సరైన యాజమాన్య పద్ధతులతో శ్రీవరి సాగు లాభదాయకం
- ఎకరాకు రెండు కిలోల విత్తనం సరిపోతుంది
- ఎరువుల ఖర్చు తక్కువ
- 40 నుంచి 45 బస్తాల దిగుబడి
యాజమాన్య పద్ధతులు పాటిస్తే తక్కువ ఖర్చు, నీటితో శ్రీవరి సాగులో అధిక దిగుబడి సాధించవచ్చని రైతులు నిరూపిస్తున్నారు. పీలేరు మండలం మొరవవడ్డిపల్లెకు చెందిన ఏ.చంద్రశేఖర్ (9440959227) ఐదేళ్లుగా శ్రీవరి సాగు చేస్తూ మంచి ఫలితాలు సాధిస్తున్నారు. యాజమాన్య పద్ధతులు, తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి ఆయన మాటల్లోనే చూద్దాం..
- పీలేరు
శ్రీవరి సాగు పద్ధతి భూమిలోని సూక్ష్మ జీవులను బాగా వృద్ధి చేస్తుంది. ఈ సూక్ష్మ జీవులు సహజంగానే పైరుకు కావాల్సిన పోషక పదార్థాలను అందజేస్తుంది. కాబట్టి ఈ పద్ధతి భూసారాన్ని పెంచుతూ సుస్థిర దిగుబడినిస్తుంది. సాధారణ పద్ధతిలో వరి సాగుకు నీరు చాలా అవసరమవుతుంది. శ్రీవరి సాగుకు ఇందులో మూడో వంతు నీరు సరిపోతుంది.
ఈ పంటలో నీరు ఎక్కువగా నిల్వ ఉండకూడదు. సాధారణ పద్ధతిలో ఎకరాకు 20 కిలోల విత్తనం అవసరమైతే ఇందులో రెండు కిలోలు సరిపోతాయి. పైగా వేర్లు విస్తారంగా వ్యాప్తి చెంది లోతుకు చొచ్చుకుపోయి భూమి లోపల పోషక పదార్థాలను తీసుకుని ఏపుగా పెరుగుతుంది.
ఒక్కో మొక్కకు 50 నుంచి 100కు పైగా బలమైన పిలకలు వచ్చి అన్నీ కూడా ఒకేసారి పొట్ట దశకు చేరి పెద్ద పెద్ద కంకులు వేస్తాయి. కంకులలో గింజలు (400 వరకు) బాగా పాలు పోసుకొని దృఢంగా ఉంటాయి. సంప్రదాయ పద్ధతి కన్నా ‘శ్రీ’ పద్ధతిలో వరిపంట సాగు చేయడం ద్వారా 20 నుంచి 30 శాతం అధిక దిగుబడి వస్తుంది. సంప్రదాయ పద్ధతిలో ఎకరాకు 30 నుంచి 32 బస్తాలు (75 కేజీలు) పండిస్తే శ్రీ పద్ధతిలో 40 నుంచి 45 బస్తాలు దిగుబడి వస్తుంది.
కలుపు నివారణ..
పొలంలో నీరు నిల్వకుండా చూస్తాం కాబట్టి కలుపు సమస్య ఎక్కువ. కలుపు నివారణకు నాటిన 10 రోజులకోసారి రోటరీ, కోనోవీడర్‌తో నేలను కదిలిస్తే కలుపు మొక్కలు నేలలో కలిసిపోతాయి. పంటకాలం లోపు ఇలాగే మరో రెండుసార్లు రోటరీ- కోనోవీడర్‌తో పనిచేసినపుడు అధిక దిగుబడి వస్తుంది.
నీటి యాజమాన్యం..
నీటి యాజమాన్యం చాలా జాగ్రత్తగా చేపట్టాలి. పొలం తడిగా ఉండాలి. నీరు నిల్వకూడదు. నీరు ఎక్కువైతే బయటకు పోవడానికి వీలుగా ప్రతి 5 సెంటీమీటర్లకూ ఒక కాలు వ చేయాలి. మధ్య మధ్యలో పొలం ఆరితే నీరు పెడుతుండాలి. తద్వారా వేర్లు ఆరోగ్యంగా వృద్ధి చెందుతాయి.
సేంద్రియ ఎరువులు..
సేంద్రియ ఎరువులు వాడడం వల్ల భూసారం పెరగడమేగాక ఆరోగ్యకరమైన పంట చేతికొస్తుంది. ప్రస్తుత పరిస్థితుల్లో రసాయనిక ఎరువులు కూడా పైరుకు తడి దశలో వాడవచ్చు. కానీ ముందు సేంద్రియ ఎరువులు వాడి రసాయనిక ఎరువుల వాడకం తగ్గించాలి.
లేత నారు నాటుకోవాలి..
8 నుంచి 12 రోజుల వయసు గల రెండు ఆకుల నారు మాత్ర మే నాటాలి. తద్వారా వేర్లు బాగా వ్యాపించి 30 నుంచి 100 పిలకలు వేస్తుంది. నారుమడి నుంచి మొక్క ను జాగ్రత్తగా వేరు, బురద, గింజతో సహా తీసి పొలంలో పైపైన నొక్కి పెట్టాలి. లోతుగా నాటకూడదు. తద్వారా పీకేటపుడు సహజంగా ఉండే తీవ్రమైన ఒత్తిడికి మొక్క గురికాకుండా బతుకుతుంది. త్వరగా అధిక సంఖ్యలో పిలకలు వేస్తుంది. మొక్కకు మొక్కకు ఎటుచూసినా 25 సెంటీమీటర్ల దూరం ఉండేటట్లు చూడాలి. భూసారం ఎక్కువగా ఉండే భూముల్లో ఇంకా ఎడంగా కూడా నాటుకోవచ్చు.