ఊపందుకున్న వరి నాట్లు
పరిగి: ఇటీవల కురిసిన వర్షాలతో రైతులు వరి నాట్లు వేసుకోవడంలో నిమగ్నమయ్యారు. బోరు బావుల్లో నీరు సమృద్ధిగా ఉన్న రైతులు ఇప్పటికే వరి నాట్లు వేసుకోగా.. నీరు తక్కువగా ఉన్న రైతులతో పాటు చెరువు ఆయకట్టు రైతులు ఇంకా వరి నాట్లు వేసుకోలేదు. ప్రస్తుతం వర్షాలు కురుస్తుండటంతో ఆయా రైతులు సైతం నాట్లు వేసుకుంటున్నారు. కాగా.. అందుబాటులో వరి నారు లేకపోవడంతో సమస్యగా పరిణమించింది. ప్రతీసారి వానలు కురిసే సమయానికి రైతులు నారు సిద్ధం చేసుకునేవారు. కానీ ఈసారి కరెంటు సమస్య, బోరుబావుల్లో నీరు అడగంటడం తదితర కారణాలతో ఎక్కువ శాతం రైతులు వరి నారు పోసుకోలేకపోయారు. చాలామంది రైతులు ఇప్పుడు వరి నారు పోసుకోవాల్సి వస్తోంది.
దీంతో పంట వెనకబడే ప్రమాదం ఉందని వారు ఆందోళనకు గురవుతున్నారు. వారంరోజులుగా కురిసిన వర్షాలకు చెరువులు నిండు కుండలను తలపిస్తున్నాయి. దీంతో ఆయకట్టు రైతులు వరినాట్లు వేయటంలో బిజీగా మారారు.
ఉత్సాహాన్ని నింపిన అనుకూల వర్షపాతం
ఈ ఏడాది వర్షాలు కాస్త ఆలస్యమైనప్పటికీ ఇటీవల సరిపడా కురవటంతో రైతుల్లో ఉత్సాహాన్ని నింపింది. జూన్‌లో సాధారణ వర్షపాతం 117 మిల్లీ మీటర్లు కాగా.. 17.4 మిల్లీ మీటర్ల వర్షపాతం మాత్రమే నమోదయ్యింది. జూలై సాధారణ వర్షపాతం 260 మి.మీ. కాగా 140 మి.మీ.కురిసింది. ఆగస్టులో సాధారణ వర్షపాతం 201 మి.మీ. కాగా 419 మీల్లీ మీటర్ల వర్షపాతం కురిసింది. దీంతో మూడు నెల్లల్లో కురవాల్సిన సాధారణ వర్షపాతం నమోదయ్యింది. జూన్, జూలై, ఆగస్టు మా సాల్లో కురవాల్సిన సాధారణ వర్షపాతం 578 మిల్లీ మీటర్లు కాగా ఆగస్టు 31 నాటి సరిగా అంతే.. అంటే 578 మిల్లీ మీటర్ల వర్షం నమో దు కావటం గమనార్హం.. పరిగి ప్రాంతంలో ఇటీవల కురిసిన భారీ వర్షాలకు కొంత మేర పంటలు పాడైనప్పటికీ ఎక్కువ శాతం మేలే జరిగిందని రైతులు పేర్కొంటున్నారు.