బాగు బాగు బొప్పాయి సాగు | papaya cultivation incresed in district | Sakshi
Sakshi News home page

బాగు బాగు బొప్పాయి సాగు

Published Fri, Sep 26 2014 2:46 AM | Last Updated on Sat, Sep 2 2017 1:57 PM

బాగు బాగు బొప్పాయి సాగు

బాగు బాగు బొప్పాయి సాగు

ఖమ్మం వ్యవసాయం: గత ఏడాది వరకు జిల్లాలో 300 ఎకరాల మేరకు బొప్పాయి సాగు విస్తీర్ణం ఉండగా ఈ ఏడాది వెయ్యి ఎకరాలకు పైగా సాగు చేస్తున్నారు. ఈ సాగు విస్తీర్ణం మరింత పెరిగే అవకాశం ఉంది. రాష్ట్ర ఉద్యాన మిషన్ ఈ పంట సాగుకు ఉత్పాదకాల రూపంలో రాయితీ కల్పించి ఆర్థికంగా, సాంకేతికంగా తోడ్పాటునిస్తోంది. ఈ పంట సాగు పద్ధతులు, మెళకువలు, తెగుళ్ల నివారణ గురించి కొత్తగూడెం, మధిర ఉద్యానశాఖ అధికారి బి. శ్రావణ్ వివరించారు.

 వాతావరణం: బొప్పాయి ఉష్ణ మండలపు పంట. వేసవిలో 38 డిగ్రీల సెంటీగ్రేడ్ నుండి 48 డిగ్రీల సెంటీగ్రేడ్ ఉష్ణోగ్రత వరకు తట్టుకుంటుంది.


 నేలలు: సారవంతమైన ఎర్రగరప నేలలు, ఒండ్రు నేలలు, అనుకూలం. వీటితో పాటు తేలికగా నీరు ఇంకిపోయే రేగడి నేలల్లో కూడా ఈ పంటను సాగు చేసుకోవచ్చు.


 రకాలు: బొప్పాయిలో రెండు రకాల మొక్కలు ఉంటాయి. డైయోషియస్‌కు చెందిన వాషింగ్టన్, కో-1, కో-2, కో-4, కో-5, కో-6, పూసా డార్ఫా, పూసా జెయింట్, పూసానన్‌హా, హనిడ్యూ రకాల్లో ఆడ, మగ చెట్లు విడివిడిగా ఉంటాయి. గైనోడయోసియస్‌కు చెందిన కూర్గు హనీడ్యూ, సోలో, సన్‌రైజ్ సోలో, కో-3, కో-7, పూసాడెలీసియస్, పూసా మెజస్టీ, తైవాన్ రెడ్ లేడీ రకాల్లో ఆడ, ద్విలింగ మొక్కలు ఉంటాయి. వీటిలో మన జిల్లా రైతులు అధికంగా తైవాన్ రెడ లేడీ రకాన్ని ఎక్కువగా సాగు చేస్తున్నారు.
 

ప్రవర్దనం: విత్తనం ద్వారా ప్రవర్దనం చేస్తారు. పండ్ల నుంచి తీసిన విత్తనాలను 40 రోజుల్లో విత్తకోవాలి. ఎకరాకు గైనోడయోసియస్ రకాలు 20 గ్రాములు సరిపోతాయి.

 అంతర పంటలు, అంతర కృషి
 బొప్పాయి నాటిన తరువాత 6-7 మాసాలకు కాపు వస్తుంది. అంత వరకు మొక్కల మధ్య కలుపు రాకుండా స్వల్పకాలిక అంతర పంటలు సాగు చేసుకోవచ్చు. జీలుగు, జనుము, అలసంద వంటి పచ్చిరొట్ట పంటలు వేసి పూ మొగ్గదశలో కలియదున్నాలి. దీనివల్ల భూసారం పెరుగుతుంది . మేలు చేసే సూక్ష్మజీవులు అభివృద్ధి చెంది తెగుళ్ల తాకిడి తగ్గుతుంది. వేరుశనగ, శనగ, పెసర, మినుము, అలసంద, సోయాచిక్కుడు, నేల చిక్కుడు వంటి పంటలు వేసుకోవచ్చు. మిరప, వంగ, టమాట వంటి పంటలను కూడా సాగు చేసుకోవచ్చు. బొప్పాయిని అంతరపంటగా మామిడి, సపోట, కొబ్బరి వంటి తోటల్లో కూడా వేసుకోవచ్చు.

 ఎరువులు: చె ట్టు వయసును బట్టి ఎరువులను వినియోగించాలి. ఒక్కో చెట్టుకు నాటే గుంతలో ఐదు కిలోల పశుల ఎరువు, 200 గ్రాముల సూపర్ పాస్ఫేట్ వేయాలి. మొక్క 2, 4, 6, 8, 10, 12  నెలల్లో  90 గ్రాముల చొప్పున యూరియా, 200 గ్రాముల సూపర్, 140 గ్రాముల చొప్పున పొటాష్ వేయాలి. 6, 12 నెలల్లో ఐదు కిలోల చొప్పున పశువుల ఎరువు వేయాలి.

 తెగుళ్ల నివారణ
 కాండం మొదలు కుళ్లు: వేర్ల మొదలు మెత్తగా మారి కుళ్లిపోతాయి. కాయలున్న చెట్లకు ఈ తెగులు ఆశిస్తే నష్టం అధికంగా ఉంటుంది. దీని నివారణకు మొక్క మొదలు దగ్గర నీరు నిల్వ ఉండకుండా చూడాలి. బోర్డో మిశ్రమం ఒక శాతం మందుతో కాండంపైన, లేదా, మెటాలాక్సిన్ లేదా క్లోరోథలానిల్  లేదా అలియేట్ రెండు గ్రాములు లీటర్ నీటిలో కలిపి మొదలు తడపాలి. ఇలా వారంలో రెండుసార్లు తడపాలి.
 
ఆంత్రక్నోన్ ఆకుపచ్చ తెగులు: ఈ తెగులు సోకితే నల్లటి ఉబ్బెత్తుగా ఉన్న మచ్చలు ఏర్పడుతాయి. కాయలు పక్వానికి రావు. నివారణకు లీటర్ నీటిలో మంకోజెట్ 2.5 గ్రాములు లేదా క్లోరోథలామిన్ రెండు గ్రాముల మందును కలిపి 15 రోజుల వ్యవధిలో రెండు సార్లు పిచికారీ చేయాలి.
 
కాండం కుళ్లు: కాండం మొదలు కుళ్లిపోయి మొక్కలు వాలిపోతాయి. దీని నివారణ కు ఒక కిలో ట్రైకోడెర్మా విరిడీ+90 కిలోల పశువుల ఎరువు+ 10 కిలోల వేపపిండి+ కిలో బెల్లం నీటిని 10 రోజులు నిల్వ ఉంచి చెట్ల పాదుల్లో పోయాలి. తెగులు ఉధృతి ఎక్కువగా ఉంటే లీటర్ నీటిలో రెండు గ్రాముల రెడోమిల్ ఎంజెడ్ కలిపి చెట్ల మొదలు, కాండం తడిసేలా పోయాలి.
 
ఆకుముడత: ఇది వైరస్ వల్ల ఆశిస్తుంది. ఈ వైరస్ ఆశించిన మొక్కల్లో ఆకులు ముడుచుకుపోతాయి. తె గులు సోకితే దిగుబడులు గణనీయంగా తగ్గుతాయి. కీటక నాశినులను ఉపయోగించి ఈ వైరస్‌ను అరికట్టాలి.
 
పండు ఈగ: కాయ పక్వానికి వచ్చినప్పుడు ఆశించి నష్టాన్ని కలిగిస్తుంది. ఈ ఈగ లార్వాలు కాయలోని గుజ్జును తింటాయి. నివారణకు తోటను శుభ్రంగా ఉంచుకోవాలి. రాలిన పండ్లను ఎప్పటికప్డుపు ఏరివేయాలి. మి.లీ మిథైల్ యూజినాల్, రెండు గ్రాముల కార్బోఫ్యూరాన్, ఒక లీటర్ నీటిలో కలిపి పొలంలో అక్కడక్కడ ఉంచాలి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement