Higher yields
-
సబ్సిడీ నారుతో అధిక దిగుబడులు
హర్షం వ్యక్తం చేసిన గవర్నర్ నరసింహన్ - కుటుంబ సమేతంగా సీవోఈ సందర్శన సాక్షి, హైదరాబాద్: నాణ్యమైన కూరగాయల నారును సబ్సిడీపై రైతులకు సరఫరా చేసి అధిక దిగుబడులు సాధించడంపై రాష్ట్ర గవర్నర్ ఈఎస్ఎల్ నరసింహన్ హర్షం వ్యక్తం చేశారు. సోమవారం జీడిమెట్లలోని సెంటర్ ఆఫ్ ఎక్సలెన్సీ (సీవోఈ)ని గవర్నర్ కుటుంబ సమేతంగా సందర్శించారు. ఆయనకు వ్యవసాయ శాఖ మంత్రి పోచారం శ్రీనివాసరెడ్డి స్వాగతం పలికారు. గవర్నర్ మాట్లాడుతూ, ‘రాష్ట్ర ప్రజలు అధికంగా వ్యవసాయంపై ఆధారపడి జీవిస్తున్నారు. వారికి సంప్రదాయ పంటలతో సరైన లాభాలు రావడంలేదు. సాగునీటి ప్రాజెక్టుల రీ డిజైనింగ్‌తో రాష్ట్రంలో నీటి పారుదల కింద సేద్యం పెరుగుతుంది. ఉద్యాన రైతులు అధిక దిగుబడులు సాధించేందుకు సాగులో ఇలాం టి నూతన పద్ధతులు పాటించాలి’ అని అభిప్రాయపడ్డారు. రైతాంగం అధిక దిగుబడులతో లాభాలు ఆర్జించి పేదరికం నుంచి బయటపడాలని ఆకాంక్షించారు. స్వయంగా రైతులైన ముఖ్యమంత్రి, వ్యవసా య మంత్రి రాష్ట్రానికి ఉండటం రైతుల అదృష్టమని కొనియాడారు. పాలీహౌస్‌లలో పంటల సాగు, డ్రిప్, స్ప్రింక్లర్ల ద్వారా నీటి నియంత్రణ, ఉష్ణోగ్రత నియంత్రణ, నాణ్య మైన నారు మొక్కల పెంపకం వంటి అంశా లపై మంత్రిని, ఉద్యాన శాఖ అధికారులను అడిగి తెలుసుకున్నారు. సన్న చిన్నకారు రైతులకు దేశంలోనే అధిక సబ్సిడీపై సూక్ష్మ, బిందు సేద్య పరికరాలను అందిస్తున్న రాష్ట్రం తెలంగాణ అని గవర్నర్‌కు మంత్రి పోచారం వివరించారు. సీవోఈలోని అన్ని పాలీహౌస్ లను, సాగులో ఉన్న కూరగాయలు, పండ్లను గవర్నర్ పరిశీలించారు. దేశంలోనే అధునాతన టెక్నాలజీతో నూతన పద్ధతుల్లో పండ్లు, కూరగాయలు సాగు చేయడంపై గవర్నర్ అభినందించారు. అనంతరం సీవోఈ ప్రాంగణంలో మామిడి మొక్క నాటారు. కార్యక్రమంలో వ్యవసాయ శాఖ కార్యదర్శి సి.పార్థసారథి, ఉద్యాన శాఖ కమిషనర్ ఎల్.వెంకట్రామ్రెడ్డి, అధికారులు మధుసూదన్, బాబు, రాజ్‌కుమార్ తదితరులు పాల్గొన్నారు. -
జీవితేచ్ఛకు కొత్త చిగుళ్లు!
- ప్రకృతి సేద్యంతో వయోధిక రైతు జీవితంలో చిగురించిన సరికొత్త ఆశలు - 60 ఏళ్ల వయసులో బహుళ పంటలతో సాగు కొత్త పుంతలు - కూరగాయలు, పత్తి, చెరకు, అపరాలు, ఎల్లిపాయ సాగులో అధిక దిగుబడులు - అంతర పంటలుగా బంతి, నాటు పొగాకు సాగుతో అధికాదాయం అప్పు కోసం వడ్డీ వ్యాపారుల దగ్గర మాటిమాటికీ చేయి చాచాల్సిన అవమానకర పరిస్థితి కుంగదీసి ఊరు వదిలి వెళ్లమంటే.. దశాబ్దాలుగా సేద్యాన్నే నమ్ముకున్న రైతన్నకు మట్టిపై ఉన్న మమకారం మళ్లీ ఒక ప్రయత్నం చేసి చూడమంది. మిత్రుడి ప్రోత్సాహంతో ప్రకృతి సేద్యం చేపట్టగా వ్యవసాయానికి కొత్త ఊపిర్లూదింది. ఒకటికి నాలుగు పంటల సాగుతో పెరిగిన నికరాదాయం ఆత్మగౌరవాన్ని నిలబెట్టింది. ప్రకృతికి ప్రణమిల్లిన అన్నదాతకు నలుగురిలోనూ తలెత్తుకొని తిరిగేలా జవజీవాలనిచ్చింది. అలా అరవయ్యేళ్లకు ప్రకృతి సేద్యబాట పట్టిన మనోహరాచారిని ఇప్పుడు ఇతర రైతులు అనుసరిస్తున్నారు. 1972.. నూనూగు మీసాల నూత్న యవ్వనంలో కాడి పట్టారు వనపన మనోహరాచారి. రంగారెడ్డి జిల్లా చౌదరి గూడెం మండలం పద్మారం ఆయన స్వగ్రామం. పదో తరగతి చదివిన తర్వాత 1978లో తొలిసారి పత్తి సాగును చేపట్టారు. అప్పట్లో పత్తి సాగులో దుక్కిలో ఎకరాకు అర బస్తా డీఏపీ మాత్రమే వేసేవారు. పంట కాలం మొత్తంలో రెండుసార్లు పురుగుమందులు కొట్టేవారు. ఎకరాకు 10 క్వింటాళ్లకు తగ్గకుండా దిగుబడి వచ్చేది. క్వింటా పత్తికి రూ. 1300–1500 వరకు ధర ఉండేది. 2013... మనోహరాచారి అరవయ్యో పడిలోకి అడుగుపెట్టారు. ఇప్పుడూ పత్తిని సాగు చేస్తున్నారు. రసాయనిక ఎరువులు వాడకం 10 బస్తాలకు పెరగ్గా.. పురుగు మందులను వారానికి రెండుసార్లు పిచికారీ చేయాల్సి వస్తోంది. దిగుబడి అదే పది క్వింటాళ్లు. కానీ ఖర్చులు మాత్రం విపరీతంగా పెరిగాయి. 40 ఏళ్లలో పురుగుమందులు, ఎరువుల ధరలు 40 రెట్లు పెరిగితే.. పంట అమ్మకం ధర మాత్రం పెరిగింది రెండింతలే. 2014... చేసిన అప్పులు తీరే పరిస్థితి కనపడలేదు. తన మీద తనకు నమ్మకం సడలింది. ఎన్నాళ్లిలా.. పగలనకా రేయనకా.. ఎండనకా వాననకా.. రక్తాన్ని స్వేదంగా మార్చి కష్టపడితే చివరకు మిగిలిందేమిటి అనే అంతర్మథనం మొదలైంది. తన రుణాలు తీర్చాలంటే మట్టితో తన రుణం తెంచుకోవాలని... పట్టణానికి వలస బాట పట్టాల్సిందేనని నిశ్చయించుకున్నారు మనోహరాచారి. చాలా కాలంగా తన మిత్రుడు తనను ప్రకృతి సేద్యం చేయాలని పోరుతున్నా ఇన్ని (రసాయనిక) ఎరువులు, పురుగుమందులు వల్ల కానిది గోమూత్రం వల్ల ఏమవుతుందని భావించి లక్ష్య పెట్టలేదు. కానీ లోలోపల మిణుకు మంటున్న ఆశ ఆఖరి సారిగా ప్రయత్నం చేసి చూడమంది... అలా ఆయన ప్రకృతి సేద్యంలోకి అడుగుపెట్టి బతుకును పండించుకుంటున్నారు. పాలేకర్ రాసిన పుస్తకాలను చదవటం, సాక్షిలో ‘సాగుబడి’ కథనాలను క్రమం తప్పకుండా చదువుతూ ప్రకృతి సేద్యంలో లోతుపాతులను ఆకళింపు చేసుకుంటూ అనుసరిస్తున్నారు. మనోహరాచారి 2014–15లో తొలిగా ప్రకృతి సేద్యం ప్రారంభించారు. ఫలితాలు ఆశాజనకంగా ఉండటంతో ఉత్సాహం నింపాయి. రెట్టించిన ఉత్సాహంతో రెండో ఏడాది ఇతర పంటలకు ప్రకృతి సేద్యాన్ని విస్తరించారు. నల్లరేగడి భూమి. మూడు బోర్లు పనిచేస్తున్నాయి. పంటలకు డ్రిప్పు ద్వారా అందిస్తూ నీటిని పొదుపుగా వాడుతూ పంటలను సాగు చేస్తున్నారు. పత్తిలో 14 క్వింటాళ్ల దిగుబడి! తొలిసారిగా 2014లో ప్రకృతి సేద్యంలో (హైబ్రిడ్) పత్తిని ఎకరంన్నర పొలంలో సాగు చేశారు. బీజామృతంతో విత్తనశుద్ధి చేశారు. పురుగు నివారణకు దశపత్ర కషాయం వాడారు. 15 రోజుల పంటకు ఎకరాకు 5 క్వింటాళ్ల వర్మికంపోస్టు వేశారు. ఎకరాకు 200 లీటర్ల జీవామృతం డబ్బాలతో పాదుల్లో పోశారు. 200 లీటర్ల నీటికి 30 లీటర్ల జీవామృతం కలిపి పిచికారీ చేశారు. ఎకరాకు పది క్వింటాళ్ల దిగుబడి వచ్చింది. రసాయన సేద్యంలో ఎకరాకు రూ. 20–25 వేల వరకు అయ్యే ఖర్చు ప్రకృతి సేద్యంలో రూ. 6 వేలకు తగ్గింది. ఈ ఏడాది పత్తిలో 14 క్వింటాళ్ల వరకు దిగుబడి రావచ్చని మనోహరాచారి అంచనా వేస్తున్నారు. చెరకులో 50 టన్నుల దిగుబడి మనోహరాచారి మొత్తం పదెకరాల్లో చెరకును కార్శి పంటగా సాగు చేస్తున్నారు. తొలిసారి రెండెకరాల్లో చెరకును ప్రకృతి సేద్యంలోకి తెచ్చారు. తొలుత ఎకరాకు 2 క్వింటాళ్ల ఘనజీవామృతం వేశారు. 20 రోజులకోసారి డ్రిప్పు ద్వారా ఎకరాకు 200 లీటర్ల జీవామృతం అందిస్తారు. రసాయన సేద్యం చేసే రైతులు గత ఏడాది లద్దెపురుగు నివారణకు విపరీతంగా కీటకనాశనులు పిచికారీ చేసినా తోటలు దెబ్బతిన్నాయి. మనోహరాచారి మాత్రం ఎకరాకు 10 లీటర్ల అగ్ని అస్త్రంను డ్రిప్పు ద్వారా అందించి పంటను లద్దె పురుగుల బెడద నుంచి కాపాడుకున్నారు. పంట వ్యర్థాలతో ఆచ్ఛాదన కల్పించి కలుపును నివారించడమే గాక పొలంలో తేమను కూడా ఎక్కువ రోజులు కాపాడుకోగలిగారు. దీనివల్ల నీరు ఆదా అయింది. సూక్ష్మవాతావరణంతో వానపాములు, సూక్ష్మజీవులకు అనువైన పరిస్థితి నెలకొనడంతో భూసారం పెంపొందింది. పైపాటు, కూలీలకు అయ్యే ఖర్చులో రూ. 10 వేల వరకు ఆదా అయ్యాయి. రసాయన ఎరువులు, పురుగుమందులకు ఎకరాకు 20 వేల వరకు ఖర్చయ్యేది. జీవామృతం... దశపత్ర కషాయాలు వాడటంతో ఆ ఖర్చు కూడా రైతుకు ఆదా అయింది. ఇది తొలి ఏడాది ఖర్చు మాత్రమే. నాలుగేళ్లలో ఖర్చు సగం మేర తగ్గుతుంది. రసాయన సేద్యం నుంచి ప్రకృతి సేద్యంలోకి మారిన తొలి ఏడాది కూడా చెరకు దిగుబడి తగ్గలేదు. తీవ్ర నీటి ఎద్దడి ఉన్నప్పటికీ ఎకరాకు 40 టన్నుల దిగుబడి వచ్చింది. ఈ ఏడాది 50 టన్నుల వరకు దిగుబడి రావచ్చని మనోహరాచారి భావిస్తున్నారు. కూలీలు, రవాణా ఖర్చులు పోను టన్నుకు రూ. 1,900 ధర లభించింది. ఎకరాకు రూ. 75 వేల ఆదాయం వచ్చింది. జడ కట్టేందుకు రూ. 15 వేలు పోను ఎకరాకు రూ. 50 వేల నికరాదాయం లభించింది. కూరగాయల్లో ఎకరాకు రూ. 40 వేల నికరాదాయం గతేడాది వేసవిలో ప్రకృతి సేద్య విధానంలో మూడెకరాల్లో కీరదోస, పప్పు దోస పంటలను సాగు చేశారు. డ్రిప్పు ద్వారా 15 రోజులకోసారి ఎకరాకు 200 లీటర్ల జీవామృతం అందించారు. తీగజాతి కూరగాయలు జీవామృతానికి బాగా స్పందించాయి. పూత బాగా వచ్చింది. ఎకరాకు 4 టన్నుల దిగుబడి వచ్చింది. విత్తనాలు కూలీలు, రవాణా ఖర్చులు రూ. 10 వేలయ్యాయి. ఖర్చులు పోను ఎకరాకు రూ. 30–40 వేల నికరాదాయం లభించింది. కందిలో మొక్కజొన్న సాగు.. కందిలో పెసర, మినుము, మొక్కజొన్న పంటలను అంతర పంటలుగా సాగు చేశారు. ఆవులం దేశీ రకం కందిని సాగు చేశారు. మొక్కల మధ్య నాలుగడుగులు, సాళ్ల మధ్య 8 అడుగుల దూరం ఉండేలా పాదుల్లో విత్తనాలను నాటుకున్నారు. 20, 40 రోజుల దశలో ఎకరానికి 200 లీటర్ల జీవామృతాన్ని కంది, మొక్కజొన్నకు అందించారు. 200 లీటర్ల నీటికి 30 లీటర్ల జీవామృతాన్ని కలిపి ఎకరా పైరుపై 30–50 రోజుల దశలో పిచికారీ చేశారు. అతివృష్టికి పెసర, మినుము పంటలు చేతికి రాలేదు. కందిలో ఎకరాకు 8–10 క్వింటాళ్ల వరకు దిగుబడి రావచ్చని భావిస్తున్నారు. మొక్కజొన్న ఎకరాకు పది క్వింటాళ్ల చొప్పున దిగుబడి వచ్చింది. ఖర్చులు రూ. 6 వేలు మాత్రమే కాగా రెండు పంటలకు కలిపి రూ. లక్ష వరకు నికరాదాయం రావచ్చని మనోహరాచారి తెలిపారు. నాణ్యమైన ఎల్లిపాయలకు మారు పేరు మనోహరాచారి చాలాకాలంగా ఎల్లిపాయ పంటను రసాయన సేద్యంలో సాగు చేస్తున్నారు. గతేడాది ప్రయోగాత్మకంగా ఎకరా పొలంలో ఎల్లిపాయను ప్రకృతి సేద్య విధానంలో సాగు చేసి మంచి దిగుబడి సాధించారు. డ్రిప్పుతో 20 రోజులకోసారి ఇచ్చే తడితో పాటే 200 లీటర్ల జీవామృతం ఇచ్చేవారు. 80 కిలోల సొంత విత్తనం వాడారు. రెండుసార్లు కలుపు తీతకు, గడ్డలు ఏరేందుకు కూలీలకు కలిపి మొత్తం ఎకరాకు రూ. 10 వేల ఖర్చయింది. దిగుబడి 15 నుంచి 20 క్వింటాళ్లకు పెరిగింది. క్వింటా రూ. 6,500 చొప్పున విక్రయించారు. ఎకరాకు రూ. 1.30 లక్షల ఆదాయం వచ్చింది. ఖర్చులు పోను రూ. 1.20 లక్షల నికరాదాయం లభించింది. రసాయన సేద్యంలో పండించిన ఎల్లిపాయ గడ్డ మూడు నెలలకే మెత్తబడేది. పొలంలో కలుపు మళ్లీ మళ్లీ పుట్టుకొచ్చి పంటకన్నా కలుపు ఎక్కువ ఉండేది. ప్రకృతి సేద్యంలో కలుపు ఉధృతి బాగా తగ్గింది. పంటను ఏడాది నిల్వ ఉంచినా గడ్డ మెత్తబడలేదు. రసాయన సేద్యంలో 12 ఎకరాల సాగుకు రూ.1.5 లక్షల నుంచి రూ. 2 లక్షల వరకు ఖర్చయ్యేది. ప్రకృతి సేద్యంలో 18 ఎకరాల సాగుకు రూ. 20 వేలకు మించి ఖర్చు లేదు. మినుములు, ఎల్లిపాయలు కిలోకు రూ. 20–25 వరకు అధిక ధరకు అమ్ముడవుతున్నాయి. రైతు ఇతర రైతులను చూసి నేర్చుకుంటాడు. మనోహరాచారి స్ఫూర్తితో లక్ష్మీదేవిపల్లి గ్రామానికి చెందిన నాగారం నారాయణరెడ్డి, రాంరెడ్డి ప్రకృతి సేద్యం చేపట్టడం విశేషం. – పొల్కంపల్లి గాండ్ల నాగరాజు,సాక్షి, మహబూబ్‌నగర్ వ్యవసాయం తలెత్తుకొని దర్జాగా తిరుగుతున్నా! రసాయన సేద్యంలో అప్పులు చేసినా.. తీర్చేదారి లేక పనికోసం ఊరొదిలి పట్నానికి పోదామనుకున్నా. ఆ సమయంలో ప్రకృతి సేద్యం చేయటం ప్రారంభించా. రూ. లక్ష ఖర్చు కాస్తా మంత్రం వేసినట్టే రూ. 10 వేలకు తగ్గింది. ఎరువులు, పురుగు మందులు కొనాల్సిన అవసరం లేకపోవటమే దానికి కారణం. రసాయన సేద్యం ఆపితే చీడపీడలు, తెగుళ్లు తగ్గుతాయి. రసాయన సేద్యంతో రైతు బాగుపడడు. ఎరువులు, పురుగుమందులు అమ్మే వ్యాపారులు, వడ్డీ వ్యాపారులు బాగుపడుతున్నారు. ఇంతకు ముందు అప్పులు తీర్చేదారిలేక తలదించుకొని బతుకుతున్నట్టనిపించేది. ప్రకృతి సేద్యంలోకి మారాక తలెత్తుకొని దర్జాగా తిరుగుతున్నా. రైతులు ప్రకృతి సేద్యం చేస్తే ఆ అప్పులు ఉండవు.. ఆత్మహత్యలు ఉండవు. – వనపన మనోహరాచారి (99669 84871)పద్మారం, చౌదరిగూడెం మండలం,రంగారెడ్డి జిల్లా ఆపిల్ బేర్‌లో అంతర పంటలుగా బంతి, పొగాకు తొలి ఏడాది ప్రకృతి సేద్యంలో అంతర పంటలకు పెద్ద పీట వేశారు మనోహరాచారి. ఒకటిన్నర ఎకరాలో ప్రకృతి సేద్యంలో ఆపిల్ బేర్‌ను సాగు చేస్తున్నారు. జూలైలో ఎకరాకు 200 మొక్కలు నాటారు. నెలకోసారి డ్రిప్పు ద్వారా జీవామృతం అందిస్తున్నారు. ఆపిల్ బేర్ మధ్యలో సెప్టెంబర్‌లో బంతిపూల నారు నాటారు. అక్టోబర్ ఆఖరుకు కోత తెగేది. రసాయన సేద్యంలో నెల రోజులు మాత్రమే పూలకోత తెగేది. ప్రకృతి సేద్యంలో మూడో నెలలోనూ పూల దిగుబడి వచ్చింది. దిగుబడి రెండింతలైంది. రసాయన సేద్యంలో ఖర్చు రూ. 15 వేలు కాగా ప్రకృతి సేద్యంలో రూ. 3 వేలకు తగ్గి రూ. 30 వేల నికరాదాయం వచ్చింది. పూలు కోతకొచ్చిన అక్టోబర్ నెలలోనే రెండు బంతి మొక్కల మధ్యలో పొగాకు నారును నాటారు. ఎకరాకు 8 క్వింటాళ్ల దిగుబడి వచ్చింది. క్వింటా రూ. 15 వేల ధర చొప్పున విక్రయించారు. ఎకరాకు రూ. 4 వేలు మాత్రమే ఖర్చయింది. -
సేంద్రియ సాగుతో రైతులకు మేలు
అందరి బాగుకు సేంద్రియ సాగు ∙ఏఓ బాబూ నాయక్ సదాశివపేట రూరల్:రైతులు సేంద్రియ సాగుతో అధిక దిగుబడులు సాధించాలని, దీనివల్ల అటు రైతులకు లాభాలతో పాటు సేంద్రియ ఉత్పత్తుల ను వినియోగించడం వల్ల ఆరోగ్యంగా ఉంటారని సదాశివపేట మండల వ్యవసాయశాఖ అధికారి బాబూనాయక్ తెలిపారు. బుధవారం నిజాంపూర్ గ్రామంలో 50 ఎకరాల్లో సేంద్రియ సాగు చేస్తున్న రైతులకు భూ సంజీవనిపై ఆయన అవగాహన కల్పించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ సేం ద్రియ పద్ధతిలో వరినాటే విధానం గురించి రైతులకు వివరించారు. మహిళా రైతులకు సేంద్రియ పద్ధతిలో వరినాటే విధానం గురించి సూచనలు, సలహాలు ఇచ్చారు. సేం ద్రియ వరి సాగు చేసే ప్రతి రైతు భూ సారాన్ని, భూమి సమతుల్యతను పాటిం చేందుకు తప్పనిసరిగా పచ్చిరొట్ట ఎరువు, జనుము, జీలుగను సాగు చేయాలని సూచిం చారు. సేంద్రియ ఎరువులతో సాగు చేసే రైతులు తమ భూమిలో తప్పకుండా మిష¯ŒS కాకతీయ కింద తవ్వుతున్న చెరువులోని మట్టి వేసుకోవాలన్నారు. వర్మి కంపోస్టు వాడటం వల్ల రైతులకు కలిగే లాభాల గురించి ఆయన రైతులకు వివరించారు. కార్యక్రమంలో ఏఈఓ శ్రీనివాస్, సేంద్రియ రైతులు సత్యనారాయణ, శ్రీనివాస్, మహిళా రైతులు పాల్గొన్నారు. -
ప్రకృతే ఆయన ప్రాణం!
♦ భూమిని దున్నకుండా రసాయనిక రహిత సాగు ♦ అధిక దిగుబడులు సాధించిన ప్రకృతి ప్రేమికుడు భూమిని దున్నకుండా, ఎరువులు వేయకుండా, క్రిమిసంహారకాలు పిచికారీ చేయకుండా వ్యవసాయం చేయడమనేది నేటి ఆధునిక ప్రపంచంలో కలలో సైతం ఊహించలేనిది. గుజరాత్‌కు చెందిన భాస్కర సావే దానిని ఆచరణలో పెట్టి అందరినీ అబ్బురపరిచారు. ప్రకృతి ఒడిలో సహజీవనం చేసి ప్రకృతి వ్యవసాయానికి గాంధీజీగా పేరొందిన భాస్కర సావే ఇటీవలే మరణించారు. అడవులను ఎవరు పెంచారు? అక్కడ భూమిని ఎవరు దున్నారు? విత్తనాలు ఎవరు వేశారు? ఎరువులు, నీరు ఎవరు అందించారు? ఇవేమీ జరగకపోయినా అటవీ సంపద మనకు మధురమైన ఫలాలను అందిస్తోంది కదా! అదెలా సాధ్యం? ప్రకృతే వాటిని సమకూరుస్తోందనేవారు సావే. మరి మనం మాత్రం రసాయనిక ఎరువులు వేయకుండా, క్రిమిసంహారకాలను పిచికారీ చేయకుండా ఎందుకు వ్యవసాయం చేయకూడదన్నది ఆయన ప్రశ్న. తాను నమ్మిన సిద్ధాంతాన్ని త్రికరణశుద్ధిగా ఆచరించి చూపిన సావే ప్రకృతి వ్యవసాయానికి గాంధీజీగా పేరుగాంచారు. 1960 నుంచి తుది శ్వాస విడిచేంత వరకు ఆయనది అదే బాట.అదే మాట. భాస్కర సావే గతనెల 24న మరణించారు. అది నిజంగా కల్పవృక్షమే! గుజరాత్‌లోని సావే వ్యవసాయ క్షేత్రం ‘కల్పవృక్ష’లోకి అడుగు పెడితే చాలు... అన్నీ అద్భుతాలే. ఆయనెప్పుడూ తన భూమిని దున్నలేదు. ఎరువులు వేయలేదు. రసాయనాలు పిచికారీ చేయలేదు. దేశంలోనే అత్యధిక దిగుబడి ఇస్తున్న కొబ్బరి చెట్లు కల్పవృక్షలో కన్పిస్తాయి. కొన్ని చెట్లు ఏడాదికి 400 కాయలను అందిస్తాయి. దిగుబడి సగటున 350 కాయలకు తగ్గదు. 45 సంవత్సరాల నాటి సపోటా మొక్కలు ఇప్పటికీ మధుర ఫలాలను అందిస్తూనే ఉన్నాయి. ఏడాదికి ఒక్కో చెట్టుకు 300 పండ్లు కాస్తున్నాయి. సావే వ్యవసాయ క్షేత్రంలో అరటి, బొప్పాయి, మామిడి, తాటి, దానిమ్మ, నిమ్మ, వేప...ఒకటేమిటి అన్ని రకాల చెట్లు కన్పిస్తాయి. రెండెకరాల విస్తీర్ణంలో వరి పంట వేశారు. పప్పు ధాన్యాలు, గోధుమలు, కూరగాయల పంటలకు సైతం నెలవుగా ఉంటోంది ‘కల్పవృక్ష’. సహజసిద్ధంగా, ప్రకృతి ప్రసాదంగా లభిస్తున్న ఈ పంటల ఉత్పత్తులు అతిథులకు మరువలేని ఆతిథ్యానిస్తుంటాయి. ఇవన్నీ మిత్ర జీవులే ప్రకృతి మాత ఒడిలోని అనేక జీవులు మనకు స్నేహితులేనని సావే చెప్పేవారు. చీమ, వానపాము, బాక్టీరియా వంటి జీవులు అన్నదాతలకు ఎంతో మేలు చేస్తాయి. పంట చేలో ఇవి పుష్కలంగా ఉంటే చాలు... ఆ రైతు సంపన్నుడే అని అనేవారు సావే. ఈ జీవులన్నీ భూసారాన్ని పెంచుతూ రైతుకు మంచి దిగుబడులు అందిస్తున్నాయి. వీటిలో చాలా వరకు రసాయనిక క్రిమిసంహారక మందుల బారినపడి చనిపోతున్నాయి. ట్రాక్టర్ల కింద నలిగిపోతున్నాయి. ఫలితం... నేల నిస్సారమై చీడపీడల దాడికి సులభంగా లోనవుతోంది. కలుపు మొక్కలు కూడా... కలుపు మొక్కలను శత్రువులుగా రైతులు భావిస్తుంటారు. నిజానికి అవి కూడా అన్నదాతకు మేలు చేసేవే. కలుపు మొక్కలు భూమి కోతను నివారిస్తాయి. నేలలో తేమను నిలుపుతాయి. పూత దశకు చేరకముందే కలుపు మొక్కలను భూమిలో తొక్కేస్తే నేలకు బలం చేకూరుతుంది. వాటిని రసాయనిక మందులతో నిర్మూలించే బదులు లోతు దుక్కులు చేస్తే సరి. భూసారం పెరుగుతుంటే కలుపు బెడద దానంతట అదే తగ్గిపోతుంది. భూసారం తక్కువగా ఉంటే పంట మొక్కల సాంద్రతను పెంచితే కలుపు సమస్య ఉండదు. భూమిపై నివసించే ప్రాణులన్నింటికీ జీవించే హక్కు ఉంది. ప్రకృతిలో లభించేవన్నీ ఉపయోగపడేవే. వ్యవసాయం వ్యాపారం కాకూడదు. పంట ఉత్పత్తులను కొంతమేరకే వినియోగించుకోవాలి. భూసారం పెంచడానికి కొద్దిగా కృషి చేస్తే సమస్యలనేవే ఉండవనేవారు భాస్కర సావే. - సాక్షి, సాగుబడి డెస్క్ -
ఆధునిక పద్ధతులతోనే అధికదిగుబడులు
గజ్వేల్: సాగులో ఆధునిక పద్ధతులు అవలంభిస్తే అధిక దిగుబడులు సాధ్యమని బ్యాంక్ ఆఫ్ బరోడా రిటైర్డ్ సౌత్ జోన్ జనరల్ మేనేజర్ మాధవరెడ్డి సూచించారు. శుక్రవారం గజ్వేల్ మండలం బూర్గుపల్లి గ్రామంలో సత్యసాయి సేవా సమితి అధ్వర్యంలో నిర్వహించిన రైతు సదస్సుకు ఆయన హాజరై ప్రసంగించారు. గ్రీన్హౌస్, కల్టివేషన్ విధానంలో సాగు చేపడితే మంచి ఫలితాలుంటాయన్నారు. వ్యవసాయశాఖ గజ్వేల్ నియోజకవర్గ ఓఎస్డీ అశోక్‌కుమార్ మాట్లాడుతూ, రైతులు గ్రామస్థాయి నుంచి సంఘాలుగా ఏర్పడి ప్రభుత్వ పథకాలపై అవగాహన పెంచుకోవాలన్నారు. అనంతరం విత్తన తయారీ, శుద్ధి అంశాలను వివరించారు. పశుసంవర్దక శాఖ ఏడీ వెంకటేశ్వర్లు మాట్లాడుతూ, పాడి పరిశ్రమను అభివృద్ధి చేసేందుకు ప్రభుత్వం వివిధ పథకాలను అమలు చేస్తోందని, వీటిని సద్వినియోగం చేసుకోవాలన్నారు. కార్యక్రమంలో సత్యసాయి సేవాసమితి సభ్యులు, రైతులు పాల్గొన్నారు. -
మామిడి పూత, కాతలను నిలుపుకొంటేనే..
మామిడి పూత సాధారణంగా డిసెంబర్ - జనవరి నెలల్లో మొదలై ఫిబ్రవరి వరకు పూస్తుంది. ఎనిమిది నెలల పాటు చేపట్టే యాజమాన్య పద్ధతులు ఒక ఎత్తయితే పూత నుంచి కోత వరకు నాలుగు నెలల పాటు చేపట్టే పద్ధతులు మరో ఎత్తు. మామిడిలో పూతంతా ఒకేసారి రాదు. దీంతో మాసం మొత్తం పూత కాలంగా ఉంటుంది. పూత ఒకేసారి రాకపోవడంతో సస్యరక్షణ చర్యలు చేపట్టడంలో, కోత కోయడంలో రైతులకు ఇబ్బందులు ఎదురవుతుంటాయి. ఈ సమస్యను అధిగమించేందుకు.. తేమ తక్కువగా ఉండే నేలల్లో, ఇసుక నేలల్లో మొగ్గ బయటకు వచ్చే ముందు తేలికపాటి నీటి తడులు ఇవ్వాలి. మొగ్గలు బయటకు వచ్చే ముందు గానీ పగిలే సమయంలో గానీ పొటాషియం నైట్రేట్ లేదా మల్టీ-కేను లీటరు నీటికి ఐదు గ్రాముల యూరియాలో కలిపి పిచికారీ చేయాలి. అక్టోబర్ తర్వాత.. అక్టోబర్ తర్వాత ఎట్టి పరిస్థితుల్లోనూ దుక్కి దున్నవద్దు. చెట్టుకింద పాదులను కదిలించకూడదు. లేదంటే చెట్ల వేర్లు, పోషక పదార్థాల సమతుల్యత దెబ్బతిని పూత తగ్గిపోయే అవకాశం ఉంటుంది. అక్టోబర్ తర్వాత ఎరువులు వేయకూడదు. చెట్టుకు నీటి తడులు సైతం ఇవ్వవద్దు. మామిడిలో ఆశించే బూడిద రంగు తెగులు నివారణ... లేత ఆకులు, పూత కాండం, పూలమీద, చిరు పిందెల మీద తెల్లని పౌడర్ లాంటి బూజు చేరుతుంది. ఇదే బూడిద తెగులు. ఇది ఎక్కువగా రాత్రిపూట చల్లగా, పగలు వేడి ఎక్కువగా ఉన్నప్పుడు ఆశిస్తుంది. దీని వల్ల పూత, కాత రాలిపోతుంది. దీని నివారణ కోసం మొగ్గలు కనిపించే దశలో లీటరు నీటికి 3 గ్రాముల గంధకం కలిపి పిచికారీ చేయాలి. పూత దశలో తెగులు కనిపిస్తే హెక్బాకోనజోల్ 2 మి.లీ. లేదా ప్రాసికోనజోల్ ఒక మి.లీ. లేదా డినోకాఫ్ లేదా ట్రైడిమాల్స్ ఒక మి.లీ. నీటికి కలిపి పిచికారీ చేయాలి. ఆకుపచ్చ, పూతమాడు, నల్లమచ్చ తెగుళ్లు... వర్షాలు లేదా పొగమంచు అధికంగా ఉన్న సమయంలో ఈ తెగుళ్లు వ్యాపిస్తాయి. లేత ఆకులు, రెక్కలు, పూలను పండ్లను ఆశించి నష్టపరుస్తాయి. ఆకుల మీద గోధుమరంగులో మచ్చలు ఏర్పడి క్రమంగా మచ్చలు పెరిగిపోయి ఆకులు త్వరగా పండుబారి రాలిపోతాయి. రెమ్మలపైనా నల్లని మచ్చలు ఏర్పడి పూల గుత్తులు, పూలు మాడిపోతాయి. కాయలు రాలిపోతాయి. ఈ తెగులు నివారణ కోసం పూత దశకు ముందే ఎండిన కొమ్మలను కత్తిరించి తగులబెట్టాలి. లీటర్ నీటికి 3 గ్రాముల కాపర్ ఆక్సిక్లోరైడ్ లేదా ఒక శాతం బోర్డో మిశ్రమం కలిపి పిచికారీ చేయాలి. 3 గ్రాముల కాపర్ ఆక్సిక్లోరైడ్ లీటరు నీటికి కలిపి పిచికారీ చేయాలి. పచ్చిపూత మీద ఒక గ్రాము కార్బండిజమ్, ఒక గ్రాము థయోఫినేట్ మిథైల్ లీటరు నీటికి కలిపి పిచికారీ చేయాలి. పిందె దశలో లీటరు నీటిలో 2.5గ్రాముల మండోజెల్ లేదా 2గ్రాముల ఆంట్రాకాల్ కలిపి పిచికారీ చేయాలి. తేనెమందు పురుగులు... తల్లి, పిల్ల పురుగులు గుంపులుగా చేరి లేత ఆకులను, పూత కాండాలు, పూలు, లేత పిందెల నుంచి రసం పీల్చుతాయి. లేత ఆకులను ఆశించినప్పుడు ఆకుల చివర్ల మాడిపోతాయి. పూత మాడిపోతుంది. పిందెలు బలహీనపడి రాలిపోతాయి. అంతేకాకుండా ఈ పురుగు తేనెలాంటి తియ్యని పదార్థాన్ని విసర్జిం చడం వల్ల ఆకులు, కాండలు, కాయలపై మసిపొర ఏర్పడుతుంది. దీంతో ఆకుల్లో కిరణజన్య సంయోగక్రియ జరగక కాయలు రాలిపోతాయి. పూత, పిందె దశలో ఈ పురుగుల ఉద్ధృతి అధికంగా ఉంటుంది. మిగతా సమయంలో ఈ పురుగులు చెట్ల మొదలు, కొమ్మల బెరడులోని పగుళ్లలో ఉంటాయి. కాయలపై మసి ఏర్పడి నాణ్యత లోపిస్తాయి. వీటి నివారణకు 1.5 మి.లీ. మోనోక్రొటోఫాస్ మందును లీటరు నీటిలో కలిపి పిచికారీ చేయాలి. పూత, మొగ్గ దశలో లీటరు నీటికి ఒక మి.లీ. డైక్లోరోఫాస్ లేదా 3గ్రాముల కార్పోరిల్ కలిపి చెట్టంతా తడిచేలా పిచికారీ చేయాలి. పచ్చపూత దశలో కాండలు బయటకు వచ్చి పూలు వికసించకుండా ఇంకా మొగ్గ దశలో ఉన్నప్పుడు లీటరు నీటికి 2 మి.లీ. మోనోక్రొటోపాస్, లేదా డైమిథోయేట్, లేదా 3 మి.లీ. జిథైల్డెమాటాన్, లేదా0.25మిల్లిలీటర్ల ఇమిడాక్లోపిడ్ పిచికారీ చేయాలి. నవంబర్ మాసంలో ఈజాగ్రత్తలు.. సూక్ష్మ పోషకాల లోపాలను నివారించడానికి లీటరు నీటికి 5 గ్రాముల జింక్ సల్ఫేట్, మూడు గ్రాముల బోరాక్స్ 5గ్రాముల ఫెర్రిస్ సల్ఫేట్, 10 గ్రా. యూరియా కలిపి 10 నుంచి 15రోజుల వ్యవధిలో రెండుమార్లు పిచికారీ చేయాలి. తోటలో కలుపు లేకుండా చూడాలి. వర్షం పడితే రసం పీల్చే పురుగులు ఎక్కువగా చేరతాయి. వీటి నివారణకు ఒక గ్రాము ఎసిఫేట్ లేదా పిప్రోనిల్ 2 మి.లీ. లేదా ఇమిడాక్లోఫిడ్ ఏడు మి.లీ. ఒక లీటరు నీటితో కలిపి పిచికారీ చేసుకోవాలి. తోటలో పూత, మొగ్గలు ప్రారంభమైన తర్వాత మొగ్గలు పగిలి పూత రావడానికి రెండు గ్రాముల బోరాన్ లేదా 10 గ్రాముల మల్టీ-కేతో పాటు 5 గ్రాముల ఫార్ములా-4 మందును లీటరు నీటికి కలికి పిచికారీ చేయాలి. సందేహాలున్న రైతులు 89744 49325ను సంప్రదించవచ్చు. -
జాగ్రత్తలతో జామ సాగు.. బాగుబాగు
ఒంగోలు టూటౌన్ : జిల్లాలో సుమారు 600 ఎకరాల్లో జామ తోటలు సాగవుతున్నాయి. మద్దిపాడు మండలంలోని ఇనమెనమెళ్లూరు, కీర్తిపాడు, చుట్టుపక్కల గ్రామాల్లో పంట సాగవుతోంది. తీరప్రాంత మండలాలైన కొత్తపట్నం, చిన్నగంజాం, పందిళ్లపల్లి, వేటపాలెం మండలాల్లో కూడా జామ సాగులో ఉంది. ప్రస్తుతం తోటలు పూత, పిందె, కాయ దశల్లో ఉన్నాయి. ఈ దశల్లోనే పంటను వివిధ రకాల పురుగులు, తెగుళ్లు ఆశిస్తాయి. వీటి నివారణ చర్యల గురించి ఉద్యాన శాఖ ఏడీ పి.జెన్నెమ్మ (83744 49051) వివరించారు. పండు ఈగ.. కాయలు పక్వానికి రాగానే పండు ఈగ ఉృదతి ఎక్కువగా ఉంటుంది. 2 మిల్లీ లీటర్ల మిథైల్యూజినాల్, 3 గ్రాముల కార్బోఫ్యూరాన్, 3జి గుళికలను లీటరు నీటిలో కలిపి ద్రావణాన్ని తయారు చేయాలి. ఒక్కో ప్లాస్టిక్ పళ్లెంలో 200 మిల్లీ లీటర్ల ద్రావణాన్ని పోయాలి. తోటలో అక్కడక్కడా చెట్ల కొమ్మలకు వాటిని వేలాడదీయాలి. మగ ఈగలు ఆకర్షణకు గురై ద్రావణంలో పడి చనిపోతాయి. 2 మిల్లీలీటర్ల మలాథియన్‌ను లీటరు నీటిలో కలిపి పిచికారీ చేయాలి. తోటలో పండు ఈగ ఆశించి రాలిపడిన కాయలను ఏరివేసి నాశనం చేయాలి. తెల్లదోమ.. తెల్లదోమ ఆకులపై చేరి రసాన్ని పీలుస్తాయి. ఆకులు ఎర్రబడి ముడతలు పడతాయి. వీటి నివారణకు జిగురు పూసిన పసుపు రంగు డబ్బాలను రాత్రివేళల్లో తెల్లదోమ ఆశించిన చెట్ల వద్ద ఉంచాలి. వేప నూనె 0.5 మిల్లీ లీటర్లను లీటరు నీటిలో కలిపి పిచికారీ చేయాలి. సమస్య పరిష్కారమవుతుంది. పిండినల్లి.. కొమ్మల చివర కాయలను ఆశించి రసాన్ని పీలుస్తాయి. కాయలు, ఆకులు రాలిపోతాయి. ఇవి జిగురు పదార్థాన్ని విసర్జించడం వల్ల మసి తెగులు వస్తుంది. వీటి నివారణకు అక్షింతలు పురుగు బదనికలను తోటలో విడుదల చేయాలి. ఎసిఫేట్ గ్రాము, లేదా డైక్లోరోవాస్ 1 మిల్లీ లీటరును లీటరు నీటిలో కలిపి పిచికారీ చేయాలి. -
దిగుమతులు ఆగితేనే ‘గిట్టుబాటు’: కేసీఆర్
* రైతులు ఆధునిక పద్ధతులతో అధిక దిగుబడులు సాధించాలి * తెలంగాణలో వ్యవసాయాన్ని లాభసాటిగా మారుస్తాం * ఛత్తీస్‌గఢ్‌లో వ్యవసాయ క్షేత్రాలను సందర్శించిన ముఖ్యమంత్రి అక్కడి రైతులతో ముఖాముఖి సాక్షి, హైదరాబాద్: రైతులకు గిట్టుబాటు ధర లభించాలంటే విదేశాల నుంచి దిగుమతులు ఆగిపోవాలని తెలంగాణ ముఖ్యమంత్రి చంద్రశేఖర్‌రావు అభిప్రాయపడ్డారు. దేశంలో ఆహారధాన్యాల కొరత ఉన్నప్పటికీ రైతులకు గిట్టుబాటు ధర రావడం లేదన్నారు. ఆధునిక వ్యవసాయ విధానాలు అవలంభించడం ద్వారా అధిక దిగుబడులు సాధించాల్సిన అవసరముం దని ఆయన పేర్కొన్నారు. రెండు రోజుల ఛత్తీస్‌గఢ్ పర్యటనకు వెళ్లిన సీఎం ఆదివారం అక్కడి దుర్గ్, బెమెత్రా జిల్లాల్లోని వ్యవసాయ క్షేత్రాలు, విత్తనాభివృద్ధి కేంద్రాలు, గ్రీన్హౌస్ ఫామ్‌లను సందర్శించి, రైతులతో ముఖాముఖి మాట్లాడారు. తెలంగాణకు విద్యుత్ ఇచ్చి ఆదుకోవాలని ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి రమణ్‌సింగ్‌ను కోరడానికి వచ్చానని తెలిపారు. ఎంతో కష్టపడి పంట లు పండిస్తున్నా గిట్టుబాటు ధరలు లభించకపోవడం దారుణవన్నారు. విదేశాల నుంచి దిగుమతులు తగ్గిపోవాలని దీనిపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు దృష్టి పెట్టాల్సిన అవసరం ఉందని కేసీఆర్ అభిప్రాయపడ్డారు. ఆధునిక విధానాలతో అత్యధిక దిగుబడి సాధిస్తున్న ఛత్తీస్‌గఢ్ రైతుల ను ఆయన అభినందించారు. ఈ సందర్భంగా వీఎస్ఆర్ సీడ్స్ సంస్థ గురించి విని సంస్థ ఎండీ విమల్ చౌదాను స్వయంగా తన వ్యవసాయ క్షేత్రానికి ఆహ్వానించినట్లు సీఎం వివరించారు. లాభసాటిగా మారుస్తాం.. తెలంగాణలో వ్యవసాయాన్ని లాభసాటిగా మార్చాలన్నదే తన సంకల్పమని ముఖ్యమంత్రి చెప్పారు. లాభసాటి వ్యవసాయం చేసేలా రైతులను తీర్చిదిద్దాల్సిన బాధ్యత తనపై ఉందని, తెలంగాణ నేలల్లో బంగారు పంటలు పండాలని ఆకాంక్షించారు. అయితే ఛత్తీస్‌గఢ్‌లో ఒక ఎకరానికి 80 టన్నుల కాప్సికం, మరో రైతు ఎకరానికి 420 క్వింటాళ్ల మిర్చి పండించినట్లు తెలిసి ఆశ్చర్యపోయినట్లు పేర్కొన్నారు. తెలంగాణలోని నిజామాబాద్ జిల్లా అంకాపూర్ రైతులు కూడా అద్భుతాలు సృష్టిస్తున్నారన్నారు. ‘‘రైతులు ఎక్కడికక్కడ సంఘటితం కావాలి. ఐక్యంగా వ్యవసాయం చేయాలి. రైతులకు సంఘాలు లేవు. వారు పండించే పంటకు సరైన ధర వచ్చే అవకాశమే లేదు. ఈ పరిస్థితి పోవాలంటే ప్రభుత్వాలు వారికి సహకరించాల్సిన అవసరం ఉంది..’’ అని కేసీఆర్ పేర్కొన్నారు. కరెంటు అందుబాటులో ఉంటే తెలంగాణలో కూడా అద్భుతాలు సృష్టిస్తామని చెప్పారు. తొలిరోజు వ్యవసాయ క్షేత్రాల్లో... ఛత్తీస్‌గఢ్ పర్యటన తొలిరోజు సీఎం కేసీఆర్.. అక్కడి వ్యవసాయ క్షేత్రాలు, విత్తనాభివృద్ధి కేంద్రాల్లో పర్యటించారు. దుర్గ్ జిల్లాలోని మాల్పురి గ్రామంలో వంద ఎకరాల్లో సాగవుతున్న కూరగాయలు, పండ్ల తోటలను పరిశీలించారు. జామ, టమాటా, అరటి, దోస, వంకాయ, అల్లం, క్యాబేజీ, క్యాలీఫ్లవర్, దానిమ్మ, ఖర్జూర పంటలను... తక్కువ నీటి వినియోగంతో పంటలు పండించడాన్ని పరిశీలించారు. ఒక చోట 50, 60 ఎకరాల్లో ఒకే రకమైన పంట వేయడాన్ని.. బెమెత్రా జిల్లాలోని కోహడియా గ్రామంలో గ్రీన్హౌస్లను సందర్శించారు. కేసీఆర్‌కు ఘన స్వాగతం.. సీఎం కేసీఆర్‌కు ఛత్తీస్‌గఢ్‌లో రాష్ట్ర గౌరవ అతిథి హోదాలో ఘన స్వాగతం లభించింది. ఆ రాష్ట్ర మంత్రి రాజేశ్ ముసత్ ఆధ్వర్యంలో అధికారులు రాయ్‌పూర్‌లోని స్వామి వివేకానంద విమానాశ్రయంలో సాదర స్వాగతం పలికారు. రాష్ట్రావతరణ దినోత్సవాన్ని జరుపుకొంటున్న తరుణంలో కేసీఆర్ అక్కడికి రావడంపై సంతోషం వ్యక్తం చేశారు. గ్రామాల్లో పర్యటనకు వెళ్లినప్పుడు ఆయా ప్రాంత ఎమ్మెల్యేలు కేసీఆర్ వెంట ఉన్నారు. ముఖ్యమంత్రి వెంట మంత్రి ఈటెల రాజేందర్, ఢిల్లీలో రాష్ట్ర ప్రభుత్వ ప్రతినిధి వేణుగోపాలాచారి, సీఎంవో ముఖ్యకార్యదర్శి నర్సింగ్‌రావు తదితరులు ఉన్నారు. -
వరిలో సస్యరక్షణ చర్యలు చేపట్టాలి
మొయినాబాద్: వరిలో సస్యరక్షణ చర్యలు పాటిస్తేనే అధిక దిగుబడులు వచ్చే అవకాశం ఉంటుంది. సకాలంలో తెగుళ్లను గుర్తించి వాటి నివారణ చర్యలు పాటించాలి. యాజమాన్య పద్ధతుల్లో పంటకు కావాల్సిన ఎరువులు అందించాలి. ఏయే సమయంలో ఎలాంటి ఎరువులు అందించాలి, ఏయే తెగుళ్లకు ఎలాంటి మందులు పిచికారీ చేయాలో మొయినాబాద్ మండల వ్యవసాయాధికారిణి రాగమ్మ వివరించారు. మొయినాబాద్, శంషాబాద్, చేవెళ్ల, శంకర్పల్లి తదితర మండలాల్లో వర్షాలు ఖరీఫ్ సీజన్ ఆరంభం నుంచి కురవలేదు. ఆగస్టులో వర్షాలు కురవడంతో వరినాట్లు చాలా ఆలస్యంగా వేశారు. ప్రస్తుతం వరి పిలకలు పెట్టే దశనుంచి చిరుపొట్ట దశలో ఉంది. వాటికి ఆశించే తెగుళ్లు, నివారణ చర్యలపై రాగమ్మ సూచనలు, సలహాలు అందజేశారు. ఎరువుల యాజమాన్యం వరిలో యాజమాన్య పద్ధతులు తప్పనిసరిగా పాటించాలి. నాట్లు వేసే ముందు పూర్తి భాస్వరం, సగం పొటాష్ ఎరువులను ఆఖరు దమ్ములో వేసుకోవాలి. ఇప్పటికే నాట్లు పూర్తయ్యాయి కనుక మిగిలిన సగం పొటాష్‌ను వరి చిరుపొట్ట దశలో ఉన్నప్పుడు నత్రజని ఎరువులతో కలిపి వేసుకోవాలి. నత్రజని ఎరువులను 3 సమ భాగాలుగా చేసి 1/3వ భాగం విత్తిన 15-20 రోజులకు, రెండో భాగాన్ని పిలక దశలో విత్తిన 40-45 రోజులకు, మిగిలిన భాగాన్ని చిరుపొట్ట దశలో విత్తిన 60-65 రోజులకు వేసుకోవాలి సాధారణంగా ఎకరా వరికి 48 కిలోల నత్రజని, 24 కిలోల భాస్వరం, 20 కిలోల పొటాష్ ఎరువులను వాడుకోవాలి. ఉదాహరణకు.. ఒక బస్తా డీఏపీ, 15 కిలోల ఎంఓపీ విత్తిన 15 రోజులకు, పిలక దశలో, చిరుపొట్ట దశలో ఎకరాకు 32 కిలోల చొప్పున యూరియా చల్లుకోవాలి. ఆఖరి దఫా యూరియాతోపాటు 20 కిలోల ఎంఓపీ తప్పనిసరిగా వేసుకోవాలి. తెగుళ్లు.. వాటి నివారణ.. కాండంతొలుచు పురుగు, ఆకుముడత తెగులు ఈ తెగులు పూత దశలో, ఈనిక దశలో ఆశిస్తుంది. దీని నివారణకు ఎసిఫేట్ 1.5 గ్రాములు, కార్టాప్ హైడ్రోక్లోరైడ్ 2 గ్రాములు లీటరు నీటికి కలిపి పిచికారీ చేయాలి. అదే విధంగా కార్బోప్యూరాన్ 3జీ 10 కిలోలు, కార్టప్ హైడ్రోక్లోరైడ్ 4జీ ఎ కిలోలు ఎకరాకు వేసుకోవాలి. అగ్గితెగులు (మెడవిరుపు) వరి పిలకదశ, పూత దశలో ఉన్నప్పుడు ఈ తెగులు ఆశిస్తుంది. దీని నివారణకు ట్రైసైక్లోజోల్ 0.6 గ్రాములు, లేదా ఐసోప్రోధయోలేన్ 1.5 మిల్లీలీటర్ల మందును లీటరు నీటిలో కలిపి పిచికారీ చేయాలి. హిస్పా (ఎండాకు తెగులు) ఈ పురుగు పిలక దశలో ఆశిస్తుంది. దీని నివారణకు ప్రొఫేనోఫాస్ 2 మిల్లీ లీటర్లు, క్లోరోఫైరిఫాస్ 2.5 మిల్లీలీటర్లు, మోనోక్రోటోఫాస్ 1.6 మిల్లీలీటర్లు లీటరు నీటికి కలిపి పిచికారీ చేయాలి. వరి పిలక దశ, చిరుపొట్ట దశ, పూత దశలో పలు రకాల తెగుళ్లు ఆశిస్తాయి. వాటికి తగిన మందులు పిచికారీ చేయాల్సి ఉంటుంది. ప్రస్తుతం వరిచేలు పిలక దశ దాటాయి. పంటను రైతులు ఎప్పటికప్పుడు పరిశీలించి తెగుళ్లను గుర్తిస్తే వెంటనే సస్యరక్షణ చర్యలు చేపట్టాలి. తగు జాగ్రత్తలు పాటించి రైతులు అధిక దిగుబడులు పొందాలి. పాముపొడ తెగులు ఈ తెగులు పిలక దశ నుంచి దుబ్బకట్టే వరకు ఆశిస్తుంది. దీని నివారణకు హెక్సాకోనజోల్ 2 మిల్లీలీటర్లు, లేదా ప్రొపికోనజోల్ 1 మిల్లీలీటరు లీటరు నీటిలో కలిపి 15 రోజుల వ్యవధిలో రెండుసార్లు పిచికారీ చేసుకోవాలి. సుడిదోమ తెగులు ఈ తెగులు పిలక దశ, పూత దశలో ఆశిస్తుంది. దీని నివారణకు ఎసిఫేట్ 1.5 గ్రాములు, మోనోక్రోటోఫాస్ 2.2 మిల్లీలీటర్లు, ఎథోఫెన్ఫ్రాక్స్ 2.0 మిల్లీలీటర్లు లీటరు నీటికి కలిపి పిచికారీ చేయాలి. -
బాగు బాగు బొప్పాయి సాగు
ఖమ్మం వ్యవసాయం: గత ఏడాది వరకు జిల్లాలో 300 ఎకరాల మేరకు బొప్పాయి సాగు విస్తీర్ణం ఉండగా ఈ ఏడాది వెయ్యి ఎకరాలకు పైగా సాగు చేస్తున్నారు. ఈ సాగు విస్తీర్ణం మరింత పెరిగే అవకాశం ఉంది. రాష్ట్ర ఉద్యాన మిషన్ ఈ పంట సాగుకు ఉత్పాదకాల రూపంలో రాయితీ కల్పించి ఆర్థికంగా, సాంకేతికంగా తోడ్పాటునిస్తోంది. ఈ పంట సాగు పద్ధతులు, మెళకువలు, తెగుళ్ల నివారణ గురించి కొత్తగూడెం, మధిర ఉద్యానశాఖ అధికారి బి. శ్రావణ్ వివరించారు. వాతావరణం: బొప్పాయి ఉష్ణ మండలపు పంట. వేసవిలో 38 డిగ్రీల సెంటీగ్రేడ్ నుండి 48 డిగ్రీల సెంటీగ్రేడ్ ఉష్ణోగ్రత వరకు తట్టుకుంటుంది. నేలలు: సారవంతమైన ఎర్రగరప నేలలు, ఒండ్రు నేలలు, అనుకూలం. వీటితో పాటు తేలికగా నీరు ఇంకిపోయే రేగడి నేలల్లో కూడా ఈ పంటను సాగు చేసుకోవచ్చు. రకాలు: బొప్పాయిలో రెండు రకాల మొక్కలు ఉంటాయి. డైయోషియస్కు చెందిన వాషింగ్టన్, కో-1, కో-2, కో-4, కో-5, కో-6, పూసా డార్ఫా, పూసా జెయింట్, పూసానన్హా, హనిడ్యూ రకాల్లో ఆడ, మగ చెట్లు విడివిడిగా ఉంటాయి. గైనోడయోసియస్కు చెందిన కూర్గు హనీడ్యూ, సోలో, సన్‌రైజ్ సోలో, కో-3, కో-7, పూసాడెలీసియస్, పూసా మెజస్టీ, తైవాన్ రెడ్ లేడీ రకాల్లో ఆడ, ద్విలింగ మొక్కలు ఉంటాయి. వీటిలో మన జిల్లా రైతులు అధికంగా తైవాన్ రెడ లేడీ రకాన్ని ఎక్కువగా సాగు చేస్తున్నారు. ప్రవర్దనం: విత్తనం ద్వారా ప్రవర్దనం చేస్తారు. పండ్ల నుంచి తీసిన విత్తనాలను 40 రోజుల్లో విత్తకోవాలి. ఎకరాకు గైనోడయోసియస్ రకాలు 20 గ్రాములు సరిపోతాయి. అంతర పంటలు, అంతర కృషి బొప్పాయి నాటిన తరువాత 6-7 మాసాలకు కాపు వస్తుంది. అంత వరకు మొక్కల మధ్య కలుపు రాకుండా స్వల్పకాలిక అంతర పంటలు సాగు చేసుకోవచ్చు. జీలుగు, జనుము, అలసంద వంటి పచ్చిరొట్ట పంటలు వేసి పూ మొగ్గదశలో కలియదున్నాలి. దీనివల్ల భూసారం పెరుగుతుంది . మేలు చేసే సూక్ష్మజీవులు అభివృద్ధి చెంది తెగుళ్ల తాకిడి తగ్గుతుంది. వేరుశనగ, శనగ, పెసర, మినుము, అలసంద, సోయాచిక్కుడు, నేల చిక్కుడు వంటి పంటలు వేసుకోవచ్చు. మిరప, వంగ, టమాట వంటి పంటలను కూడా సాగు చేసుకోవచ్చు. బొప్పాయిని అంతరపంటగా మామిడి, సపోట, కొబ్బరి వంటి తోటల్లో కూడా వేసుకోవచ్చు. ఎరువులు: చె ట్టు వయసును బట్టి ఎరువులను వినియోగించాలి. ఒక్కో చెట్టుకు నాటే గుంతలో ఐదు కిలోల పశుల ఎరువు, 200 గ్రాముల సూపర్ పాస్ఫేట్ వేయాలి. మొక్క 2, 4, 6, 8, 10, 12 నెలల్లో 90 గ్రాముల చొప్పున యూరియా, 200 గ్రాముల సూపర్, 140 గ్రాముల చొప్పున పొటాష్ వేయాలి. 6, 12 నెలల్లో ఐదు కిలోల చొప్పున పశువుల ఎరువు వేయాలి. తెగుళ్ల నివారణ కాండం మొదలు కుళ్లు: వేర్ల మొదలు మెత్తగా మారి కుళ్లిపోతాయి. కాయలున్న చెట్లకు ఈ తెగులు ఆశిస్తే నష్టం అధికంగా ఉంటుంది. దీని నివారణకు మొక్క మొదలు దగ్గర నీరు నిల్వ ఉండకుండా చూడాలి. బోర్డో మిశ్రమం ఒక శాతం మందుతో కాండంపైన, లేదా, మెటాలాక్సిన్ లేదా క్లోరోథలానిల్ లేదా అలియేట్ రెండు గ్రాములు లీటర్ నీటిలో కలిపి మొదలు తడపాలి. ఇలా వారంలో రెండుసార్లు తడపాలి. ఆంత్రక్నోన్ ఆకుపచ్చ తెగులు: ఈ తెగులు సోకితే నల్లటి ఉబ్బెత్తుగా ఉన్న మచ్చలు ఏర్పడుతాయి. కాయలు పక్వానికి రావు. నివారణకు లీటర్ నీటిలో మంకోజెట్ 2.5 గ్రాములు లేదా క్లోరోథలామిన్ రెండు గ్రాముల మందును కలిపి 15 రోజుల వ్యవధిలో రెండు సార్లు పిచికారీ చేయాలి. కాండం కుళ్లు: కాండం మొదలు కుళ్లిపోయి మొక్కలు వాలిపోతాయి. దీని నివారణ కు ఒక కిలో ట్రైకోడెర్మా విరిడీ+90 కిలోల పశువుల ఎరువు+ 10 కిలోల వేపపిండి+ కిలో బెల్లం నీటిని 10 రోజులు నిల్వ ఉంచి చెట్ల పాదుల్లో పోయాలి. తెగులు ఉధృతి ఎక్కువగా ఉంటే లీటర్ నీటిలో రెండు గ్రాముల రెడోమిల్ ఎంజెడ్ కలిపి చెట్ల మొదలు, కాండం తడిసేలా పోయాలి. ఆకుముడత: ఇది వైరస్ వల్ల ఆశిస్తుంది. ఈ వైరస్ ఆశించిన మొక్కల్లో ఆకులు ముడుచుకుపోతాయి. తె గులు సోకితే దిగుబడులు గణనీయంగా తగ్గుతాయి. కీటక నాశినులను ఉపయోగించి ఈ వైరస్‌ను అరికట్టాలి. పండు ఈగ: కాయ పక్వానికి వచ్చినప్పుడు ఆశించి నష్టాన్ని కలిగిస్తుంది. ఈ ఈగ లార్వాలు కాయలోని గుజ్జును తింటాయి. నివారణకు తోటను శుభ్రంగా ఉంచుకోవాలి. రాలిన పండ్లను ఎప్పటికప్డుపు ఏరివేయాలి. మి.లీ మిథైల్ యూజినాల్, రెండు గ్రాముల కార్బోఫ్యూరాన్, ఒక లీటర్ నీటిలో కలిపి పొలంలో అక్కడక్కడ ఉంచాలి. -
పశువుల పేడ, వేపపిండే పెట్టుబడి
కందుకూరు: ప్రస్తుతం రైతులు అధిక దిగుబడులు పొందాలనే తలంపుతో ఇష్టానుసారంగా రసాయన ఎరువులు, క్రిమిసంహార మందులు వాడుతూ పంటలు పండిస్తున్నారు. దీంతో మనం తినే ఆహారం కలుషితంగా మారి రోగాల బారిన పడుతున్నాం. ఈ విధానాన్ని మార్చాలనే సంకల్పంతో మొదట తన ఇంటి అవసరాలకు పండించే వరిని ఎలాంటి రసాయన, క్రిమి సంహారక మందులు వినియోగించకుండా పండిస్తున్నాడు కందుకూరుకు చెందిన టంకరి యాదగిరిరెడ్డి. రెండేళ్లుగా ఇదే విధానంలో వరి సాగు చేస్తూ ఇంటి అవసరాలకు ఉపయోగించుకుంటున్నాడు. ఎకరా విస్తీర్ణంలో హంస రకం వరి సాగును కేవలం పశువుల పేడ, వేప పిండితో పూర్తిగా సేంద్రియ పద్ధతుల్లో చేపట్టాడు. ఎకరాకు పది ట్రాక్టర్ల ఎరువుతో పాటు, వేప గింజల్ని కొనుగోలు చేసి పిండి చేసుకుని నాలుగు సంచుల పిండిని వాడుతున్నాడు. నాట్లు వేయడానికి, కలుపు తీయడం, నూర్పిడి చేయడానికి తప్ప ఎలాంటి ఖర్చు లేదంటున్నాడు. పంటపై ఇంత వరకు ఎలాంటి తెగుళ్లు, పురుగులు సోకలేదంటున్నాడు. రసాయన ఎరువులు, క్రిమిసంహారక మందులు వాడకపోవడంతో మిత్ర పురుగులు బాగా వృద్ధి చెంది తెగుళ్లు రాకుండా నివారిస్తున్నాయంటున్నాడు. సాధారణ సాగు కంటే కొద్దిగా దిగుబడి తక్కువ వచ్చినా గింజ నాణ్యంగా ఉంటుందని, బియ్యంలో నూకలు రావని అంటున్నాడు. దిగుబడి తగ్గినా, ఖర్చులు తక్కువ కావడం, పంట నాణ్యంగా ఉండటం కలిసి వస్తుందంటున్నాడు. ప్రస్తుతం వరి పంట ఆ విధానంలో సాగు చేస్తున్నానని, విడతల వారీగా మిగతా పంటల వైపు దృష్టి సారిస్తున్నానని, అందరు రైతులు సేంద్రియ వ్యవసాయం చేయాలనేది తన కోరిక అంటున్నాడీ రైతు. -
కొత్త ‘వరి’ లోకం
కందుకూరు : మండలంలోని మాచవరం గ్రామ రైతులు వరి సాగులో సాంకేతిక విప్లవాన్ని అందిపుచ్చుకున్నారు. ఆధునిక యంత్రాలతో సాగు చేస్తూ అందరికీ ఆదర్శంగా నిలుస్తున్నారు. దీనివల్ల పెట్టుబడి, నీరు, కూలీల ఖర్చు తగ్గించుకోవడమేగాక, అధిక దిగుబడులు సాధిస్తున్నారు. వరి నారుమడి పెంచడం దగ్గర నుంచి నాట్లు వేయడం వరకు పూర్తిగా యంత్రాలతోనే చేస్తున్నారు. కేవలం మూడేళ్లలో 50 నుంచి 150 ఎకరాల వరకు ఈ తరహా సాగు విస్తరించింది. ప్రధాన పొలం ఇలా సిద్ధం చేసుకోవాలి వరినాటు యంత్రంతో నాట్లు వేసే ముందు ప్రధాన పొలానికి బాగా నీరుపెట్టి ట్రాక్టర్ ద్వారా రొటావేటర్, లెవలింగ్ బ్లేడ్ సాయంతో(5సెంమీ లోతున) బురద దుక్కి చేయాలి. ఆ తర్వాత డీఏపీ/ఎస్ఎస్పీ, ఎంఓపీ వేయాలి. బరువు నేలలు అయితే 24 గంటలు, తేలిక నేలలు అయితే 12 గంటల పాటు మట్టిని, నీటిని బాగా స్థిరపడనివ్వాలి. నీరు చాలా పలుచుగా ఉంటేనే యంత్రంతో నాట్లు పడతాయి. ఎకరా పొలంలో రెండు మొక్కల మధ్య 16సెంమీల దూరంలో నాటితే మొత్తం 60-70 ట్రేలలోని నారు సరిపోతుంది. అందుబాటులో రెండు యంత్రాలు వరి నాటే ట్రాన్స్‌ప్లాంటర్ యంత్రాలు రెండు రకాలున్నాయి. మొదటిది పవర్ టెల్లర్ మాదిరిగా(డీజిల్‌తో) ఒక మనిషి ప్రధాన పొలంలో ఆ యంత్రాన్ని నె ట్టుకుంటూ పోతే నాట్లు పడతాయి. దీనిని వాకింగ్ టైపు యంత్రం అంటారు. రెండోదానిపై ఒక మనిషి కూర్చుని నడిపిస్తే(పెట్రోల్‌తో) పొలంలో నాట్లు పడతాయి. మాచవరం రైతులు ఈ యంత్రాన్నే ఉపయోగిస్తున్నారు. అలాగే వరినాటే యంత్ర పరికరాలు ప్రైవేట్‌గా డీజిల్‌తో నడిచేవి మార్కెట్లో ఉన్నాయి. వీటి ద్వారా ఒకేసారి ఆరు నుంచి ఎనిమిది వరుసల్లో నాట్లు వేసుకోవచ్చు. వరుసల మధ్య 30సెంమీల దూరం, చాళ్లలో మొక్కల మధ్య 10, 12, 14, 16, 18, 20 సెంమీల దూరంలో నాటు వేసేలా మార్చుకోవచ్చు. ఈ యంత్రంతో నాట్లు వేసేటప్పుడు దుబ్బుకి 3-5 మొక్కలు పడేలా మార్చుకునే వీలుంది. ఈ యంత్రంతో రోజుకి 8నుంచి 10 ఎకరాలు నాట్లు వేయవచ్చు. -
సేంద్రియ శ్రీ వరి
కందుకూరు: శ్రీ వరి సాగును సేంద్రియ పద్ధతిలో చేపట్టి అధిక దిగుబడులు సాధిస్తూ పలువురు రైతులకు ఆదర్శంగా నిలుస్తున్నారు మండల పరిధిలోని నేదునూరుకు చెందిన బి.చంద్రశేఖర్‌రెడ్డి, పోలమోని లక్ష్మణ్‌లు. తక్కువ పెట్టుబడి, తక్కువ నీటి వనరులతో పంట సాగు చేస్తున్న ఆ రైతులు చెబుతున్న విషయాలు ఇవీ.. అవలంబిస్తున్న సాగు పద్ధతి ఆవు పేడ, మూత్రం కలిపి మూడు రోజులు పులియబెట్టిన తర్వాత ఎకరాకు రెండు కిలోల వరి విత్తనాలను తీసుకుని ఆ ద్రావణంలో విత్తన శుద్ధి చేసుకోవాలి. బెడ్ తయారు చేసుకుని నారు పోసుకోవాలి. దుక్కిలో ఎకరాకు మూడు టన్నుల పశువుల ఎరువు వేసుకోవాలి. డీఏపీ వంటి రసాయన ఎరువుల్ని ఒకేసారి తగ్గించకుండా ఎకరాకు 50 కిలోలు వేసే చోట 15 కిలోలు వేసుకోవాలి. క్రమేణా తగ్గిస్తే నాలుగేళ్ల తర్వాత అసలు ఆ మోతాదు రసాయన ఎరువు కూడా అవసరం ఉండదు. దుక్కిలో లేదా నాటే ముందు, లేదా రెండు నెలల తర్వాత ఎకరాకు 150 కిలోల వేప పిండి వేసుకోవాలి. నారు పోసిన 28 నుంచి 30 రోజుల తర్వాత తాడు సహాయంతో లేదా మార్కర్ ద్వారా మొక్క మొక్కకు ప్రతి వరుసకు 25 సెం.మీ. ఎడముతో నాటుకోవాలి. నాట్లు వేసే సమయంలో పావు అంగుళం మేర మాత్రమే నీరు ఉంచుకోవాలి. మడుల్ని చదరంగా ఉంచుకుంటే 15 రోజుల్లో కూడా నాట్లు వేసుకోవచ్చు. ప్రారంభంలో రెండు నెలల వరకు ఆరుతడి పంటలకు అందించిన విధంగా నీరు పెట్టుకున్నా సరిపోతుంది. పొట్టదశలో ఎక్కువ నీరు అవసరమవుతుంది. పది కిలోల చొప్పున ఆవుపేడ, ఆవు మూత్రం, పప్పు దినుసుల పిండి, కిలో బెల్లం తీసుకుని 200 లీటర్ల నీటిలో మూడు రోజులు మురగబెట్టి బాగా కలియతిప్పి జీవామృతాన్ని తయారు చేసుకోవాలి. ఆ ద్రావణాన్ని మొక్క బలం గా కుదురుకున్న తర్వాత ప్రతి 15, 20 రోజులకోసారి నీటి ద్వారా పారించుకోవాలి. అవసరమైతే ఆ ద్రావణాన్ని పై పాటుగా పిచికారీ చేసుకోవచ్చు. అవసరాన్ని బట్టి వేప నూనె లేదా పులియబెట్టిన మజ్జిగతో చేసిన ద్రావణాన్ని పిచికారీ చేసుకుని చీడపీడలు, తెగుళ్లను నివారించవచ్చు. రోటో వీడర్‌తో.. పది మంది కూలీలు నాలుగు రోజులు చేసే పనిని రోటో వీడర్‌ను వినియోగించి ఎకరా విస్తీర్ణంలోని కలుపును ఒక వ్యక్తి కేవలం రెండు రోజుల్లో పూర్తిచేయవచ్చు. సాధారణంగా మొక్కకు 25 పిలకలు వస్తే రోటో వీడర్ తిప్పడంతో వేళ్లు కదిలి 60-80 పిలకలు వస్తాయి. అజోలా పెంపకంతో.. దీంతో పాటు అజోలా గడ్డిని పొలంలో పెంచుతున్నాం. అజోలా త్వరగా పెరగడంతో కలుపును పైకి రానీయదు. నీరు త్వరగా ఆవిరి కాకుండా చేస్తుంది. అజోలా పెంచితే యూరియా వేయాల్సిన అవసరమే ఉండదు. దాని ద్వారా నత్రజని విడుదల అవుతుంది. ఈ విధానంతో సాగు చేస్తూ ఎకరాకు రూ.5 వేల పెట్టుబడి తగ్గిస్తూ అదనంగా 15 బస్తాలు పండిస్తున్నామంటున్నారు ఆ రైతులు. -
ఆరుతడి పంటగానూ వరి
ఈ పద్ధతిలో నీటి వినియోగం చాలా తక్కువ. పొలాన్ని దున్నడం.. నారుమడి తయారు చేయడం.. నాటు అవసరం లేకుండానే వరి పండించవచ్చు. వరి విత్తనాన్ని నేరుగా విత్తి ఆరుతడి పంటగా సాగు చేయవచ్చు. ఈ పద్ధతిలో ఆరుతడి పంటలకు ఇచ్చేలా నీటిని ఇస్తే సరిపోతుంది. పొలంలో తేమ తగ్గకుండా చూడాలి. ఇందుకోసం తేమ లేని సమయంలో భూమిని బాగా దున్ని విత్తనాలను సాళ్లలో గానీ, సీడ్ డ్రిల్లర్ ద్వారా కాని విత్తితే సరిపోతుంది. ఎకరాకు 12 కిలోల విత్తనం అవసరమవుతుంది. మాములు పద్ధతి మాదిరిగానే ఎరువులను వాడాల్సి ఉంటుంది. చీడపీడల సమస్య తక్కువగా ఉంటుంది. కలుపు ఎక్కువగా ఉంటుంది. అయితే కలుపు మందులు వాడి సమస్యను అధిగమించవచ్చు. అన్ని యాజమాన్య పద్ధతులు పాటిస్తే దిగుబడిలో ఎలాంటి తేడా ఉండదు. ఆధునిక యంత్రంతో వరినాట్లు ఆధునిక యంత్రంతో నాట్లు వేసి అధిక దిగుబడులు పొందవచ్చు. ఈ పద్ధతిలో నాట్లు వేయాలంటే ముందుగా నారును ట్రేలలో పెంచాల్సి ఉంటుంది. ట్రేలలో పెంచిన నారును, ప్రధాన పొలం సిద్దం చేసిన తర్వాత అక్కడకు తీసుకెళ్లి, నాటు మిషన్‌లో పెట్టి నాట్లు వేయాల్సి ఉంటుంది. ట్రేలలో నారును పెంచడం సామాన్య రైతులకు కొంత ఇబ్బందే. కూలీలతో పోల్చితే ఖర్చు తక్కువగా ఉన్నప్పటికి, ఈ పరికరాలు ఎక్కువ సంఖ్యలో అందుబాటులో లేవు. డ్రిప్‌తో వరి సాగు ఉన్న నీటిని డ్రిప్‌తో సద్వినియోగం చేసుకుంటూ సైతం వరి సాగు చేపట్టవచ్చు. ఒక మీటర్ వెడల్పు, 80 మీటర్ల పొడవుతో బెడ్లను తయారు చేసుకోవాలి. కలుపు నివారణ కోసం బెడ్లపైన మల్చింగ్ పేపర్ వేసుకోవాలి. అనంతరం విత్తనాలు వేసుకోవాలి. డ్రిప్ ద్వారా సాగు నీరుతోపాటు ఎరువులను సైతం అందించవచ్చు. ఒక సారి డ్రిప్ ఏర్పాటు చేసుకుంటే దాదాపు 10 ఏళ్లపాటు ఉపయోగించుకోవచ్చు. ఖర్చు ఎక్కువగా ఉంటుంది. ఏటా ఈ పద్ధతినే ఎంచుకునేవారికి ఇది ఉత్తమం.