ఆదిలాబాద్ అగ్రికల్చర్ : అవగాహన లేమి.. పంటలను కాపాడుకోవాలనే ఆతృతతో కొందరు రైతులు ఇష్టానుసారంగా ఎరువులు వేస్తుంటారు. ఒకరిని చూసి మరొకరు.. కంపెనీల ప్రచారార్భాటం మాయలో పడి అధిక మోతాదులో ఎరువులు వినియోగిస్తుంటారు. అలా చేయడం వల్ల రైతులు ఆర్థికంగా, దిగుబడుల పరంగా నష్టపోవాల్సి వస్తుందని ఆదిలాబాద్ ఏరువా కో ఆర్డినేటర్, శాస్త్రవేత్త డాక్టర్ రాజశేఖర్ వివరించారు.
ప్రస్తుతం వర్షాలు కురవకపోవడం వల్ల అధిక ఉష్ణోగ్రతతో రసం పీల్చే పురుగులు, పేనుబంక, తామర పురుగులు, తెల్లదోమ, పత్తి, సోయాబీన్ వంటి తెగుళ్ల బారిన పడుతున్నాయి. అధికంగా ఎరువులు వాడడం వల్ల మొక్కలు త్వరగా పచ్చబడి పురుగులకు ఆహారంగా మారుతాయి. హార్మోన్లు వాడడం వల్ల చెట్టుపైన చిగురు ఆకులు పసుపు రంగులోకి మారడం, మాడిపోవడం జరుగుతుంది.
పత్తి పంటలో..
రైతులు పత్తి విత్తుకునే సమయంలో గానీ, విత్తిన 10 నుంచి 15 రోజుల తర్వాత గానీ ఎకరానికి 50 కిలోల డీఏపీ వేయాలి. ఒకవేళ డీఏపీ అందుబాటులో లేకుంటే సింగిల్ సూపర్ ఫాస్పెట్ ఎకరానికి మూడు బస్తాలు వేయాలి. ఇది మొదటి దఫా.. ప్రతీ 20 రోజులకోసారి 15 కిలోల యూరియా, 10 నుంచి 15 కిలోల పొటాష్ కలిపి ఒక ఎకరం చొప్పున వేసుకోవాలి. ఇలా నాలుగైదుసార్లు వేయడం వల్ల మొక్కలో పెరుగుదల వస్తుంది. పురుగు పట్టదు.
రైతు చేసే పొరపాట్లు..
పత్తి రైతులు సాధారణంగా మొత్తం యూరియా 50కిలోలు ఒకేసారి వేసేస్తారు. డీఏపీని రెండోసారి వేస్తారు. 20-20-0, యూరియా కలిపి వేస్తారు. ఇలా వేయడం వల్ల మొక్కల్లో పెరుగుదల శక్తి నశిస్తుంది. చీడపీడలు వస్తాయి.
సోయాబీన్, ఇతర పంటల్లో..
సోయాబీన్ విత్తే సమయంలో ఎకరానికి ఎస్‌ఎస్‌పీ మూడు బస్తాలు ఎకరం చొప్పున నేలలో కలపాలి. విత్తనం వేసిన పక్షం రోజుల తర్వాత డీఏపీ+పొటాష్ 25 కిలోల విశ్రమాన్ని కలిపి వేయాలి. ఇలా వేసిన 30 రోజుల తర్వాత పంట పెరుగుదల స్థితి అవసరాన్ని బట్టి 15 కిలోల యూరియా వేయాలి. కందులు, మినుములు, పెసర, జొన్న పంటలకు విత్తుకునే సమయంలో ఏడీఏ 50 కిలోలు ఎకరం చొప్పున వేస్తే సరిపోతోంది.
రసాయన ఎరువులపైనే ఆధారపడొద్దు
మొత్తంగా రసాయన ఎరువులపైనే ఆధారపడితే చాలా ప్రమాదం. ఇవి భూ సారాన్ని దెబ్బతీసి నేలను నిర్జీవంగా తయారు చేస్తాయి. భూమిలో నీరు+సూక్ష్మ పోషకాల వృద్ధి, భూమిని గుల్లగా మార్చే వానపాములు, ఇతర సేంద్రియ సూక్ష్మజీవులు రసాయన పిచికారీ వల్ల అంతమై పంటలకు చాలా నష్టం వాటిల్లుతుంది. నేలలో 30శాతం సేంద్రియ ప దార్థం ఉండి మిగితా 70శాతం రసాయన ఎరువులు వాడినా పరవాలేదు.
కానీ మొత్తం రసాయనాలు అంటే మొదటికే మోసం. పంటలు పెరగాలని పురుగుల మందులను మార్చి మార్చి కొట్టడం వల్ల పురుగులకు రోగ నిరోధక శక్తి పెరిగే అవకాశం ఉంది. రసాయన పురుగు మందులు కొడితే మొ క్క నిగనిగలాడడంతోపాటు లేతగా మారుతుందని, ఆకులు పచ్చగా ఏర్పడి మొక్క పెరుగుతుందనే నమ్మకాల్ని తీసేయా లి. మోనోక్రోటోపాస్, కాన్ఫిడార్, ప్రైడ్ లాంటివి పురుగు మందులు మాత్రమే. ఇవి పంట పెరుగుదలకు ఏమాత్రం దోహదం చేయవు. వీటిని అవసరానికి మించి వాడొద్దు. పురుగుమందులు, ఎరువుల వాడకంపై వ్యవసాయ, వ్యవసాయ విస్తరణ అధికారులు, శాస్త్రవేత్తలను సంప్రదించాలి.
ఏ ఎరువులో ఏముందంటే.. ఎరువుల్లో రెండు రకాలు..
సూటి ఎరువులు : ఈ ఎరువు చాలా ముఖ్యమైనది. ఇందులోనూ యూరియా, పొటాష్, సూపర్ అనే రకాలున్నాయి. వీటితోపాటు సహజమైన సేంద్రియ ఎరువులూ వాడొచ్చు. సూటి ఎరువుల్లోని 100 కిలోల యూరియాలో నత్రజని 46శాతం, పొటాష్‌లో నత్రజని 60శాతం, సూపర్, డీఏపీ(డైఅమోనియం పాస్ఫెట్)లో నత్రజని 18 శాతం, భాస్వరం 46 శాతం ఉంటాయి. వీటిపై రైతులకు అవగాహన లేక ఫలనా యూరియా, డీఏపీ వేస్తేనే పంట బాగుంటుందనే అపోహలు పడుతుంటారు.
నిజానికి నాగార్జున, క్రిప్కో, ఇఫ్కో, ఆర్‌ఎలెఫ్, ఐపీఎల్, ఎఫ్‌సీఆర్, కేపీఆర్ ఇలా రకరకాల కంపెనీలు యూరియా, డీఏపీలు తయారు చేస్తున్నాయి. కానీ ఏ రకం కంపెనీ డీఏపీ, యూరియాలోనైనా నత్రజనిస మపాళ్లలో ఉంటుంది. మొక్కకు నత్రజని మూలపదార్థం. కాబట్టి ఏ కంపెనీ యూరియా వేసినా అదే రకమైన రసాయనిక స్థితి ఉంటుంది. ఎరువుల కంపెనీల ఉత్పత్తి, సామర్థ్యం, వినియోగదారుల అవసరాన్ని బట్టి ప్రభుత్వం రకరకాల కంపెనీలకు జిల్లాల వారీగా కోటా ఇస్తుంది. కొరత ఉన్న ఎరువు మంచిదనే భావన సరికాదు. ప్రభుత్వం గుర్తించిన ఏ కంపెనీ ఎరువైనా వాడవచ్చు.
మిశ్రమ ఎరువులు : మిశ్రమ ఎరువుల విషయానికొస్తే 20-20-0-13, 28-28-0, 14- 35-14 రకాలు ఉన్నాయి. ఈ మూడింటిలో వరుసగా మొదటి అంకె నత్రజని, రెండో అంకె భాస్వరం, మూడోది పాస్ఫరస్‌ల మిశ్రమం. ఏది ఎంత కలిపి ఉన్నాయనే ఫార్ములానే ఇది. డీఏపీ ఎరువు వేసిన రైతులు కాంప్లెక్స్ ఎరువులు వేయాల్సిన పనిలేదు.
ఎరువులు మోతాదు మించొద్దు..
Published Fri, Aug 22 2014 12:41 AM | Last Updated on Fri, Aug 17 2018 2:53 PM
Advertisement
Advertisement