‘సిరి’ దారిలో ప్రజా వైద్య సేద్యం! | small grains used to perfect health | Sakshi
Sakshi News home page

‘సిరి’ దారిలో ప్రజా వైద్య సేద్యం!

Published Tue, Sep 17 2019 5:41 AM | Last Updated on Tue, Sep 17 2019 5:41 AM

small grains used to perfect health - Sakshi

తన పొలంలో ఊద పంటను పరిశీలిస్తున్నా డా. రామ్‌కిషన్‌

వైద్యుడు అనారోగ్యాన్ని తగ్గించడం గురించి మాత్రమే కాదు, ఆరోగ్యాన్ని అందించే సరైన ఆహారం గురించి, ఆ ఆహారం పండించే పద్ధతుల గురించి కూడా పట్టించుకోవాలంటున్నారు డాక్టర్‌ ధర్మకారి రాంకిషన్‌. మహబూబ్‌నగర్‌ ప్రభుత్వ ఆసుపత్రి సూపరింటెండెంట్‌గా పనిచేస్తున్న ఆయన చాలాకాలంగా నల్లమల ప్రాంత చెంచుల గ్రామాల్లోకి వెళ్లి వైద్య శిబిరాలు నిర్వహిస్తూ ఉంటారు. గత రెండేళ్లుగా సిరిధాన్యాలనే ఆహారంగా తింటూ.. వందలాది మంది రోగులకూ ఈ ఆహారాన్ని అలవాటు చేసి దీర్ఘవ్యాధుల నుంచి వారిని విముక్తం చేస్తున్నారు.

అంతేకాదు.. స్వయంగా 20 ఎకరాల్లో సిరిధాన్యాలను వర్షాధారంగా పండిస్తున్నారు. మహబూబ్‌నగర్, నాగర్‌కర్నూల్‌ జిల్లాల్లో కొందరు చెంచులు, ఇతర రైతులను ప్రోత్సహించి ఈ ఖరీఫ్‌ సీజన్‌లో 200 ఎకరాల్లో సిరిధాన్యాలను సాగు చేయిస్తున్నారు. చెంచులోకం స్వచ్ఛంద సంస్థకు గౌరవాధ్యక్షుడు కూడా అయిన ఆయన ఐటీడీఏ తోడ్పాటుతో చెంచులతో సిరిధాన్యాల ప్రాసెసింగ్‌ యూనిట్లు, విక్రయ కేంద్రాలు ఏర్పాటు చేయించబోతున్నారు.

వచ్చే ఏడాది వెయ్యి ఎకరాల్లో సాగు చేయించాలని, సిరిధాన్యాల విత్తన బ్యాంకులను నిర్మించాలన్న దృఢ సంకల్పంతో ఉన్నారు. ఇందుకోసం ‘రైతు లోకం ఫౌండేషన్‌’ను రిజిస్టర్‌ చేయించి టోల్‌ ఫ్రీ నంబరు ద్వారా సిరిధాన్యాలు ఆహార, ఆరోగ్య, వ్యవసాయ సంబంధమైన శాస్త్రీయ అవగాహనను ప్రజలకు అందించాలని అభిలషిస్తూ ఇతరులకు స్ఫూర్తినిస్తున్నారు. మెట్ట రైతుల పక్షపాతి, సిసలైన ప్రజావైద్యుడు డాక్టర్‌ రామ్‌కిషన్‌కు వందనాలు!

అరుదైన ప్రజా వైద్యుడు డాక్టర్‌ ధర్మకారి రామ్‌కిషన్‌. వృత్తి రీత్యా ఆయన ఎముకల శస్త్రచికిత్సా నిపుణుడు. వైద్య విద్యార్థులకు 20 ఏళ్లుగా పాఠాలు చెబుతున్న ప్రొఫెసర్‌. ప్రస్తుతం మహబూబ్‌నగర్‌ ప్రభుత్వ ఆసుపత్రి సూరపింటెండెంట్‌గా సేవలందిస్తున్నారు. ప్రవృత్తి రీత్యా అట్టడుగు వర్గమైన నల్లమల చెంచులకు ఆప్తుడు. చెంచులోకం స్వచ్ఛంద సంస్థకు గౌరవాధ్యక్షుడిగా చెంచుల పెంట(గూడేల)ల్లో వైద్య శిబిరాలు పెడుతూ వారికి అండదండగా ఉంటుంటారు.

గత రెండేళ్లుగా వరి, గోధుమలను తినటం నిలిపివేసి పూర్తిగా వర్షాధారంగా పండించిన సిరిధాన్యాలనే తింటున్నారు. ప్రజావైద్యంలో సిరిధాన్యాలను మిళితం చేసి వందలాది మంది దీర్ఘ రోగులను సంపూర్ణ ఆరోగ్యం దిశగా నడిపిస్తున్నారు. బంధు మిత్రుల కుటుంబాలను కూడా కొర్రలు, సామలు, ఆరికలు, ఊదలు, అండుకొర్రలనే ముఖ్య ఆహారంగా, అంబలిగా, అల్పాహారంగా, చిరుతిండ్లుగా తీసుకోవడం.. రోజూ 7–10 కిలోమీటర్లు నడవడం ద్వారా దీర్ఘరోగాల నుంచి కూడా విముక్తి పొంది సంపూర్ణ ఆరోగ్యం సంతరించుకోవచ్చని సూచిస్తూ సత్ఫలితాలు సాధిస్తున్నారు. స్వయంగా తాను 20 ఎకరాల్లో సాగు చేస్తున్నారు. అంతగా ఆదాయం లేక అల్లాడుతున్న వర్షాధార వ్యవసాయదారులను నాలుగు వర్షాలు పడితే నిశ్చింతగా పండే ఈ సిరిధాన్యాల సాగుకు చెంచులను, ఇతర వర్గాల రైతులను ప్రోత్సహిస్తున్నారు. స్వతంత్ర శాస్త్రవేత్త డా. ఖాదర్‌ వలితో కూడా అనేక సదస్సులు నిర్వహించారు.

పత్తి పొలాల మధ్య సిరిధాన్యాల సాగు
నాగర్‌కర్నూల్‌ జిల్లా తాడూరు మండలం ఇంద్రకల్‌ డాక్టర్‌ రామ్‌కిషన్‌ సొంత గ్రామం. అక్కడే ఆయనకు రెండెకరాల పొలం ఉంది. మరో 18 ఎకరాల నల్లరేగడి భూమి కౌలుకు తీసుకొని మొదటి సారిగా ఈ ఏడాదే 5 రకాల సిరిధాన్యాలు – కొర్రలు, సామలు, ఆరికలు, ఊదలు, అండుకొర్రల–ను పండిస్తున్నారు. గొర్రు/ట్రాక్టర్‌తో సాళ్లుగా వెద పెట్టించారు. పంట 5 అడుగుల ఎత్తు ఏపుగా ఎదిగి కంకి దశలో కనువిందు చేస్తోంది. మరో నెల రోజులకు కోతకు వస్తుంది. ఎకరానికి 10 క్వింటాళ్లకు పైగానే దిగుబడి వస్తుందని, కొన్ని చోట్ల 15 క్వింటాళ్ల వరకు కూడా దిగుబడి రావచ్చని ఆయన సంతోషంగా చెప్పారు. చుట్టూ పత్తి పొలాల మధ్యలో తమ సిరిధాన్యాల పంటలు చూస్తుంటే ముచ్చటగా ఉందని ఆయన సంబరపడుతున్నారు. విత్తనం చల్లటం తప్ప చేసిందేమీలేదు. కలుపు కూడా ఉంది. కానీ, అది పంట ఎదుగుదలకు ఆటంకం కాలేదని డా. రామ్‌ కిషన్‌ చెప్పారు.

ఉచితంగా సిరిధాన్యాల విత్తనాలు
సిరిధాన్యాల సాగులో అనుభవం లేనందున వైఎస్సార్‌ కడప జిల్లాకు చెందిన విఆర్‌డిఎస్‌ స్వచ్ఛంద సంస్థ వ్యవస్థాపకుడు, రైతు శాస్త్రవేత్త కొమ్ములూరి విజయకుమార్‌ను డా. రామ్‌కిషన్‌ తమ ప్రాంతానికి ఆహ్వానించి ఆయన సహాయ సహకారాలు తీసుకున్నారు. రెండు నెలల క్రితం విజయకుమార్‌ ఈ ప్రాంతంలో పర్యటించి డాక్టర్‌ రామ్‌కిషన్‌ చెంచులు, మెట్ట రైతుల అభ్యున్నతికి చేస్తున్న కృషికి ముగ్ధుడయ్యారు. 50 ఎకరాల్లో సిరిధాన్యాల సాగుకు అవసరమైన సేంద్రియ విత్తనాలను విజయకుమార్‌ డా. రామ్‌కిషన్‌ ద్వారా ఉచితంగా అందించి, సిరిధాన్యాల సాగులో మెలకువలను తెలియజెప్పారు. వంద ఎకరాలకు విత్తనాన్ని ఐటిడిఏ ఉచితంగా పంపిణీ చేసింది.

వీరి సహకారంతో తాడూరు మండలం ఇంద్రకల్‌కు చెందిన ఇంజినీరింగ్‌ పట్టభద్రుడు ప్రశాంత్‌ తొలి సారిగా ఈ ఏడాది 30 ఎకరాల్లో సిరిధాన్యాలు సాగు చేస్తున్నారు. ఎక్కువ విస్తీర్ణంలో అండుకొర్రలు, సామలు, అరికలు సాగు చేస్తున్నారు. అదేవిధంగా తాడూరు మండలం యాదిరెడ్డి కాలనీకి చెందిన మర్రెడ్డి, శౌర్రెడ్డి, అనిల్‌ తలా ఒక రెండెకరాల్లో ప్రయోగాత్మకంగా సిరిధాన్యాలు సాగు చేశారు. పత్తి, వరి సాగు చేసే అలవాటు ఉన్న ఈ రైతులు సిరిధాన్యాల పంట ఎదుగుతున్న తీరు, పది క్వింటాళ్లకు పైగా దిగుబడి వచ్చే అవకాశం ఉండటంతో సంతోషిస్తున్నారు. అధిక పెట్టుబడులతో జూదంగా మారిపోయిన పత్తి కన్నా సిరిధాన్యాల సాగు మేలన్న భావనతో వచ్చే ఏడాది మరిన్ని ఎకరాల్లో సాగు చేస్తామని వారు చెబుతున్నారు.

మహబూబ్‌నగర్‌ మండలం తాటికొండ శివారులో వరి రైతు శంకర్‌ తొలిసారిగా 6 ఎకరాల్లో సిరిధాన్యాలను సాగు చేస్తూ ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు. లింగాల మండలం అప్పాయపల్లి, శ్రీరంగాపురంలలో కూడా డా. రామ్‌కిషన్, విజయకుమార్‌ ప్రోత్సాహంతో కొందరు రైతులు సిరిధాన్యాల సాగుకు శ్రీకారం చుట్టారు. ఆముదం, వరి సాగు చేసే అలవాటున్న చెంచు మహిళా రైతు శీతమ్మ ఈ ఏడాది 3 ఎకరాల్లో సిరిధాన్యాలు సాగు చేస్తున్నారు. లింగాల మండలం దారారంలో చెంచు రైతు కాట్రాజ శ్రీనివాస్‌ 12 ఎకరాల్లో కొర్రలు సాగు చేస్తున్నారు. వనపర్తి జిల్లా పెబ్బేరు మండలం శ్రీరంగాపురంలో శ్రీనివాస్‌ అనే  రైతు 5 ఎకరాల్లో కొర్రలు సాగు చేస్తున్నారు. జోగులాంబ గద్వాల జిల్లా ఐజ గ్రామ శివారులో రామకృష్ణ 8 ఎకరాల్లో కొర్రలు సాగు చేస్తున్నారు.

ఈ విధంగా సుమారు 200 ఎకరాల్లో ఈ ఏడాది డా. రామ్‌కిషన్‌ ప్రోత్సాహంతో రైతులు సిరిధాన్యాల సాగును ప్రారంభించారు. గ్రామాల్లో 40–50 చోట్ల రైతుల గ్రూప్‌ మీటింగ్‌లు ఏర్పాటు చేసి వర్షాధారంగా సిరిధాన్యాల సాగు ఆవశ్యకత గురించి రైతులను చైతన్యవంతం చేయడం విశేషం. ఎకరానికి కనీసం 10 క్వింటాళ్ల దిగుబడి వస్తుందని అంచనా వేశామని, కనీసం రూ. 30 వేల ఆదాయం వస్తుందన్నారు. ఎకరానికి రూ. 50 వేలు పెట్టుబడి పెట్టి 6 నెలల పంటకాలం ఉండే పత్తి వేసి నానా బాధలు పడేకన్నా స్వల్ప పెట్టుడితో 100 రోజుల్లో చేతికి వచ్చే సిరిధాన్యాల వర్షాధార సాగు మేలని రైతులు సంతృప్తిగా చెబుతున్నారని డా. రామ్‌కిషన్‌ తెలిపారు.

చెంచులతో ప్రాసెసింగ్‌ యూనిట్లు
సిరిధాన్యాల పంట సంతృప్తికరంగా ఉన్నందున కోత, కోత అనంతర ప్రాసెసింగ్‌ విషయాలపై దృష్టి సారిస్తున్నారు. ఐటీడీఏ తోడ్పాటుతో రెండు చోట్ల చెంచు రైతుల ఆధ్వర్యంలో సిరిధాన్యాల శుద్ధి యంత్రాలను ఏర్పాటు చేసేందుకు ప్రయత్నిస్తున్నానని డా. రామ్‌కిషన్‌ తెలిపారు. అంతేకాదు, వర్షాధారంగా, సేంద్రియ పద్ధతుల్లో సాగు చేసే సిరిధాన్యాల విక్రయానికి ప్రత్యేక బ్రాండ్‌ను రిజిస్టర్‌ చేయించి, ప్రత్యేక దుకాణాల ద్వారా విక్రయం చేపట్టాలని ఆలోచిస్తున్నామన్నారు.

బోరు నీటితో భార ఖనిజాల బెడద
బోరు నీటితో పండించిన వరి, గోధుమలు తినటం మానేసి వర్షాధారంగా పండించిన సిరిధాన్యాల ఆహారం తీసుకోవడంతో రక్తపోటు, సుగర్, ఊబకాయం, మానసిక ఆందోళన తదితర ఆరోగ్య సమస్యలు ఉపశమిస్తున్నాయని డా. రామ్‌కిషన్‌ తెలిపారు. తనకు తెలిసిన కనీసం వెయ్యి మంది రోగులు ఆహారం మార్చుకోవడంతోపాటు రోజూ నడవడం ద్వారా ఆరోగ్యవంతులుగా మారుతున్నారన్నారు. ఆహారం ద్వారానే కాకుండా నడక ద్వారా మనిషిలో రోగనిరోధక శక్తిని పెంచే యాంటీ ఆక్సిడెంట్లు పెరుగుతాయన్నారు.

బోరు నీటితో పండించే వరి తదితర పంట దిగుబడుల్లో భార ఖనిజాలు ఉంటాయని, ఆ బియ్యం తిన్న వారికి కిడ్నీ జబ్బులు వస్తున్నాయని ఆయన తెలిపారు. సిరిధాన్యాలు నాలుగు వర్షాలు పడితే పండుతాయని, వీటి ద్వారా సంపూర్ణ ఆరోగ్యం చేకూరుతుందన్నారు. 300 లోపు టిడిఎస్‌(టోటల్‌ డిసాల్వుడ్‌ సాలిడ్స్‌) ఉన్న నీరు తాగడానికి, 400 లోపు టీడీఎస్‌ ఉన్న నీరు సాగుకు పనికివస్తుందన్నారు. అయితే, నల్లగొండ, మహబూబ్‌నగర్‌ జిల్లాల్లో బోరు నీటిలో 800–1300 మేరకు టీడీఎస్‌ ఉంటున్నదన్నారు. ఇందువల్లే కిడ్నీ రోగుల సంఖ్య పెరుగుతోందన్నారు. అందువల్ల సిరిధాన్యాలు వంటి నాలుగు వర్షాలతో పండే పంటలే ఆరోగ్యదాయకమని గుర్తించాలని డా. రామ్‌కిషన్‌ కాలికి బలపం కట్టుకొని ప్రచారం చేస్తున్నారు.

ఇన్‌పుట్స్‌ : జమ్ముల దామోదర్, సాక్షి, బిజినేపల్లి
బోరు నీటితో పండించే వరి తదితర పంట దిగుబడుల్లో భార ఖనిజాలు ఉంటాయి. ఆ బియ్యం తిన్న వారికి కిడ్నీ జబ్బులు వస్తున్నాయి.  సిరిధాన్యాలు నాలుగు వర్షాలు పడితే పండుతాయి. వీటి ద్వారా సంపూర్ణ ఆరోగ్యం చేకూరుతుంది. బోరు నీటిలో 800–1300 మేరకు టీడీఎస్‌ ఉంటున్నది. ఈ నీటితో పండించే పంటల దిగుబడుల్లో, బియ్యంలో భారఖనిజాలు నిక్షిప్తమై ఉంటాయి. వీటిని తిన్న వారు కిడ్నీ, తదితర జబ్బులకు గురవుతున్నారు. అందువల్ల సిరిధాన్యాలు వంటి నాలుగు వర్షాలతో పండే పంటలే ఆరోగ్యదాయకమని గుర్తించాలి.

ఉచిత ఫోన్‌ సదుపాయం
సిరిధాన్యాలను వర్షాధారంగా సేంద్రియ పద్ధతుల్లో సాగు చేసే పద్ధతులు, ప్రాసెసింగ్, సిరిధాన్యాల ఆహార పదార్థాలు, సంపూర్ణ ఆరోగ్యం పొందే పద్ధతులపై రైతులు, ప్రజల్లో వ్యక్తమవుతున్న సందేహాలను శాస్త్రీయ సమాచారంతో నివృత్తి చేయడానికి ఉచిత ఫోన్‌ (టోల్‌ ఫ్రీ) నంబరును ప్రారంభించాలని భావిస్తున్నట్లు డా. రామ్‌కిషన్‌ తెలిపారు. సిరిధాన్యాల విత్తన బ్యాంకులను సైతం గ్రామాల్లో విరివిగా ఏర్పాటు చేయనున్నామన్నారు. తొలి ఏడాది రైతులకు ఉచితంగా విత్తనాలు ఇస్తామని, వారు పండించిన పంటలో నుంచి రెట్టింపు పరిమాణంలో తిరిగి విత్తన బ్యాంకుకు జమచేయాల్సి ఉంటుందన్నారు. ఈ పనులన్నిటినీ చేపట్టేందుకు ‘రైతు లోకం ఫౌండేషన్‌’ను నెలకొల్పనున్నట్లు వివరించారు.  
(డా. రామ్‌కిషన్‌ను 94407 12021 నంబరులో సంప్రదించవచ్చు)

– పంతంగి రాంబాబు, సాగుబడి డెస్క్‌

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement