రైతు సమస్యలపై వైఎస్ జగన్ దీక్ష
ఏపీ రాజధాని ప్రాంతంలో రైతులను చిత్రహింసలు పెడుతున్న తీరు, ఇతర ప్రాంతాల్లో కూడా రైతులు అనుభవిస్తున్న కష్టాలపై వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, అసెంబ్లీలో విపక్షనేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి దీక్ష చేయనున్నారు. జనవరి 31, ఫిబ్రవరి ఒకటో తేదీలలో జరిగే ఈ దీక్షకు పశ్చిమగోదావరి జిల్లా తణుకు వేదిక కానుంది. ఈ విషయాన్ని పార్టీ సీనియర్ నాయకుడు ధర్మాన ప్రసాదరావు తెలిపారు.
రాజధాని ప్రాంత రైతుల సమస్యలపై గవర్నర్ నరసింహన్కు కలిసి విజ్ఞప్తి చేశామని, ఈ అంశంపై హైకోర్టు సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాల్సిందిగా కోరామని ధర్మాన ప్రసాదరావు చెప్పారు. రైతుల కష్టాలను గవర్నర్ నరసింహన్కు వివరించడానికి గుంటూరు, కృష్ణా, ప్రకాశం జిల్లాలకు చెందిన రైతు ప్రతినిధులు, ప్రజాప్రతినిధులు కలిసి వచ్చారు. నరసింహన్ను కలిసి వచ్చిన తర్వాత ధర్మాన ప్రసాదరావు మీడియాతో మాట్లాడారు. ఆయన చెప్పిన విషయాల్లో ప్రధానాంశాలు..
* రాష్ట్ర హోం మంత్రి బాధ్యతారహితంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీయే నిప్పు పెట్టిందని అన్నారు. దాంతో జనం ముక్కున వేలేసుకున్నారు.
* దీనిపై దర్యాప్తు జరిపిస్తామని చెప్పకుండా, ఎలాంటి విషయాలు తెలుసుకోకుండా ఒక రాజకీయ పార్టీపై నెపం వేయడం ఇందులో చాలా విచిత్రమైన విషయం.
* వెంటనే వ్యవసాయమంత్రి, ఇతర మంత్రులు కూడా ఒక పార్టీపై బురద చల్లే ప్రయత్నం చేశారు.
* ఆ గ్రామాల్లో రాజధానికి భూమి స్వచ్ఛందంగా ఇవ్వలేమని చెప్పినవాళ్లను కేసుల్లో ఇరికించి, అల్లరిచేసి, బలవంతంగా భూములు తీసుకోవాలన్న ఎత్తుగడ పోలీసులతో కలిసి ప్రభుత్వం చేస్తోంది.
* ఈ విషయాన్ని ఆ గ్రామాల నుంచి వచ్చిన సుమారు 200 మంది రైతులు స్వయంగా వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి చెప్పారు.
* అదే విషయాన్ని గవర్నర్ దృష్టికి తీసుకెళ్లాం.
* హైకోర్టు సిట్టింగ్ జడ్జితో జ్యుడీషియల్ విచారణ జరిపించాలని విజ్ఞప్తి చేశాం.
* ఇందులో దోషులు ఎవరో తెలియకుండా చేసేందుకు మసిపూసి మారేడు చేద్దామన్న ప్రయత్నం జరుగుతున్నట్లు అనుమానాలున్నాయి.
* స్వయంగా హోం మంత్రే ఒక పార్టీపై ఆరోపణలు చేసిన తర్వాత, ఆయన ఆధ్వర్యంలో పనిచేసే పోలీసులు అందుకు భిన్నమైన నివేదిక ఎలా ఇస్తారో అర్థం కావట్లేదు.
* అసలు దీనంతటికీ లక్ష్యం ఏంటో కూడా తెలుసుకోవాలి.
* భూసేకరణ కోసం చట్టాన్ని ఉపయోగించకుండా.. బలవంతంగా భూములు సేకరిస్తున్నారు.
* రాత్రిళ్లు రైతులను పోలీసు స్టేషన్లకు తీసుకెళ్తున్నారు. అందుకే గవర్నర్ను కలిసి రైతుల బాధలను ఆయనకు వివరించాం.