సాక్షి, అమరావతి: రాష్ట్రంలో కొర్రల సాగును ప్రోత్సహించేలా వైఎస్ జగన్ ప్రభుత్వం చర్యలు చేపడుతోంది. రైతులకు భరోసా కల్పించేలా కొర్రలను మద్దతు ధర పంటల జాబితాలో చేర్చాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరింది. ఇప్పటివరకు చిరుధాన్యాల్లో రాగులు, జొన్నలు, సజ్జలు, మొక్కజొన్నకు మాత్రమే కేంద్ర ప్రభుత్వం మద్దతు ధర ప్రకటిస్తోంది. అయితే అనంతపురం, కడప, సత్యసాయి, అన్నమయ్య జిల్లాల్లో ఎక్కువగా కొర్రలను సాగు చేస్తున్నారు. మంచి దిగుబడులు రావడం, మార్కెట్‌లో డిమాండ్ ఉండటంతో రైతుకు లాభసాటిగా మారింది.
మరోవైపు ప్రభుత్వం కూడా సాంప్రదాయ పంటల నుంచి చిరుధాన్యాల సాగువైపు రైతులను నడిపించేందుకు ప్రత్యేక కార్యాచరణ చేపట్టింది. ఇటీవల ఢిల్లీలో జరిగిన జాతీయ స్థాయి పౌరసరఫరాల శాఖ కాన్ఫరెన్స్‌లో.. కొర్రలను కూడా మద్దతు ధరకు కొనుగోలు చేసేలా వెసులుబాటు కల్పించాలని కేంద్రానికి ఏపీ ప్రభుత్వం విజ్ఞప్తి చేసింది. దీనిపై కేంద్రం సానుకూలంగా స్పందించింది. దీంతో ఏపీ పౌరసరఫరాల సంస్థ సమగ్ర వివరాలతో కొర్రలకు మద్దతు ధర కోసం ప్రతిపాదనలు పంపే పనిలో నిమగ్నమైంది.
పీడీఎస్ ద్వారా పంపిణీకి చర్యలు..
రాష్ట్రంలోని 1.47 కోట్ల రైస్ కార్డుదారులకు పౌష్టికాహారాన్ని అందించే లక్ష్యంతో సీఎం జగన్ అడుగులు వేస్తున్నారు. రెండు నెలల నుంచి రాయలసీమ, ఉత్తరాంధ్రలోని 13 జిల్లాల్లో రాగులు, జొన్నలను పంపిణీ చేస్తున్నారు. కార్డుదారుల ఐచ్చికం మేరకు 2 కేజీల బియ్యం బదులు వీటిని అందిస్తుండగా.. ప్రజల నుంచి విశేష స్పందన లభిస్తోంది.
రాయలసీమ, ఉత్తరాంధ్రలో రాగులను ఎక్కువగా వినియోగిస్తుంటారు. దీంతో పీడీఎస్‌లో జొన్నల కంటే రాగులకు ఎక్కువ డిమాండ్ ఏర్పడింది. ఇప్పటికే 8 వేల టన్నులకు పైగా రాగులను పంపిణీ చేశారు. తాజాగా కొర్రలను కూడా పీడీఎస్ జాబితాలో చేర్చాలని ప్రభుత్వం భావిస్తోంది. స్థానికంగా రైతుల నుంచే కొనుగోలు చేసి తిరిగి ప్రజలకు సరఫరా చేసేందుకు ప్రణాళిక రూపొందించింది.
గ్రామాల్లో సర్వే..
మరోవైపు రాష్ట్రంలోని అన్ని మునిసిపాల్టీలు, కార్పొరేషన్లు, నగర పంచాయతీల్లో ఫోర్టిఫైడ్ గోధుమ పిండిని పంపిణీ చేస్తున్నారు. కార్డుకు కిలో చొప్పున రూ.16కు ప్రత్యేక ప్యాకింగ్‌లో దీనిని అందిస్తున్నారు. గతంలో గ్రామీణ ప్రాంతాల్లో గోధుమ పిండి వినియోగం తక్కువ ఉండటంతో.. కొత్తగా సర్వే చేపట్టి వచి్చన ఫీడ్‌బ్యాక్ ప్రకారం పంపిణీకి నిర్ణయం తీసుకోనున్నారు. అయితే బియ్యం బదులుగా కూడా గోధుమ పిండిని తీసుకునే వెసులుబాటు కల్పించి.. ఇప్పుడిచ్చే ధర కంటే తక్కువకే సరఫరా చేసే యోచనలో పౌరసరఫరాల శాఖ ఉంది.
పౌష్టికాహారం తప్పనిసరి
ఆరోగ్య రక్షణ దృష్ట్యా ప్రతి ఒక్కరూ బలవర్థక ఆహారం తీసుకోవాల్సిన అవసరముంది. అందుకే పేదలకు పీడీఎస్ ద్వారా పంపిణీ చేసే నిత్యావసరాల్లో చిరుధాన్యాలను అందిస్తున్నాం. ఇప్పటివరకు రాగులు, జొన్నలు ఇచ్చాం. ఇకపై కొర్రలను కూడా పంపిణీ చేసే ఆలోచన చేస్తున్నాం. దీని ద్వారా రైతులకు, వినియోగదారులకు లాభం కలుగుతుంది. ఫోర్టిఫైడ్ గోధుమ పిండిని గ్రామీణ ప్రాంతాల్లోని కార్డుదారులు కూడా కోరుకుంటే అందించేందుకు సిద్ధంగా ఉన్నాం.
– హెచ్.అరుణ్ కుమార్, కమిషనర్, పౌరసరఫరాల శాఖ
కొర్రలకు ‘మద్దతు’ ఇవ్వండి
Published Mon, Jul 10 2023 4:49 AM | Last Updated on Mon, Jul 10 2023 4:49 AM
Advertisement
Comments
Please login to add a commentAdd a comment