వరిలో సస్యరక్షణ చర్యలు చేపట్టాలి | suitable pesticides should be used for pestilences prevention | Sakshi
Sakshi News home page

వరిలో సస్యరక్షణ చర్యలు చేపట్టాలి

Published Thu, Oct 2 2014 12:17 AM | Last Updated on Sat, Sep 2 2017 2:14 PM

suitable pesticides should be used for pestilences prevention

మొయినాబాద్: వరిలో సస్యరక్షణ చర్యలు పాటిస్తేనే అధిక దిగుబడులు వచ్చే అవకాశం ఉంటుంది. సకాలంలో తెగుళ్లను గుర్తించి వాటి నివారణ చర్యలు పాటించాలి. యాజమాన్య పద్ధతుల్లో పంటకు కావాల్సిన ఎరువులు అందించాలి. ఏయే సమయంలో ఎలాంటి ఎరువులు అందించాలి, ఏయే తెగుళ్లకు ఎలాంటి మందులు పిచికారీ చేయాలో మొయినాబాద్ మండల వ్యవసాయాధికారిణి రాగమ్మ వివరించారు.

మొయినాబాద్, శంషాబాద్, చేవెళ్ల, శంకర్‌పల్లి తదితర మండలాల్లో వర్షాలు ఖరీఫ్ సీజన్ ఆరంభం నుంచి కురవలేదు. ఆగస్టులో వర్షాలు కురవడంతో వరినాట్లు చాలా ఆలస్యంగా వేశారు. ప్రస్తుతం వరి పిలకలు పెట్టే దశనుంచి చిరుపొట్ట దశలో ఉంది. వాటికి ఆశించే తెగుళ్లు, నివారణ చర్యలపై రాగమ్మ సూచనలు, సలహాలు అందజేశారు.

 ఎరువుల యాజమాన్యం
  వరిలో యాజమాన్య పద్ధతులు తప్పనిసరిగా పాటించాలి. నాట్లు వేసే ముందు పూర్తి భాస్వరం, సగం పొటాష్ ఎరువులను ఆఖరు దమ్ములో వేసుకోవాలి. ఇప్పటికే నాట్లు పూర్తయ్యాయి కనుక మిగిలిన సగం పొటాష్‌ను వరి చిరుపొట్ట దశలో ఉన్నప్పుడు నత్రజని ఎరువులతో కలిపి వేసుకోవాలి.
 
నత్రజని ఎరువులను 3 సమ భాగాలుగా చేసి 1/3వ భాగం విత్తిన 15-20 రోజులకు, రెండో భాగాన్ని పిలక దశలో విత్తిన 40-45 రోజులకు, మిగిలిన భాగాన్ని చిరుపొట్ట దశలో విత్తిన 60-65 రోజులకు వేసుకోవాలి
 
సాధారణంగా ఎకరా వరికి 48 కిలోల నత్రజని, 24 కిలోల భాస్వరం, 20 కిలోల పొటాష్ ఎరువులను వాడుకోవాలి.
 
ఉదాహరణకు.. ఒక బస్తా డీఏపీ, 15 కిలోల ఎంఓపీ విత్తిన 15 రోజులకు, పిలక దశలో, చిరుపొట్ట దశలో ఎకరాకు 32 కిలోల చొప్పున యూరియా చల్లుకోవాలి. ఆఖరి దఫా యూరియాతోపాటు 20 కిలోల ఎంఓపీ తప్పనిసరిగా వేసుకోవాలి.
 
తెగుళ్లు.. వాటి నివారణ..
 కాండంతొలుచు పురుగు, ఆకుముడత తెగులు
 ఈ తెగులు పూత దశలో, ఈనిక దశలో ఆశిస్తుంది. దీని నివారణకు ఎసిఫేట్ 1.5 గ్రాములు, కార్టాప్ హైడ్రోక్లోరైడ్ 2 గ్రాములు లీటరు నీటికి కలిపి పిచికారీ చేయాలి. అదే విధంగా కార్బోప్యూరాన్ 3జీ 10 కిలోలు, కార్టప్ హైడ్రోక్లోరైడ్ 4జీ ఎ కిలోలు ఎకరాకు వేసుకోవాలి.

 అగ్గితెగులు (మెడవిరుపు)
  వరి పిలకదశ, పూత దశలో ఉన్నప్పుడు ఈ తెగులు ఆశిస్తుంది. దీని నివారణకు ట్రైసైక్లోజోల్ 0.6 గ్రాములు, లేదా ఐసోప్రోధయోలేన్ 1.5 మిల్లీలీటర్ల మందును లీటరు నీటిలో కలిపి పిచికారీ చేయాలి.
 
 హిస్పా (ఎండాకు తెగులు)
 ఈ పురుగు పిలక దశలో ఆశిస్తుంది. దీని నివారణకు ప్రొఫేనోఫాస్ 2 మిల్లీ లీటర్లు, క్లోరోఫైరిఫాస్ 2.5 మిల్లీలీటర్లు, మోనోక్రోటోఫాస్ 1.6 మిల్లీలీటర్లు లీటరు నీటికి కలిపి పిచికారీ చేయాలి.
 వరి పిలక దశ, చిరుపొట్ట దశ, పూత దశలో పలు రకాల తెగుళ్లు ఆశిస్తాయి. వాటికి తగిన మందులు పిచికారీ చేయాల్సి ఉంటుంది.
 
 ప్రస్తుతం వరిచేలు పిలక దశ దాటాయి. పంటను రైతులు ఎప్పటికప్పుడు పరిశీలించి తెగుళ్లను గుర్తిస్తే వెంటనే సస్యరక్షణ చర్యలు చేపట్టాలి. తగు జాగ్రత్తలు పాటించి రైతులు అధిక దిగుబడులు పొందాలి.
 
పాముపొడ తెగులు
 ఈ తెగులు పిలక దశ నుంచి దుబ్బకట్టే వరకు ఆశిస్తుంది. దీని నివారణకు హెక్సాకోనజోల్ 2 మిల్లీలీటర్లు, లేదా ప్రొపికోనజోల్ 1 మిల్లీలీటరు లీటరు నీటిలో కలిపి 15 రోజుల వ్యవధిలో రెండుసార్లు పిచికారీ చేసుకోవాలి.
 
సుడిదోమ తెగులు
 ఈ తెగులు పిలక దశ, పూత దశలో ఆశిస్తుంది. దీని నివారణకు ఎసిఫేట్ 1.5 గ్రాములు, మోనోక్రోటోఫాస్ 2.2 మిల్లీలీటర్లు, ఎథోఫెన్‌ఫ్రాక్స్ 2.0 మిల్లీలీటర్లు లీటరు నీటికి కలిపి పిచికారీ చేయాలి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement