Korra cultivation
-
కొర్రలకు ‘మద్దతు’ ఇవ్వండి
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో కొర్రల సాగును ప్రోత్సహించేలా వైఎస్ జగన్ ప్రభుత్వం చర్యలు చేపడుతోంది. రైతులకు భరోసా కల్పించేలా కొర్రలను మద్దతు ధర పంటల జాబితాలో చేర్చాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరింది. ఇప్పటివరకు చిరుధాన్యాల్లో రాగులు, జొన్నలు, సజ్జలు, మొక్కజొన్నకు మాత్రమే కేంద్ర ప్రభుత్వం మద్దతు ధర ప్రకటిస్తోంది. అయితే అనంతపురం, కడప, సత్యసాయి, అన్నమయ్య జిల్లాల్లో ఎక్కువగా కొర్రలను సాగు చేస్తున్నారు. మంచి దిగుబడులు రావడం, మార్కెట్లో డిమాండ్ ఉండటంతో రైతుకు లాభసాటిగా మారింది. మరోవైపు ప్రభుత్వం కూడా సాంప్రదాయ పంటల నుంచి చిరుధాన్యాల సాగువైపు రైతులను నడిపించేందుకు ప్రత్యేక కార్యాచరణ చేపట్టింది. ఇటీవల ఢిల్లీలో జరిగిన జాతీయ స్థాయి పౌరసరఫరాల శాఖ కాన్ఫరెన్స్‌లో.. కొర్రలను కూడా మద్దతు ధరకు కొనుగోలు చేసేలా వెసులుబాటు కల్పించాలని కేంద్రానికి ఏపీ ప్రభుత్వం విజ్ఞప్తి చేసింది. దీనిపై కేంద్రం సానుకూలంగా స్పందించింది. దీంతో ఏపీ పౌరసరఫరాల సంస్థ సమగ్ర వివరాలతో కొర్రలకు మద్దతు ధర కోసం ప్రతిపాదనలు పంపే పనిలో నిమగ్నమైంది. పీడీఎస్ ద్వారా పంపిణీకి చర్యలు.. రాష్ట్రంలోని 1.47 కోట్ల రైస్ కార్డుదారులకు పౌష్టికాహారాన్ని అందించే లక్ష్యంతో సీఎం జగన్ అడుగులు వేస్తున్నారు. రెండు నెలల నుంచి రాయలసీమ, ఉత్తరాంధ్రలోని 13 జిల్లాల్లో రాగులు, జొన్నలను పంపిణీ చేస్తున్నారు. కార్డుదారుల ఐచ్చికం మేరకు 2 కేజీల బియ్యం బదులు వీటిని అందిస్తుండగా.. ప్రజల నుంచి విశేష స్పందన లభిస్తోంది. రాయలసీమ, ఉత్తరాంధ్రలో రాగులను ఎక్కువగా వినియోగిస్తుంటారు. దీంతో పీడీఎస్‌లో జొన్నల కంటే రాగులకు ఎక్కువ డిమాండ్ ఏర్పడింది. ఇప్పటికే 8 వేల టన్నులకు పైగా రాగులను పంపిణీ చేశారు. తాజాగా కొర్రలను కూడా పీడీఎస్ జాబితాలో చేర్చాలని ప్రభుత్వం భావిస్తోంది. స్థానికంగా రైతుల నుంచే కొనుగోలు చేసి తిరిగి ప్రజలకు సరఫరా చేసేందుకు ప్రణాళిక రూపొందించింది. గ్రామాల్లో సర్వే.. మరోవైపు రాష్ట్రంలోని అన్ని మునిసిపాల్టీలు, కార్పొరేషన్లు, నగర పంచాయతీల్లో ఫోర్టిఫైడ్ గోధుమ పిండిని పంపిణీ చేస్తున్నారు. కార్డుకు కిలో చొప్పున రూ.16కు ప్రత్యేక ప్యాకింగ్‌లో దీనిని అందిస్తున్నారు. గతంలో గ్రామీణ ప్రాంతాల్లో గోధుమ పిండి వినియోగం తక్కువ ఉండటంతో.. కొత్తగా సర్వే చేపట్టి వచి్చన ఫీడ్‌బ్యాక్ ప్రకారం పంపిణీకి నిర్ణయం తీసుకోనున్నారు. అయితే బియ్యం బదులుగా కూడా గోధుమ పిండిని తీసుకునే వెసులుబాటు కల్పించి.. ఇప్పుడిచ్చే ధర కంటే తక్కువకే సరఫరా చేసే యోచనలో పౌరసరఫరాల శాఖ ఉంది. పౌష్టికాహారం తప్పనిసరి ఆరోగ్య రక్షణ దృష్ట్యా ప్రతి ఒక్కరూ బలవర్థక ఆహారం తీసుకోవాల్సిన అవసరముంది. అందుకే పేదలకు పీడీఎస్ ద్వారా పంపిణీ చేసే నిత్యావసరాల్లో చిరుధాన్యాలను అందిస్తున్నాం. ఇప్పటివరకు రాగులు, జొన్నలు ఇచ్చాం. ఇకపై కొర్రలను కూడా పంపిణీ చేసే ఆలోచన చేస్తున్నాం. దీని ద్వారా రైతులకు, వినియోగదారులకు లాభం కలుగుతుంది. ఫోర్టిఫైడ్ గోధుమ పిండిని గ్రామీణ ప్రాంతాల్లోని కార్డుదారులు కూడా కోరుకుంటే అందించేందుకు సిద్ధంగా ఉన్నాం. – హెచ్.అరుణ్ కుమార్, కమిషనర్, పౌరసరఫరాల శాఖ -
‘చిరు’కు జైకొడుతున్నారు.. కారణాలు ఇవే! ..మంచి పరిణామం
సాక్షి, అమరావతి: కరోనా కారణంతో ఆహారపు అలవాట్లలో బాగా మార్పులొచ్చాయి. ఎన్నో పోషక విలువలున్న చిరుధాన్యాలు, వాటి అనుబంధ ఉత్పత్తుల వినియోగం రాష్ట్రంలో బాగా పెరిగింది. సంప్రదాయ అల్పాహారాలైన ఉప్మా–పెసరట్టు, మసాలా దోశ, ఇడ్లీ, ఊతప్పం తదితరాల స్థానంలో ఇప్పుడు చిరుధాన్యాలతో తయారుచేసే కొర్రల ఉప్మా, పుట్టగొడుగుల దోశ, కొర్ర ఇడ్లీ, రాగి ఇడ్లీ, జొన్నట్టు ఉప్మా, కొర్ర పాయసం, రాగి జావ వంటివి వచ్చి వచ్చాయి. ఇది సేంద్రీయ వ్యవసాయ రైతులో లేక ప్రకృతి సేద్యం చేస్తున్న వారో చెబుతోంది కాదు.. కార్పొరేట్ సంస్థలే స్పష్టంచేస్తున్న వాస్తవం. 2020 మార్చి నుంచి ఇప్పటివరకు చేసిన ఓ సర్వే ప్రకారం.. లాక్డౌన్ అనంతర కాలంలో పోషక విలువలున్న ఆహారానికి ఎక్కడలేని గిరాకీ పెరిగింది. కరోనా సమయంలో ఇంటి వద్ద ఉన్న చిన్నాపెద్ద అందరూ చిరుతిళ్ల వైపు ఎక్కువ మొగ్గు చూపారు. ప్యాక్ చేసిన చిరు ధాన్యాలు, వాటి అనుబంధ ఉత్పత్తులపై ఆసక్తి చూపారు. దీన్ని ఆసరా చేసుకున్న వాటి తయారీ సంస్థలు, పేరున్న మల్టీచైన్ కంపెనీలు చిరుధాన్యాలతో తయారుచేసిన రెడీ టూ కుక్, రెడీ టూ ఈట్ పదార్థాలపై ఎక్కువ దృష్టిపెట్టాయి. కొత్త పదార్థాలను మార్కెట్లోకి ప్రవేశపెట్టాయి. లాక్డౌన్ అనంతరం కూడా చిరుధాన్యాల వినియోగం పెరిగింది. అల్పాహారంలో ఎక్కువ వినియోగం ప్రస్తుతం చిరు ధాన్యాలను ఎక్కువగా అల్పాహారంలో తీసుకుంటున్నట్లు అమెరికాకు చెందిన కెల్లాగ్స్ ఫ్రూట్ లూప్స్ కంపెనీ వెల్లడించింది. కార్న్‌ఫ్లేక్స్ మాదిరే చిరు ధాన్యాల ఫ్లేక్స్ ప్రస్తుతం మార్కెట్లో బాగా దొరుకుతున్నాయి. వీటిని పాలల్లో కలుపుకుని తీసుకుంటున్నారు. ఇక జొన్న రవ్వ ఇడ్లీలు, కొర్ర, ఆండ్రు కొర్రలు, రాగి ఇడ్లీల పిండిని ప్యాక్‌చేసి రెడీ టూ కుక్‌గా విక్రయిస్తున్నారు. అటుకులు సరేసరి. చిరుధాన్యాలతో తయారైన పరోటా, చపాతీలు.. వాటిల్లోకి కూరలు కూడా ప్యాకింగ్‌లో దొరుకుతున్నాయి. ఉప్మా, ఇడ్లీ, ఓట్స్, దోశ మిక్స్ వంటివీ తయారుచేస్తున్నాయి. మరోవైపు.. దేశవ్యాప్తంగా చిరుధాన్యాలు, ఓట్స్ వ్యాపారం గత ఏడాది కాలంలో 300 మిలియన్ డాలర్లకు చేరింది. ఏడాది కిందట 11–12 శాతంగా ఉన్న వీటి వినియోగం ఇప్పుడు 18–20 శాతానికి పెరిగింది. చిరుధాన్యాలతో తయారుచేసిన ఉప్మా రవ్వ ఇప్పుడు ఎక్కువగా అమ్ముడవుతోంది. ఇంటికి తీసుకువెళ్లి నీళ్లలో ఉడికించి తినడమే. -
కొర్ర సాగు మేలు
నూనెపల్లె: నిన్నటి దాకా వర్షాభావ పరిస్థితులు.. నేడు జోరు వర్షాలు.. ఈ పరిస్థితుల్లో పంటలు ఎండిపోయి నష్టపోయిన రైతులు ప్రత్యామ్నాయం వైపు చూస్తున్నారు. మంచి వర్షాలు పడటంతో కొర్ర సాగుకు ఇది అనువైన సమయమని వ్యవసాయ శాస్త్రవేత్తలు చెబుతున్నారు. జిల్లాలో ఈ పంట ఇప్పటికే 5,728 హెక్టార్లలో సాగైంది. స్వల్పకాలంలో దిగుబడి రావడం, పెట్టుబడి తక్కువగా ఉండటం, నీటి ఎద్దడిని తట్టుకోవడంతో ఈ పంట సాగుపై రైతులు మక్కువ చూపుతున్నారు. ప్రస్తుతం మార్కెట్లో ధర క్వింటా రూ. రూ. 1200 నుంచి రూ. 1500 మధ్య పలుకుతోంది. కొర్ర సాగుకు 350 మి.మీ నుంచి 400 మి.మీ వర్షపాతం సరిపోతుందని, రెండు లేదంటే మూడు తడులిస్తే పంట చేతికొస్తుందని నంద్యాల వ్యవసాయ పరిశోధన కేంద్రం.. చిరుధాన్యాల విభాగం శాస్త్రవేత్త డాక్టర్ సి.వి. చంద్రమోహన్ రెడ్డి (08514-248264)తెలిపారు. పంట ఎలా సాగు చేసుకోవాలో ఆయన వివరించారు. అనూకూలమైన నేలలు.. తేలిక నేలలు, బరువైన నల్లరేగడి నేలలు కొర్ర సాగుకు అనుకూలం. నల్లరేగడి నేలల్లో నీరు బయటకు పోయేందుకు ఏర్పాటు చేసుకోవాలి. నీరు నిలిచి ఉంటే పంటకు తెగుళ్లు ఆశించే ప్రమాదం ఉంది. విత్తే పద్ధతి: ఎకరాకు 2 నుంచి 3 కేజీల విత్తనం సరిపోతుంది. వరుసల మధ్య 25 సెంమీలు ఉం డేలా చూసుకోవాలి. మొక్కల మధ్య 7.5 నుంచి 10.0 సెంటీ మీటర్లు ఎడమ ఉండాలి. విత్తనాలు ఎక్కువ లోతులో వేయకూడదు. అలా చేస్తే పోషక విలువలు పంటకు అందవు. చెదల నివారణకు దుక్కిలో ఫోలిడాల్ పొడి మందును (2 శాతం) ఎకరాకు 10 -12 కిలో గ్రాములు చొప్పున వేయాలి. విత్తనశుద్ధి: కిలో విత్తనాన్ని కాప్టాన్ లేదా థెరమ్ 3 గ్రాములు లేదా కార్బండజమ్ 2-3 గ్రాములతో శుద్ధి చేసుకోవాలి. అంతర పంటలు.. కొర్రలో 5:1 నిష్పత్తిలో అంతర పంటను సాగు చేసుకోవచ్చు. సాళ్లకు సాళ్లు మధ్య దూరం ఉండడంతో శనగ, జొన్న, కుసుమ పంటలు వేసుకునేందుకు ఉపయోగపడుతుంది.