కందుకూరు: ప్రస్తుతం రైతులు అధిక దిగుబడులు పొందాలనే తలంపుతో ఇష్టానుసారంగా రసాయన ఎరువులు, క్రిమిసంహార మందులు వాడుతూ పంటలు పండిస్తున్నారు. దీంతో మనం తినే ఆహారం కలుషితంగా మారి రోగాల బారిన పడుతున్నాం. ఈ విధానాన్ని మార్చాలనే సంకల్పంతో మొదట తన ఇంటి అవసరాలకు పండించే వరిని ఎలాంటి రసాయన, క్రిమి సంహారక మందులు వినియోగించకుండా పండిస్తున్నాడు కందుకూరుకు చెందిన టంకరి యాదగిరిరెడ్డి.
రెండేళ్లుగా ఇదే విధానంలో వరి సాగు చేస్తూ ఇంటి అవసరాలకు ఉపయోగించుకుంటున్నాడు. ఎకరా విస్తీర్ణంలో హంస రకం వరి సాగును కేవలం పశువుల పేడ, వేప పిండితో పూర్తిగా సేంద్రియ పద్ధతుల్లో చేపట్టాడు. ఎకరాకు పది ట్రాక్టర్ల ఎరువుతో పాటు, వేప గింజల్ని కొనుగోలు చేసి పిండి చేసుకుని నాలుగు సంచుల పిండిని వాడుతున్నాడు. నాట్లు వేయడానికి, కలుపు తీయడం, నూర్పిడి చేయడానికి తప్ప ఎలాంటి ఖర్చు లేదంటున్నాడు. పంటపై ఇంత వరకు ఎలాంటి తెగుళ్లు, పురుగులు సోకలేదంటున్నాడు.
రసాయన ఎరువులు, క్రిమిసంహారక మందులు వాడకపోవడంతో మిత్ర పురుగులు బాగా వృద్ధి చెంది తెగుళ్లు రాకుండా నివారిస్తున్నాయంటున్నాడు. సాధారణ సాగు కంటే కొద్దిగా దిగుబడి తక్కువ వచ్చినా గింజ నాణ్యంగా ఉంటుందని, బియ్యంలో నూకలు రావని అంటున్నాడు. దిగుబడి తగ్గినా, ఖర్చులు తక్కువ కావడం, పంట నాణ్యంగా ఉండటం కలిసి వస్తుందంటున్నాడు. ప్రస్తుతం వరి పంట ఆ విధానంలో సాగు చేస్తున్నానని, విడతల వారీగా మిగతా పంటల వైపు దృష్టి సారిస్తున్నానని, అందరు రైతులు సేంద్రియ వ్యవసాయం చేయాలనేది తన కోరిక అంటున్నాడీ రైతు.
పశువుల పేడ, వేపపిండే పెట్టుబడి
Published Wed, Sep 10 2014 11:20 PM | Last Updated on Mon, Oct 1 2018 2:03 PM
Advertisement