సబ్సిడీ నారుతో అధిక దిగుబడులు
హర్షం వ్యక్తం చేసిన గవర్నర్ నరసింహన్
- కుటుంబ సమేతంగా సీవోఈ సందర్శన
సాక్షి, హైదరాబాద్: నాణ్యమైన కూరగాయల నారును సబ్సిడీపై రైతులకు సరఫరా చేసి అధిక దిగుబడులు సాధించడంపై రాష్ట్ర గవర్నర్ ఈఎస్‌ఎల్ నరసింహన్ హర్షం వ్యక్తం చేశారు. సోమవారం జీడిమెట్లలోని సెంటర్ ఆఫ్ ఎక్సలెన్సీ (సీవోఈ)ని గవర్నర్ కుటుంబ సమేతంగా సందర్శించారు. ఆయనకు వ్యవసాయ శాఖ మంత్రి పోచారం శ్రీనివాసరెడ్డి స్వాగతం పలికారు. గవర్నర్ మాట్లాడుతూ, ‘రాష్ట్ర ప్రజలు అధికంగా వ్యవసాయంపై ఆధారపడి జీవిస్తున్నారు. వారికి సంప్రదాయ పంటలతో సరైన లాభాలు రావడంలేదు.
సాగునీటి ప్రాజెక్టుల రీ డిజైనింగ్‌తో రాష్ట్రంలో నీటి పారుదల కింద సేద్యం పెరుగుతుంది. ఉద్యాన రైతులు అధిక దిగుబడులు సాధించేందుకు సాగులో ఇలాం టి నూతన పద్ధతులు పాటించాలి’ అని అభిప్రాయపడ్డారు. రైతాంగం అధిక దిగుబడులతో లాభాలు ఆర్జించి పేదరికం నుంచి బయటపడాలని ఆకాంక్షించారు. స్వయంగా రైతులైన ముఖ్యమంత్రి, వ్యవసా య మంత్రి రాష్ట్రానికి ఉండటం రైతుల అదృష్టమని కొనియాడారు. పాలీహౌస్‌లలో పంటల సాగు, డ్రిప్, స్ప్రింక్లర్ల ద్వారా నీటి నియంత్రణ, ఉష్ణోగ్రత నియంత్రణ, నాణ్య మైన నారు మొక్కల పెంపకం వంటి అంశా లపై మంత్రిని, ఉద్యాన శాఖ అధికారులను అడిగి తెలుసుకున్నారు.
సన్న చిన్నకారు రైతులకు దేశంలోనే అధిక సబ్సిడీపై సూక్ష్మ, బిందు సేద్య పరికరాలను అందిస్తున్న రాష్ట్రం తెలంగాణ అని గవర్నర్‌కు మంత్రి పోచారం వివరించారు. సీవోఈలోని అన్ని పాలీహౌస్ లను, సాగులో ఉన్న కూరగాయలు, పండ్లను గవర్నర్ పరిశీలించారు. దేశంలోనే అధునాతన టెక్నాలజీతో నూతన పద్ధతుల్లో పండ్లు, కూరగాయలు సాగు చేయడంపై గవర్నర్ అభినందించారు. అనంతరం సీవోఈ ప్రాంగణంలో మామిడి మొక్క నాటారు. కార్యక్రమంలో వ్యవసాయ శాఖ కార్యదర్శి సి.పార్థసారథి, ఉద్యాన శాఖ కమిషనర్ ఎల్.వెంకట్రామ్‌రెడ్డి, అధికారులు మధుసూదన్, బాబు, రాజ్‌కుమార్ తదితరులు పాల్గొన్నారు.