organic method
-
ముత్తు నందిని ప్యాలెస్ ఇష్టాల ఇల్లు
రాజ్ చందర్ పద్మనాభన్, నాగ జయలక్ష్మి దంపతులు తమిళనాడు రాష్ట్రం, కన్యాకుమారిలో నివసించేవారు. సొంత ఇంటి కలను నెరవేర్చుకునే క్రమంలో వీరు అనుసరించిన విధానం ఇప్పుడు దేశమంతటినీ ఆకర్షిస్తోంది. పర్యావరణ ప్రేమికులనైతే మరీ ఎక్కువగా ఆకట్టుకుంటోంది. రెండేళ్ల కిందట గృహప్రవేశం చేసుకున్న కొత్త ఇల్లది. అయితే ఆ ఇంట్లో అడుగుపెడితే కాలం గిర్రున సినిమా రీల్‌లాగ వందేళ్ల వెనక్కి తిరిగిపోయిందా అనిపిస్తుంది. ఇంటిని చూడడానికి వచ్చిన వాళ్లను అతిథి మర్యాదలతో ముంచెత్తుతారు ఈ దంపతులు. సేంద్రియ పద్ధతిలో పండించిన దినుసులు, కాయగూరలతో సంప్రదాయ తమిళ, చెట్టినాడు వంటలను వడ్డిస్తారు. ఎర్రమట్టి, సున్నపు రాయితో నిర్మించిన ఇంట్లో భూగర్భ జలాలను పరిరక్షించే ఏర్పాటు ఉంది. బంకమట్టి నిర్మాణం కావడంతో ఎండాకాలం చల్లగా ఉంటుంది. నేచర్ ఫ్రెండ్లీ ట్రావెల్‌ను ఇష్టపడే వాళ్లు ఇక్కడ బస చేస్తుంటారు. బస చేయకపోయినా చూసి పోవడానికి వచ్చేవాళ్లు కూడా ఎక్కువగానే ఉంటారు. ఈ కాలంలో ఇంటిని ఇలా ఎందుకు కట్టుకున్నారనే ప్రశ్న దాదాపుగా ప్రతి ఒక్కరి నుంచి ఎదురవుతుంటుంది. జయలక్ష్మి ప్రతి ఒక్కరికీ పూసగుచ్చినట్లు వివరిస్తుంటుంది. బాల్యంలోకి వెళ్లారాయన! ‘‘రాజ్‌చందర్ వృత్తిరీత్యా జియో డాటా అనలిస్ట్. ఆయనకు ఇష్టమైన రోజులంటే చిన్నప్పుడు వాళ్ల అమ్మమ్మ గారింట్లో గడిపిన బాల్యమే. పైగా రాజ్ అభిరుచి, విధి నిర్వహణ కూడా పర్యావరణవేత్తలతో కలిసి పని చేయడమే. ఈ రెండు ఇష్టాలను కలుపుతూ చక్కటి ఇల్లు కట్టుకోవాలని ఎప్పుడూ చెప్పేవారు. నాక్కూడా మా సంప్రదాయ నిర్మాణంలో ఉండే సౌందర్యం చాలా ఇష్టం. ఇద్దరి అభిరుచులూ కలవడంతో ఇంటిని ఇలా కట్టుకున్నాం. మా ఇద్దరి ఇష్టాల మేరకు ఎలా కట్టుకోవాలో ఒక ఐడియా వచ్చేసింది. ఎక్కడ కట్టాలనే విషయంలో ఒక అభిప్రాయానికి రావడం కొంచెం కష్టమే అయింది. లొకేషన్ సెర్చింగ్ మొదలు పెట్టాం. సంజీవని శకలం కన్యాకుమారికి సమీపంలో పోథయాడి గ్రామాన్ని చూసినప్పుడు కొండలు, పచ్చటి చెట్లతో ప్రదేశం బాగుందనిపించింది. ఆశ్చర్యంగా మరో విషయం తెలిసింది. అదేంటంటే... రామాయణంలో లక్ష్మణుడు మూర్ఛపోయినప్పుడు వైద్యం కోసం హనుమంతుడు ఏకంగా సంజీవని మొక్క ఉన్న పర్వతం అంతటినీ ఎత్తుకొచ్చాడని విన్నాం. వైద్యం చేసిన తర్వాత ఆ పర్వతాన్ని తిరిగి తీసుకెళ్లే క్రమంలో పర్వతంలోని ఒక శకలం విరిగి కింద పడి పోయిందని, ఆ శకలమే ఈ కొండ అని చె΄్పారు స్థానికులు. వాళ్ల విశ్వాసాన్ని పక్కన పెడితే ఆ కొండమీద చుట్టు పక్కల ఉన్న మొక్కలన్నీ ఔషధ మొక్కలే. ప్రకృతితో మమేకమై నివసించడానికి మాకు ఇంతకంటే సౌకర్యవంతమైన ప్రదేశం మరోటి ఉండదేమో అనిపించింది. అంతే... 2021లో నిర్మాణం మొదలు పెట్టాం. ఒక ఏడాదిలో తమిళ, వేనాడు, చెట్టినాడు సంస్కృతుల సమ్మేళనమైన మా ఇంటి నిర్మాణం పూర్తయింది. సంప్రదాయ కళాకృతుల సేకరణ నా హాబీ. ఇంటిని తమిళ సంప్రదాయ సంస్కృతికి ప్రతీకగా మలిచాను. ఇంటి ముఖద్వారం నుంచి నేల, గోడ, మెట్లు, పై కప్పు, అలంకరణ వస్తువులు ప్రతి ఒక్కటీ తమ వైభవాన్ని తామే చెప్పుకుంటాయి. పర్యావరణ హితమైన సున్నపు పోడి ఇటుకలు, ఎర్ర మట్టి, ఆవుపేడ, ధాన్యం పోట్టు, కోడిగుడ్లు, బెల్లంతోపాటు అత్తంగుడి నది తీరాన దొరికే ఇసుకతో తయారు చేసే అత్తంగుడి టైల్స్‌ను వాడాం. పై కప్పుకి కాంక్రీట్ వాడకాన్ని తగ్గించి ఫిల్లర్ స్లాబ్ టెక్నిక్ ఉపయోగించాం. వర్షపు నీటిని నిల్వ చేయడానికి రెయిన్ వాటర్ హార్వెస్టింగ్ పిట్, కరెంటుకోసం సోలార్ ప్యానెల్స్ పెట్టాం. ఈ మట్టి సౌధంలో 5బెడ్ రూమ్‌లు, మూడు బాల్కనీలు, మూడు లివింగ్ స్పేస్‌లు ఉన్నాయి. ఇప్పటివరకు రెండు వందల మందికి పైగా పర్యాటకులు ఈ హోమ్ స్టేలో బస చేశారు. ఆహారం కూడా తమిళనాటప్రాంంతాల వారీగా విలసిల్లిన విభిన్నమైన రుచులుంటాయి. ఇంటి ఆవరణలో అన్ని రకాల కూరగాయలనూ పండిస్తాం. వంటగదిలో వచ్చే వ్యర్థాలనే ఎరువుగా వేస్తాం’’ అని తమ పర్యావరణ హిత భవనం ముత్తు నందిని ప్యాలెస్ గురించి వివరించింది జయలక్ష్మి. -
అమ్మ చేతి పంట
విద్యార్థులు ఏటా పరీక్షలు రాసి ఉత్తీర్ణులవుతూ పై తరగతులకు ప్రమోట్ అవుతుంటారు. పట్టభద్రులైన తర్వాత ఇక పుస్తకాలుండవు, తరగతులుండవు, పరీక్షలూ ఉండవు. రైతుకి అలా కాదు. వ్యవసాయం అనే పరీక్షను ఏటా ఎదుర్కోవాల్సిందే. తన జీవితకాలమంతా ఏటా పరీక్ష కు సిద్ధం కావాల్సిందే. కాలం కలిసి వచ్చి ప్రకృతి కరుణిస్తేనే ఉత్తీర్ణత. ఎన్నేళ్లు ఎన్ని పరీక్షలు రాసినా ప్రమోషన్ ఉండదు. అదే పొలం, అదే పంట. భూమితో అనుబంధం తెంచుకోలేక, ఉత్తీర్ణత ప్రశ్నార్థకమవుతున్నా సరే మళ్లీ మళ్లీ పరీక్షకు సిద్ధం కావాల్సిందే. ఇన్ని పరీక్షలతో అలసిపోయిన రైతులు తర్వాతి తరాన్ని పొలానికి దూరంగా పెంచుతున్నారు. వ్యవసాయం మీద మమకారం పెంచుకుంటారేమోనని భయపడుతున్నారు కూడా. తమిళనాడులోని ఈ కుటుంబం కూడా అలాంటిదే. ఓ అమ్మ పిల్లల బాధ్యతలు పూర్తయిన తరవాత అదే పొలంలో అడుగుపెట్టి, ప్రయోగాల పంట పండించింది. కావేరి తీరం! భువనేశ్వరి పుట్టింది తమిళనాడు, తంజావూరు జిల్లాలోని కల్యాణోదయ్ గ్రామంలో. వాళ్ల ఇంటికి దగ్గరగా కావేరి నది ప్రవహిస్తుండేది. నీరు, మట్టి, చెట్టు, పండు అన్నీ స్వచ్ఛమే. కలుషితం కావడం అంటే ఏమిటో తెలియని ప్రకృతి ఒడిలో పెరిగిన బాల్యం ఆమెది. పెళ్లి తర్వాత మధురైకి దగ్గరలోని పుదుకొటై్టకి వెళ్లింది. అత్తవారిది కూడా వ్యవసాయ ప్రధానమైన కుటుంబమే. కానీ ఈ తరంలో అందరూ ఇతర వృత్తి ఉద్యోగాల్లో స్థిరపడిపోయారు. కౌలు రైతుల కెమికల్ ఫార్మింగ్ వల్ల పొలం బీడువారింది. అత్తగారింట్లో వాళ్లెవరూ తమకు పదెకరాల పొలం ఉందనే సంగతి కూడా పట్టించుకోవడం లేదు. భువనేశ్వరి మొక్కల హాబీ పెరటిసాగుకే పరిమితమైంది. పిల్లలు పెద్దయిన తర్వాత ఆమెకు ఖాళీ సమయం ఎక్కువైంది. ఇంట్లో వాళ్లను అడిగి ఒకటిన్నర ఎకరా పొలంలో సాగు చేయడానికి అనుమతి తీసుకుందామె. పొలానికి వెళ్లి సేద్యం చేయడానికి అనుమతి ఇస్తూ ఇంట్లో వాళ్లు ‘వ్యవసాయం అంటే పెరట్లో కూరగాయలు పండించినట్లు కాదు’ అని హెచ్చరించారు కూడా. సేద్యంలో మెళకువల కోసం కరూర్‌లోని ‘వనగమ్ నమ్మళ్వార్ ఎకలాజికల్ ఫౌండేషన్’లో శిక్షణ తీసుకుంది. అన్నింటికీ తలూపి సేంద్రియ పద్ధతిలో సేద్యం చేయడం మొదలుపెట్టిందామె. అలా ఆమె రైతుగా మారింది. ఇది 2013 నాటి మాట. ప్రయోగాత్మకంగా మొదలు పెట్టిన సాగు మంచి ఫలితాలనిచ్చింది. సాగు విస్తీర్ణాన్ని విస్తరించింది. ఇప్పుడు పదెకరాల పొలాన్ని ఒంటి చేత్తో సాగు చేస్తోంది. నేలకు ఎప్పుడు ఏ సేవ చేయాలో, ఎప్పుడు ఏ పంట వేయాలో క్షుణ్నంగా వివరించగలుగుతోంది. కొత్తగా సేంద్రియ వ్యవసాయం చేయాలనుకునే వాళ్లకు సలహాలిస్తోంది. వంట కోసమా! పంట కోసమా!! భువనేశ్వరి సేంద్రియ సేద్యంలో నేర్చుకున్న ఆవుపేడ, ఆవు మూత్రంతో కూడిన పంచగవ్యాన్ని ఉపయోగించడం వంటి మెళకువలకు తోడు తాను మరికొన్ని జోడించి చేసిన సొంత ప్రయోగాలు ఫలించాయి. అల్లం, వెల్లుల్లి, పచ్చిమిర్చి మెత్తగా నూరి ఆ ముద్దను మజ్జిగలో కలిపి పంటల మీద చల్లేది. కీటకాలు మొక్కలోని సారాన్ని పీల్చేసి ఆకులు తెల్లగా మారిపోయినప్పుడు ఆమె ఈ పని చేసింది. కీటకాలు నశించి మొక్కలు ఆకుపచ్చదనం సంతరించుకున్నాయి. ఆమె ప్రయోగాలను చూసి ఆమె పిల్లలు ‘అమ్మా! వంట చేస్తున్నావా? పంట పండిస్తున్నావా’ అని చమత్కరించేవారు. ఎరువులు, క్రిమిసంహారక మందుల మీద ప్రయోగాలు పూర్తయ్యాయి. ఇక ఇప్పుడు అంతరించిపోతున్న ధాన్యాలను పరిరక్షించే పనిలో ఉందామె. అందరికీ ఉండేది రోజుకు ఇరవై నాలుగ్గంటలే. ఆ ఇరవై నాలుగ్గంటలను ఉపయుక్తంగా మలుచుకునే వాళ్లు చరిత్ర సృష్టిస్తారు... అచ్చం భువనేశ్వరిలాగానే. -
నల్ల ధాన్యం సాగు సక్సెస్
సాక్షి, అమరావతి బ్యూరో: బాపట్ల వ్యవసాయ పరిశోధన కేంద్రం బీపీటీ 2841 రకం బ్లాక్ రైస్ వరి వంగడాన్ని ఆవిష్కరించింది. ఖరీఫ్ సీజన్లో ప్రయోగాత్మకంగా దీన్ని బాపట్ల పట్టణానికి చెందిన రైతు లేళ్ల వెంకటప్పయ్య సేంద్రియ పద్ధతిలో సాగు చేశారు. 2 కిలోల విత్తనాన్ని 20 సెంట్ల మాగాణిలో సాగు చేయగా 7 బస్తాల దిగుబడి వచ్చింది. దీని ధర 75 కిలోల బస్తా రూ.7,500కు పైగా ఉండటం గమనార్హం. ఇప్పటివరకూ బాపట్లలో 8 రకాల నాణ్యమైన వరి వంగడాలు రూపొందించగా... బీపీటీ 5204 (సాంబ మసూరి), బీపీటీ 2270 (భావపురి సన్నాలు) దేశవ్యాప్తంగా ప్రాచుర్యం పొందాయి. బీపీటీ 5204 రకం దేశంలో సాగయ్యే విస్తీర్ణంలో 25 శాతం సాగు చేయడం గమనార్హం. తాజాగా బాపట్ల కీర్తి కిరీటంలో సరికొత్త వంగడం బ్లాక్‌రైస్ బీపీటీ 2841 చేరనుంది. క్వాలిటీ రైస్ కింద అభివృద్ధి చేస్తున్నాం... బీపీటీ 2841 బ్లాక్ రైస్‌ను రూపొందించి ఈ ఏడాది ప్రయోగాత్మకంగా రైతులతో సాగు చేయించాం. తెగుళ్లను తట్టుకొని మంచి దిగుబడి వచ్చింది. మూడేళ్లు ప్రయోగాలు చేసి, ఫలితాలు చూసిన తరువాతే అధికారికంగా విడుదల చేస్తాం. దీన్ని వినియోగించటం వలన వ్యాధి నిరోధక శక్తి పెరుగుతుంది. మార్కెట్లో గిరాకీ ఉంది. అమెజాన్‌లో కిలో బియ్యం రూ. 375కి అమ్ముతున్నారు. ఈ కొత్త వంగడం బాపట్ల సిగలో తలమానికం కానుంది. – టీవీ రామారావు, ప్రధాన శాస్త్రవేత్త, బాపట్ల మంచి దిగుబడి వచ్చింది బాపట్ల వ్యవసాయ పరిశోధన స్థానం వారు ఈ వంగడాన్ని ప్రయోగాత్మకంగా సాగు చేసేందుకు ఇచ్చారు. 2 కిలోల విత్తనాన్ని 20 సెంట్లలో సాగు చేశాను. 7 బస్తాల దిగుబడి వచ్చింది. మార్కెట్లో బ్లాక్ రైస్‌కు డిమాండ్ ఉండటంతో మంచి ఆదాయం వస్తుంది. – లేళ్ల వెంకటప్పయ్య, రైతు, బాపట్ల ఖర్చు తక్కువ–ఆదాయం ఎక్కువ బ్లాక్ రైస్‌ను 20 సెంట్లలో సాగు చేసేందుకు ఖర్చు తక్కువే అయిందని రైతు లేళ్ల వెంకటప్పయ్య చెబుతున్నారు. ఒక బండి ఎరువు రూ.1,200, నాలుగు సార్లు దుక్కుల కోసం రూ.500, వరి నాట్లు వేసేందుకు ఇద్దరు కూలీలకు రూ.600, కోత కోసేందుకు ఇద్దరు కూలీలకు రూ.600, పంట నూర్పిడి చేసేందుకు రూ.1,000 మొత్తం రూ.3,900 మాత్రమే ఖర్చు అయినట్లు తెలిపారు. 20 సెంట్లలో సుమారు 7 బస్తాల దిగుబడి వచ్చిందని దీని ప్రకారం ఎకరానికి 35 బస్తాలకు పైగా దిగుబడి వచ్చినట్లని వివరించారు.75 కిలోల ధాన్యం ధర రూ.7,500 పలుకుతోందని చెప్పారు. ఈ లెక్కన 20 సెంట్ల సాగుతో రూ.49,000 వస్తుందని, ఖర్చులు పోను రూ.45,100 ఆదాయం వస్తుందని ఆనందం వ్యక్తం చేశారు. పంట కేవలం 125 రోజుల్లో వచ్చిందని, ఎలాంటి రసాయన ఎరువులు ఉపయోగించలేదని, బ్యాక్టీరియా, మెడ తెగులు, పాముపొడ రాకుండా వేప చమురు, పుల్ల మజ్జిగను వినియోగించినట్లు ఆయన వివరించారు. బ్లాక్ రైస్ ప్రత్యేకతలు ఈ వంగడం దోమ, అగ్గి తెగులును తట్టుకుంటుంది. భారీ వర్షాలను తట్టుకుంటుంది. పంట నేలవాలదు. దీనిలో యాంటీఆక్సిడెంట్స్ అధికంగా ఉండటం వలన, వాడిన వారిలో వ్యాధి నిరోధక శక్తి పెరుగుతుంది. క్యాన్సర్, గుండె సంబంధిత వ్యాధులను నివారించవచ్చని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. -
ఫ్యామిలీ ఫార్మర్
సాక్షి, హైదరాబాద్: ఆహారం అంటేనే ఆరోగ్యం. ఆరోగ్యం అంటేనే ఆహారం. కానీ ఇప్పుడు ఆహారం అంటేనే దాదాపు భయపడాల్సిన పరిస్థితి. రసాయన ఎరువులు, క్రిమిసంహారక మందుల ద్వారా పండిన పంటలు ఒకవైపు.. కల్తీ ఆహార పదార్థాలు మరోవైపు మూకుమ్మడి దాడి చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో సేంద్రియ పంటలు అందుబాటులోకి వచ్చాయి. అయితే ఇందులో కూడా ఏది సేంద్రియం.. ఏది సేంద్రియం కాదనేది తెలుసుకోవడం కాస్త కష్టమే. అందుకే నమ్మకమైన ఫ్యామిలీ ఫార్మర్స్ వచ్చేశారు. ఫ్యామిలీ డాక్టర్ ఎలాగో.. ఫ్యామిలీ ఫార్మర్స్ అలాగన్న మాట. మనకు కావాల్సిన ఆరోగ్యకరమైన, నిజమైన సేంద్రియ పంటలు మన ముంగిళ్లకే తెచ్చి ఇచ్చేందుకు సిద్ధమవుతున్నారు. ఇప్పుడు మన రాష్ట్రంలో ‘ఫ్యామిలీ ఫార్మర్స్’ నయా ట్రెండ్ మొదలైంది. దీంతో ఆదాయంతో పాటు తృప్తి కలుగుతుందని ఈ ఫార్మర్స్ చెబుతున్నారు. రసాయనాల్లేని ఆహారాన్ని తమ వంట గదుల్లో అందుబాటులో ఉంచుకోవాలని కోరుకునే కుటుంబాలకు కొందరు రైతులు ‘ఫ్యామిలీ ఫార్మర్లు’గా మారుతున్నారు. నేరుగా ఇళ్లకే సరఫరా.. పరిశుభ్రమైన, పురుగు మందులు, రసాయన ఎరువుల్లేకుండా పూర్తిగా సేంద్రియ పద్ధతిలో పండించే ఆహారపదార్థాలపై ఇప్పుడు జనంలో ఆసక్తి పెరిగింది. అలాంటి ఆహారం కోసం ఎదురుచూస్తున్నారు. అలాంటివారి కోసం కొందరు రైతులు సేంద్రియ ఆహారం పండించి ఇళ్లకు సరఫరా చేస్తు న్నారు. ఇప్పుడు హైదరాబాద్ సహా పలు పట్టణాలు, నగరాల్లో సేంద్రియ పద్ధతిలో పండించిన కూరగాయలు, వరి, పప్పుల కోసం జనం పరుగులు పెడుతున్నారు. కొందరు పాలు, కూరగాయలు, బియ్యం, పప్పులు, సుగంద ద్రవ్యాలన్నీ ఇలాగే కొంటున్నారు. కొందరు నేరుగా రైతుల నుంచి కొంటుండగా, మరికొందరు పలు సంస్థల నుంచి కొనుగోలు చేస్తున్నారు. సాఫ్ట్వేర్ ఉద్యోగం వదిలి మరీ.. వనపర్తి జిల్లా పెబ్బేరుకు చెందిన ప్రవీణ్‌రెడ్డి బెంగళూరు, హైదరాబాద్‌లో సాఫ్ట్వేర్ ఇంజనీర్‌గా పనిచేశాడు. ఉద్యోగంలో సంతృప్తి చెందలేదు. తనకున్న 18 ఎకరాల్లో సేంద్రియ సాగు చేయాలని నిర్ణయించుకున్నాడు. వరి, కంది, పెసర, వేరుశనగ తదితర ఆహార పంటలతో పాటు సొర, కాకర, బీర వంటి కూరగాయలను సాగు చేస్తున్నాడు. హైదరాబాద్‌లో 20 ఇళ్లకు నేరుగా బియ్యం, కూరగాయలు సరఫరా చేస్తున్నాడు. కొందరేమో ప్రవీణ్ ఇంటికి వచ్చి కొనుగోలు చేస్తారు. హైదరాబాద్‌లో ఒక దుకాణానికి వేరుశనగ, ఉలవలు పండించి పంపుతారు. మామిడి పండ్లను కూడా సాధారణ పద్ధతిలో మాగబెట్టి అపార్ట్మెంట్లకు పంపుతున్నట్లు చెబుతున్నారు. నేరుగా అపార్ట్మెంట్లకు.. రంగారెడ్డి జిల్లా కడ్తల్ గ్రామానికి చెందిన చల్లా పవన్‌రెడ్డి హైదరాబాద్‌లో కొందరిని అబ్బాయిలను నియమించుకున్నాడు. వారు నేరుగా అపార్ట్మెంట్లకు, ఇళ్లకు వెళ్లి పవన్ పండించే సేంద్రియ ఆహారపదార్థాలను అందజేస్తారు. తనకున్న 17 దేశవాళీ ఆవు పాలు రోజుకు 100 లీటర్ల వరకు ఇస్తాయి. వాటిని అబ్బాయిల ద్వారా విక్రయిస్తారు. టమాట, మిర్చి, వంకాయ, గోరుచిక్కుడు, కొత్తిమీర పండించి వినియోగదారులకు పంపిస్తాడు. 11 ఎకరాల్లో అతను సాగు చేసి వినియోగదారులకు ఇలా పంపుతున్నాడు. నియమించుకున్న ఒక్కో అబ్బాయికి నెలకు రూ.6 వేలు ఇస్తున్నాడు. రమణారెడ్డి ఇంటికి ప్రజాప్రతినిధులు, ఐఏఎస్‌లు... నాగర్‌కర్నూలు జిల్లా తెలకపల్లి మండలం కారువంగ గ్రామానికి చెందిన రమణారెడ్డి 30 ఎకరాల్లో సేంద్రియ వ్యవసాయం చేస్తాడు. తాను పండించే పంటల్లో 80 శాతం ఇంటి నుంచే అమ్ముతాడు. సేంద్రియ పద్ధతిలో పండించిన వరి నుంచి పాలీష్ బియ్యం, దంపుడు బియ్యం, తక్కువ దంపుడు బియ్యం మిల్లులో పట్టిస్తాడు. అలాగే మిర్చి, కంది, పెసర, మినుములు, శనగ, జొన్న, వేరుశనగ, ఆవాలు, ధనియాలు పండిస్తాడు. అన్నీ సేంద్రియ పద్ధతిలో పండించడం వల్ల తన ఇంటికి హైదరాబాద్, నిజామాబాద్, కరీంనగర్, కర్ణాటక నుంచి నుంచి జనం క్యూలు కడతారని చెబుతున్నాడు. ప్రస్తుత, మాజీ ఎమ్మెల్యేలు, కొందరు ఐఏఎస్‌లు కూడా తన ఇంటికొచ్చి తన పంటలు కొంటారని పేర్కొంటున్నాడు. హైదరాబాద్‌లోని ఒక దుకాణానికి కూడా తాను పండించేవి పంపుతున్నారు. తన వద్ద కొందరు క్యాన్సర్ రోగులు కూడా వచ్చి కొనుగోలు చేస్తున్నారని ఆయనంటున్నారు. సాధారణ పద్ధతిలో పండించే వాటికి, తాను సేంద్రియ పద్ధతిలో పండించే వాటికి ధరలో కేవలం కొద్ది తేడా మాత్రమే ఉంటుందని ఆయనంటున్నారు. తాను పండించే ఆహార పదార్థాలతో ఆరోగ్యం ఎంతో బాగుంటుందని వినియోగదారులు చెబుతున్నారని రమణారెడ్డి చెబుతున్నారు. నాలుగెకరాల్లో పండిస్తున్న రజిత.. యాదాద్రి జిల్లా చౌటుప్పల్ మండలం పెద్ద కొండూరు గ్రామానికి చెందిన రజిత కూడా సేంద్రియ పద్ధతిలో పంటలు పండిస్తున్నారు. వరి, టమాట, వంకాయ, మిర్చి, బీరకాయ, గోరు చిక్కుడు, కాకరకాయ వంటివి సీజనల్‌గా పండిస్తున్నారు. తాను పండించే వీటిని ఓ ప్రముఖ సంస్థకు సరఫరా చేస్తున్నట్లు చెబుతున్నారు. సమీపంలో ఉన్న ఓ హోటల్‌కు కూడా సరఫరా చేస్తున్నారు. ఆ హోటల్ కూడా సేంద్రియ ఆహార పదార్థాలతో పండించే ‘విలేజ్ ఆహారం’పేరుతో ప్రజలకు పెడుతుండటం గమనార్హం. -
రోజూ రాబడే!
రైతుకు ప్రతి రోజూ ఆదాయాన్నిచ్చే పంటలు కూరగాయలు. ప్రణాళికాబద్ధంగా దఫ దఫాలుగా వివిధ రకాల కూరగాయ పంటలను విత్తుకుంటూ ఉంటే.. ఏడాది పొడవునా, అన్ని సీజన్లలోనూ, ప్రతి రోజూ అనేక రకాల కూరగాయలు చేతికి అందివస్తాయి. రైతు కుటుంబం తినవచ్చు, అమ్ముకొని ఆదాయమూ పొందవచ్చు. అయితే, రైతుకు ఇందుకు కావల్సింది ఖచ్చితమైన ప్రణాళిక, తగిన నీటి వసతి. ఈ రెంటికీ క్రమశిక్షణ తోడైతే ఇక అరెకరం ఎర్ర నేల ఉన్న చిన్న రైతు కూడా నిశ్చింతగా రోజువారీగా ఆదాయం పొందవచ్చు. సేంద్రియ ఉత్పత్తుల వల్ల ఒనగూడే ఆరోగ్య ప్రయోజనాలపై నగర, పట్టణ వాసుల్లోనే కాదు గ్రామీణుల్లోనూ అవగాహన అంతకంతకూ పెరుగుతున్న నేపథ్యంలో రసాయనాలు దరిచేరనివ్వని రైతుల ఆదాయానికి ఢోకా ఉండబోదు. సేంద్రియ సేద్యంలో 15 ఏళ్ల అనుభవం గడించిన సుస్థిర వ్యవసాయ కేంద్రం (సి.ఎస్.ఎ.) నిపుణులు ‘నిరంతర సేంద్రియ కూరగాయల సాగు’పై అందించిన సమాచారం.. ‘సాగుబడి’ పాఠకుల కోసం! కూరగాయలు సాగు చేస్తున్న రైతులు ఆ పంట నుంచి తగిన ఆదాయం పొందాలంటే పంటను బట్టి విత్తిన/నాటిన దగ్గర నుంచి ఒక నెల నుంచి 4–5 నెలలు పడుతుంది. ఈ లోగా దానికి కావలసిన పెట్టుబడి కోసం అప్పులు చేయాల్సి వస్తున్నది. రైతులు సంవత్సరం పొడవునా ప్రణాళిక ప్రకారం అన్ని రకాల కూరగాయలను సాగు చేసుకుంటే రోజువారీగా ఆదాయం అందుతుంది. అంతేకాకుండా, పెట్టుబడి కోసం అప్పులు చేయాల్సిన అవసరం ఉండదు. పైగా, తినటానికి కూరగాయలను వెతుక్కోవలసిన/ కొనుక్కోవాల్సిన అవసరమూ ఉండదు. ఒకవేళ వాతావరణ పరిస్థితులు అనుకూలించకపోయినా, ఇంకే విధమైన నష్టం జరిగినా, ఒకటి రెండు పంట రకాలను నష్టపోయినా, మిగతా వాటి నుంచి ఎంతో కొంత ఆదాయాన్ని పొందవచ్చు. అంతేకాక పురుగుమందుల విషాలు లేని ఆరోగ్యదాయకమైన సేంద్రియ తాజా కూరగాయలను గ్రామస్థాయిలోనే వినియోగదారులకు అనుదినం అందుబాటులో ఉంచవచ్చు. అర ఎకరం ఎర్ర భూమిలో నీటి వసతి, పందిరి కలిగి ఉండి, ఆసక్తి కలిగిన రైతులు శిక్షణ పొంది సంవత్సరం పొడవునా సేంద్రియ పద్ధతిలో నిరంతర కూరగాయల సాగు ప్రణాళిక రూపొందించుకొని అమలు చేయవచ్చు. సంవత్సరం పొడవునా కూరగాయల సాగు ప్రయోజనాలు: ► కూరగాయలను గ్రామస్థాయిలో ప్రతిరోజూ అమ్మకానికి అందుబాటులో ఉంచగలగడం. ► రైతుకు ప్రతి రోజూ ఆదాయం పొందగలగడం. ► అధిక ఉత్పత్తితోపాటు మంచి నాణ్యమైన సేంద్రియ కూరగాయలను సాగు చేయటం. ► పురుగులు, తెగుళ్ల ఉధృతిని సేంద్రియ పద్ధతుల్లో అదుపులో ఉంచగలగటం. ► పంట ఉత్పత్తిలో, మార్కెటింగ్‌లో కష్టనష్టాలను తగ్గించడం. ఉన్న అరెకరంలో ఒకేరకమైన పంట పండించడం వల్ల సాగు, మార్కెటింగ్‌లోనూ సమస్యలు వస్తున్నాయి. అందువల్ల ఒక సీజన్లో అధిక ధర పలికిన పంటకు తర్వాత సీజన్లో అతి తక్కువ ధర పలికే పరిస్థితి వస్తుంది. ఇటువంటి పరిస్థితి నుంచి తప్పించుకోవాలంటే.. అనేక రకాల కూరగాయలను, అన్ని సీజన్లలోనూ దఫాల వారీగా విత్తుకుంటూ/నాటుకుంటూ ఏడాది పొడవునా కూరగాయల దిగుబడి వచ్చేలా చూసుకోవడమే ఉత్తమం. నేల తయారీ ► అనుకూలంగా ఉన్న సారవంతమైన భూమిని గుర్తించి, గుర్తులు పెట్టి, శుభ్రం చేసి ట్రాక్టర్‌తో గానీ, నాగలితో గానీ దున్నుకోవాలి. ► ఒక అడుగు లోతు వరకూ మట్టిని తవ్వి పూర్తిగా కలిసేలా కలియబెట్టాలి. ► అర ఎకరలో కూరగాయల సాగుకు బెడ్ల నిర్మాణం ► బెడ్ మేకర్‌తో మడులను తయారుచేసుకోవాలి. ► బెడ్ వెడల్పు 4 అడుగులు, ఎత్తు ఒక అడుగు ఉండాలి. రెండు బెడ్ల మధ్యలో 1.5 అడుగులు నడకదారిని ఏర్పాటు చేసుకోవాలి. ► 25 శాతం విస్తీర్ణంలో తీగ జాతి కూరగాయలు, 75% విస్తీర్ణంలో ఇతర కూరగాయలు పండించుకునే విధంగా సిద్ధం చేసుకోవాలి. ► స్థలం పొడవు, వెడల్పును బట్టి మడుల పొడవు నిర్ణయమవుతుంది. ► పొలం చుట్టూ 3 వరుసల సరిహద్దు పంటలుగా జొన్న లేదా సజ్జలను విత్తుకోవచ్చు. ఫలితంగా ఇరుగుపొరుగు పొలాలనుంచి రసం పీల్చే పురుగుల రాకను అడ్డుకోవచ్చు. ► మునగ, కూర అరటి, కరివేపాకు మొక్కలను వేసుకుంటే బహువార్షిక కూరగాయ పంటలను కూడా పండించి, అమ్ముకోవచ్చు. వీటి మధ్య 9 అడుగుల దూరం పాటించాలి. ► జామ, నిమ్మ, బొప్పాయి వంటి పండ్ల మొక్కలను(దూరం 18 అడుగులు) నాటుకోవాలి. మడి తయారు చేసుకోవడానికి కావలసిన వస్తువులు అర ఎకరంలో కూరగాయలు సాగు చేయడానికి దాదాపుగా 2 టన్నుల పశువుల పేడ లేదా వర్మీకంపోస్టు లేదా గొర్రెల ఎరువు మొదలైనవి దుక్కిలో వేసి కలియదున్నుకోవాలి. జీవన ఎరువుల(ట్రైకోడర్మా విరిడి, పి.ఎస్.బి., సూడో మోనాస్)ను అర ఎకరానికి ఒక కేజీ చొప్పున 50 కేజీల పశువుల పేడ కలిపి చల్లడం ద్వారా తెగుళ్లను అరికట్టవచ్చు. ప్రతి 15 రోజులకు ఒకసారి 100 లీటర్ల జీవామృతం లేదా అమృత జలం పిచికారీ చేయాలి. సూటి రకాల విత్తనాలు మేలు సూటిరకాల కూరగాయ విత్తనాలు రైతు ఉత్పత్తిదారుల సంఘాల దగ్గర, సికింద్రాబాద్‌లో తార్నాకలోని సహజ ఆహారం ఆర్గానిక్ స్టోర్స్(85007 83300)లో లభిస్తాయి. సూటి రకాలు తెగుళ్లు, చీడపీడల బెడదను తట్టుకుంటాయి. విత్తనాలు, మొక్కలు నాటడంలో మెలకువలు బెండ, చిక్కుడు, గోరు చిక్కుడు పంటలను నేరుగా విత్తుకోవాలి. ఆకుకూర విత్తనాలను ఇసుకలో కలిపి వెదజల్లుకోవాలి. టమాటో, వంగ, మిరప పంటల విత్తనాలతో నారు పెంచుకొని నాటుకోవాలి. సాగునీటిని పొదుపుగా వాడుకోవాలి. డ్రిప్ ద్వారా లేదా స్ప్రింక్లర్ల ద్వారా నీటిని అందించాలి. రైతులు తమ గ్రామంలో ఏయే రకాల కూరగాయలకు డిమాండ్ ఉంటుందో తెలుసుకొని ఆ రకాలను ఎంపిక చేసుకోవాలి. ఒక మడిలో ఒక పంట పూర్తయిన తర్వాత మళ్లీ అదే పంట వేయకూడదు. పంట మార్పిడి తప్పనిసరి. కూరగాయ మొక్కలను ఆశించే పురుగులు, తెగుళ్లు– నివారణ కూరగాయల సాగులో ముఖ్యంగా రసంపీల్చే పురుగులు, కాయతొలిచే పురుగులు, తెగుళ్లు ఆశిస్తాయి. వీటి నివారణకు తగు జాగ్రత్తలు తీసుకోవాలి. పురుగులు, తెగుళ్లు సమస్యను గమనించిన వెంటనే తగు చర్యలు చేపట్టడం ద్వారా నష్ట తీవ్రతను తగ్గించవచ్చు. రసం పీల్చే పురుగులు: రసం పీల్చే పురుగులు మొక్క లేత భాగాల నుంచి రసం పీల్చుతాయి. ఇవి సోకితే ఆకులు పసుపు రంగుకు మారి ఆకు ముడత ఏర్పడుతుంది. ఆకులు వాడిపోతాయి. పచ్చదోమ, పేనుబంక, తెల్లదోమ మొదలైనవి ఆశించిన వెంటనే 50 లీటర్ల నీటిలో 2.5 కిలోల వేప పిండితో చేసిన కషాయం పిచికారీ చేసుకోవాలి. పసుపు, తెలుపు, నీలం రంగు జిగురు పూసిన పళ్లాలను అమర్చుకోవాలి. వేరు, కాండం కుళ్లు తెగులు నివారణకు 50 కిలోల వేపపిండిని ఒక కిలో ట్రైకోడర్మా విరిడిని, 50 కిలోల పశువుల పేడను కలుపుకొని చల్లుకోవాలి. ఆకులు తినే పురుగులు ఆకులు తినే పురుగుల వల్ల కూరగాయ మొక్కల ఆకులు, కాయలపై రంధ్రాలు ఏర్పడతాయి. పురుగు తీవ్రత ఎక్కువగా ఉంటే ఆకుల ఈనెలు మాత్రమే మిగులుతాయి. ఆకుమచ్చ తెగులు నివారణకు 5 కిలోల పశువుల పేడ, 5 లీటర్ల పశువుల మూత్రం, 5 లీటర్ల నీటిని కలిపి 5 రోజుల పాటు మురగబెట్టిన తరువాత 6వ రోజు 250 గ్రాముల ఇంగువను 100 లీటర్ల నీటిలో కలిపి పిచికారీ చేసుకోవాలి. కాయ తొలిచే, మొవ్వు తొలిచే పురుగులను అరికట్టడం కోసం లింగాకర్షక బుట్టలను అమర్చుకోవాలి. శనగపచ్చ పురుగు నుంచి రక్షణకు పసుపు రంగు గల బంతిని ఎర పంటగా వేసుకోవాలి. కాండం కుళ్లు తెగులు: కాండం కుళ్లు తెగులు సోకితే మొక్కలు మొదళ్లలో కుళ్లి, ఒరిగిపోయి చనిపోతాయి. మొక్కలు నాటే ముందే వేప పిండిని మట్టిలో కలిపి ఆ తర్వాత మొక్కలను నాటుకుంటే ఈ తెగులు రాదు. ఆకులపై మచ్చలు, నివారణ: ఆకులపై మచ్చల తెగులు నివారణకు వేపకషాయం పిచికారీ చేయాలి. ఆకులపై బూడిదలా ఏర్పడటం (బూడిద తెగులు): బూడిద తెగులు నివారణకు 5 లీటర్ల పశువుల మూత్రం, 200 గ్రాముల ఇంగువ లేదా 5 శాతం మజ్జిగ పిచికారీ చేసుకోవాలి. గ్రామంలో రైతుకు ఉన్న అవకాశాలను బట్టి షాపు /రిక్షా/తోపుడు బండి/ ఎలక్ట్రిక్ ఆటో ఏర్పాటు చేసుకొని కూరగాయలను విక్రయించుకోవచ్చు. (సేంద్రియ సేద్యంపై సందేహాల నివృత్తికి సుస్థిర వ్యవసాయ కేంద్రం శాస్త్రవేత్తలను 85007 83300 నంబరులో సంప్రదించవచ్చు) ఏయే కూరగాయలను ఎన్ని రోజుల వ్యవధిలో విత్తుకోవాలి? ► రెండు నుంచి మూడు రకాల ఆకుకూరలను వారానికి ఒకసారి విత్తుకోవాలి. ► టమాటో, వంగ లాంటివి రెండు నెలలకు ఒకసారి విత్తుకోవాలి. ► చిక్కుడు సీజన్లో ఒకటి లేదా రెండుసార్లు విత్తుకుంటే సరిపోతుంది. ► బీట్రూట్, క్యారెట్, కాలీఫ్లవర్, క్యాబేజీ రబీలో ఒకసారి మాత్రమే విత్తుకోవాలి. ► మిరప,బెండ మొదటసారి విత్తిన బెడ్ పూతకు రాగానే మరో బెడ్లో నాటుకోవాలి. సేంద్రియ కూరగాయల సాగుపై జనగామలో 5 రోజుల శిక్షణ అరెకరంలో సేంద్రియ కూరగాయలను ఏడాది పొడవునా సాగు చేస్తూ ప్రతి రోజూ ఆదాయం పొందే పద్ధతులను నేర్చుకొని, ఇతరులకు శిక్షణ ఇచ్చేందుకు ప్రగాఢమైన ఆసక్తి కలిగిన వారికి సుస్థిర వ్యవసాయ కేంద్రం జనగామలోని తన రైతు శిక్షణా కేంద్రంలో 5 రోజుల పాటు సమగ్ర శిక్షణ ఇవ్వనుంది. వివరాలకు.. డా. జి. రాజశేఖర్ –83329 45368 -
కొల్లిపరలో విరగపండిన కేరళ పసుపు
దేశవాళీ పసుపు రకాలు నాణ్యతను కోల్పోతున్నాయి. పంటల్లో లక్ష్మిగా రైతులు పరిగణించే పసుపును తెగుళ్లు దెబ్బతీస్తున్నాయి. గిరాకీకి కారణమైన కుర్కుమిన్ శాతం తగ్గిపోతోంది. విచక్షణా రహితంగా రసాయన ఎరువుల వాడకం, కొత్త తరహా విత్తనం కోసం ప్రయత్నాలు కొరవడటం ఇందుకు కారణం. ఫ్యూచర్స్ ట్రేడింగ్‌పై ఆధారపడిన ధరల్లో నాణ్యత లేని పసుపుకు ఆదరణ త గ్గిపోతోంది. ఎగుమతులపైనా ప్రభావం పడుతోంది. వెరసి పసుపు పంట సాగు రైతులకు సవాలుగా మారింది. ఇలాంటి తరుణంలో అందుబాటులోకి వచ్చిన కేరళ తరహా విత్తనం నాటి, సేంద్రియ పద్ధతిలో సాగుచేసిన గుంటూరు జిల్లా అభ్యుదయ రైతులు అద్భుతమైన ఫలితాలను సాధించారు. పసుపు సాగులో కొత్త ఆశలకు నాంది పలికారు. కేరళలోని కాలికట్లో భారతీయ వ్యవసాయ పరిశోధన మండలికి అనుబంధంగా గల ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ స్పైసెస్ రీసెర్చ్ (ఐఐఎస్ఆర్) మేలైన పసుపు వంగడాలు ఏసీసీ-48, ఏసీసీ-79లను రూపొందించింది. వీటిపి ప్రయోగాత్మకంగా సాగు చేయగా చక్కని దిగుబడులు వచ్చాయి. కొల్లిపర మండలం వల్లభాపురం అభ్యుదయ రైతు వంగా సాంబిరెడ్డి ఈ రెండు రకాలను ఎకరం విస్తీర్ణంలో సాగు చేశారు. 60 సెంట్లలో వేసిన ఏసీసీ-48 రకం పసుపు చేను ఇటీవలే దున్నారు. ఒక్కో పసుపు దుంప సైజు ఆశ్చర్యం గొలిపే రీతిలో ఉండటాన్ని చూసి, అక్కడకు వచ్చిన ఐఐఎస్ఆర్ సీనియర్ శాస్త్రవేత్త డాక్టర్ డి.ప్రాశత్ సహా తోటి రైతులంతా అబ్బురపడ్డారు. సెంటుకు 3 బానల దిగుబడి.. 5 శాతం కుర్కుమిన్! సహజంగా పసుపు సాగుచేసే రైతులకు ఒక సెంటు విస్తీర్ణానికి పచ్చి పసుపు 1-2 బానల దిగుబడి వస్తుంది. కుర్కుమిన్ శాతం 2-2.5 శాతం ఉంటోంది. తాజాగా తవ్విన ఏసీసీ-48 రకం పసుపు 3 బానల దిగుబడి రాగా, ఇందులో కుర్కుమిన్ 4.5-5 శాతం ఉంటుందని స్వయంగా పరిశీలించిన డాక్టర్ ప్రాశత్ చెప్పారు. ప్రయోగాత్మకంగా వేసిన ఈ పంటను సేంద్రియ విధానంలో సాగు చేయడంతో మంచి ఫలితం వచ్చిందన్నారు. 2017 జూన్ నాటికి ఈ వంగడాలను మార్కెట్లోకి విడుదల చేస్తామని ఆయన ‘సాక్షి’తో చెప్పారు. నూతన పసుపు ఏసీసీ-48 వంగడం విశిష్టతలు.. ► కుర్కుమిన్ శాతం ఎక్కువ. ► పైరు ఎత్తుగా, గుబురుగా పెరిగి, దుంప నుండి మరో మూడు వరకు పిలకలు, వాటికి మంచి సైజులో ఉండే కొమ్ములు వచ్చాయి. ► సేంద్రియ పద్థతిలో సాగుకు అనుకూలం. ► {పత్యేక పరిస్థితుల్లోనూ దిగుబడులు తగ్గని పరిస్థితి. ► సాధారణ పసుపు రకాల పంటకాలం 275 రోజులు. ఈ రకం పసుపు 210 రోజుల్లోనే చేతికి వచ్చేస్తుంది. ఎకరానికి 300 కిలోల విత్తనం చాలు.. ► సాధారణంగా రైతులు ఎకరానికి 1,350 కిలోల పసుపు విత్తనం వేస్తుంటే కొత్త రకం విత్తనం 300 కిలోలు మాత్రమే నాటారు. దీంతో ఖర్చు తగ్గింది. ► {పత్యేకంగా తయారు చేసిన గొర్రుతో బెడ్లను ఏర్పాటు చేశారు. దీని కారణంగా వర్షం కురిసినపుడు, తుపాన్లు వచ్చినప్పుడు వర్షపు నీరు పొలంలోంచి త్వరితగతిన వెళ్లిపోతుంది. ► {పత్యేకంగా తయారు చేసుకున్న బెడ్లపై త్రికోణం ఆకారంలో.. కూలీల చేత పసుపు కొమ్ములను ముక్కలు చేసి నాటించారు. ఎటు చూసినా అడుగు దూరం ఉండేలా నాటారు. బెడ్ మధ్య భాగంలో డ్రిప్ లేటరల్స్ ఏర్పాటు చేశారు. ► మాగిన పశువుల ఎరువు, గొర్రెల ఎరువు, గడ్డీ గాదంతో సొంతంగా తయారు చేసుకున్న సేంద్రియ ఎరువును మాత్రమే వాడారు. ► దుంప పుచ్చు రాకుండా చూసేందుకు.. డ్రిప్ ద్వారా అల్లం పేస్టు, ఆముదం నూనె మొక్కలకు పంపించారు! ► ఆకులపై ఎటువంటి రసాయనాలు పడకుండా చూసుకున్నారు. పొలం చుట్టూ అవిశె చెట్లను నాటారు. ► సెంటుకు మూడు బానల మేర దిగుబడి వచ్చే అవకాశం ఉందని తోటి రైతులు సైతం చెబుతున్నారు. కేరళలో నూతన పసుపు రకాలను అభివృద్ధి చేసిన ఐఐఎస్ఆర్, ప్రయోగాత్మకంగా సాగుచేసే బాధ్యతను గుంటూరు జిల్లా గుండిమెడ గ్రామంలోని ఆదర్శ రైతు శాస్త్రవేత్త పిడికిటి చంద్రశేఖర్ ఆజాద్‌కు అప్పగించింది. అజాద్ తనకు పరిచయస్తులైన గుండిమెడలోని భీమిరెడ్డి భాస్కరరెడ్డి, వడ్డేశ్వరం రైతు సుధాకర్, వల్లభాపురం రైతు వంగా సాంబిరెడ్డికి విత్తనాన్ని అందజేసి, సాగుకు ప్రోత్సహించారు. వీరిలో పూర్తిగా సేంద్రియ పద్ధతిలో సాగు చేసిన సాంబిరెడ్డే తక్కువ ఖర్చుతో అద్భుతమైన దిగుబడి సాధించటం విశేషం. - ఉయ్యూరు సాంబిరెడ్డి, కొల్లిపర, గుంటూరు జిల్లా పూర్తి సేంద్రియ పద్ధతిలోనే కొత్త విత్తనం అభివృద్ధి! కొత్త రకం విత్తనం అభివృద్ధి ఒకే ప్రాంతంలో జరిగితే మంచి గుర్తింపు వస్తుంది. అందరూ సేంద్రియ పద్ధతిలోనే సాగు చేయాలి. పైరుపై ఎలాంటి రసాయనాలు పడకుండా కాపాడుకొంటూ ఉండాలి. ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలి. రైతులు పరస్పరం సహకరించుకోవాలి. అట్లా అయితేనే ఆశించినట్టుగా పసుపులో కొత్త విత్తనం అభివృద్ధి చెందుతుందని నా అభిప్రాయం. అందుకే కేవలం కొల్లిపర మండల గ్రామాల్లోని రైతులకు మాత్రమే ఈ రకం పసుపు విత్తనం ఇవ్వాలని భావిస్తున్నాను. - వంగా సాంబిరెడ్డి (97041 46562),వల్లభాపురం, కొల్లిపర, గుంటూరు జిల్లా -
సహజ ‘ఇంటిపంట’లకు సప్త సూత్రాలు!
‘సాక్షి’ ప్రారంభించిన ‘ఇంటిపంట’ కాలమ్ తెలుగు రాష్ట్రాల్లో వేలాది మందిలో స్ఫూర్తిని రగిలించి ‘ఇంటిపంట’ల సాగుకు ఉపక్రమింపజేసింది. నివసించే ఇంటి వద్ద ఉన్న తక్కువ స్థలంలోనే కూరగాయలు, ఆకుకూరలు సేంద్రియ పద్ధతిలో పండించుకుంటూ ఆరోగ్యవంతమైన జీవనం గడుపుతున్నారు. అటువంటి సహజాహార ప్రేమికుల్లో యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్‌లో అసిస్టెంట్ ప్రొఫెసర్‌గా పనిచేస్తున్న డా. వసంత శ్రీనివాసరావు ఒకరు. ఇంటిపంటల సాగు ప్రారంభించిన వారికి తరచూ ఎదురయ్యే సందేహాల నివృత్తి కోసం.. కొన్ని పద్ధతులు, సూచనలను స్వీయానుభవంతో ఆయన వివరిస్తున్నారు. జీవామృతం కావలసిన పదార్థాలు: తాజా(పది రోజుల్లోపు) నాటు లేదా దేశీ ఆవు పేడ 2 కేజీలు, నాటు ఆవు పంచితం ఒకటిన్నర లీటర్లు, బెల్లం (సేంద్రియ బెల్లం ఉత్తమం) అర కేజీ, ఏదైనా పప్పుల(కంది/శనగ/మినుము/పెసర..) పిండి అర కేజీ, మగ్గిన అరటిపండ్లు 3, చెట్ల కింద మట్టి 2 గుప్పిళ్లు, 35 లీటర్ల నీరు, 50 లీటర్ల డ్రమ్ము. తయారీ విధానం: పేడ, తురుముకున్న బెల్లం, పప్పుల పిండి, మట్టి, అరటి పండ్ల గుజ్జు.. డ్రమ్ములో వేసి చేతితో బాగా కలపాలి. తరువాత ఆవు పంచితం వేసి మళ్లీ కలపాలి. ఈ మిశ్రమాన్ని డ్రమ్ములో వేసి 35 లీటర్ల నీటిని పోయాలి. దీన్ని నీడలోనే ఉంచాలి. ఉదయం, సాయంత్రం వేప కర్రతో ఒక నిమిషం పాటు కుడి వైపు తిప్పుతూ కలపాలి. 4వ రోజు నుంచి వాడొచ్చు. వాడే విధానం: 7-10 రోజుల్లోగా జీవామృతాన్ని 1:10 నిష్పత్తిలో మొక్కలు, చెట్ల పాదుల్లో పోయవచ్చు లేదా పిచికారీ చేయొచ్చు. ఘన జీవామృతం కావలసిన పదార్థాలు: తాజా ఆవు పేడ 2 కేజీలు, బెల్లం పావు కేజీ, ఏదైనా పప్పుల పిండి పావు కేజీ, ఆవు పంచితం తగినంత. తయారీ విధానం: తురిమిన బెల్లం, పిండి, ఆవుపేడ.. ఈ మూడిటిని బల్లపరుపుగా పరచిన ప్లాస్టిక్ షీట్ లేదా గోనెసంచిపై వేసి చేతితో బాగా కలిపి.. ఉండలు తయారు చేసుకోవడానికి వీలుగా తగినంత ఆవు పంచకం కలపాలి. ఈ మిశ్రమాన్ని ఉండల్లా చుట్టి, నీడలోనే ఆరబెట్టాలి. నీడలో పూర్తిగా ఎండిన ఈ ఉండల్ని పొడి చేసుకొని ఒక గోనె సంచిలో నిల్వ ఉంచి సంవత్సరమంతా వాడుకోవచ్చు. వాడే విధానం: ఘన జీవామృతాన్ని మొక్క మొదట్లో గుప్పెడు చొప్పున ప్రతి 10 నుంచి 15 రోజులకోసారి వేసుకోవాలి. ఇందులో నిద్రావస్థలో ఉండే మేలుచేసే సూక్ష్మజీవులు నీరు తగిలినప్పుడు చైతన్యవంతమవుతాయి. వీటి ద్వారా మొక్కలకు మంచి పోషకాలు అందుతాయి. వేపకషాయం కావలసిన పదార్థాలు: తాజా వేపాకులు అర కేజీ, తాజా దేశీ ఆవు పేడ అర కేజీ, నాటు ఆవు పంచితం అర లీటరు. తయారీ విధానం: మెత్తగా నూరిన వేపాకు మిశ్రమానికి ఆవు పేడ, ఆవు పంచితం చేతితో కలిపి, 3 రోజులు పులియబెట్టాలి. నాలుగో రోజున వస్త్రంతో వడబోసి వాడుకోవాలి. 1:10 నిష్పత్తిలో వేప కషాయం, నీరు కలిపి ప్రతి పది నుంచి 15 రోజులకోసారి పిచికారీ చేయాలి. కీటకాల నివారిణి (మల్టీ పెస్ట్ కంట్రోలర్) కావలసిన పదార్థాలు: పావు కేజీ చొప్పున జిల్లేడు, మారేడు, వేప, కానుగ, ఉమ్మెత్త, సీతాఫలం, గన్నేరు ఆకులతోపాటు దేశీ ఆవు పంచితం(డ్రమ్ములో వేసిన ఈ ఆకుల మిశ్రమం పూర్తిగా మునగడానికి) తగినంత. తయారీ విధానం: పైన చెప్పిన అన్ని రకాల ఆకులను మెత్తగా నూరుకొని.. ఏదైనా ఒక ప్లాస్టిక్ పాత్రలో పెట్టి ఆకుల మిశ్రమం పూర్తిగా మునిగే వరకు ఆవు మూత్రం పోయాలి. ఈ మిశ్రమాన్ని 15 రోజులు ఊరబెట్టాలి. ఆ తర్వాత వడకట్టుకొని ఒక సీసాలో నిల్వ చేసుకోవాలి. కషాయాన్ని 1:30 నిష్పత్తిలో నీటిలో కలిపి పిచికారీ చేసుకోవాలి. ఎంతపాతదైతే అంత ఉత్తమం. ఎగ్ అమైనో ఆమ్లం కావలసిన పదార్థాలు: నాటు కోడిగుడ్లు 2 లేక 3, మూత ఉన్న గాజు సీసా (లీటరు ద్రవం పట్టేది), నాటు కోడిగుడ్లు మునగడానికి కావలసినంత తాజా నిమ్మరసం, (సేంద్రియ)బెల్లం పావు కేజీ. తయారీ విధానం: గాజు సీసాలో నాటు కోడిగుడ్లను (పగలగొట్టకుండా, పెంకు తీయకుండా) ఉంచాలి. గుడ్లు మునిగేంత వరకు తాజా నిమ్మరసం పోయాలి. మూత గట్టిగా పెట్టి 18 రోజులు వేడి తగలని ప్రదేశంలో ఉంచుకోవాలి. 18వ రోజున దీనిలో తురిమిన బెల్లాన్ని వేసి కలపాలి. మళ్లీ పది రోజుల వరకు నీడలో భద్రపరచాలి. 28 రోజులకు సిద్ధమవుతుందన్నమాట. పిచికారీ విధానం: సిద్ధమైన ఎగ్ అమైనో ఆమ్లంను ఒక లీటరు నీటికి 2 మిల్లీలీటర్లు కలిపి మొక్కలపై పిచికారీ చేసుకోవాలి. పిచికారీలో మరోపద్ధతి: 900 మిల్లీలీటర్ల నీటికి 100 మిల్లీలీటర్ల జీవామృతం, 2 మిల్లీలీటర్ల ఎగ్ అమైనో ఆసిడ్ కలిపి కూడా మొక్కలపై పిచికారీ చేసుకోవచ్చు. పూత పుష్కలంగా వస్తుంది. పూసిన పూత రాలకుండా ఉండడానికి ఉపయోగపడుతుంది. బూడిద - పసుపు మిశ్రమం కావలసిన పదార్థాలు: నాటు ఆవు పేడతో చేసిన పిడకలు, పసుపు తయారీ పద్ధతి: పిడకలను కాల్చి బూడిద చేసుకోవాలి. తర్వాత ఆ బూడిదను మట్టికుండలో నిల్వ చేసుకోవాలి. తగినంత బూడిద తీసుకొని.. అంతే పరిమాణంలో పసుపు కలపాలి. తీగజాతి మొక్కలపై చల్లితే పూత రాలడం తగ్గుతుంది. ఆచ్ఛాదన (మల్చింగ్) కుండీల్లోని మట్టిని నిత్యం తేమగా ఉంచడానికి ఆచ్ఛాదన (మల్చింగ్) పద్ధతి బాగా సహకరిస్తుంది. ఎండిన ఆకులు, గడ్డీగాదంతో 7 -10 అంగుళాల మందాన మల్చింగ్ చేయవచ్చు. దీనివల్ల కుండీల్లో మట్టి తేమను ఎక్కువ రోజులుంటుంది. వానపాములకు అనువైన వాతావరణం ఏర్పడి మొక్కలు ఆరోగ్యంగా పెరుగుతాయి. (డా. శ్రీనివాసరావును 94922 93299 నంబరులో సాయంత్రం 7-8 గంటల మధ్య మాత్రమే సంప్రదించాలి) -
భర్త సహకారంతో పంటల సాగు..
నర్సాపూర్ (దండేపల్లి) : నర్సాపూర్ గ్రామానికి చెందిన నరెడ్ల సత్యనారాయ, విజయ దంపతులు పదిహేనుళ్లుగా వ్యవసాయం చేస్తున్నాయి. వారికి ఉన్న ఐదెకరాల భూమిలో ఏడేళ్లపాటు వరి సాగు చేశారు. దిగుబడి అంతంతమాత్రమే కావడంతో వరి సాగుకు స్వస్తి పలికారు. సత్యనారాయణ ఐటీఐలో మెటార్ మెకానిక్ చేశాడు. ఉద్యోగం రాకపోవడంతో వ్యవసాయన్నే వృత్తిగా మలుచుకున్నాడు. వరి సాగుతో ఆశించిన లాభాలు రాకపోవడంతో వరికి బదులు ఐదెకరాల్లో వివిధ రకాల కూరగాయలు సాగు చేశారు. లాభాల పంట పండడంతో కూరగాయలే సాగు చేస్తున్నారు. సత్యనారాయణ కూరగాయలను జన్నారం, ముత్యంపేట, దండేపల్లి, మేదర్పేట, తాళ్లపేట, లక్సెట్టిపేట, ద్వారకలో జరిగే వారసంతలకు తరలించి విక్రయిస్తుంటాడు. సాగు పనులన్నీ విజయ ముందుండి చేస్తోంది. సాగు వివరాలు ఆ దంపతుల మాటల్లోనే.. ఏడాది పొడవునా సాగు.. వరి, పత్తి వంటి పంటల సాగు మూడు నుంచి నాలుగు నెలల్లోనే పూర్తవుతుంది. కూరగాయల సాగు ఏడాదంతా చేపట్టవచ్చు. సీజన్ వారీగా డిమాండ్ ఎక్కువ ఉన్న వాటిని సాగు చేసి లాభాలు సాధించవచ్చు. మిర్చి, వంకాయ, టమాటా, బెండ, అలసంద, బీరకాయ, కాకరకాయ వంటి కూరగాయలను సాగు చేస్తున్నాం. వీటి సాడు ఏడాదంతా చేపడుతాం. సేంద్రియ పద్ధతిలో.. సత్యనారాయణ ఎన్‌పీఎం(నాన్ ఫెస్టిసైడ్ మేనేజ్మెంట్) వీఏ(విలేజ్ అక్టివిటిస్ట్)గా పని చేస్తుం డడంతో కూరగాయల సాగును పూర్తిగా సేంద్రి య పద్ధతిలో చేపడుతున్నాం. ఎలాంటి రసాయనిక ఎరువులు వాడకుండా ఇంటి వద్దనే సేం ద్రియ ఎరువులు తయారు చేసి పంటలకు వేస్తున్నారు. కూరగాయల దిగుబడి బాగా వచ్చేందు కు నాడెపు కంపోస్టు ఎరువు, ఘనజీవామృతం, ద్రవజీవామృతం, పంచగవ్వ, పేడ ఎరువును వాడడంతోపాటు రసం పీల్చే పురుగుల నివారణకు పంట చేళల్లో తెలుపు, పసుపు ప్లేట్ల ఏర్పాటు, వావిలాకు కషాయం, బ్రహ్మస్త్రం, అగ్రిహస్త్రం వంటి మందులు కూడా తయారు చేసి పిచికారీ చేస్తున్నట్లు విజయ పేర్కొన్నారు. డ్రిప్‌తో నీరు.. కూరగాయల సాగుకు నీటిని డ్రిప్ పద్ధతిలో అందిస్తున్నాం. కాలువలు ఏర్పాటు చేసి నీళ్లందించడంతో ఎక్కువ నీరు పడుతుంది. కాబట్టి వ్యవసాయ బావికి డ్రిప్ సిస్టమ్‌ను బిగించాం. డ్రిప్ తో మొక్కకు నేరుగా నీరందడంతోపాటు నీరు వృథా కాదు. ఎరువుల తయారీ ఇలా.. మనం పడేసే వ్యర్థ పదార్థాలు, పిచ్చిమొక్కలు, పశువుల పేడ, ఆవు మూత్రం వంటి వాటితో సేంద్రియ ఎరువులు తయారు చేసుకోవచ్చు. నాడెపు కంపోస్టు ఎరువు.. దీంతో భూసారం పెరిగి పంట దిగుబడి వస్తుం ది. గడ్డి, కలుపు మొక్కలు ఒక చోట కుప్పగా వేయాలి వాటిపై ఆవుపేడ, మూత్రం చల్లాలి. ఒకసారి కుప్పగా వేసింది కొంత కుళ్లిపోగానే దానిపై మరో సారిగడ్డి, కలుపు మొక్కల కుప్ప వేసి మళ్లీ ఆవుపేడ, మూత్రం చల్లాలి ఇలా ఒకటి నుంచి 5 స్టెప్ల వరకు కుప్పగా వేయాలి 70 రోజుల్లో నాడెపు కాంపోస్టు ఎరువు తయారవుతుంది. దీనిని పంటలకు వేసుకోవచ్చు. ఘనజీవామృతం.. ఇది కూడా భూసార పెంపునకు ఉపయోగ పడుతుంది. క్వింటాళు ఆవుపేడ, 2 కిలోల బెల్లం, 2 కిలోల పిండి(పప్పుధాన్యాలతో తయారు చేసిం ది)తో తయారు చేసుకోవాలి. గుప్పెడు మట్టి వీ టన్నింటిని చూర్ణం చేసి చెట్టు మొదట్లో వేసినట్లయితే కాత బాగా కాస్తుంది. మొక్క, చెట్టు బలం గా ఉంటుంది. ఇది ఒక ఎకరాకు సరిపోతుంది. ధ్రవ జీవామృతం.. దీన్ని పిచికారీ చేయాలి.. 10 కిలోల ఆవుపేడ, 2 కిలోల బెల్లం, 2కిలోల పిండి(పప్పుదినుసులతో తయారు చేసింది) 200 లీటర్ల నీటిలో కలిపాలి. వారం రోజులపాటు నానబెట్టాలి. ప్రతి రోజు కలియ తిప్పాలి. ఆ తర్వాత పంటలకు పిచికారీ చేయవచ్చు. ఇది కూడా ఒక ఎకరానికి సరిపోతుంది. దీని ద్వారా చీడలను నివారించవచ్చు. పంచగవ్వ.. ఇది సూక్ష్మధాతు లోపానికి వినియోగించవ చ్చు. పావుకిలో ఆవునెయ్యి, 2 లీటర్ల చొప్పున ఆవు పాలు, పెరుగు, డజను అరటి పండ్లు, 2 లీటర్ల కొబ్బరి నీళ్లతో తయారు చేసుకోవాలి. ఈ మిశ్రమాన్ని ఎకరాకు పిచికారీ చేయొచ్చు. పసుపు, తెలుపు ప్లేట్లు.. చేనులో పసుపు, తెలుపు రంగుతో ఇనుప ప్లేట్లు ఏర్పాటు చేసి వాటికి నాలుగురోజులకోసారి గ్రీసు రాస్తే రసం పీల్చే పురుగులు వాటిపై వాలి అతుక్కుంటాయి. ఇలా చేయడంతో రసం పీల్చు పురుగులు నివారించవచ్చు. ఇవే కాకుండా వివిధ రకాల తెగుళ్ల నివారణకు వావిలాకు, వేప ఆకులతో తయారు చేసిన కషాయాలు, బ్రహ్మస్త్రం, అగ్రిహస్త్రం వంటి వాటిని కూడా ఉపయోగించవచ్చు. -
‘సాఫ్ట్వేర్’ రైతు
మేడ్చల్ రూరల్: ఆయనో సాఫ్ట్వేర్ ఇంజినీర్. నెలవారీ వేతనం వేలల్లోనే ఉంటుంది. అయినా జీవితంలో ఇంకా ఏదో సాధించాలనే తపన. చిన్నప్పటినుంచీ వ్యవసాయం అంటే ఎంతో మక్కువ. ప్రజలకు సేంద్రియ ఎరువుల తో పండిన ఆకుకూరలు, కూరగాయలు అందించాలనే లక్ష్యం ఉండేది. ఇంకేముంది.. ఒకవైపు సాఫ్ట్వేర్ ఇంజినీర్‌గా ఉద్యోగం చేస్తూనే మరోవైపు వ్యవసాయంపై దృష్టి సారించాడు. సేంద్రియ పద్ధతిలో కూరగాయల పంటలు పండిస్తున్నాడు. నూతన ఒరవడికి శ్రీకారం చుట్టాడు జాన్ ఇజ్రాయిల్ రావూరి. మేడ్చల్‌కు చెందిన జాన్ ఏడాదిన్నర క్రితం మండలంలోని గిర్మాపూర్, మండమాదారం గ్రామాల్లో ఏడెకరాల భూమిని లీజ్‌కు తీసుకుని లాభసాటిగా సేంద్రియ వ్యవసాయ సాగు చేస్తున్నాడు. ఆవు పేడ, మూత్రం, ఆకు కషాయంతో తక్కువ పెట్టుబడి పెట్టి వ్యవసాయం మెలకువలు నేర్చుకుని, నలుగురికి మార్గదర్శకంగా నిలుస్తున్నాడు. అంతే కాకుండా పండిన పంటలను తానే మార్కెట్లో నేరుగా వినియోగదారులకు విక్రయించి లాభాలను ఆర్జిస్తున్నాడు. వ్యవసాయం వైపు దృష్టి సారించడానికి కారణాలేమిటి తదితర అంశాలు జాన్ ఇజ్రాయిల్ మాట ల్లోనే... సేంద్రియ వ్యవసాయమే ఉత్తమం.. వ్యవసాయంలో సేంద్రియ పంటలు రుచికరంగా, ఆరోగ్యకరంగా ఉంటాయని తెలుసుకున్నా. మనమెందుకు ఇలాంటి వ్యవసాయం చేయకూడదనుకుని ఈ పద్ధతిలో సాగు చేపట్టాను. దీనికి తోడు ఒకే రకం పంటలు కాకుండా తక్కువ భూమిలో ఎక్కువ రకాల పంటలు వేస్తున్నాను. మన పూర్వీకులు సారవంతమైన భూమిలో పంటలు ఎలా పండించారో ఆ విధంగా మనం కూడా పంటలు పండించాలని జీవామృత ఎరువుతో పంటల సాగు చేపడుతున్నాను. ఆవు పేడ, మూత్రం, బెల్లం, శనగ పిండితో జీవామృతాన్ని తయారుచేసి ఎరువుగా ఉపయోగిస్తున్నాను. చెట్ల ఆకులను, జనుము, జీలుగను ఎరువుగా వాడుతున్నాను. నేరుగా వినియోగదారులకే విక్రయం.. పండించిన కూరగాయలను నేరుగా వినియోగదారుల ఇళ్లకు వె ళ్లి అందిస్తున్నాను. కొందరు రైతులు మార్కెట్ చేయడం తెలియక నష్టపోతున్నారు. నూతన పద్ధతితో కూరగాయల విక్రయాలు చేపట్టాలని ఒక కవరులో ఎనిమిది రకాల కూరగాయలు ఒక్కోటి అరకిలో చొప్పున, అయిదు రకాల ఆకు కూరలు 5 కట్టల చొప్పున ప్యాక్‌చేసి రూ.350కు వినియోగదారులకు చేరవేస్తున్నాను. ఈ పద్ధతి కోసం ఇతర రైతులకు ప్రోత్సాహం అందించి వారితో కొన్ని రకాల పంటలు వేయిస్తున్నాను. ఇలా ప్రతి రోజు వినియోగదారులకు ప్యాక్ చేసి ఇస్తున్నాను. వారంలో వంద మందికి అందించాలనే లక్ష్యం నెరవేర్చుకున్నాను. దీంతో నలుగురికి ఉపాధి కల్పిస్తున్నాను. వ్యవసాయం చేసి పదిమందికి మంచి భోజనం అందించడంలో ఉన్న తృప్తి దేనిలోనూ ఉండదు. -
పామ్రోజ్, నిమ్మ గడ్డి సాగు
‘మాది వైఎస్సార్ జిల్లా కాశినాయన మండలం బాలాయిపల్లె. గిద్దలూరులో టెక్స్మో పోలిరెడ్డి అనే వ్యక్తి 100 ఎకరాల్లో పంట వేయడం చూసి మా ఊర్లో 15 ఎకరాల్లో పామ్రోజ్, నిమ్మగడ్డిని సాగుచేశా. ఆయిల్ తీసే పద్ధతిలో లోపాలు ఉండటంతో నష్టాలు వచ్చాయి. కందుకూరులో నా స్నేహితుని వద్దకు వెళ్లి ఇవే పంటలపై రూ.3 లక్షల పెట్టుబడి పెట్టా. అక్కడ కూడా నష్టపోయా. మేం పెట్టిన రెండు డిస్టిలేషన్ యూనిట్లలో(మొక్కల నుంచి ఆయిల్ తీసే యంత్రం) ఉన్న లోపాలను అప్పుడు గమనించా. తొలిసారి 6:6 సైజ్ పెద్ద డ్రమ్‌లను, ఆవిరిని చల్లబరిచే గొట్టం 2 అంగుళాలు ఉండే పరికరాన్ని ఉపమోగించా. టన్ను గడ్డికి 4 లీటర్ల ఆయిల్ రావాల్సి ఉండగా 2.5 లీటర్లు మాత్రమే వచ్చేది. కర్నాటకలోని చిక్‌బళ్లాపూర్‌లో యంత్రాలను గమనించా. 6ఁ5 సైజ్‌లో రెండు పెద్ద డ్రమ్‌లను, ఆవిరిని చల్లబరచే గొట్టంను 10 అంగుళాలకు పెంచి సొంతగా తయారు చేయించా. ఒక్కో డ్రమ్‌లో 750 కేజీల గడ్డి పడుతుంది. దీని నుంచి నాలుగు కేజీల ఆయిల్ వస్తోంది. కంపెనీలు తయారు చేసే డిస్టిలేషన్ యూనిట్ కొనాలంటే రూ.3 లక్షలు ఖర్చువుతుంది. వాటి ద్వారా ఆశించిన ఆయిల్ రావడం లేదు. అందుకని రూ.2.50 లక్షలు ఖర్చుపెట్టి ఆయిల్ తీసే యంత్రాన్ని సొంతగా తయారు చేయించుకున్నా. ఇప్పుడు న ష్టం రావడం లేదు. లక్షల్లో ఉన్న అప్పు మొత్తం తీరిపోయింది. ప్రస్తుతం ఎడాదికి రూ.15 లక్షల ఆదాయం పొందుతున్నా. 2011లో బేస్తవారిపేట మండలం మల్లాపురం సమీపంలో 60 ఎకరాల పొలం కౌలుకు తీసుకుని పామ్రోజ్, నిమ్మగడ్డి సాగుచేస్తున్నా. హైదరాబాద్‌లోని బోడుప్పల్ మెడికల్ అండ్ ఆరోమాటిక్ కార్యాలయంలో విత్తనాలు తెచ్చుకుంటున్నా. ప్రారంభంలో పంట చేతికి వచ్చే వరకు ఎకరాకు రూ.15-20 వేలు ఖర్చవుతుంది. నాటిన నాలుగో నెల నుంచి పంట చేతికొస్తుంది. పామ్రోజ్ విత్తనాలు ఒకసారి నాటితే 8-10 ఏళ్ల పాటు పంట పండుతుంది. ఏడాదికి ఐదు కోతలు కోయవచ్చు. విత్తనాలు నాటిన తర్వాత ఖర్చు ఉండదు. ఏడాదికి ఒకసారి అంతర సేద్యం(దుక్కి దున్నడం), 25 కేజీల యూరియా, 25 కేజీల డీఏపీ చల్లితే సరిపోతుంది. రెండు నెలల్లో ఎకరాకు మూడు టన్నుల గడ్డి పెరుగుతోంది. టన్నుకు నాలుగు కేజీల ఆయిల్ దిగుబడి ఉంటుంది. రోజూ రూ.1,500 ఖర్చుతో(కూలీలకు) 8 లీటర్ల ఆయిల్ తీస్తున్నా. నెలలో 20 రోజుల పాటు 150 ఆయిల్ దిగుబడి వస్తోంది. డిస్టిలేషన్ యంత్రంతో గడ్డిని ఉడికించడానికి ముందు రోజు ఆయిల్ తీసిన గడ్డినే వంట చెరకుగా ఉపయోగిస్తున్నా. దీనివల్ల వంట చెరకు ఖర్చు మిగులుతోంది. నిమ్మగడ్డి రెండు నెలలకు ఎకరాకు 2 టన్నుల గడ్డి వస్తుంది. టన్నుకు 10 కేజీల ఆయిల్ తీస్తున్నా. మార్కెట్లో కేజీ రూ.800 ధర ఉంది. ఈ పంట నీటి ఎద్దడిని తట్టుకోలేదు. 8-10 ఏళ్లు ఉండే పామ్రోజ్లా ఎక్కువ కాలం పంట ఉండకపోవడంతో ఎక్కువ మంది ఆసక్తి చూపించడం లేదు. నేను కూడా ఐదెకరాల్లో సాగు చేస్తున్నా. సేంద్రియ పద్ధతిలో అధిక దిగుబడి మొదట్లో సేంద్రియ పద్ధతిలోనే గడ్డి పెంచా. మంచి దిగుబడి వచ్చింది. 200 లీటర్ల నీటికి ఐదు కేజీల ఆవు పేడ, మూత్రం, 2 కిలోల శనగ పిండి, 2 కిలోల బెల్లం, మర్రి చెట్ల కింద మట్టి గుప్పెడు వేస్తే బ్యాక్టీరియా వెయ్యి రెట్లు ఉత్పన్నమవుతుంది. ఆరు రోజుల తర్వాత ఈ మిశ్రమాన్ని పొలమంతా చల్లితే గడ్డి దిగుబడి చాలా పెరిగింది. అయితే అదే సమయంలో డిస్టిలేషన్ యంత్రాల్లో లోపాలను అధిగమించే క్రమంలో సేంద్రియ పద్ధతిలో సాగు గాడితప్పింది. ఇప్పుడు సమస్యలేమీ లేవు. త్వరలోనే పూర్తి స్థాయిలో సేంద్రియ ఎరువులు ఉపయోగిస్తా. ఆయిల్‌ను దళారులకే విక్ర యిస్తున్నా.. పదేళ్ల క్రితం పామ్రోజ్ ఆయిల్ కేజీ రూ.400 ఉండేది. ఇప్పుడు రూ.1,500 నుంచి రూ.1,800 మధ్య ధర ఉంటోంది. తిరుపతిలో ప్రైవేట్ దళారులకు ఆయిల్‌ను అమ్ముతున్నా. నేరుగా కంపెనీలకు అమ్మితే మంచి ధర వస్తుంది. కంపెనీల వాళ్లు నగదు చెల్లింపులో జాప్యం చేస్తుండటంతో ఆర్థికంగా ఇబ్బంది పడాల్సి వచ్చింది’. రైతు చెన్నారెడ్డిని 9440855448లో సంప్రదించవచ్చు. -
సేంద్రియ శ్రీ వరి
కందుకూరు: శ్రీ వరి సాగును సేంద్రియ పద్ధతిలో చేపట్టి అధిక దిగుబడులు సాధిస్తూ పలువురు రైతులకు ఆదర్శంగా నిలుస్తున్నారు మండల పరిధిలోని నేదునూరుకు చెందిన బి.చంద్రశేఖర్‌రెడ్డి, పోలమోని లక్ష్మణ్‌లు. తక్కువ పెట్టుబడి, తక్కువ నీటి వనరులతో పంట సాగు చేస్తున్న ఆ రైతులు చెబుతున్న విషయాలు ఇవీ.. అవలంబిస్తున్న సాగు పద్ధతి ఆవు పేడ, మూత్రం కలిపి మూడు రోజులు పులియబెట్టిన తర్వాత ఎకరాకు రెండు కిలోల వరి విత్తనాలను తీసుకుని ఆ ద్రావణంలో విత్తన శుద్ధి చేసుకోవాలి. బెడ్ తయారు చేసుకుని నారు పోసుకోవాలి. దుక్కిలో ఎకరాకు మూడు టన్నుల పశువుల ఎరువు వేసుకోవాలి. డీఏపీ వంటి రసాయన ఎరువుల్ని ఒకేసారి తగ్గించకుండా ఎకరాకు 50 కిలోలు వేసే చోట 15 కిలోలు వేసుకోవాలి. క్రమేణా తగ్గిస్తే నాలుగేళ్ల తర్వాత అసలు ఆ మోతాదు రసాయన ఎరువు కూడా అవసరం ఉండదు. దుక్కిలో లేదా నాటే ముందు, లేదా రెండు నెలల తర్వాత ఎకరాకు 150 కిలోల వేప పిండి వేసుకోవాలి. నారు పోసిన 28 నుంచి 30 రోజుల తర్వాత తాడు సహాయంతో లేదా మార్కర్ ద్వారా మొక్క మొక్కకు ప్రతి వరుసకు 25 సెం.మీ. ఎడముతో నాటుకోవాలి. నాట్లు వేసే సమయంలో పావు అంగుళం మేర మాత్రమే నీరు ఉంచుకోవాలి. మడుల్ని చదరంగా ఉంచుకుంటే 15 రోజుల్లో కూడా నాట్లు వేసుకోవచ్చు. ప్రారంభంలో రెండు నెలల వరకు ఆరుతడి పంటలకు అందించిన విధంగా నీరు పెట్టుకున్నా సరిపోతుంది. పొట్టదశలో ఎక్కువ నీరు అవసరమవుతుంది. పది కిలోల చొప్పున ఆవుపేడ, ఆవు మూత్రం, పప్పు దినుసుల పిండి, కిలో బెల్లం తీసుకుని 200 లీటర్ల నీటిలో మూడు రోజులు మురగబెట్టి బాగా కలియతిప్పి జీవామృతాన్ని తయారు చేసుకోవాలి. ఆ ద్రావణాన్ని మొక్క బలం గా కుదురుకున్న తర్వాత ప్రతి 15, 20 రోజులకోసారి నీటి ద్వారా పారించుకోవాలి. అవసరమైతే ఆ ద్రావణాన్ని పై పాటుగా పిచికారీ చేసుకోవచ్చు. అవసరాన్ని బట్టి వేప నూనె లేదా పులియబెట్టిన మజ్జిగతో చేసిన ద్రావణాన్ని పిచికారీ చేసుకుని చీడపీడలు, తెగుళ్లను నివారించవచ్చు. రోటో వీడర్‌తో.. పది మంది కూలీలు నాలుగు రోజులు చేసే పనిని రోటో వీడర్‌ను వినియోగించి ఎకరా విస్తీర్ణంలోని కలుపును ఒక వ్యక్తి కేవలం రెండు రోజుల్లో పూర్తిచేయవచ్చు. సాధారణంగా మొక్కకు 25 పిలకలు వస్తే రోటో వీడర్ తిప్పడంతో వేళ్లు కదిలి 60-80 పిలకలు వస్తాయి. అజోలా పెంపకంతో.. దీంతో పాటు అజోలా గడ్డిని పొలంలో పెంచుతున్నాం. అజోలా త్వరగా పెరగడంతో కలుపును పైకి రానీయదు. నీరు త్వరగా ఆవిరి కాకుండా చేస్తుంది. అజోలా పెంచితే యూరియా వేయాల్సిన అవసరమే ఉండదు. దాని ద్వారా నత్రజని విడుదల అవుతుంది. ఈ విధానంతో సాగు చేస్తూ ఎకరాకు రూ.5 వేల పెట్టుబడి తగ్గిస్తూ అదనంగా 15 బస్తాలు పండిస్తున్నామంటున్నారు ఆ రైతులు. -
సేంద్రియ సాగు ఆరోగ్యకరం
సుగంధ ద్రవ్యాలపై అధ్యయనం కేరళ ఉద్యాన పరిశోధన స్థానం ప్రధాన శాస్త్రవేత్త నిర్మల్‌బాబు చింతపల్లి: సేంద్రియ సాగులో విశాఖ మన్యంలోని చింతపల్లి అగ్రస్థానంలో నిలుస్తుందని,ఇక్కడి ఉద్యానవన పంటలకు మార్కెట్లో ప్రత్యేక గుర్తింపు తీసుకురావడానికి కృషి చేయాలని కేరళ ఉద్యాన పరిశోధన స్థానం ప్రధాన శాస్త్రవేత్త, ప్రా జెక్టు కో-ఆర్డినేటర్ డాక్టర్ కె. నిర్మల్‌బాబు అన్నారు. నేషనల్ రీసెర్చ్ సెంటర్ ఫర్ సీడ్స్ అం డ్ స్పైస్ ఆలిండియా కో-ఆర్డినేటింగ్ ప్రాజెక్టు ఆధ్వర్యంలో ఇక్కడ పండే సుగంధ ద్రవ్య ఉద్యాన పంటలపై అధ్యయనంలో భాగంగా గురువారం మండలంలోని పలు గ్రామాల్లో పర్యటించారు. ఆయన విలేకరులతో మాట్లాడు తూ ఆంధ్రలో ప్రస్తుతం చింతపల్లి మినహా మరెక్కడా సేంద్రియ పద్ధతిలో సాగు చేయడం లేదన్నారు. అధిక దిగుబడుల కోసం విచ్చలవిడిగా రసాయనిక ఎరువులు వాడుతున్నారని, ఇది మానవాళి మనుగుడకు సవాలుగా మారుతుం దన్నారు. ఇలాంటి పరిస్థితుల్లో చింతపల్లి ప్రాం తంలో గిరిజనులు సేంద్రియ పంటలను పం డించడం అభినందించ దగ్గ విషయమన్నారు. ఆంధ్ర ప్రదేశ్‌లో రసాయనిక ఎరువుల వినియోగంలో గుంటూరు అగ్రస్థానంలో ఉందని, రెట్టిం పు దిగుబడుల కోసం ఈ పద్ధతులను అనుసరిస్తున్నప్పటికీ, భవిష్యత్‌లో ఇబ్బందులు ఎదురుకాక తప్పదన్నారు. ఐస్క్రీంల తయారీకి విని యోగించే వెనీల ఒకప్పుడు విదేశాల్లో పండేద ని, అక్కడ రసాయనిక ఎరువుల వినియోగం పెరిగిపోవడంతో మన దేశంలో సేంద్రియ పద్ధతులలో సాగు చేపట్టారన్నారు. దీంతో ఇక్కడ పండిన వెనీలకు అంతర్జాతీయ మార్కెట్లో ఐదురెట్లు ధర లభించేదన్నారు. దీని వినియోగం పెరిగిన కొద్ది మన రైతులు కూడా రసాయనిక ఎరువులు విని యోగించడంతో ఇక్కడ పండిన వెనీలకు కూడా అంతర్జాతీయ మార్కెట్లో ఒక్కసారిగా ధరలు పతనమైపోయాయని వివరించారు. కార్యక్రమంలో స్థా నిక ఉద్యాన పరిశోధన కేంద్రం శాస్త్రవేత్త చంద్రశేఖరరావు, భాగవతుల చారిటబుల్ ట్రస్ట్ కో- ఆర్డినేటర్ శ్రీహరిబాబు, శాస్త్రవేత్తలు మల్లేశ్వరరావు, నాగేంద్ర ప్రసాద్, జివి సుబ్బారెడ్డి పాల్గొన్నారు. చక్కెర వ్యాధిగ్రస్తులకు మన్యం జామ మంచిది మైదానంలో పండించే జామ తియ్యగా ఉంటుంది. ఏజెన్సీలో పండే జామ అంత తియ్యగా ఉండకపోవడం వల్ల వినియోగదారులు ఇక్కడ జామను కొనుగోలుకు ఆసక్తి చూపడం లేదని శాస్త్రవేత్త నిర్మల్‌బాబు అన్నా రు. అయితే ఇక్కడ పండించే జామ డయాబెటిక్ రోగులకు మంచిదని ఈ విషయం తెలియకపోవడం వల్ల వినియోగదారులు ఆసక్తి చూ పడం లేదన్నారు. ఈ విషయాన్ని ప్రచారంలోకి తేవాలని, అప్పుడే ఇక్కడ జామకు కూడా మార్కెట్లో మంచి ధరలు దక్కుతాయన్నారు. మిరియాలలో అధిక దిగుబడులు ఇచ్చే రకాలను అభివృద్ధికి కృషి చేయాలని స్థానిక శాస్త్రవేత్తలకు సూచించారు. గిరిజన రైతులు పండించే పసుపు, అల్లం పంటలను నాణ్యంగా తయారు చేయడంపై రైతులకు అవగాహన కల్పించాలన్నారు. మండలంలోని చిట్రాలగొప్పు, తాజంగి, దిగువపాకలలో రైతు లు పండిస్తున్న రోమా రకం పసుపు, మిరియా ల సాగును ఆయన పరిశీలించారు.