నమ్మకం లేకపోతే పదవి నుంచి తప్పుకోండి: ధర్మాన
గవర్నర్ వ్యవస్థపైనే తనకు నమ్మకం లేదని ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు అంటున్నారని, అంత నమ్మకం లేకపోతే ముఖ్యమంత్రి పదవి నుంచి ఆయన తొలగిపోవాలని వైఎస్ఆర్సీపీ ప్రధాన కార్యదర్శి ధర్మాన ప్రసాదరావు డిమాండ్ చేశారు. లేకపోతే గవర్నరే మిమ్మల్ని తొలగించాల్సి ఉంటుందన్నారు. ఆంధ్రప్రదేశ్ కేబినెట్ను గవర్నర్ వెంటనే బర్తరఫ్ చేయాలని ఆయన కోరారు. ఓటుకు నోటు కేసు పరిణామాలపై ఆయన హైదరాబాద్ లో విలేకరుల సమావేశంలో మాట్లాడారు.
చంద్రబాబు తెలివితేటలను చూసి తెలుగు ప్రజలు నవ్వుకుంటున్నారని, ఇన్నేళ్లు ముఖ్యమంత్రిగా, ప్రతిపక్ష నాయకుడిగా అనుభవం ఉండి కూడా కేవలం ఒక కేసులో తనకు అనుకూలంగా వ్యవహరించడం లేదన్న కారణంతో ఆయనపై విమర్శలు చేయడం సరికాదని ఆయన అన్నారు. గవర్నర్ మీద తమకు విశ్వాసం లేదంటూ మంత్రులు రావెల కిశోర్ బాబు, అచ్చెన్నాయుడు తదితరులు వ్యాఖ్యానాలు చేశారని, వారిని బర్తరఫ్ చేయాలని ధర్మాన అన్నారు. తెలంగాణ రాష్ట్రంలో చంద్రబాబు కేవలం ఒక వ్యక్తి మాత్రమేనని, అందువల్ల ఆయన ఓటుకు నోటు కేసులో విచారణకు సహకరించాలని కోరారు. విచారణకు సహకరించకుండా.. పైపెచ్చు, తనకు నోటీసులు ఇస్తే తెలంగాణ ప్రభుత్వం పడిపోతుందని చంద్రబాబు వ్యాఖ్యానించొచ్చా అని ఆయన ప్రశ్నించారు. చంద్రబాబు చాలా తప్పుల మీద తప్పులు చేస్తున్నారని చెప్పారు. రాజ్యాంగ వ్యవస్థ మీద, శాసన వ్యవస్థ మీద గౌరవం లేకుండా ప్రవర్తించడం సబబు కాదన్నారు. ఇప్పుడు ఎవరి హక్కులకు భంగం వాటిల్లిందని మీరు భావిస్తున్నారని ప్రశ్నించారు. శాంతి భద్రతల వ్యవస్థకు ఎక్కడ వైఫల్యం వచ్చిందని అడిగారు. ఊరికే రెండు రాష్ట్రాల ప్రజలను భయభ్రాంతులను చేసుకునే ప్రయత్నాలు చేస్తున్నారని మండిపడ్డారు. ఇప్పుడు పోలీసు ఉన్నతాధికారులు కూడా హైదరాబాద్లో నియమించిన 400 మంది వరకు పోలీసులను రీకాల్ చేయడం చూస్తుంటే.. వాళ్ల మీద నాయకులు ఎంతగా ఒత్తిడి తెచ్చారోనన్న విషయం అర్థమవుతోందన్నారు.