అరిక.. 5 నెలల పంట. దీన్ని ఖరీఫ్‌లో ఆరుద్ర కార్తెలో మాత్రమే విత్తుకోవాలి. కొర్ర, అండుకొర్ర, ఊద, సామ, బరిగలు 3 నెలల పంటలు. వీటిని ఖరీఫ్‌లోను, రబీలోనూ సాగు చేసుకోవచ్చని డా.వైఎస్సార్ కడప జిల్లాకు చెందిన రైతు శాస్త్రవేత్త విజయకుమార్ వివరించారు. ఆయన ‘సాగుబడి’కి అందించిన వివరాలు..
► ఎకరానికి 3 కిలోల విత్తనం అవసరం. పొలాన్ని మడులుగా విభజించి.. ఈ చిరుధాన్యాలన్నిటినీ ఒక ఎకరంలో సాగు చేసుకోవచ్చు. అవి కలిసిపోకుండా కందిని సరిహద్దు పంటగా వేసుకోవచ్చు.
► మూడు తడులు ఇవ్వడానికి నీటి సదుపాయం ఉంటే.. ఎకరానికి 8 క్వింటాళ్ల వరకూ సేంద్రియ సిరిధాన్యాలను పండించుకోవచ్చు. ఎకరానికి రూ. 2,300 ఖర్చు అవుతుంది.
► సాలు దున్నిన తర్వాత సిరిధాన్యాలు విత్తుకొని, విత్తనాలపైకి మట్టి పడేలా ఇరవాలు దున్నాలి. 5 సెం.మీ. లోతు దున్నితే చాలు. అంతకంటే లోతులో పడిన సిరిధాన్య విత్తనాల మొలక పైకి రాలేదు.
► విత్తిన వెంటనే తడి ఇవ్వాలి. రెండో తడి 30 రోజులకు, మూడో తడి 60 రోజులకు ఇస్తే చాలు. డ్రిప్, స్ప్రింక్లర్, పారించడం.. ఏ పద్ధతిలోనైనా తడి ఇవ్వొచ్చు.
► వరి కోసిన పొలాల్లో, వేరుశనగ పీకిన పొలాల్లో, కూరగాయలు పండించిన పొలాల్లో.. ఎటువంటి భూమి అయినా.. పంటల మార్పిడి కోసం ఈ రబీలో సిరిధాన్యాలను సాగు చేసుకోవచ్చు. కోతలు పూర్తయిన తర్వాత మోళ్లను భూమిలో కలియదున్నితే భూమి సారవంతమవుతుంది.
► సిరిధాన్యాల పంట నుంచి ఎకరానికి రెండు ట్రాక్టర్ల నాణ్యమైన, పశువులు బాగా ఇష్టపడే గడ్డి వస్తుంది.
► సిరిధాన్యాలను నూర్చే టప్పుడు ప్లాస్టిక్ బరకాలను ఉపయోగించి, ఇసుక, మట్టి కలవకుండా జాగ్రత్తపడాలి.
► అరిక, కొర్ర, అండుకొర్ర, ఊద, సామ, బరిగల ప్రత్యేకత ఏమిటంటే.. పొట్టు తీయని ధాన్యాలను రెండేళ్ల వరకు నిల్వ చేసుకోవచ్చు. పురుగు రాదు. రెండేళ్లు నిల్వ ఉన్నవి కూడా విత్తనానికి నిక్షేపంగా పనికొస్తాయి. విత్తనాలను గోనె సంచుల్లోనే గాలి, వెలుతురు తగిలే చోట నిల్వ చేయాలి. ప్లాస్టిక్ సంచుల్లో నిల్వచేస్తే.. ఉక్కిపోయి మొలక శాతం తగ్గవచ్చు.
► సిరిధాన్యాల బియ్యానికి మాత్రం రెండు, మూడు నెలల తర్వాత సన్న పురుగు వస్తుంది. మిక్సీతో అవసరం ఉన్నప్పుడు పొట్టు తీసుకునే మెలకువ తెలిసింది కాబట్టి, ఒకేసారి ఎక్కువ మొత్తంలో మిల్లు పట్టించుకొని అమ్ముకోలేక తిప్పలు పడాల్సిన అవసరం లేదు.
► సిరిధాన్యాలను రైతులు వెంటనే అమ్మేయకుండా.. నిల్వ చేసుకోవాలి. మిక్సీతో శుద్ధి చేసి తయారు చేసిన బియ్యాన్ని రైతు కుటుంబాలు ఇంటిల్లపాదీ అన్ని వయసుల వారూ తిని పూర్తి ఆరోగ్యవంతులుగా మారాలి. తమ గ్రామాలు, దగ్గర్లోని పట్టణాలు, నగరాల్లో వినియోగదారులకు ఏడాది పొడవునా నేరుగా అమ్ముకునే ఏర్పాట్లు చేసుకుంటే.. రైతులు అధిక నికరాదాయం పొందవచ్చు.
► రసాయనిక ఎరువులు వాడనవసరం లేదు. యూరియా ఎక్కువ వేస్తే పంట అతిగా పెరిగి పడిపోతుంది. పడిపోయిన పంటను కోయటం అధిక శ్రమ, ఖర్చుతో కూడిన పని. పైగా పడిపోయిన కంకుల్లో నుంచి గింజలను అన్ని రకాల పక్షులూ సులువుగా తినేస్తాయి. కాబట్టి రైతుకు చేతికి వచ్చే దిగుబడి బాగా తగ్గిపోతుంది.
► నిలబడి ఉన్న చిరుధాన్య పంట గింజలను జీనిగ, బుల్‌బుల్ వంటి అతి చిన్న పిట్టలు మాత్రమే తినగలవు. ఇవి ఎంత ఎక్కువ తిన్నా ఎకరానికి క్వింటాకు మించి తినలేవు. 7 క్వింటాళ్ల దిగుబడి మనకు వస్తుంది.
► వర్షాకాలపు పంటలో జొన్న, కొర్రలకు ఎర్రదిమ్మ తెగులు వస్తుంది. కానీ, రబీలో ఇవేవీ రావు. వరికి వచ్చే కాండం తొలిచే పురుగు, తెల్లమచ్చ(మజ్జిగ) తెగులు సిరిధాన్య పంటల జోలికి రావు.
► డ్వాక్రా మహిళా సంఘాలు, చిరు వ్యాపారులు సిరిధాన్యాలతో టిఫిన్లు, రకరకాల పిండివంటలు తయారు చేసి అమ్ముకుంటే మంచి పౌష్టికాహారాన్ని జనానికి అందించినట్టవుతుంది. మంచి ఆదాయమూ పొందవచ్చు. సిరిధాన్య వంటలకు వరిపిండి, శనగపప్పు పిండితో చేసే పిండివంటలకు ఖర్చయ్యే నూనెలో సగం సరిపోతుంది.
► రాబోయే ఖరీఫ్ కోసమైతే.. ఎకరానికి 2.5 కిలోల సిరిధాన్యాల విత్తనాలు, అరకిలో నాటు రకం కంది విత్తనాలను రైతులకు ఉచితంగా ఇప్పుడే ఇస్తాను. 2019 నాటికి తెలుగు రాష్ట్రాల్లో అన్ని ఊళ్లలో ఐదారు రకాల సిరిధాన్యాలు పండాలి. అందరూ తినాలి. ఆసుపత్రులు వద్దు.. సిరిధాన్యాలు ముద్దు..
► సిరిధాన్యాల ఉచిత విత్తనాలు, సాగు మెలకువల కోసం విజయకుమార్ (వెలమవారిపాలెం, వేంపల్లె మండలం, డా.వైఎస్సార్ కడప జిల్లా)ను సంప్రదించాల్సిన
ఫోన్: 98496 48498.
సేకరణ: పంతంగి రాంబాబు, సాగుబడి డెస్క్
‘మిక్సీ.. సిరిధాన్యాల మిల్లు’ కథనానికి విశేష స్పందన
‘మిక్సీ.. సిరిధాన్యాల మిల్లు’ శీర్షికతో గత మంగళవారం ‘సాగుబడి’లో ప్రచురించిన కథనానికి రైతుల నుంచి విశేష స్పందన లభిస్తోంది. సిరిధాన్యాలను సాగు చేసినప్పటికీ తగిన ప్రాసెసింగ్ మిల్లులు అందుబాటులో లేక నానా ఇబ్బందులు పడుతున్న రైతులకు అందుబాటులో ఉండే మిక్సీ ప్రత్యామ్నాయం గొప్ప ఊరట కలిగింది. కేవలం మిక్సీ ద్వారా సిరిధాన్యాల బియ్యాన్ని ఇంటిపట్టునే కావాలనుకున్నప్పడు సిద్ధం చేసుకునే అవకాశం ‘బుచ్చి పద్ధతి’ ద్వారా అందుబాటులోకి వచ్చినందుకు చాలా మంది రైతులు సంబరపడుతున్నారు. సిరిధాన్యాలలోని విశిష్ట ఔషధ గుణాల గురించి డాక్టర్ ఖాదర్ ప్రచారం చేస్తుండడంతో వినియోగదారుల్లో వీటి పట్ల ఆసక్తి పెరిగింది. ఈ నేపథ్యంలో సిరిధాన్యాల శుద్ధికి మిక్సీ ఉంటే చాలన్న సమాచారం రైతుల్లో పెద్ద సంచలనమే కలిగించింది. డాక్టర్ ఖాదర్, బాలన్, మహబున్నీలకు అనేక మంది ఫోన్ చేసి కృతజ్ఞతలు తెలుపుతున్నారు. కొర్ర తదితర ఐదు రకాల సిరిధాన్యాల విత్తనాలు కావాలని, ఈ రబీలోనే సాగు చేస్తామని రైతులు ముందుకు వస్తుండటం విశేషం. అటవీ వ్యవసాయ పద్ధతిలో సిరిధాన్యాలు, పప్పుధాన్యాలు, నూనెగింజల సాగు, బుచ్చి పద్ధతిలో సిరిధాన్యాల శుద్ధిపై సంక్రాంతి తర్వాత తెలుగునాట రైతు శిక్షణా శిబిరం నిర్వహిస్తామని, విత్తనాలను అందుబాటులోకి తెస్తామని బాలన్ తెలిపారు.
ఇదిలాఉండగా, ఎకరంలో విత్తడానికి సరిపోయే 3 కిలోల సిరిధాన్యాల విత్తనాలను రైతులకు ఉచితంగా ఇస్తానని డా. వైఎస్సార్ కడప జిల్లాకు చెందిన రైతు శాస్త్రవేత్త విజయకుమార్ ప్రకటించారు. ఎంత మంది రైతులకైనా ఎకరానికి విత్తనం ఉచితంగా ఇస్తానని, అంతకు మించి కావాలనుకుంటే కిలో రూ. 40కి ఇస్తాననటం విశేషం.
సిరిధాన్యాల విత్తనాలు ఉచితం!
Published Tue, Jan 2 2018 5:28 AM | Last Updated on Sat, Oct 20 2018 4:36 PM
Advertisement
Advertisement
Comments
Please login to add a commentAdd a comment