ప్రకృతే ఆయన ప్రాణం!
♦ భూమిని దున్నకుండా రసాయనిక రహిత సాగు
♦ అధిక దిగుబడులు సాధించిన ప్రకృతి ప్రేమికుడు
భూమిని దున్నకుండా, ఎరువులు వేయకుండా, క్రిమిసంహారకాలు పిచికారీ చేయకుండా వ్యవసాయం చేయడమనేది నేటి ఆధునిక ప్రపంచంలో కలలో సైతం ఊహించలేనిది. గుజరాత్‌కు చెందిన భాస్కర సావే దానిని ఆచరణలో పెట్టి అందరినీ అబ్బురపరిచారు. ప్రకృతి ఒడిలో సహజీవనం చేసి ప్రకృతి వ్యవసాయానికి గాంధీజీగా పేరొందిన భాస్కర సావే ఇటీవలే మరణించారు.
అడవులను ఎవరు పెంచారు? అక్కడ భూమిని ఎవరు దున్నారు? విత్తనాలు ఎవరు వేశారు? ఎరువులు, నీరు ఎవరు అందించారు? ఇవేమీ జరగకపోయినా అటవీ సంపద మనకు మధురమైన ఫలాలను అందిస్తోంది కదా! అదెలా సాధ్యం? ప్రకృతే వాటిని సమకూరుస్తోందనేవారు సావే. మరి మనం మాత్రం రసాయనిక ఎరువులు వేయకుండా, క్రిమిసంహారకాలను పిచికారీ చేయకుండా ఎందుకు వ్యవసాయం చేయకూడదన్నది ఆయన ప్రశ్న. తాను నమ్మిన సిద్ధాంతాన్ని త్రికరణశుద్ధిగా ఆచరించి చూపిన సావే ప్రకృతి వ్యవసాయానికి గాంధీజీగా పేరుగాంచారు. 1960 నుంచి తుది శ్వాస విడిచేంత వరకు ఆయనది అదే బాట.అదే మాట. భాస్కర సావే గతనెల 24న మరణించారు.
అది నిజంగా కల్పవృక్షమే!
గుజరాత్‌లోని సావే వ్యవసాయ క్షేత్రం ‘కల్పవృక్ష’లోకి అడుగు పెడితే చాలు... అన్నీ అద్భుతాలే. ఆయనెప్పుడూ తన భూమిని దున్నలేదు. ఎరువులు వేయలేదు. రసాయనాలు పిచికారీ చేయలేదు. దేశంలోనే అత్యధిక దిగుబడి ఇస్తున్న కొబ్బరి చెట్లు కల్పవృక్షలో కన్పిస్తాయి. కొన్ని చెట్లు ఏడాదికి 400 కాయలను అందిస్తాయి. దిగుబడి సగటున 350 కాయలకు తగ్గదు. 45 సంవత్సరాల నాటి సపోటా మొక్కలు ఇప్పటికీ మధుర ఫలాలను అందిస్తూనే ఉన్నాయి. ఏడాదికి ఒక్కో చెట్టుకు 300 పండ్లు కాస్తున్నాయి. సావే వ్యవసాయ క్షేత్రంలో అరటి, బొప్పాయి, మామిడి, తాటి, దానిమ్మ, నిమ్మ, వేప...ఒకటేమిటి అన్ని రకాల చెట్లు కన్పిస్తాయి. రెండెకరాల విస్తీర్ణంలో వరి పంట వేశారు. పప్పు ధాన్యాలు, గోధుమలు, కూరగాయల పంటలకు సైతం నెలవుగా ఉంటోంది ‘కల్పవృక్ష’. సహజసిద్ధంగా, ప్రకృతి ప్రసాదంగా లభిస్తున్న ఈ పంటల ఉత్పత్తులు అతిథులకు మరువలేని ఆతిథ్యానిస్తుంటాయి.
ఇవన్నీ మిత్ర జీవులే
ప్రకృతి మాత ఒడిలోని అనేక జీవులు మనకు స్నేహితులేనని సావే చెప్పేవారు. చీమ, వానపాము, బాక్టీరియా వంటి జీవులు అన్నదాతలకు ఎంతో మేలు చేస్తాయి. పంట చేలో ఇవి పుష్కలంగా ఉంటే చాలు... ఆ రైతు సంపన్నుడే అని అనేవారు సావే. ఈ జీవులన్నీ భూసారాన్ని పెంచుతూ రైతుకు మంచి దిగుబడులు అందిస్తున్నాయి. వీటిలో చాలా వరకు రసాయనిక క్రిమిసంహారక మందుల బారినపడి చనిపోతున్నాయి. ట్రాక్టర్ల కింద నలిగిపోతున్నాయి. ఫలితం... నేల నిస్సారమై చీడపీడల దాడికి సులభంగా లోనవుతోంది.
కలుపు మొక్కలు కూడా...
కలుపు మొక్కలను శత్రువులుగా రైతులు భావిస్తుంటారు. నిజానికి అవి కూడా అన్నదాతకు మేలు చేసేవే. కలుపు మొక్కలు భూమి కోతను నివారిస్తాయి. నేలలో తేమను నిలుపుతాయి. పూత దశకు చేరకముందే కలుపు మొక్కలను భూమిలో తొక్కేస్తే నేలకు బలం చేకూరుతుంది. వాటిని రసాయనిక మందులతో నిర్మూలించే బదులు లోతు దుక్కులు చేస్తే సరి. భూసారం పెరుగుతుంటే కలుపు బెడద దానంతట అదే తగ్గిపోతుంది. భూసారం తక్కువగా ఉంటే పంట మొక్కల సాంద్రతను పెంచితే కలుపు సమస్య ఉండదు.
భూమిపై నివసించే ప్రాణులన్నింటికీ జీవించే హక్కు ఉంది. ప్రకృతిలో లభించేవన్నీ ఉపయోగపడేవే. వ్యవసాయం వ్యాపారం కాకూడదు. పంట ఉత్పత్తులను కొంతమేరకే వినియోగించుకోవాలి. భూసారం పెంచడానికి కొద్దిగా కృషి చేస్తే సమస్యలనేవే ఉండవనేవారు భాస్కర సావే.
- సాక్షి, సాగుబడి డెస్క్