దిగుమతులు ఆగితేనే ‘గిట్టుబాటు’: కేసీఆర్
* రైతులు ఆధునిక పద్ధతులతో అధిక దిగుబడులు సాధించాలి
* తెలంగాణలో వ్యవసాయాన్ని లాభసాటిగా మారుస్తాం
* ఛత్తీస్‌గఢ్‌లో వ్యవసాయ క్షేత్రాలను సందర్శించిన ముఖ్యమంత్రి అక్కడి రైతులతో ముఖాముఖి
సాక్షి, హైదరాబాద్: రైతులకు గిట్టుబాటు ధర లభించాలంటే విదేశాల నుంచి దిగుమతులు ఆగిపోవాలని తెలంగాణ ముఖ్యమంత్రి చంద్రశేఖర్‌రావు అభిప్రాయపడ్డారు. దేశంలో ఆహారధాన్యాల కొరత ఉన్నప్పటికీ రైతులకు గిట్టుబాటు ధర రావడం లేదన్నారు. ఆధునిక వ్యవసాయ విధానాలు అవలంభించడం ద్వారా అధిక దిగుబడులు సాధించాల్సిన అవసరముం దని ఆయన పేర్కొన్నారు. రెండు రోజుల ఛత్తీస్‌గఢ్ పర్యటనకు వెళ్లిన సీఎం ఆదివారం అక్కడి దుర్గ్, బెమెత్రా జిల్లాల్లోని వ్యవసాయ క్షేత్రాలు, విత్తనాభివృద్ధి కేంద్రాలు, గ్రీన్‌హౌస్ ఫామ్‌లను సందర్శించి, రైతులతో ముఖాముఖి మాట్లాడారు.
తెలంగాణకు విద్యుత్ ఇచ్చి ఆదుకోవాలని ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి రమణ్‌సింగ్‌ను కోరడానికి వచ్చానని తెలిపారు. ఎంతో కష్టపడి పంట లు పండిస్తున్నా గిట్టుబాటు ధరలు లభించకపోవడం దారుణవన్నారు. విదేశాల నుంచి దిగుమతులు తగ్గిపోవాలని దీనిపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు దృష్టి పెట్టాల్సిన అవసరం ఉందని కేసీఆర్ అభిప్రాయపడ్డారు. ఆధునిక విధానాలతో అత్యధిక దిగుబడి సాధిస్తున్న ఛత్తీస్‌గఢ్ రైతుల ను ఆయన అభినందించారు. ఈ సందర్భంగా వీఎస్‌ఆర్ సీడ్స్ సంస్థ గురించి విని సంస్థ ఎండీ విమల్ చౌదాను స్వయంగా తన వ్యవసాయ క్షేత్రానికి ఆహ్వానించినట్లు సీఎం వివరించారు.
లాభసాటిగా మారుస్తాం..
తెలంగాణలో వ్యవసాయాన్ని లాభసాటిగా మార్చాలన్నదే తన సంకల్పమని ముఖ్యమంత్రి చెప్పారు. లాభసాటి వ్యవసాయం చేసేలా రైతులను తీర్చిదిద్దాల్సిన బాధ్యత తనపై ఉందని, తెలంగాణ నేలల్లో బంగారు పంటలు పండాలని ఆకాంక్షించారు. అయితే ఛత్తీస్‌గఢ్‌లో ఒక ఎకరానికి 80 టన్నుల కాప్సికం, మరో రైతు ఎకరానికి 420 క్వింటాళ్ల మిర్చి పండించినట్లు తెలిసి ఆశ్చర్యపోయినట్లు పేర్కొన్నారు. తెలంగాణలోని నిజామాబాద్ జిల్లా అంకాపూర్ రైతులు కూడా అద్భుతాలు సృష్టిస్తున్నారన్నారు. ‘‘రైతులు ఎక్కడికక్కడ సంఘటితం కావాలి. ఐక్యంగా వ్యవసాయం చేయాలి. రైతులకు సంఘాలు లేవు. వారు పండించే పంటకు సరైన ధర వచ్చే అవకాశమే లేదు. ఈ పరిస్థితి పోవాలంటే ప్రభుత్వాలు వారికి సహకరించాల్సిన అవసరం ఉంది..’’ అని కేసీఆర్ పేర్కొన్నారు. కరెంటు అందుబాటులో ఉంటే తెలంగాణలో కూడా అద్భుతాలు సృష్టిస్తామని చెప్పారు.
తొలిరోజు వ్యవసాయ క్షేత్రాల్లో...
ఛత్తీస్‌గఢ్ పర్యటన తొలిరోజు సీఎం కేసీఆర్.. అక్కడి వ్యవసాయ క్షేత్రాలు, విత్తనాభివృద్ధి కేంద్రాల్లో పర్యటించారు. దుర్గ్ జిల్లాలోని మాల్‌పురి గ్రామంలో వంద ఎకరాల్లో సాగవుతున్న కూరగాయలు, పండ్ల తోటలను పరిశీలించారు. జామ, టమాటా, అరటి, దోస, వంకాయ, అల్లం, క్యాబేజీ, క్యాలీఫ్లవర్, దానిమ్మ, ఖర్జూర పంటలను... తక్కువ నీటి వినియోగంతో పంటలు పండించడాన్ని పరిశీలించారు. ఒక చోట 50, 60 ఎకరాల్లో ఒకే రకమైన పంట వేయడాన్ని.. బెమెత్రా జిల్లాలోని కోహడియా గ్రామంలో గ్రీన్‌హౌస్‌లను సందర్శించారు.
కేసీఆర్‌కు ఘన స్వాగతం..
సీఎం కేసీఆర్‌కు ఛత్తీస్‌గఢ్‌లో రాష్ట్ర గౌరవ అతిథి హోదాలో ఘన స్వాగతం లభించింది. ఆ రాష్ట్ర మంత్రి రాజేశ్ ముసత్ ఆధ్వర్యంలో అధికారులు రాయ్‌పూర్‌లోని స్వామి వివేకానంద విమానాశ్రయంలో సాదర స్వాగతం పలికారు. రాష్ట్రావతరణ దినోత్సవాన్ని జరుపుకొంటున్న తరుణంలో కేసీఆర్ అక్కడికి రావడంపై సంతోషం వ్యక్తం చేశారు. గ్రామాల్లో పర్యటనకు వెళ్లినప్పుడు ఆయా ప్రాంత ఎమ్మెల్యేలు కేసీఆర్ వెంట ఉన్నారు. ముఖ్యమంత్రి వెంట మంత్రి ఈటెల రాజేందర్, ఢిల్లీలో రాష్ట్ర ప్రభుత్వ ప్రతినిధి వేణుగోపాలాచారి, సీఎంవో ముఖ్యకార్యదర్శి నర్సింగ్‌రావు తదితరులు ఉన్నారు.