SRI paddy cultivation
-
సరైన యాజమాన్య పద్ధతులతో శ్రీవరి సాగు లాభదాయకం
ఎకరాకు రెండు కిలోల విత్తనం సరిపోతుంది ఎరువుల ఖర్చు తక్కువ 40 నుంచి 45 బస్తాల దిగుబడి యాజమాన్య పద్ధతులు పాటిస్తే తక్కువ ఖర్చు, నీటితో శ్రీవరి సాగులో అధిక దిగుబడి సాధించవచ్చని రైతులు నిరూపిస్తున్నారు. పీలేరు మండలం మొరవవడ్డిపల్లెకు చెందిన ఏ.చంద్రశేఖర్ (9440959227) ఐదేళ్లుగా శ్రీవరి సాగు చేస్తూ మంచి ఫలితాలు సాధిస్తున్నారు. యాజమాన్య పద్ధతులు, తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి ఆయన మాటల్లోనే చూద్దాం.. - పీలేరు శ్రీవరి సాగు పద్ధతి భూమిలోని సూక్ష్మ జీవులను బాగా వృద్ధి చేస్తుంది. ఈ సూక్ష్మ జీవులు సహజంగానే పైరుకు కావాల్సిన పోషక పదార్థాలను అందజేస్తుంది. కాబట్టి ఈ పద్ధతి భూసారాన్ని పెంచుతూ సుస్థిర దిగుబడినిస్తుంది. సాధారణ పద్ధతిలో వరి సాగుకు నీరు చాలా అవసరమవుతుంది. శ్రీవరి సాగుకు ఇందులో మూడో వంతు నీరు సరిపోతుంది. ఈ పంటలో నీరు ఎక్కువగా నిల్వ ఉండకూడదు. సాధారణ పద్ధతిలో ఎకరాకు 20 కిలోల విత్తనం అవసరమైతే ఇందులో రెండు కిలోలు సరిపోతాయి. పైగా వేర్లు విస్తారంగా వ్యాప్తి చెంది లోతుకు చొచ్చుకుపోయి భూమి లోపల పోషక పదార్థాలను తీసుకుని ఏపుగా పెరుగుతుంది. ఒక్కో మొక్కకు 50 నుంచి 100కు పైగా బలమైన పిలకలు వచ్చి అన్నీ కూడా ఒకేసారి పొట్ట దశకు చేరి పెద్ద పెద్ద కంకులు వేస్తాయి. కంకులలో గింజలు (400 వరకు) బాగా పాలు పోసుకొని దృఢంగా ఉంటాయి. సంప్రదాయ పద్ధతి కన్నా ‘శ్రీ’ పద్ధతిలో వరిపంట సాగు చేయడం ద్వారా 20 నుంచి 30 శాతం అధిక దిగుబడి వస్తుంది. సంప్రదాయ పద్ధతిలో ఎకరాకు 30 నుంచి 32 బస్తాలు (75 కేజీలు) పండిస్తే శ్రీ పద్ధతిలో 40 నుంచి 45 బస్తాలు దిగుబడి వస్తుంది. కలుపు నివారణ.. పొలంలో నీరు నిల్వకుండా చూస్తాం కాబట్టి కలుపు సమస్య ఎక్కువ. కలుపు నివారణకు నాటిన 10 రోజులకోసారి రోటరీ, కోనోవీడర్‌తో నేలను కదిలిస్తే కలుపు మొక్కలు నేలలో కలిసిపోతాయి. పంటకాలం లోపు ఇలాగే మరో రెండుసార్లు రోటరీ- కోనోవీడర్‌తో పనిచేసినపుడు అధిక దిగుబడి వస్తుంది. నీటి యాజమాన్యం.. నీటి యాజమాన్యం చాలా జాగ్రత్తగా చేపట్టాలి. పొలం తడిగా ఉండాలి. నీరు నిల్వకూడదు. నీరు ఎక్కువైతే బయటకు పోవడానికి వీలుగా ప్రతి 5 సెంటీమీటర్లకూ ఒక కాలు వ చేయాలి. మధ్య మధ్యలో పొలం ఆరితే నీరు పెడుతుండాలి. తద్వారా వేర్లు ఆరోగ్యంగా వృద్ధి చెందుతాయి. సేంద్రియ ఎరువులు.. సేంద్రియ ఎరువులు వాడడం వల్ల భూసారం పెరగడమేగాక ఆరోగ్యకరమైన పంట చేతికొస్తుంది. ప్రస్తుత పరిస్థితుల్లో రసాయనిక ఎరువులు కూడా పైరుకు తడి దశలో వాడవచ్చు. కానీ ముందు సేంద్రియ ఎరువులు వాడి రసాయనిక ఎరువుల వాడకం తగ్గించాలి. లేత నారు నాటుకోవాలి.. 8 నుంచి 12 రోజుల వయసు గల రెండు ఆకుల నారు మాత్ర మే నాటాలి. తద్వారా వేర్లు బాగా వ్యాపించి 30 నుంచి 100 పిలకలు వేస్తుంది. నారుమడి నుంచి మొక్క ను జాగ్రత్తగా వేరు, బురద, గింజతో సహా తీసి పొలంలో పైపైన నొక్కి పెట్టాలి. లోతుగా నాటకూడదు. తద్వారా పీకేటపుడు సహజంగా ఉండే తీవ్రమైన ఒత్తిడికి మొక్క గురికాకుండా బతుకుతుంది. త్వరగా అధిక సంఖ్యలో పిలకలు వేస్తుంది. మొక్కకు మొక్కకు ఎటుచూసినా 25 సెంటీమీటర్ల దూరం ఉండేటట్లు చూడాలి. భూసారం ఎక్కువగా ఉండే భూముల్లో ఇంకా ఎడంగా కూడా నాటుకోవచ్చు. -
సేంద్రియ శ్రీ వరి
కందుకూరు: శ్రీ వరి సాగును సేంద్రియ పద్ధతిలో చేపట్టి అధిక దిగుబడులు సాధిస్తూ పలువురు రైతులకు ఆదర్శంగా నిలుస్తున్నారు మండల పరిధిలోని నేదునూరుకు చెందిన బి.చంద్రశేఖర్‌రెడ్డి, పోలమోని లక్ష్మణ్‌లు. తక్కువ పెట్టుబడి, తక్కువ నీటి వనరులతో పంట సాగు చేస్తున్న ఆ రైతులు చెబుతున్న విషయాలు ఇవీ.. అవలంబిస్తున్న సాగు పద్ధతి ఆవు పేడ, మూత్రం కలిపి మూడు రోజులు పులియబెట్టిన తర్వాత ఎకరాకు రెండు కిలోల వరి విత్తనాలను తీసుకుని ఆ ద్రావణంలో విత్తన శుద్ధి చేసుకోవాలి. బెడ్ తయారు చేసుకుని నారు పోసుకోవాలి. దుక్కిలో ఎకరాకు మూడు టన్నుల పశువుల ఎరువు వేసుకోవాలి. డీఏపీ వంటి రసాయన ఎరువుల్ని ఒకేసారి తగ్గించకుండా ఎకరాకు 50 కిలోలు వేసే చోట 15 కిలోలు వేసుకోవాలి. క్రమేణా తగ్గిస్తే నాలుగేళ్ల తర్వాత అసలు ఆ మోతాదు రసాయన ఎరువు కూడా అవసరం ఉండదు. దుక్కిలో లేదా నాటే ముందు, లేదా రెండు నెలల తర్వాత ఎకరాకు 150 కిలోల వేప పిండి వేసుకోవాలి. నారు పోసిన 28 నుంచి 30 రోజుల తర్వాత తాడు సహాయంతో లేదా మార్కర్ ద్వారా మొక్క మొక్కకు ప్రతి వరుసకు 25 సెం.మీ. ఎడముతో నాటుకోవాలి. నాట్లు వేసే సమయంలో పావు అంగుళం మేర మాత్రమే నీరు ఉంచుకోవాలి. మడుల్ని చదరంగా ఉంచుకుంటే 15 రోజుల్లో కూడా నాట్లు వేసుకోవచ్చు. ప్రారంభంలో రెండు నెలల వరకు ఆరుతడి పంటలకు అందించిన విధంగా నీరు పెట్టుకున్నా సరిపోతుంది. పొట్టదశలో ఎక్కువ నీరు అవసరమవుతుంది. పది కిలోల చొప్పున ఆవుపేడ, ఆవు మూత్రం, పప్పు దినుసుల పిండి, కిలో బెల్లం తీసుకుని 200 లీటర్ల నీటిలో మూడు రోజులు మురగబెట్టి బాగా కలియతిప్పి జీవామృతాన్ని తయారు చేసుకోవాలి. ఆ ద్రావణాన్ని మొక్క బలం గా కుదురుకున్న తర్వాత ప్రతి 15, 20 రోజులకోసారి నీటి ద్వారా పారించుకోవాలి. అవసరమైతే ఆ ద్రావణాన్ని పై పాటుగా పిచికారీ చేసుకోవచ్చు. అవసరాన్ని బట్టి వేప నూనె లేదా పులియబెట్టిన మజ్జిగతో చేసిన ద్రావణాన్ని పిచికారీ చేసుకుని చీడపీడలు, తెగుళ్లను నివారించవచ్చు. రోటో వీడర్‌తో.. పది మంది కూలీలు నాలుగు రోజులు చేసే పనిని రోటో వీడర్‌ను వినియోగించి ఎకరా విస్తీర్ణంలోని కలుపును ఒక వ్యక్తి కేవలం రెండు రోజుల్లో పూర్తిచేయవచ్చు. సాధారణంగా మొక్కకు 25 పిలకలు వస్తే రోటో వీడర్ తిప్పడంతో వేళ్లు కదిలి 60-80 పిలకలు వస్తాయి. అజోలా పెంపకంతో.. దీంతో పాటు అజోలా గడ్డిని పొలంలో పెంచుతున్నాం. అజోలా త్వరగా పెరగడంతో కలుపును పైకి రానీయదు. నీరు త్వరగా ఆవిరి కాకుండా చేస్తుంది. అజోలా పెంచితే యూరియా వేయాల్సిన అవసరమే ఉండదు. దాని ద్వారా నత్రజని విడుదల అవుతుంది. ఈ విధానంతో సాగు చేస్తూ ఎకరాకు రూ.5 వేల పెట్టుబడి తగ్గిస్తూ అదనంగా 15 బస్తాలు పండిస్తున్నామంటున్నారు ఆ రైతులు.