జీవితేచ్ఛకు కొత్త చిగుళ్లు! | The blossoming of new hope to the farmers | Sakshi
Sakshi News home page

జీవితేచ్ఛకు కొత్త చిగుళ్లు!

Published Tue, Dec 20 2016 4:16 AM | Last Updated on Sat, Oct 20 2018 4:36 PM

The blossoming of new hope to the farmers

- ప్రకృతి సేద్యంతో వయోధిక రైతు జీవితంలో చిగురించిన సరికొత్త ఆశలు
- 60 ఏళ్ల వయసులో బహుళ పంటలతో సాగు కొత్త పుంతలు
- కూరగాయలు, పత్తి, చెరకు, అపరాలు, ఎల్లిపాయ సాగులో అధిక దిగుబడులు
- అంతర పంటలుగా బంతి, నాటు పొగాకు సాగుతో అధికాదాయం



అప్పు కోసం వడ్డీ వ్యాపారుల దగ్గర మాటిమాటికీ చేయి చాచాల్సిన అవమానకర పరిస్థితి కుంగదీసి ఊరు వదిలి వెళ్లమంటే.. దశాబ్దాలుగా సేద్యాన్నే నమ్ముకున్న రైతన్నకు మట్టిపై ఉన్న మమకారం మళ్లీ ఒక ప్రయత్నం చేసి చూడమంది. మిత్రుడి ప్రోత్సాహంతో ప్రకృతి సేద్యం చేపట్టగా వ్యవసాయానికి కొత్త ఊపిర్లూదింది. ఒకటికి నాలుగు పంటల సాగుతో పెరిగిన నికరాదాయం ఆత్మగౌరవాన్ని నిలబెట్టింది. ప్రకృతికి ప్రణమిల్లిన అన్నదాతకు నలుగురిలోనూ తలెత్తుకొని తిరిగేలా జవజీవాలనిచ్చింది. అలా అరవయ్యేళ్లకు ప్రకృతి సేద్యబాట పట్టిన మనోహరాచారిని ఇప్పుడు ఇతర రైతులు అనుసరిస్తున్నారు.

1972.. నూనూగు మీసాల నూత్న యవ్వనంలో కాడి పట్టారు వనపన మనోహరాచారి. రంగారెడ్డి జిల్లా చౌదరి గూడెం మండలం పద్మారం ఆయన స్వగ్రామం. పదో తరగతి చదివిన తర్వాత 1978లో తొలిసారి పత్తి సాగును చేపట్టారు. అప్పట్లో పత్తి సాగులో దుక్కిలో ఎకరాకు అర బస్తా డీఏపీ మాత్రమే వేసేవారు. పంట కాలం మొత్తంలో రెండుసార్లు పురుగుమందులు కొట్టేవారు. ఎకరాకు 10 క్వింటాళ్లకు తగ్గకుండా దిగుబడి వచ్చేది. క్వింటా పత్తికి రూ. 1300–1500 వరకు ధర ఉండేది.   

2013... మనోహరాచారి అరవయ్యో పడిలోకి అడుగుపెట్టారు. ఇప్పుడూ పత్తిని సాగు చేస్తున్నారు. రసాయనిక ఎరువులు వాడకం 10 బస్తాలకు పెరగ్గా.. పురుగు మందులను వారానికి రెండుసార్లు పిచికారీ చేయాల్సి వస్తోంది. దిగుబడి అదే పది క్వింటాళ్లు. కానీ ఖర్చులు మాత్రం విపరీతంగా పెరిగాయి. 40 ఏళ్లలో పురుగుమందులు, ఎరువుల ధరలు 40 రెట్లు పెరిగితే.. పంట అమ్మకం ధర మాత్రం పెరిగింది రెండింతలే.

2014... చేసిన అప్పులు తీరే పరిస్థితి కనపడలేదు. తన మీద తనకు నమ్మకం సడలింది. ఎన్నాళ్లిలా.. పగలనకా రేయనకా.. ఎండనకా వాననకా.. రక్తాన్ని స్వేదంగా మార్చి కష్టపడితే చివరకు మిగిలిందేమిటి అనే అంతర్మథనం మొదలైంది. తన రుణాలు తీర్చాలంటే మట్టితో తన రుణం తెంచుకోవాలని...  పట్టణానికి వలస బాట పట్టాల్సిందేనని నిశ్చయించుకున్నారు మనోహరాచారి. చాలా కాలంగా తన మిత్రుడు తనను ప్రకృతి సేద్యం చేయాలని పోరుతున్నా ఇన్ని (రసాయనిక) ఎరువులు, పురుగుమందులు వల్ల కానిది గోమూత్రం వల్ల ఏమవుతుందని భావించి లక్ష్య పెట్టలేదు. కానీ లోలోపల మిణుకు మంటున్న ఆశ ఆఖరి సారిగా ప్రయత్నం చేసి చూడమంది... అలా ఆయన ప్రకృతి సేద్యంలోకి అడుగుపెట్టి బతుకును పండించుకుంటున్నారు. పాలేకర్‌ రాసిన పుస్తకాలను చదవటం, సాక్షిలో ‘సాగుబడి’ కథనాలను క్రమం తప్పకుండా చదువుతూ ప్రకృతి సేద్యంలో లోతుపాతులను ఆకళింపు చేసుకుంటూ అనుసరిస్తున్నారు.

 మనోహరాచారి 2014–15లో తొలిగా ప్రకృతి సేద్యం ప్రారంభించారు. ఫలితాలు ఆశాజనకంగా ఉండటంతో  ఉత్సాహం నింపాయి. రెట్టించిన ఉత్సాహంతో రెండో ఏడాది ఇతర పంటలకు ప్రకృతి సేద్యాన్ని విస్తరించారు. నల్లరేగడి భూమి. మూడు బోర్లు పనిచేస్తున్నాయి. పంటలకు డ్రిప్పు ద్వారా అందిస్తూ నీటిని పొదుపుగా వాడుతూ పంటలను సాగు చేస్తున్నారు.

పత్తిలో 14 క్వింటాళ్ల దిగుబడి!
తొలిసారిగా 2014లో ప్రకృతి సేద్యంలో (హైబ్రిడ్‌) పత్తిని ఎకరంన్నర పొలంలో సాగు చేశారు. బీజామృతంతో విత్తనశుద్ధి చేశారు. పురుగు నివారణకు దశపత్ర కషాయం వాడారు. 15 రోజుల పంటకు ఎకరాకు 5 క్వింటాళ్ల వర్మికంపోస్టు వేశారు. ఎకరాకు 200 లీటర్ల జీవామృతం డబ్బాలతో పాదుల్లో పోశారు. 200 లీటర్ల నీటికి 30 లీటర్ల జీవామృతం కలిపి పిచికారీ చేశారు. ఎకరాకు పది క్వింటాళ్ల దిగుబడి వచ్చింది. రసాయన సేద్యంలో ఎకరాకు రూ. 20–25 వేల వరకు అయ్యే ఖర్చు ప్రకృతి సేద్యంలో రూ. 6 వేలకు తగ్గింది. ఈ ఏడాది పత్తిలో 14 క్వింటాళ్ల వరకు దిగుబడి రావచ్చని మనోహరాచారి అంచనా వేస్తున్నారు.

చెరకులో 50 టన్నుల దిగుబడి
మనోహరాచారి మొత్తం పదెకరాల్లో చెరకును కార్శి పంటగా సాగు చేస్తున్నారు. తొలిసారి రెండెకరాల్లో చెరకును ప్రకృతి సేద్యంలోకి తెచ్చారు.  తొలుత ఎకరాకు 2 క్వింటాళ్ల ఘనజీవామృతం వేశారు. 20 రోజులకోసారి డ్రిప్పు ద్వారా ఎకరాకు 200 లీటర్ల జీవామృతం అందిస్తారు. రసాయన సేద్యం చేసే రైతులు గత ఏడాది లద్దెపురుగు నివారణకు విపరీతంగా కీటకనాశనులు పిచికారీ చేసినా తోటలు దెబ్బతిన్నాయి. మనోహరాచారి మాత్రం ఎకరాకు 10 లీటర్ల అగ్ని అస్త్రంను డ్రిప్పు ద్వారా అందించి పంటను లద్దె పురుగుల బెడద నుంచి కాపాడుకున్నారు.

పంట వ్యర్థాలతో ఆచ్ఛాదన కల్పించి కలుపును నివారించడమే గాక పొలంలో తేమను కూడా ఎక్కువ రోజులు కాపాడుకోగలిగారు. దీనివల్ల నీరు ఆదా అయింది. సూక్ష్మవాతావరణంతో వానపాములు, సూక్ష్మజీవులకు అనువైన పరిస్థితి నెలకొనడంతో భూసారం పెంపొందింది.

 పైపాటు, కూలీలకు అయ్యే ఖర్చులో రూ. 10 వేల వరకు ఆదా అయ్యాయి. రసాయన ఎరువులు, పురుగుమందులకు ఎకరాకు 20 వేల వరకు ఖర్చయ్యేది. జీవామృతం... దశపత్ర కషాయాలు వాడటంతో ఆ ఖర్చు కూడా రైతుకు ఆదా అయింది. ఇది తొలి ఏడాది ఖర్చు మాత్రమే. నాలుగేళ్లలో ఖర్చు సగం మేర తగ్గుతుంది. రసాయన సేద్యం నుంచి ప్రకృతి సేద్యంలోకి మారిన తొలి ఏడాది కూడా చెరకు దిగుబడి తగ్గలేదు. తీవ్ర నీటి ఎద్దడి ఉన్నప్పటికీ ఎకరాకు 40 టన్నుల దిగుబడి వచ్చింది. ఈ ఏడాది 50 టన్నుల వరకు దిగుబడి రావచ్చని మనోహరాచారి భావిస్తున్నారు. కూలీలు, రవాణా ఖర్చులు పోను టన్నుకు రూ. 1,900 ధర లభించింది. ఎకరాకు రూ. 75 వేల ఆదాయం వచ్చింది. జడ కట్టేందుకు రూ. 15 వేలు పోను ఎకరాకు రూ. 50 వేల నికరాదాయం లభించింది.

కూరగాయల్లో ఎకరాకు రూ. 40 వేల నికరాదాయం
గతేడాది వేసవిలో ప్రకృతి సేద్య విధానంలో మూడెకరాల్లో కీరదోస, పప్పు దోస పంటలను సాగు చేశారు.  డ్రిప్పు ద్వారా 15 రోజులకోసారి ఎకరాకు 200 లీటర్ల జీవామృతం అందించారు. తీగజాతి కూరగాయలు జీవామృతానికి బాగా స్పందించాయి. పూత బాగా వచ్చింది. ఎకరాకు 4 టన్నుల దిగుబడి వచ్చింది. విత్తనాలు కూలీలు, రవాణా ఖర్చులు రూ. 10 వేలయ్యాయి. ఖర్చులు పోను ఎకరాకు రూ. 30–40 వేల నికరాదాయం లభించింది.

కందిలో మొక్కజొన్న సాగు..
కందిలో పెసర, మినుము, మొక్కజొన్న పంటలను అంతర పంటలుగా సాగు చేశారు. ఆవులం దేశీ రకం కందిని సాగు చేశారు. మొక్కల మధ్య నాలుగడుగులు, సాళ్ల మధ్య 8 అడుగుల దూరం ఉండేలా పాదుల్లో విత్తనాలను నాటుకున్నారు.  20, 40 రోజుల దశలో ఎకరానికి 200 లీటర్ల జీవామృతాన్ని కంది, మొక్కజొన్నకు అందించారు. 200 లీటర్ల నీటికి 30 లీటర్ల జీవామృతాన్ని కలిపి ఎకరా పైరుపై 30–50 రోజుల దశలో పిచికారీ చేశారు. అతివృష్టికి పెసర, మినుము పంటలు చేతికి రాలేదు. కందిలో ఎకరాకు 8–10 క్వింటాళ్ల వరకు దిగుబడి రావచ్చని భావిస్తున్నారు. మొక్కజొన్న ఎకరాకు పది క్వింటాళ్ల చొప్పున దిగుబడి వచ్చింది. ఖర్చులు రూ. 6 వేలు మాత్రమే కాగా రెండు పంటలకు కలిపి రూ. లక్ష వరకు నికరాదాయం రావచ్చని మనోహరాచారి తెలిపారు.

నాణ్యమైన ఎల్లిపాయలకు మారు పేరు
మనోహరాచారి చాలాకాలంగా ఎల్లిపాయ పంటను రసాయన సేద్యంలో సాగు చేస్తున్నారు. గతేడాది ప్రయోగాత్మకంగా ఎకరా పొలంలో ఎల్లిపాయను ప్రకృతి సేద్య విధానంలో సాగు చేసి మంచి దిగుబడి సాధించారు. డ్రిప్పుతో 20 రోజులకోసారి ఇచ్చే తడితో పాటే 200 లీటర్ల జీవామృతం ఇచ్చేవారు. 80 కిలోల సొంత విత్తనం వాడారు. రెండుసార్లు కలుపు తీతకు, గడ్డలు ఏరేందుకు కూలీలకు కలిపి మొత్తం ఎకరాకు రూ. 10 వేల ఖర్చయింది. దిగుబడి 15 నుంచి 20 క్వింటాళ్లకు పెరిగింది. క్వింటా రూ. 6,500 చొప్పున విక్రయించారు. ఎకరాకు రూ. 1.30 లక్షల ఆదాయం వచ్చింది. ఖర్చులు పోను రూ. 1.20 లక్షల నికరాదాయం లభించింది. రసాయన సేద్యంలో పండించిన ఎల్లిపాయ గడ్డ మూడు నెలలకే మెత్తబడేది. పొలంలో కలుపు మళ్లీ మళ్లీ పుట్టుకొచ్చి పంటకన్నా కలుపు ఎక్కువ ఉండేది. ప్రకృతి సేద్యంలో కలుపు ఉధృతి బాగా తగ్గింది. పంటను ఏడాది నిల్వ ఉంచినా గడ్డ మెత్తబడలేదు.

రసాయన సేద్యంలో 12 ఎకరాల సాగుకు రూ.1.5 లక్షల నుంచి రూ. 2 లక్షల వరకు ఖర్చయ్యేది. ప్రకృతి సేద్యంలో 18 ఎకరాల సాగుకు రూ. 20 వేలకు మించి ఖర్చు లేదు. మినుములు, ఎల్లిపాయలు కిలోకు రూ. 20–25 వరకు అధిక ధరకు అమ్ముడవుతున్నాయి.
రైతు ఇతర రైతులను చూసి నేర్చుకుంటాడు. మనోహరాచారి స్ఫూర్తితో లక్ష్మీదేవిపల్లి గ్రామానికి చెందిన నాగారం నారాయణరెడ్డి, రాంరెడ్డి ప్రకృతి సేద్యం చేపట్టడం విశేషం.  
– పొల్కంపల్లి గాండ్ల నాగరాజు,సాక్షి, మహబూబ్‌నగర్‌ వ్యవసాయం

తలెత్తుకొని దర్జాగా తిరుగుతున్నా!
రసాయన సేద్యంలో అప్పులు చేసినా.. తీర్చేదారి లేక పనికోసం ఊరొదిలి పట్నానికి పోదామనుకున్నా. ఆ సమయంలో ప్రకృతి సేద్యం చేయటం ప్రారంభించా. రూ. లక్ష ఖర్చు కాస్తా మంత్రం వేసినట్టే రూ. 10 వేలకు తగ్గింది. ఎరువులు, పురుగు మందులు కొనాల్సిన అవసరం లేకపోవటమే దానికి కారణం. రసాయన సేద్యం ఆపితే చీడపీడలు, తెగుళ్లు తగ్గుతాయి. రసాయన సేద్యంతో రైతు బాగుపడడు. ఎరువులు, పురుగుమందులు అమ్మే వ్యాపారులు, వడ్డీ వ్యాపారులు బాగుపడుతున్నారు. ఇంతకు ముందు అప్పులు తీర్చేదారిలేక తలదించుకొని బతుకుతున్నట్టనిపించేది. ప్రకృతి సేద్యంలోకి మారాక తలెత్తుకొని దర్జాగా తిరుగుతున్నా.  రైతులు ప్రకృతి సేద్యం చేస్తే ఆ అప్పులు ఉండవు.. ఆత్మహత్యలు ఉండవు.
– వనపన మనోహరాచారి (99669 84871)పద్మారం, చౌదరిగూడెం మండలం,రంగారెడ్డి జిల్లా  

ఆపిల్‌ బేర్‌లో అంతర పంటలుగా బంతి, పొగాకు
తొలి ఏడాది ప్రకృతి సేద్యంలో అంతర పంటలకు పెద్ద పీట వేశారు మనోహరాచారి. ఒకటిన్నర ఎకరాలో ప్రకృతి సేద్యంలో ఆపిల్‌ బేర్‌ను సాగు చేస్తున్నారు. జూలైలో ఎకరాకు 200 మొక్కలు నాటారు. నెలకోసారి డ్రిప్పు ద్వారా జీవామృతం అందిస్తున్నారు. ఆపిల్‌ బేర్‌ మధ్యలో సెప్టెంబర్‌లో బంతిపూల నారు నాటారు.   అక్టోబర్‌ ఆఖరుకు కోత తెగేది. రసాయన సేద్యంలో నెల రోజులు మాత్రమే పూలకోత తెగేది. ప్రకృతి సేద్యంలో మూడో నెలలోనూ పూల దిగుబడి వచ్చింది. దిగుబడి రెండింతలైంది. రసాయన సేద్యంలో ఖర్చు రూ. 15 వేలు కాగా ప్రకృతి సేద్యంలో రూ. 3 వేలకు తగ్గి రూ. 30 వేల నికరాదాయం వచ్చింది. పూలు కోతకొచ్చిన అక్టోబర్‌ నెలలోనే రెండు బంతి మొక్కల మధ్యలో పొగాకు నారును నాటారు. ఎకరాకు 8 క్వింటాళ్ల దిగుబడి వచ్చింది. క్వింటా రూ. 15 వేల ధర చొప్పున విక్రయించారు. ఎకరాకు రూ. 4 వేలు మాత్రమే ఖర్చయింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement