ఒంగోలు టూటౌన్ : జిల్లాలో సుమారు 600 ఎకరాల్లో జామ తోటలు సాగవుతున్నాయి. మద్దిపాడు మండలంలోని ఇనమెనమెళ్లూరు, కీర్తిపాడు, చుట్టుపక్కల గ్రామాల్లో పంట సాగవుతోంది. తీరప్రాంత మండలాలైన కొత్తపట్నం, చిన్నగంజాం, పందిళ్లపల్లి, వేటపాలెం మండలాల్లో కూడా జామ సాగులో ఉంది. ప్రస్తుతం తోటలు పూత, పిందె, కాయ దశల్లో ఉన్నాయి. ఈ దశల్లోనే పంటను వివిధ రకాల పురుగులు, తెగుళ్లు ఆశిస్తాయి. వీటి నివారణ చర్యల గురించి ఉద్యాన శాఖ ఏడీ పి.జెన్నెమ్మ (83744 49051) వివరించారు.
పండు ఈగ..
కాయలు పక్వానికి రాగానే పండు ఈగ ఉృదతి ఎక్కువగా ఉంటుంది. 2 మిల్లీ లీటర్ల మిథైల్‌యూజినాల్, 3 గ్రాముల కార్బోఫ్యూరాన్, 3జి గుళికలను లీటరు నీటిలో కలిపి ద్రావణాన్ని తయారు చేయాలి. ఒక్కో ప్లాస్టిక్ పళ్లెంలో 200 మిల్లీ లీటర్ల ద్రావణాన్ని పోయాలి. తోటలో అక్కడక్కడా చెట్ల కొమ్మలకు వాటిని వేలాడదీయాలి. మగ ఈగలు ఆకర్షణకు గురై ద్రావణంలో పడి చనిపోతాయి. 2 మిల్లీలీటర్ల మలాథియన్‌ను లీటరు నీటిలో కలిపి పిచికారీ చేయాలి. తోటలో పండు ఈగ ఆశించి రాలిపడిన కాయలను ఏరివేసి నాశనం చేయాలి.
తెల్లదోమ..
తెల్లదోమ ఆకులపై చేరి రసాన్ని పీలుస్తాయి. ఆకులు ఎర్రబడి ముడతలు పడతాయి. వీటి నివారణకు జిగురు పూసిన పసుపు రంగు డబ్బాలను రాత్రివేళల్లో తెల్లదోమ ఆశించిన చెట్ల వద్ద ఉంచాలి. వేప నూనె 0.5 మిల్లీ లీటర్లను లీటరు నీటిలో కలిపి పిచికారీ చేయాలి. సమస్య పరిష్కారమవుతుంది.
పిండినల్లి..
కొమ్మల చివర కాయలను ఆశించి రసాన్ని పీలుస్తాయి. కాయలు, ఆకులు రాలిపోతాయి. ఇవి జిగురు పదార్థాన్ని విసర్జించడం వల్ల మసి తెగులు వస్తుంది. వీటి నివారణకు అక్షింతలు పురుగు బదనికలను తోటలో విడుదల చేయాలి. ఎసిఫేట్ గ్రాము, లేదా డైక్లోరోవాస్ 1 మిల్లీ లీటరును లీటరు నీటిలో కలిపి పిచికారీ చేయాలి.
జాగ్రత్తలతో జామ సాగు.. బాగుబాగు
Published Fri, Nov 14 2014 2:59 AM | Last Updated on Sat, Sep 2 2017 4:24 PM
Advertisement