మామిడి పూత, కాతలను నిలుపుకొంటేనే.. | Higher yields possble with protect the mango coating | Sakshi
Sakshi News home page

మామిడి పూత, కాతలను నిలుపుకొంటేనే..

Published Wed, Nov 19 2014 12:09 AM | Last Updated on Tue, Oct 9 2018 4:55 PM

మామిడి పూత, కాతలను నిలుపుకొంటేనే.. - Sakshi

మామిడి పూత, కాతలను నిలుపుకొంటేనే..

 మామిడి పూత సాధారణంగా డిసెంబర్ - జనవరి నెలల్లో మొదలై ఫిబ్రవరి వరకు పూస్తుంది. ఎనిమిది నెలల పాటు చేపట్టే యాజమాన్య పద్ధతులు ఒక ఎత్తయితే పూత నుంచి కోత వరకు నాలుగు నెలల పాటు చేపట్టే పద్ధతులు మరో ఎత్తు. మామిడిలో పూతంతా ఒకేసారి రాదు. దీంతో మాసం మొత్తం పూత కాలంగా ఉంటుంది. పూత ఒకేసారి రాకపోవడంతో సస్యరక్షణ చర్యలు చేపట్టడంలో, కోత కోయడంలో రైతులకు ఇబ్బందులు ఎదురవుతుంటాయి.

ఈ సమస్యను అధిగమించేందుకు.. తేమ తక్కువగా ఉండే నేలల్లో, ఇసుక నేలల్లో మొగ్గ బయటకు వచ్చే ముందు తేలికపాటి నీటి తడులు ఇవ్వాలి. మొగ్గలు బయటకు వచ్చే ముందు గానీ పగిలే సమయంలో గానీ పొటాషియం నైట్రేట్ లేదా మల్టీ-కేను లీటరు నీటికి ఐదు గ్రాముల యూరియాలో కలిపి పిచికారీ చేయాలి.

  అక్టోబర్ తర్వాత..
 అక్టోబర్ తర్వాత ఎట్టి పరిస్థితుల్లోనూ దుక్కి దున్నవద్దు. చెట్టుకింద పాదులను కదిలించకూడదు. లేదంటే చెట్ల వేర్లు, పోషక పదార్థాల సమతుల్యత దెబ్బతిని పూత తగ్గిపోయే అవకాశం ఉంటుంది. అక్టోబర్ తర్వాత ఎరువులు వేయకూడదు. చెట్టుకు నీటి తడులు సైతం ఇవ్వవద్దు.

 మామిడిలో ఆశించే బూడిద రంగు తెగులు నివారణ...
 లేత ఆకులు, పూత కాండం, పూలమీద, చిరు పిందెల మీద తెల్లని పౌడర్ లాంటి బూజు చేరుతుంది. ఇదే బూడిద తెగులు. ఇది ఎక్కువగా రాత్రిపూట చల్లగా, పగలు వేడి ఎక్కువగా ఉన్నప్పుడు ఆశిస్తుంది. దీని వల్ల పూత, కాత రాలిపోతుంది. దీని నివారణ కోసం మొగ్గలు కనిపించే దశలో లీటరు నీటికి 3 గ్రాముల గంధకం కలిపి పిచికారీ చేయాలి. పూత దశలో తెగులు కనిపిస్తే హెక్బాకోనజోల్ 2 మి.లీ. లేదా ప్రాసికోనజోల్ ఒక మి.లీ. లేదా డినోకాఫ్ లేదా ట్రైడిమాల్స్ ఒక మి.లీ. నీటికి కలిపి పిచికారీ చేయాలి.

 ఆకుపచ్చ, పూతమాడు, నల్లమచ్చ తెగుళ్లు...
 వర్షాలు లేదా పొగమంచు అధికంగా ఉన్న సమయంలో ఈ తెగుళ్లు వ్యాపిస్తాయి. లేత ఆకులు, రెక్కలు, పూలను పండ్లను ఆశించి నష్టపరుస్తాయి. ఆకుల మీద గోధుమరంగులో మచ్చలు ఏర్పడి క్రమంగా మచ్చలు పెరిగిపోయి ఆకులు త్వరగా పండుబారి రాలిపోతాయి. రెమ్మలపైనా నల్లని మచ్చలు ఏర్పడి పూల గుత్తులు, పూలు మాడిపోతాయి. కాయలు రాలిపోతాయి. ఈ తెగులు నివారణ కోసం పూత దశకు ముందే ఎండిన కొమ్మలను కత్తిరించి తగులబెట్టాలి.

లీటర్ నీటికి 3 గ్రాముల కాపర్ ఆక్సిక్లోరైడ్ లేదా ఒక శాతం బోర్డో మిశ్రమం కలిపి పిచికారీ చేయాలి. 3 గ్రాముల కాపర్ ఆక్సిక్లోరైడ్ లీటరు నీటికి కలిపి పిచికారీ చేయాలి. పచ్చిపూత మీద ఒక గ్రాము కార్బండిజమ్, ఒక గ్రాము థయోఫినేట్ మిథైల్  లీటరు నీటికి కలిపి పిచికారీ చేయాలి. పిందె దశలో లీటరు నీటిలో 2.5గ్రాముల మండోజెల్ లేదా 2గ్రాముల ఆంట్రాకాల్ కలిపి పిచికారీ చేయాలి.

 తేనెమందు పురుగులు...
 తల్లి, పిల్ల పురుగులు గుంపులుగా చేరి లేత ఆకులను, పూత కాండాలు, పూలు, లేత పిందెల నుంచి రసం పీల్చుతాయి. లేత ఆకులను ఆశించినప్పుడు ఆకుల చివర్ల మాడిపోతాయి. పూత మాడిపోతుంది. పిందెలు బలహీనపడి రాలిపోతాయి. అంతేకాకుండా ఈ పురుగు తేనెలాంటి తియ్యని పదార్థాన్ని  విసర్జిం చడం వల్ల ఆకులు, కాండలు, కాయలపై మసిపొర ఏర్పడుతుంది. దీంతో ఆకుల్లో కిరణజన్య సంయోగక్రియ జరగక కాయలు రాలిపోతాయి. పూత, పిందె దశలో ఈ పురుగుల ఉద్ధృతి అధికంగా ఉంటుంది. మిగతా సమయంలో ఈ పురుగులు చెట్ల మొదలు, కొమ్మల బెరడులోని పగుళ్లలో ఉంటాయి.

కాయలపై మసి ఏర్పడి నాణ్యత లోపిస్తాయి. వీటి నివారణకు 1.5 మి.లీ. మోనోక్రొటోఫాస్ మందును లీటరు నీటిలో కలిపి పిచికారీ చేయాలి. పూత, మొగ్గ దశలో లీటరు నీటికి ఒక మి.లీ. డైక్లోరోఫాస్ లేదా 3గ్రాముల కార్పోరిల్ కలిపి చెట్టంతా తడిచేలా పిచికారీ చేయాలి. పచ్చపూత దశలో కాండలు బయటకు వచ్చి పూలు వికసించకుండా ఇంకా మొగ్గ దశలో ఉన్నప్పుడు లీటరు నీటికి 2 మి.లీ. మోనోక్రొటోపాస్, లేదా డైమిథోయేట్, లేదా 3 మి.లీ. జిథైల్‌డెమాటాన్, లేదా0.25మిల్లిలీటర్ల ఇమిడాక్లోపిడ్ పిచికారీ చేయాలి.

 నవంబర్ మాసంలో ఈజాగ్రత్తలు..  
 సూక్ష్మ పోషకాల లోపాలను నివారించడానికి లీటరు నీటికి 5 గ్రాముల జింక్ సల్ఫేట్, మూడు గ్రాముల బోరాక్స్ 5గ్రాముల ఫెర్రిస్ సల్ఫేట్, 10 గ్రా. యూరియా కలిపి 10 నుంచి 15రోజుల వ్యవధిలో రెండుమార్లు పిచికారీ చేయాలి. తోటలో కలుపు లేకుండా చూడాలి.  వర్షం పడితే రసం పీల్చే పురుగులు ఎక్కువగా చేరతాయి. వీటి నివారణకు ఒక గ్రాము ఎసిఫేట్ లేదా పిప్రోనిల్ 2 మి.లీ. లేదా ఇమిడాక్లోఫిడ్ ఏడు మి.లీ. ఒక లీటరు నీటితో కలిపి పిచికారీ చేసుకోవాలి. తోటలో పూత, మొగ్గలు ప్రారంభమైన తర్వాత మొగ్గలు పగిలి పూత రావడానికి రెండు గ్రాముల బోరాన్ లేదా 10 గ్రాముల మల్టీ-కేతో పాటు 5 గ్రాముల ఫార్ములా-4 మందును లీటరు నీటికి కలికి పిచికారీ చేయాలి. సందేహాలున్న రైతులు 89744 49325ను సంప్రదించవచ్చు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement