కొల్లిపరలో విరగపండిన కేరళ పసుపు | Kerala in kollipara break its ripe yellow | Sakshi
Sakshi News home page

కొల్లిపరలో విరగపండిన కేరళ పసుపు

Published Wed, Feb 24 2016 12:31 AM | Last Updated on Mon, Oct 1 2018 2:00 PM

కొల్లిపరలో విరగపండిన కేరళ పసుపు - Sakshi

కొల్లిపరలో విరగపండిన కేరళ పసుపు

దేశవాళీ పసుపు రకాలు నాణ్యతను కోల్పోతున్నాయి. పంటల్లో లక్ష్మిగా రైతులు పరిగణించే పసుపును తెగుళ్లు దెబ్బతీస్తున్నాయి. గిరాకీకి కారణమైన కుర్కుమిన్ శాతం తగ్గిపోతోంది. విచక్షణా రహితంగా రసాయన ఎరువుల వాడకం, కొత్త తరహా విత్తనం కోసం ప్రయత్నాలు కొరవడటం ఇందుకు కారణం. ఫ్యూచర్స్ ట్రేడింగ్‌పై ఆధారపడిన ధరల్లో నాణ్యత లేని పసుపుకు ఆదరణ త గ్గిపోతోంది. ఎగుమతులపైనా ప్రభావం పడుతోంది. వెరసి పసుపు పంట సాగు రైతులకు సవాలుగా మారింది. ఇలాంటి తరుణంలో అందుబాటులోకి వచ్చిన కేరళ తరహా విత్తనం నాటి, సేంద్రియ పద్ధతిలో సాగుచేసిన గుంటూరు జిల్లా అభ్యుదయ రైతులు అద్భుతమైన ఫలితాలను సాధించారు. పసుపు సాగులో కొత్త ఆశలకు నాంది పలికారు.

 కేరళలోని కాలికట్‌లో భారతీయ వ్యవసాయ పరిశోధన మండలికి అనుబంధంగా గల ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ స్పైసెస్ రీసెర్చ్ (ఐఐఎస్‌ఆర్) మేలైన పసుపు వంగడాలు ఏసీసీ-48, ఏసీసీ-79లను రూపొందించింది. వీటిపి ప్రయోగాత్మకంగా సాగు చేయగా చక్కని దిగుబడులు వచ్చాయి. కొల్లిపర మండలం వల్లభాపురం అభ్యుదయ రైతు వంగా సాంబిరెడ్డి ఈ రెండు రకాలను ఎకరం విస్తీర్ణంలో సాగు చేశారు. 60 సెంట్లలో వేసిన ఏసీసీ-48 రకం పసుపు చేను ఇటీవలే దున్నారు. ఒక్కో పసుపు దుంప సైజు ఆశ్చర్యం గొలిపే రీతిలో ఉండటాన్ని చూసి, అక్కడకు వచ్చిన ఐఐఎస్‌ఆర్ సీనియర్ శాస్త్రవేత్త డాక్టర్ డి.ప్రాశత్ సహా తోటి రైతులంతా అబ్బురపడ్డారు.

 సెంటుకు 3 బానల దిగుబడి.. 5 శాతం కుర్కుమిన్!
  సహజంగా పసుపు సాగుచేసే రైతులకు ఒక సెంటు విస్తీర్ణానికి పచ్చి పసుపు 1-2 బానల దిగుబడి వస్తుంది. కుర్కుమిన్ శాతం 2-2.5 శాతం ఉంటోంది. తాజాగా తవ్విన ఏసీసీ-48 రకం పసుపు 3 బానల దిగుబడి రాగా, ఇందులో కుర్కుమిన్ 4.5-5 శాతం ఉంటుందని స్వయంగా పరిశీలించిన  డాక్టర్ ప్రాశత్ చెప్పారు. ప్రయోగాత్మకంగా వేసిన ఈ పంటను సేంద్రియ విధానంలో సాగు చేయడంతో మంచి ఫలితం వచ్చిందన్నారు. 2017 జూన్ నాటికి ఈ వంగడాలను మార్కెట్‌లోకి విడుదల చేస్తామని ఆయన ‘సాక్షి’తో చెప్పారు.

 నూతన పసుపు ఏసీసీ-48 వంగడం విశిష్టతలు..
► కుర్కుమిన్ శాతం ఎక్కువ.
► పైరు ఎత్తుగా, గుబురుగా పెరిగి, దుంప నుండి మరో మూడు వరకు పిలకలు, వాటికి మంచి సైజులో ఉండే కొమ్ములు వచ్చాయి.
► సేంద్రియ పద్థతిలో సాగుకు అనుకూలం.
► {పత్యేక పరిస్థితుల్లోనూ దిగుబడులు తగ్గని పరిస్థితి.
► సాధారణ పసుపు రకాల పంటకాలం 275 రోజులు. ఈ రకం పసుపు 210 రోజుల్లోనే చేతికి వచ్చేస్తుంది.

 ఎకరానికి 300 కిలోల విత్తనం చాలు..
► సాధారణంగా రైతులు ఎకరానికి 1,350 కిలోల పసుపు విత్తనం వేస్తుంటే కొత్త రకం విత్తనం 300 కిలోలు మాత్రమే నాటారు. దీంతో ఖర్చు తగ్గింది.
► {పత్యేకంగా తయారు చేసిన గొర్రుతో బెడ్లను ఏర్పాటు చేశారు. దీని కారణంగా వర్షం కురిసినపుడు, తుపాన్లు వచ్చినప్పుడు వర్షపు నీరు పొలంలోంచి త్వరితగతిన వెళ్లిపోతుంది.  
► {పత్యేకంగా తయారు చేసుకున్న బెడ్లపై త్రికోణం ఆకారంలో.. కూలీల చేత పసుపు కొమ్ములను ముక్కలు చేసి నాటించారు. ఎటు చూసినా అడుగు దూరం ఉండేలా నాటారు.

     బెడ్ మధ్య భాగంలో డ్రిప్ లేటరల్స్ ఏర్పాటు చేశారు.
► మాగిన పశువుల ఎరువు, గొర్రెల ఎరువు, గడ్డీ గాదంతో సొంతంగా తయారు చేసుకున్న సేంద్రియ ఎరువును మాత్రమే వాడారు.
► దుంప పుచ్చు రాకుండా చూసేందుకు.. డ్రిప్ ద్వారా అల్లం పేస్టు, ఆముదం నూనె మొక్కలకు పంపించారు!
► ఆకులపై ఎటువంటి రసాయనాలు పడకుండా చూసుకున్నారు. పొలం చుట్టూ అవిశె చెట్లను నాటారు.
► సెంటుకు మూడు బానల మేర దిగుబడి వచ్చే అవకాశం ఉందని తోటి రైతులు సైతం చెబుతున్నారు.
 కేరళలో నూతన పసుపు రకాలను అభివృద్ధి చేసిన ఐఐఎస్‌ఆర్, ప్రయోగాత్మకంగా సాగుచేసే బాధ్యతను గుంటూరు జిల్లా గుండిమెడ గ్రామంలోని ఆదర్శ రైతు శాస్త్రవేత్త పిడికిటి చంద్రశేఖర్ ఆజాద్‌కు అప్పగించింది. అజాద్ తనకు పరిచయస్తులైన గుండిమెడలోని భీమిరెడ్డి భాస్కరరెడ్డి, వడ్డేశ్వరం రైతు సుధాకర్, వల్లభాపురం రైతు వంగా సాంబిరెడ్డికి విత్తనాన్ని అందజేసి, సాగుకు ప్రోత్సహించారు. వీరిలో పూర్తిగా సేంద్రియ పద్ధతిలో సాగు చేసిన సాంబిరెడ్డే తక్కువ ఖర్చుతో అద్భుతమైన దిగుబడి సాధించటం విశేషం.
 - ఉయ్యూరు సాంబిరెడ్డి, కొల్లిపర, గుంటూరు జిల్లా
 
 పూర్తి సేంద్రియ పద్ధతిలోనే కొత్త విత్తనం అభివృద్ధి!
 కొత్త రకం విత్తనం అభివృద్ధి ఒకే ప్రాంతంలో జరిగితే మంచి గుర్తింపు వస్తుంది. అందరూ సేంద్రియ పద్ధతిలోనే సాగు చేయాలి. పైరుపై ఎలాంటి రసాయనాలు పడకుండా కాపాడుకొంటూ ఉండాలి. ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలి. రైతులు పరస్పరం సహకరించుకోవాలి. అట్లా అయితేనే ఆశించినట్టుగా పసుపులో కొత్త విత్తనం అభివృద్ధి చెందుతుందని నా అభిప్రాయం. అందుకే కేవలం కొల్లిపర మండల గ్రామాల్లోని రైతులకు మాత్రమే ఈ రకం పసుపు విత్తనం ఇవ్వాలని భావిస్తున్నాను.
 - వంగా సాంబిరెడ్డి (97041 46562),వల్లభాపురం, కొల్లిపర, గుంటూరు జిల్లా

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement