కందుకూరు: శ్రీ వరి సాగును సేంద్రియ పద్ధతిలో చేపట్టి అధిక దిగుబడులు సాధిస్తూ పలువురు రైతులకు ఆదర్శంగా నిలుస్తున్నారు మండల పరిధిలోని నేదునూరుకు చెందిన బి.చంద్రశేఖర్‌రెడ్డి, పోలమోని లక్ష్మణ్‌లు. తక్కువ పెట్టుబడి, తక్కువ నీటి వనరులతో పంట సాగు చేస్తున్న ఆ రైతులు చెబుతున్న విషయాలు ఇవీ..
అవలంబిస్తున్న సాగు పద్ధతి
ఆవు పేడ, మూత్రం కలిపి మూడు రోజులు పులియబెట్టిన తర్వాత ఎకరాకు రెండు కిలోల వరి విత్తనాలను తీసుకుని ఆ ద్రావణంలో విత్తన శుద్ధి చేసుకోవాలి. బెడ్ తయారు చేసుకుని నారు పోసుకోవాలి. దుక్కిలో ఎకరాకు మూడు టన్నుల పశువుల ఎరువు వేసుకోవాలి. డీఏపీ వంటి రసాయన ఎరువుల్ని ఒకేసారి తగ్గించకుండా ఎకరాకు 50 కిలోలు వేసే చోట 15 కిలోలు వేసుకోవాలి. క్రమేణా తగ్గిస్తే నాలుగేళ్ల తర్వాత అసలు ఆ మోతాదు రసాయన ఎరువు కూడా అవసరం ఉండదు.
దుక్కిలో లేదా నాటే ముందు, లేదా రెండు నెలల తర్వాత ఎకరాకు 150 కిలోల వేప పిండి వేసుకోవాలి. నారు పోసిన 28 నుంచి 30 రోజుల తర్వాత తాడు సహాయంతో లేదా మార్కర్ ద్వారా మొక్క మొక్కకు ప్రతి వరుసకు 25 సెం.మీ. ఎడముతో నాటుకోవాలి. నాట్లు వేసే సమయంలో పావు అంగుళం మేర మాత్రమే నీరు ఉంచుకోవాలి. మడుల్ని చదరంగా ఉంచుకుంటే 15 రోజుల్లో కూడా నాట్లు వేసుకోవచ్చు. ప్రారంభంలో రెండు నెలల వరకు ఆరుతడి పంటలకు అందించిన విధంగా నీరు పెట్టుకున్నా సరిపోతుంది. పొట్టదశలో ఎక్కువ నీరు అవసరమవుతుంది.
పది కిలోల చొప్పున ఆవుపేడ, ఆవు మూత్రం, పప్పు దినుసుల పిండి, కిలో బెల్లం తీసుకుని 200 లీటర్ల నీటిలో మూడు రోజులు మురగబెట్టి బాగా కలియతిప్పి జీవామృతాన్ని తయారు చేసుకోవాలి. ఆ ద్రావణాన్ని మొక్క బలం గా కుదురుకున్న తర్వాత ప్రతి 15, 20 రోజులకోసారి నీటి ద్వారా పారించుకోవాలి. అవసరమైతే ఆ ద్రావణాన్ని పై పాటుగా పిచికారీ చేసుకోవచ్చు. అవసరాన్ని బట్టి వేప నూనె లేదా పులియబెట్టిన మజ్జిగతో చేసిన ద్రావణాన్ని పిచికారీ చేసుకుని చీడపీడలు, తెగుళ్లను నివారించవచ్చు.
రోటో వీడర్‌తో..
పది మంది కూలీలు నాలుగు రోజులు చేసే పనిని రోటో వీడర్‌ను వినియోగించి ఎకరా విస్తీర్ణంలోని కలుపును ఒక వ్యక్తి కేవలం రెండు రోజుల్లో పూర్తిచేయవచ్చు. సాధారణంగా మొక్కకు 25 పిలకలు వస్తే రోటో వీడర్ తిప్పడంతో వేళ్లు కదిలి 60-80 పిలకలు వస్తాయి.
అజోలా పెంపకంతో..
దీంతో పాటు అజోలా గడ్డిని పొలంలో పెంచుతున్నాం. అజోలా త్వరగా పెరగడంతో కలుపును పైకి రానీయదు. నీరు త్వరగా ఆవిరి కాకుండా చేస్తుంది. అజోలా పెంచితే యూరియా వేయాల్సిన అవసరమే ఉండదు. దాని ద్వారా నత్రజని విడుదల అవుతుంది. ఈ విధానంతో సాగు చేస్తూ ఎకరాకు రూ.5 వేల పెట్టుబడి తగ్గిస్తూ అదనంగా 15 బస్తాలు పండిస్తున్నామంటున్నారు ఆ రైతులు.
సేంద్రియ శ్రీ వరి
Published Fri, Aug 22 2014 12:15 AM | Last Updated on Sat, Sep 2 2017 12:14 PM
Advertisement