్లో 10 లక్షల ఎకరాలు ఉద్యాన పంటలున్నాయని వ్యవసాయ శాఖ తెలిపింది. గతేడాది 1.46 కోట్ల ఎకరాల్లో పంటలు సాగయ్యాయని వెల్లడించింది.
18.47 లక్షల క్వింటాళ్ల విత్తనాలు..
ఉద్యాన పంటలను మినహాయించి చూస్తే 1.40 కోట్ల ఎకరాల్లో ఆహార, వాణిజ్య పంటలు సాగవుతాయి. అందుకోసం 18.47 లక్షల క్వింటాళ్ల విత్తనాలు అవసరమవుతాయని వ్యవసాయశాఖ పేర్కొంది. విత్తనాలకు కొరత లేదని, 1.82 కోట్ల ఎకరాలకు సరిపడా 22.50 లక్షల క్వింటాళ్ల విత్తనాలు అందుబాటులో ఉన్నాయని వెల్లడించింది.
అకాల వర్షాల నుంచి బయటపడేలా ముందస్తు నాట్లు..
ఈ ఏడాది యాసంగిలో రెండు దఫాలు పెద్ద ఎత్తున అకాల వర్షాలు రావడంతో లక్షలాది ఎకరాల పంటలకు నష్టం వాటిల్లింది. ఈ నేపథ్యంలో వానాకాలం, యాసంగి సీజన్లను ముందుకు జరపడం వల్ల నష్టాన్ని నివారించవచ్చని భావిస్తున్న ప్రభుత్వం ఆ మేరకు చర్యలు చేపట్టింది. సీజన్‌ను ముందుకు జరపడంతో పాటు తక్కువ కాలపరిమితి కలిగిన విత్తనాలను రైతులకు అందుబాటులోకి తీసుకురావాలని, అకాల వర్షాలు, వడగళ్లను తట్టుకునే రకా లను రైతులకు ఇవ్వాలని నిర్ణయించింది.
ఎక్కువ సమయం తీసుకునే పంట రకాలను ప్రోత్సహించకూడదని ప్రభుత్వం భావిస్తోంది. 135 రోజుల మధ్యస్థం, 125 రోజుల తక్కువ కాలపరిమితి వెరైటీలను రైతులు వేసుకోవాలని సూచించింది. కాగా, ఐదు రకాల మధ్యస్థ కాల పరిమితి కలిగిన వరి వంగడాలు, స్వల్పకాలిక వ్యవధి కలిగిన 10 రకాల వరి వెరైటీలను వేసుకోవాలని రైతులకు సూచించింది.
వానాకాలంలో జూన్ 10–20వ తేదీల మధ్య నారు వేయాలని చెప్పింది. ఈ మార్పులవల్ల ఇబ్బందులు ఉండవని పేర్కొంది. అలాగే యాసంగిలో స్వల్పకాలిక రకాలను మాత్రం వేయాలని స్పష్టం చేసింది. వెదజల్లే పద్ధతిలో వరి సాగు చేయాలని సూచించింది. యాసంగిలో నవంబర్ 15 నుంచి డిసెంబర్ 10 మధ్య నార్లను పూర్తి చేయాలని వ్యవసాయ శాఖ విజ్ఞప్తి చేసింది.
Comments
Please login to add a commentAdd a comment