Management practices
-
మురి‘పాలు’ కావాలంటే..!
చలికాలంలో పశువులపై దృష్టి సారించాలి యాజమాన్య పద్ధతులు పాటించాలి సమీకృత దాణా విడిగా ఇవ్వాలి శరీర ఉష్ణోగ్రత కోసం ప్రత్యేక ఆహారం ఇవ్వాలి సాధారణంగా 12గంటల వ్యవధిలో పాలు పితుకుతుంటారు. కానీ చలికాలంలో పగటిపూట సమయం తక్కువగా, రాత్రి ఎక్కువగా ఉంటుంది. కాబట్టి చలికాలంలో ఉదయం 6గంటల నుంచి 7 గంటల మధ్య, సాయంత్రం 4గంటల నుంచి 5గంటల మధ్య పాలు పితకడం మంచిది. శీతాకాలంలో పశువుల శరీర ఉష్ణోగ్రత తగ్గకుండా చూడాలి. శరీరం వేడిగా ఉండడానికి అదనపు ఆహారం ఇవ్వాలి. లేకపోతే మేత తినక పాల దిగుబడి తగ్గుతుంది. పశువులకు అందించే దాణాలో పిండి పదార్థాలు ఎక్కువగా, మాంసకృత్తులు తక్కువగా ఉండాలి. లూసర్న్, బర్సీం వంటి పశుగ్రాసాల సాగును చేపట్టి అధిక పాల దిగుబడి పొందాలి. వరి కోతలు పూర్తవగానే పొలంలో మిగిలి ఉన్న తేమతో జనుము వంటి పశుగ్రాసాలను సాగు చేసుకోవాలి. శీతాకాలంలో ఎక్కువగా పశువులు ఎదకొచ్చి పొర్లుతాయి. కాబట్టి ప్రతిరోజు పశువులను కనీసం రెండు మూడుసార్లు ముందూ, వెనకా పరిశీలించాలి. పశువు వెనక భాగంలో పరిశీలిస్తే, మూగ ఎదలో ఉన్న పశువులను గుర్తించడం వీలవుతుంది. గత ఎద పూర్తయిన తర్వాత 16-25 రోజుల్లో పశువుల ప్రవర్తనలో మార్పు, పాల దిగుబడిలో తగ్గుదలను బట్టి ఎదను గుర్తించాలి. వెంటనే వీర్యదానం చేయించాలి. చలిగాలులు, మంచు కురవడం వల్ల న్యూమోనియా సోకే ప్రమాదం ఉంది. గొంతు వాపు, గిట్టలు మెత్తబడడం, మేత తినకపోవడం వంటి సమస్యలు ఉత్పన్నం అవుతాయి. పశువులు, దూడలను ఆరుబయటే కట్టేయకూడదు. ఈదురుగాలిని నిరోధించడానికి వాతావరణంలో ఉష్ణోగ్రత 10 డిగ్రీల కంటే తక్కువైన సందర్భాల్లో పాకల చుట్టూ పరదాలు కట్టాలి. లేగ దూడల వెంట్రుకలను శీతాకాలంలో కత్తిరించకూడదు. {పతి రోజు పశువులశాలను రెండు సార్లు శుభ్రం చేయాలి. సోడా కార్బోనేట్, 4 శాతం బ్లీచింగ్ పౌడర్ వంటి క్రిమిసంహారక మందులతో శుభ్రపరచాలి. నీటి తొట్లను వారానికి ఒకసారి శుభ్రం చేయాలి. తరుచూ వాటికి సున్నం వేస్తుంటే పశువులకు కాల్షియం, ఖనిజ లవణాలు లభ్యమవుతాయి. ఫంగస్ వ్యాప్తి చెందకుండా ఉంటుంది. పశువులు తాగేందుకు రోజుకు 50-60 లీటర్ల నీరు అవసరం. శీతాకాలంలో 2-3 సార్లు తాగేందుకు నీరందించాలి. తాగేందుకు నీళ్లు పుష్కలంగా అందిస్తే పాల దిగుబడి బాగుంటుంది. పాలు పితికే గంట, రెండు గంటల ముందు లేదా పితికిన తర్వాత దాణా ఇవ్వాలి. -
మక్క సాగు భలే బాగు
బయ్యారం: వరికి ప్రత్యామ్నాయంగా జిల్లాలో సాగవుతున్న ప్రధాన పంటల్లో మొక్కజొన్న మొదటిది. రబీలో ఆరుతడి పంటలు సేద్యం చేయాలని ప్రభుత్వం సూచిస్తున్న నేపథ్యంలో మొక్కజొన్న యాజమాన్య పద్ధతుల గురించి తెలుసుకుందాం... అనువైన నేలలు: మొక్కజొన్న సాగుకు సారవంతమైన నీరు ఇంకే నల్లరేగడి, ఎర్ర, ఒండ్రు మట్టి ఉన్న ఇసుక, గరపనేలలు అనుకూలం. దుక్కి తయారీ: నాగలితో నాలుగు సార్లు దుక్కి దున్నాలి. చివరి దుక్కిలో మాగిన పశువుల ఎరువు కాని కంపోస్టు ఎరువు కాని వేసి దున్నాలి. ఆ తరువాత విత్తనాలను బోదె పద్ధతి, నాగలి సాళ్ళలో తగినంత తేమను చూసుకొని విత్తాలి. విత్తే కాలం: రబీ మొక్కజొన్నను అక్టోబర్ 15 నుంచి నవంబర్ 15 వరకు విత్తాలి. విత్తన మోతాదు: ఎకరానికి ఏడు కిలోల విత్తనాలను విత్తుకోవాలి. ఎకరం విస్తీర్ణంలో 33 వేల మొక్కలు ఉండేలా జాగ్రత్త పడాలి. సాళ్ళ మధ్య 75 సెం.మీ, సాళ్ళలో మొక్కల మధ్య 20 సెం.మీ ఎడం ఉండేలా, బోదెకు ఒకవైపున 2 లేదా 3 సెం.మీ లోతులో విత్తాలి. పాదుకు 2 లేదా 3 మొక్కలను నాటాలి. విత్తనాలు మొలకెత్తిన తరువాత పాదుకు ఒక మొక్కను మాత్రమే ఉంచి మిగతా వాటిని తీసివేయాలి. విత్తనశుద్ధి: కిలో విత్తనాలకు ఇమిడాక్లోప్రిడ్ మందును 5 గ్రాముల చొప్పున కలిపి విత్తనశుద్ధి చేయాలి. అంతరపంటలు: మొక్కజొన్నలో అంతరపంటగా కంది, అలసంద, పెసర, సోయాచిక్కుడు వంటి అపరాల పంటలను వేసుకోవచ్చు. 4 లేక 5 సాళ్లు మొక్కజొన్న వేసి ఆ తర్వాత ఒక సాలు పప్పుపంట వేసుకోవచ్చు. ఇలా చేయడం వల్ల మొక్కజొన్నకు సహజ శత్రువులైన పరాన్నజీవులు, పరాన్నభుక్తుల సంఖ్యను పెంచుకోవటమే గాక అధిక దిగుబడి, అదనపు ఆదాయాన్ని పొందవచ్చు. కూరగాయ పంటలు ముల్లంగి, ఆకుకూరలను వేసుకొని కూడా అధికాదాయం పొందవచ్చు. ఎరువులు మొక్కజొన్న సాగుకు రెండు కట్టల యూరియా, కట్టన్నర డీఏపీ, కట్ట పొటాష్ అవసరం. డీఏపీతో పాటు కట్ట పొటాష్‌ను ఆఖరి దుక్కిలో వేయాలి. యూరియాను నాలుగు దఫాలుగా భూమిలో తగినంత తేమ ఉన్నప్పుడు చల్లుకోవాలి. భూమిలో జింకు లోపముంటే ఎకరానికి 20 కిలోల జింకు సల్ఫేట్‌ను ఏ ఎరువులో కలపకుండా విడిగా వేయాలి. కలుపునివారణ: మొక్కజొన్నలో అధిక దిగుబడి సాధించాలంటే విత్తిన 45-50 రోజుల వ్యవధిలో కలుపు మొక్కలు లేకుండా తొలగించాలి. విత్తనాలు విత్తిన మూడు రోజుల వ్యవధిలో భూమిలో తగినంత తేమ ఉన్నప్పుడు ఎకరానికి కిలో అట్రాజిన్ మందును 500 లీటర్ల నీటిలో కలిపి నేలపై పిచికారీ చేయాలి. అంతరకృషి: విత్తిన 30రోజులకోసారి, 45- 50 రోజులకు మరో సారి గొర్రుతో గాని, నాగలితో గాని సాళ్ళ మధ్య దున్నాలి. ఈ విధంగా దున్నటం వల్ల కలుపును నివారించటంతో పాటు మొక్కలకు తేమ, గాలి సక్రమంగా అందుతుంది. పంట ఏపుగా పెరుగుతుంది. తడులు: పంట మొలకెత్తిన నెలరోజుల వరకు (పంట మోకాలు ఎత్తుకు వచ్చేంత వరకు) అవసరాన్ని బట్టి, భూమి స్వభావాన్ని బట్టి నీటితడులు ఇవ్వాలి. ఈ దశలో నీటితేమ అధికంగా ఉంటే పంట ఎదుగుల తగ్గే అవకాశం ఉంది. సస్యరక్షణ చర్యలు మొక్కజొన్నలో అశించే పలు రకాల పురుగులు, తెగుళ్ళను రైతులు సరైన సమయంలో గుర్తించి, సస్యరక్షణ చర్యలు చేపట్టాలి. కాండంతొలిచే పురుగు: మొక్కజొన్న మొలకెత్తిన 10 నుంచి 20 రోజుల లోపు పైరును ఇది ఆశించి ఆకుల అడుగుభాగంలో గుడ్లను సముదాయంగా పెడుతుంది. ఈ గుడ్లలో ఉన్న పురుగులు 5 రోజుల వ్యవధిలో బయటకు వస్తాయి. మొక్కజొన్న అంకురంలోకి చేరి ఎదిగే అంకురాన్ని తింటాయి. ఈ పురుగుల వల్ల మొవ్వు చనిపోయి పంటకు నష్టం వాటిల్లుతుంది. దీని నివారణకు ఎకరానికి 3 కేజీల కార్బోప్యూరాన్ 3జీ గుళికలు ఆకు సుడులలో వేయాలి. లేదా లీటర్ నీటిలో 1.6 మి.లీ మోనోక్రొటోఫాస్ లేదా 0.3 మి.లీ కొరోజాన్ మందును పిచికారీ చేయాలి. రసం పీల్చే పురుగులు: నెలరోజులు పైబడిన పంటను మొక్కజొన్న నల్లి, పేనుబంక ఆశిస్తాయి. వీటి తల్లిపురుగులు, పిల్లపురుగులు పంటలో ఎదిగే భాగాల నుంచి రసాన్ని పీల్చటం వల్ల ఆకులు పసుపురంగుకు మారి గిడసబారుతాయి. ఈ పురుగు నివారణకు 1.6 మి.లీ మోనోక్రొటోఫాస్ లేదా 1 గ్రా ఎఫిసేట్ను లీటర్ నీటిలో కలిపి పిచికారీ చేయాలి. ఆకుమాడు తెగులు: అకుమాడు తెగులు నివారణకు 2.5 గ్రాముల మాంకోజెబ్ మందును లీటర్ నీటిలో కలిపి వారానికి ఒకసారి చొప్పున మూడు పర్యాయాలు పిచికారీ చేయాలి. మొక్క ఎండు తెగులు: ఈ తెగులు నివారణకు 1 మి.లీ ప్రాఫికొనజోల్ మందును లీటర్‌నీటిలో కలిపి పిచికారీ చేయాలి. -
శీతాకాలంలో పశువులపై దృష్టి పెట్టాలి
ఖమ్మం వ్యవసాయం: పశు పోషణలో మేలైన యాజమాన్య పద్ధతులు ఆచరిస్తే ఉత్తమ ఫలితాలు సాధించవచ్చని పశువ్యాధి నిర్ధారణ కేంద్రం డాక్టర్ జి.మోహనకుమారి తెలిపారు. శీతాకాలంలో ఆచరించాల్సిన పద్ధతులను ఆమె వివరించారు. పాలను సాధారణంగా ప్రతిరోజు 12 గంటల వ్యవధిలో పితుకుతుంటారు. కానీ శీతాకాలంలో పగటి సమయం తక్కువగా, రాత్రి సమయం ఎక్కువగా ఉంటుంది. కాబట్టి పాలను చలికాలంలో ఉదయం 6-7 గంటలు, సాయంత్రం 4-5 గంటల సమయంలో పితకడం మంచిది. శీతాకాలంలో పశువుల శరీర ఉష్ణోగ్రత తగ్గకుండా చూడాలి. శరీరం వేడిగా ఉండటానికి అదనపు ఆహారం ఇవ్వాలి. లేని పక్షంలో మేత తినక పాల దిగుబడి తగ్గుతుంది. పశువులకు అందించే దాణాలో పిండి పదార్థాలు ఎక్కువగా, మాంసకృత్తులు తక్కువగా ఉండాలి. లూసర్న్, బర్సీం వంటి పశుగ్రాసాల సాగును చేపట్టి అధిక పాల దిగుబడి పొందాలి. వరి కోతలు పూర్తవగానే పొలంలో మిగిలి ఉన్న తేమతో జనుము వంటి పశుగ్రాసాలను సాగు చేసుకోవాలి. శీతాకాలంలో గేదెలు ఎక్కువగా ఎదకొచ్చి పొర్లుతాయి. కాబట్టి ప్రతిరోజు పశువులను కనీసం రోజుకు రెండు సార్లు ముందు, వెనుక పరిశీలించాలి. పశువు వెనుక భాగంలో పరిశీలిస్తే మూగ ఎదలో ఉన్న పశువులను గుర్తించటం వీలవుతుంది. గత ఎద పూర్తయిన తరువాత 16-25 రోజుల్లో పశువుల ప్రవర్తనలో మార్పు, పాల దిగుబడిలో తగ్గుదలను బట్టి ఎదను గుర్తించాలి. వెంటనే వీర్యదానం చేయించాలి. చలిగాలులు, మంచుకురవటం వల్ల న్యూమోనియా సోకే ప్రమాదం ఉంది. గొంతువాపు, గిట్టలు మెత్తబడటం, మేత తినకపోవటం వంటి సమస్యలుత్పన్నమవుతాయి. పశువులు, దూడలను ఆరుబయట కట్టివేయకూడదు. ఈదురుగాలి నిరోధించటానికి వాతావరణంలో ఉష్ణోగ్రత 10 డిగ్రీల కంటే తక్కువైన సందర్భాల్లో పాకల చుట్టూ పరదాలు కట్టాలి. లేగ దూడల వెంట్రుకలను శీతాకాలంలో కత్తిరించ కూడదు. ప్రతిరోజు పశువులశాలలను రెండు సార్లు శుభ్రం చేయాలి. సోడాకార్బొనేట్, 4 శాతం బ్లీచింగ్ పౌడర్ వంటి క్రిమిసంహారక మందులతో శుభ్ర పరచాలి. నీటి తొట్లను వారానికి ఒకసారి శుభ్రం చేయాలి. తరుచుగా వాటికి సున్నం వేస్తుంటే పశువులకు కాల్షియం, ఖనిజలవణాలు లభ్యమవుతాయి. ఫంగస్ వ్యాప్తి చెందకుండా ఉంటుంది. పశువులు తాగేందుకు రోజుకు 50-60 లీటర్ల నీరు అవసరం. శీతాకాలంలో 2-3 సార్లు తాగేందుకు నీరందించాలి. తాగే నీళ్లు పుష్కలంగా అందిస్తే పాల దిగుబడి బాగుంటుంది. పాలు పితికే గంట, రెండు గంటల ముందు లేదా పితికిన తరువాత దాణా ఇవ్వాలి. పాడి పశువులకు సమీకృత దాణాను తాగే నీళ్లతో కలిపి ఇవ్వాలి. ఇలా చేయటం వల్ల పోషక పదార్థాలు ముఖ్యంగా మాంసకృత్తులు నీళ్లలో కరిగి పొట్టలోని నాల్గవ అర(అబోమేసం)లోకి నేరుగా వెళ్తాయి. రూమెన్‌లోని సూక్ష్మజీవులకు పోషకపదార్థాలు అందవు. తద్వారా రూమెన్‌లో వృద్ధి, ఉత్పాదక క్రియలు కుంటుబడి, ఆమ్లజనిత అజీర్తి చోటుచేసుకుంటుంది. కాబట్టి సమీకృత దాణాను తాగే నీళ్లతో కాకుండా విడిగా ఇవ్వటం మంచిది. -
వరిలో సస్యరక్షణ చర్యలు చేపట్టాలి
మొయినాబాద్: వరిలో సస్యరక్షణ చర్యలు పాటిస్తేనే అధిక దిగుబడులు వచ్చే అవకాశం ఉంటుంది. సకాలంలో తెగుళ్లను గుర్తించి వాటి నివారణ చర్యలు పాటించాలి. యాజమాన్య పద్ధతుల్లో పంటకు కావాల్సిన ఎరువులు అందించాలి. ఏయే సమయంలో ఎలాంటి ఎరువులు అందించాలి, ఏయే తెగుళ్లకు ఎలాంటి మందులు పిచికారీ చేయాలో మొయినాబాద్ మండల వ్యవసాయాధికారిణి రాగమ్మ వివరించారు. మొయినాబాద్, శంషాబాద్, చేవెళ్ల, శంకర్పల్లి తదితర మండలాల్లో వర్షాలు ఖరీఫ్ సీజన్ ఆరంభం నుంచి కురవలేదు. ఆగస్టులో వర్షాలు కురవడంతో వరినాట్లు చాలా ఆలస్యంగా వేశారు. ప్రస్తుతం వరి పిలకలు పెట్టే దశనుంచి చిరుపొట్ట దశలో ఉంది. వాటికి ఆశించే తెగుళ్లు, నివారణ చర్యలపై రాగమ్మ సూచనలు, సలహాలు అందజేశారు. ఎరువుల యాజమాన్యం వరిలో యాజమాన్య పద్ధతులు తప్పనిసరిగా పాటించాలి. నాట్లు వేసే ముందు పూర్తి భాస్వరం, సగం పొటాష్ ఎరువులను ఆఖరు దమ్ములో వేసుకోవాలి. ఇప్పటికే నాట్లు పూర్తయ్యాయి కనుక మిగిలిన సగం పొటాష్‌ను వరి చిరుపొట్ట దశలో ఉన్నప్పుడు నత్రజని ఎరువులతో కలిపి వేసుకోవాలి. నత్రజని ఎరువులను 3 సమ భాగాలుగా చేసి 1/3వ భాగం విత్తిన 15-20 రోజులకు, రెండో భాగాన్ని పిలక దశలో విత్తిన 40-45 రోజులకు, మిగిలిన భాగాన్ని చిరుపొట్ట దశలో విత్తిన 60-65 రోజులకు వేసుకోవాలి సాధారణంగా ఎకరా వరికి 48 కిలోల నత్రజని, 24 కిలోల భాస్వరం, 20 కిలోల పొటాష్ ఎరువులను వాడుకోవాలి. ఉదాహరణకు.. ఒక బస్తా డీఏపీ, 15 కిలోల ఎంఓపీ విత్తిన 15 రోజులకు, పిలక దశలో, చిరుపొట్ట దశలో ఎకరాకు 32 కిలోల చొప్పున యూరియా చల్లుకోవాలి. ఆఖరి దఫా యూరియాతోపాటు 20 కిలోల ఎంఓపీ తప్పనిసరిగా వేసుకోవాలి. తెగుళ్లు.. వాటి నివారణ.. కాండంతొలుచు పురుగు, ఆకుముడత తెగులు ఈ తెగులు పూత దశలో, ఈనిక దశలో ఆశిస్తుంది. దీని నివారణకు ఎసిఫేట్ 1.5 గ్రాములు, కార్టాప్ హైడ్రోక్లోరైడ్ 2 గ్రాములు లీటరు నీటికి కలిపి పిచికారీ చేయాలి. అదే విధంగా కార్బోప్యూరాన్ 3జీ 10 కిలోలు, కార్టప్ హైడ్రోక్లోరైడ్ 4జీ ఎ కిలోలు ఎకరాకు వేసుకోవాలి. అగ్గితెగులు (మెడవిరుపు) వరి పిలకదశ, పూత దశలో ఉన్నప్పుడు ఈ తెగులు ఆశిస్తుంది. దీని నివారణకు ట్రైసైక్లోజోల్ 0.6 గ్రాములు, లేదా ఐసోప్రోధయోలేన్ 1.5 మిల్లీలీటర్ల మందును లీటరు నీటిలో కలిపి పిచికారీ చేయాలి. హిస్పా (ఎండాకు తెగులు) ఈ పురుగు పిలక దశలో ఆశిస్తుంది. దీని నివారణకు ప్రొఫేనోఫాస్ 2 మిల్లీ లీటర్లు, క్లోరోఫైరిఫాస్ 2.5 మిల్లీలీటర్లు, మోనోక్రోటోఫాస్ 1.6 మిల్లీలీటర్లు లీటరు నీటికి కలిపి పిచికారీ చేయాలి. వరి పిలక దశ, చిరుపొట్ట దశ, పూత దశలో పలు రకాల తెగుళ్లు ఆశిస్తాయి. వాటికి తగిన మందులు పిచికారీ చేయాల్సి ఉంటుంది. ప్రస్తుతం వరిచేలు పిలక దశ దాటాయి. పంటను రైతులు ఎప్పటికప్పుడు పరిశీలించి తెగుళ్లను గుర్తిస్తే వెంటనే సస్యరక్షణ చర్యలు చేపట్టాలి. తగు జాగ్రత్తలు పాటించి రైతులు అధిక దిగుబడులు పొందాలి. పాముపొడ తెగులు ఈ తెగులు పిలక దశ నుంచి దుబ్బకట్టే వరకు ఆశిస్తుంది. దీని నివారణకు హెక్సాకోనజోల్ 2 మిల్లీలీటర్లు, లేదా ప్రొపికోనజోల్ 1 మిల్లీలీటరు లీటరు నీటిలో కలిపి 15 రోజుల వ్యవధిలో రెండుసార్లు పిచికారీ చేసుకోవాలి. సుడిదోమ తెగులు ఈ తెగులు పిలక దశ, పూత దశలో ఆశిస్తుంది. దీని నివారణకు ఎసిఫేట్ 1.5 గ్రాములు, మోనోక్రోటోఫాస్ 2.2 మిల్లీలీటర్లు, ఎథోఫెన్ఫ్రాక్స్ 2.0 మిల్లీలీటర్లు లీటరు నీటికి కలిపి పిచికారీ చేయాలి.