వర్ష హర్షం
- మేలుచేసిన అకాల వర్షాలు
- అకాల వానలతో జలాశయాల్లో
- పెరిగిన నీటిమట్టాలు ఖరీఫ్‌పై రైతుల్లో ఆశలు
చోడవరం, న్యూస్‌లైన్: ఖరీఫ్‌పై రైతుల్లో ఆశలు చిగురిస్తున్నాయి. అనుకోకుండా కురిసిన వర్షాలు పంటల సన్నద్ధతకు అన్నదాతలను ఉపకరించాయి. తొలకరి వర్షాలు ముందే కురవడంతో భూమి తడిబారింది. జలాశయాల్లో కూడా నీరు భారీగా వచ్చి చేరడంతో రైతులు కొంత ఊరట చెందారు. ఏప్రిల్, మే నెలల్లో ఎండలు మండిపోవడంతో జలాశయాల్లో నీటిమట్టాలు తగ్గాయి.
సాగునీటి చెరువు ఎండిపోయాయి. గతేడాది అతివృష్టి కారణంగా సాగునీటి వనరులు కళకళలాడాయి. ఖరీఫ్‌కు ఇబ్బంది లేకుండా పోయింది. ఈ ఏడాది తొలకరి జల్లులుపైనే ఖరీఫ్ సాగుకు రైతులు ఆశలు పెట్టుకున్నారు. వారం రోజులుగా అడపాదడపా వర్షాలు పడుతున్నాయి. ఇప్పటికే మెట్ట ప్రాంతాల్లో వేరుశనగ,ఇతర పంటలకు ఏరువాక జోరుగా సాగుతోంది. వరి నారుపోతలకు దుక్కులు చేపడుతున్నారు.
పల్లపు ప్రాంతాలు, జలాశయ ఆయకట్టు రైతులు కూడా మరో వారంలో నారుపోతలకు మడులు సిద్ధం చేసుకుంటున్నారు. జిల్లాలోని పెద్దేరు, కోనాం, రైవాడ, తాండవ, కల్యాణపులోవ జలాశయాల్లో నీటి మట్టాలు ఆశాజనకంగా ఉన్నాయి. జిల్లాలో అత్యధికంగా వరి,చెరకు సాగుచేసే చోడవరం, మాడుగుల నియోజకవర్గాల పరిధిలో పెద్దేరు, కోనాం, రైవాడ, కల్యాణపులోవ వంటి పెద్ద రిజర్వాయర్లు, గొర్రిగెడ్డ, పాలగెడ్డ, ఉరక గెడ్డ వంటి మినీ రిజర్వాయర్లు ఉన్నాయి. ప్రస్తుతం కురుస్తున్న వర్షాలతో ఇవన్నీ నీటితో కళకళలాడుతున్నాయి.
గత నెలలో ఎండల తీవ్రతకు ట్యాంక్ బండ్‌లలో నీటి మట్టాలు తగ్గాయి. ప్రస్తుతం జలాశయాల క్యాచ్‌మెంట్ ఏరియాతోపాటు ఎగువ ఏజెన్సీ ప్రాంతాల్లో భారీగా వర్షాలు కురవడంతో రిజర్వాయర్లలో నీటి మట్టాలు గణనీయంగా పెరిగాయి. రైవాడ రిజర్వాయరు రబీ పంటకు కూడా 150క్యూసెక్కుల చొప్పున నీరు విడుదల చేయగా ఖరీప్‌కు కూడా నిండుకుండలా ఉంది. రైవాడ క్యాచ్‌మెంట్‌లో తాజాగా 110 మిల్లీమీటర్లు వర్షం కురిసింది.
కోనాంలో 78మిల్లీమీటర్లు, పెద్దేరులో 40 మిల్లీమీటర్లు, కల్యాణపులోవలో 27 మిల్లీమీటర్లు వర్షం కురిసింది. క్యాచ్‌మెంట్‌లో కురిసిన వర్షానికి తోడు ఎగువ కొండల్లో కుసిరిన భారీ వర్షాలు కారణంగా అన్ని రిజర్వాయర్లలోనూ ఇన్‌ప్లో బాగా పెరిగి నీటి మట్టాలు పైకి వచ్చాయి. నిండుకుండల్లా జలాశయాలు ఉండటంతో ఖరీప్ పంటకు నీటి కొరత ఉండదని రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.