ప్లేట్‌లో మెనూ మారింది | The Menu On The Plate Has Changed | Sakshi
Sakshi News home page

ప్లేట్‌లో మెనూ మారింది

Published Wed, Oct 6 2021 9:55 AM | Last Updated on Wed, Oct 6 2021 9:01 PM

The Menu On The Plate Has Changed - Sakshi

కర్నూలు: నగరంలోని బుధవారపేటకు చెందిన రామాంజనేయులు ఓ ప్రైవేటు సంస్థలో పనిచేస్తాడు. ఆయన పదేళ్లుగా షుగర్‌ జబ్బుతో బాధపడుతున్నాడు. గతంలో మెనూలో అన్నాన్ని తప్పకుండా తీసుకునేవాడు. కానీ షుగర్‌ తగ్గకపోవడంతో వైద్యుల సూచన మేరకు అన్నాన్ని పూర్తిగా మానేశాడు. దాని స్థానంలో రాగులు, జొన్నలతో చేసిన ఆహారాన్ని తింటున్నాడు. నెలరోజుల్లోనే ఆయన షుగర్‌ స్థాయిలు సాధారణ స్థితికి వచ్చాడు. ఆయనతో పాటు ఆయన భార్యకూ ఇలాగే ఆహార నియమాలు పాటిస్తున్నాడు. ఇద్దరికీ షుగర్‌ సాధారణ స్థితికి రావడంతో వైద్యులు ఆ రిపోర్ట్‌లు పరిశీలించి మందుల డోసు తగ్గించాడు. 

నంద్యాలకు చెందిన రఘురామయ్యకు ఎంతకూ షుగర్‌ నియంత్రణలోకి రాకపోవడంతో ఆహారంలో సిరిధ్యానాలు చేర్చుకున్నాడు. మూడురోజులకు ఒక సిరిధాన్యాన్ని మార్చి మార్చి వివిధ వంటకాలు తయారు చేయించుకుని తినసాగాడు. కొన్ని రోజులకే అతని షుగర్‌ నియంత్రణలోకి వచ్చేసింది. 

వీరే కాదు జిల్లాలో అనేక మంది మెనూలో అన్నాన్ని తగ్గించడమో లేదా పూర్తిగా మానేయడమో చేస్తున్నారు. కాఫీ, టీలు తాగినా చక్కెర లేకుండా తాగుతున్నారు. తమ అలవాట్లలోనూ మార్పులు చేసుకుంటున్నారు. పాతకాలం నాటి ఆహార పద్దతులైన కొర్రలు, సజ్జలు, రాగులు, సామలు, గోదుమలతో చేసిన వంటకాలను తినేందుకు ఇష్టపడుతున్నారు. జీవనశైలిలో మార్పుల వల్ల వచ్చిన జబ్బులకు ఆహారంలో మార్పులే విరుగుడని ప్రజలు భావించి ప్లేట్‌లో మెనూనే మార్చుకుంటున్నారు. 

బీపీ, షుగర్, కీళ్లనొప్పులు, ఊబకాయం, గ్యాస్ట్రబుల్, గుండెజబ్బులు వంటివన్నీ జీవనశైలిలో మార్పుల వల్ల వచ్చే జబ్బులే. జిల్లా జనాభా 45లక్షలకుపైగానే ఉంది. ఇందులో 20శాతం ప్రజలు బీపీ, షుగర్, థైరాయిడ్‌ వంటి జీవనశైలి జబ్బులతో బాధపడుతున్నారు. తలనొప్పి, కళ్లు తిరగడం, ఒళ్లునొప్పులు, నీరసం, మూత్రం ఎక్కువసార్లు వెళ్లడం వంటి లక్షణాలుండి వైద్యుల వద్దకు వెళ్లే ప్రతి ముగ్గురిలో ఇద్దరికి బీపీ, షుగర్‌ ఉన్నట్లు నిర్దారిస్తున్నారు. విజ్ఞతగల వైద్యులు ముందుగా ఆహారపు అలవాట్లు మార్చుకోవాలని, వ్యాయామం చేయాలని సూచిస్తున్నారు. అప్పటికీ వారిలో మార్పు రాకపోతే మందులకు వెళ్తున్నారు. కానీ జిహ్వాచాపల్యాన్ని చంపుకోలేని వారు మందులపైనే ఎక్కువగా ఆధారపడుతున్నారు. ఫలితంగా ప్రతి సంవత్సరం వారు వాడే మందుల డోసు పెరుగుతుందే గానీ వ్యాధి నయం కావడం లేదు. దీనికంతటికీ విరుగుడు మళ్లీ పాత రోజుల్లోని ఆహారపు అలవాట్లకు వెళ్లాల్సిందేనని అధిక శాతం భావిస్తున్నారు. ఈ మేరకు వారు ఆహారపు అలవాట్లు మార్చుకుంటున్నారు. 

బజార్‌లో రొట్టెలకు భలే గిరాకీ
ఇటీవల కాలంలో కర్నూలుతో పాటు నంద్యాల, ఆదోని లాంటి పట్టణ ప్రాంతాల్లో సాయంత్రం కాగానే జొన్నరొట్టెలు, పుల్కాలు, చపాతీలు, కర్రీలు విక్రయించే వ్యాపార కేంద్రాలు తెరుచకుంటున్నాయి.  సాయంత్రం నుంచి రాత్రి వరకు అక్కడ జొన్నరొట్టెలు కొడుతూనే ఉంటారు. వేడివేడిగా రొట్టెలు ఇలా వస్తూనే అలా విక్రయాలు జరిగిపోతున్నాయి. కర్నూలులోని గాంధినగర్, వెంకటరమణ కాలని, నరసింహారెడ్డి నగర్, రైల్వేస్టేషన్‌ రోడ్, అశోక్‌నగర్, మద్దూర్‌నగర్, నంద్యాల రోడ్డు, గణేష్‌నగర్, సి.క్యాంపు, నాగిరెడ్డి రెవిన్యూ కాలని, బుధవారపేట, శ్రీరామనగర్‌ ఇలా దాదాపు అన్ని కాలనీల్లో రొట్టెలు విక్రయించే దుకాణాలు విస్తృతంగా వెలిశాయి.  ఒక జొన్న రొట్టె, చపాతీలు ఒక్కోటి  రూ.12ల నుంచి రూ.15ల వరకు విక్రయిస్తున్నారు. వీటిలోకి కర్రీలు కావాలంటే అదనంగా రూ.10 నుంచి రూ.15లు చెల్లించాల్సి ఉంటుంది. అయితే ప్రజల అవసరాన్ని ఆసరాగా చేసుకున్న కొందరు వ్యాపారులు తక్కువ సమయంలో లాభార్జన చేసేందుకు గాను జొన్న పిండిలో బియ్యం పిండి కలిపి రొట్టెలు చేస్తున్నారు. దీనివల్ల ప్రజలు తమ ఆహారాన్ని మార్చుకున్నా ఉపయోగం ఉండటం లేదు.

రెస్టారెంట్లలోనూ మారిన మెనూలు
ప్రజల ఆహారపు అలవాట్లు మారడంతో రెస్టారెంట్లలోనూ మెనూలో మార్పులు తీసుకొచ్చారు. నగరంలో 30కి పైగా చిన్నా, పెద్దా రెస్టారెంట్లు ఉన్నాయి. ఇందులో అధిక శాతం తందూరి రోటీ, చపాతి, పుల్కాలు, జొన్న రొట్టెలు ఆర్డర్‌ ఇస్తున్నారు. అందులో ఏదో ఒక కర్రీని ఆహారంగా తీసుకుంటున్నారు. చివరగా ఒక బిర్యానిని ముగ్గురు కలిసి ఆర్డర్‌ ఇచ్చి తింటున్నారు. గతంలో ఒక్కో బిర్యానిని ఒక్కొక్కరు తినేవారు. ఇప్పుడు బిర్యాని స్థానంలో రొట్టెలు వచ్చి చేరాయి. దీంతో పాటు రెస్టారెంట్లలో రాగి ముద్ద, రాగిసంకటి, కొర్ర అన్నం కూడా వండి పెడుతున్నారు. ఐదురోడ్ల కూడలిలో కేవలం సిరిధాన్యాలతో వండిన ఆహారపదార్థాలను విక్రయించడం విశేషం.
 
సిరిదాన్యాలకు భలే గిరాకి
జీవనశైలి వ్యాధులకు సిరిదాన్యాలే మందు అని ఇటీవల పలు సామాజిక మాధ్యమాల్లో సమాచారం చక్కర్లు కొడుతోంది. దీంతో ప్రజలు కొర్రలు, సామలు, అరికెలు, సజ్జలు కొనేందుకు ముందుకు వస్తున్నారు. 40 ఏళ్ల క్రితం ఇవి పేదల ఆహారంగా ఉండేవి. అప్పట్లో ధనవంతులు మాత్రమే వరి అన్నాన్ని భుజించేవారు. ఈ కారణంగా అప్పట్లో బీపీ, షుగర్‌ జబ్బులు అధిక శాతం ధనవంతులకు మాత్రమే వచ్చేవి. ఇప్పుడు వరి అన్నం అందరికీ అందుబాటులోకి రావడంతో 30 ఏళ్లుగా ఇదే ప్రధాన ఆహారంగా మారింది. అయితే వరిదాన్యాన్ని తెల్లగా పాలిష్‌ పట్టడంతో దానిపై ఉన్న పోషకాలు పోయి పిప్పిగా మారుతోంది. దీన్ని వండుకుని తినడంతో నేరుగా గ్లూకోజ్‌ మన శరీరంలోకి వెళ్తుందని వైద్యులు చెబుతున్నారు. ఈ కారణంగా ఇప్పుడు ఆహారంపై అవగాహన పెంచుకుని అలవాట్లను మార్చుకుంటున్నారు. ప్రస్తుతం మార్కెట్‌లో జొన్నలు(రాయచూరు) రూ.55లు, కొర్రలు రూ.60లు, సామలు, అరికెలు రూ.80లకు పైగానే విక్రయిస్తున్నారు. ఇక సేంద్రీయ ఎరువులతో పండించిన సిరిదాన్యాలు కిలో రూ.110లకు పైగానే పలుకుతున్నాయి. గతంలో వీటిని కొనేవారు లేక పశువులకు పెట్టేవారంటే అతిశయోక్తి కాదు. 

ఆహారపు అలవాట్లతో వ్యాధులు దూరం
–డాక్టర్‌ జి.రమాదేవి,డైటీషియన్, కర్నూలు

గతంలో ప్రతి ఒక్కరి ఆహారంగా జొన్నరొట్టెలు, కొర్ర అన్నం ఉండేది. కూరల్లో నూనె శాతం కూడా తక్కువగా ఉండేది. పండుగల సమయంలో మాత్రమే బజ్జీలు తినేవారు. ఇప్పుడు బియ్యాన్ని ఎక్కువగా పాలిష్‌ చేయడంలో వల్ల అందులోని విటమిన్స్‌ పోతున్నాయి. కార్బొహైడ్రేట్స్‌ ఎక్కువ కావడం వల్ల స్థూలకాయం వస్తోంది. ఆకలేస్తే పిజ్జాలు, బర్గర్లు తినడం వల్ల కొవ్వు శాతం అధికమైపోయి గుండెపోటుకు దారి తీస్తోంది. పలుమార్లు కాచిన నూనెలో చేసిన బజ్జీలు తినడం, కూల్‌డ్రింక్స్, నిల్వ ఉంచిన బిస్కట్లు తినడం వల్ల క్యాన్సర్‌ వస్తోంది. వీటన్నింటికీ విరుగుడూ ఆహారంలో మార్పులే. ఈ దిశగా ప్రస్తుతం ప్రజలు ముందుకు వెళ్లడం శుభపరిమాణం.

సిరిదాన్యాలతో వ్యాధులకు చెక్‌
–డాక్టర్‌ ప్రభాకర్‌రెడ్డి, ప్రభుత్వ ఆయుర్వేద వైద్యులు, కర్నూలు

కొర్రలు, అంటుకొర్రలు, రాగులు, సజ్జలు, సామలు, అరికెలు, వరిగెలు లాంటి సిరిదాన్యాలను సక్రమంగా వినియోగిస్తే చాలా జబ్బులకు పరిష్కారం దొరుకుతుంది.  స్థూలకాయం, షుగర్, బీపీ, థైరాయిడ్, క్యాన్సర్‌ వంటి జబ్బులకు ఇదే మందు. వీటిలో పీచు పదార్థం ఎక్కువగా ఉంటుంది. వరి, గోదుమల్లో 2 శాతంలోపే పీచు ఉంటుంది, సిరిదాన్యాల్లో 6 నుంచి 8 శాతం వరకు పీచు ఉంటుంది. దీనివల్ల త్వరగా జీర్ణం గాక నిదానంగా శరీరంలోకి గ్లూకోజు విడుదల అవుతుంది. రక్తప్రసరణ మెరుగుపడుతుంది. మలబద్దకం పోతుంది. సిరిదాన్యాలతో తయారు చేసిన కషాయాలు సేవించడం వల్ల చాలా దీర్ఘకాలిక వ్యాధులు తగ్గుతాయి. సిరిదాన్యాలు తక్కువ వర్షపాతంలోనూ పండుతాయి. క్రిమిసంహారక మందులు, ఎరువులు వాడాల్సిన అవసరం లేదు. అధికారులు వీటిని ప్రోత్సహిస్తే వారికి ఉపయోగం ఉంటుంది. 

అన్నం పూర్తిగా మానేశాను
–వి. ప్రసాద్, కర్నూలు

నాకు 12 ఏళ్లుగా షుగర్‌ జబ్బు ఉంది. ఈ వ్యాధి వల్ల నేను అనేక ఇబ్బందులు పడ్డాను. చివరకు వైద్యుల సలహా మేరకు నా మెనూలో మార్పులు చేసుకున్నాను. ఇప్పుడు చాలా తక్కువ పరిమాణంలో ఆహారాన్ని తీసుకుంటున్నాను. తెల్ల అన్నాన్ని పూర్తిగా మానేశాను. జొన్నరొట్టెలు, పుల్కాలు, రాగి సంకటి వంటివి తింటున్నాను. ఈ కారణంగా ప్రస్తుతం షుగర్‌ కంట్రోల్‌లో ఉంటోంది. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement