నూనెపల్లె: నిన్నటి దాకా వర్షాభావ పరిస్థితులు.. నేడు జోరు వర్షాలు.. ఈ పరిస్థితుల్లో పంటలు ఎండిపోయి నష్టపోయిన రైతులు ప్రత్యామ్నాయం వైపు చూస్తున్నారు. మంచి వర్షాలు పడటంతో కొర్ర సాగుకు ఇది అనువైన సమయమని వ్యవసాయ శాస్త్రవేత్తలు చెబుతున్నారు. జిల్లాలో ఈ పంట ఇప్పటికే 5,728 హెక్టార్లలో సాగైంది. స్వల్పకాలంలో దిగుబడి రావడం, పెట్టుబడి తక్కువగా ఉండటం, నీటి ఎద్దడిని తట్టుకోవడంతో ఈ పంట సాగుపై రైతులు మక్కువ చూపుతున్నారు.
ప్రస్తుతం మార్కెట్లో ధర క్వింటా రూ. రూ. 1200 నుంచి రూ. 1500 మధ్య పలుకుతోంది. కొర్ర సాగుకు 350 మి.మీ నుంచి 400 మి.మీ వర్షపాతం సరిపోతుందని, రెండు లేదంటే మూడు తడులిస్తే పంట చేతికొస్తుందని నంద్యాల వ్యవసాయ పరిశోధన కేంద్రం.. చిరుధాన్యాల విభాగం శాస్త్రవేత్త డాక్టర్ సి.వి. చంద్రమోహన్ రెడ్డి (08514-248264)తెలిపారు. పంట ఎలా సాగు చేసుకోవాలో ఆయన వివరించారు.
అనూకూలమైన నేలలు..
తేలిక నేలలు, బరువైన నల్లరేగడి నేలలు కొర్ర సాగుకు అనుకూలం. నల్లరేగడి నేలల్లో నీరు బయటకు పోయేందుకు ఏర్పాటు చేసుకోవాలి. నీరు నిలిచి ఉంటే పంటకు తెగుళ్లు ఆశించే ప్రమాదం ఉంది.
విత్తే పద్ధతి: ఎకరాకు 2 నుంచి 3 కేజీల విత్తనం సరిపోతుంది. వరుసల మధ్య 25 సెంమీలు ఉం డేలా చూసుకోవాలి. మొక్కల మధ్య 7.5 నుంచి 10.0 సెంటీ మీటర్లు ఎడమ ఉండాలి. విత్తనాలు ఎక్కువ లోతులో వేయకూడదు. అలా చేస్తే పోషక విలువలు పంటకు అందవు. చెదల నివారణకు దుక్కిలో ఫోలిడాల్ పొడి మందును (2 శాతం) ఎకరాకు 10 -12 కిలో గ్రాములు చొప్పున వేయాలి.
విత్తనశుద్ధి: కిలో విత్తనాన్ని కాప్టాన్ లేదా థెరమ్ 3 గ్రాములు లేదా కార్బండజమ్ 2-3 గ్రాములతో శుద్ధి చేసుకోవాలి.
అంతర పంటలు..
కొర్రలో 5:1 నిష్పత్తిలో అంతర పంటను సాగు చేసుకోవచ్చు. సాళ్లకు సాళ్లు మధ్య దూరం ఉండడంతో శనగ, జొన్న, కుసుమ పంటలు వేసుకునేందుకు ఉపయోగపడుతుంది.
కొర్ర సాగు మేలు
Published Fri, Aug 29 2014 1:15 AM | Last Updated on Mon, Oct 1 2018 2:03 PM
Advertisement