సహజ ‘ఇంటిపంట’లకు సప్త సూత్రాలు! | Natural 'home farm' to The seven principles! | Sakshi
Sakshi News home page

సహజ ‘ఇంటిపంట’లకు సప్త సూత్రాలు!

Published Wed, Nov 26 2014 11:08 PM | Last Updated on Sat, Sep 2 2017 5:10 PM

సహజ ‘ఇంటిపంట’లకు  సప్త సూత్రాలు!

సహజ ‘ఇంటిపంట’లకు సప్త సూత్రాలు!

‘సాక్షి’ ప్రారంభించిన ‘ఇంటిపంట’ కాలమ్ తెలుగు రాష్ట్రాల్లో వేలాది మందిలో స్ఫూర్తిని  రగిలించి ‘ఇంటిపంట’ల సాగుకు ఉపక్రమింపజేసింది. నివసించే ఇంటి వద్ద ఉన్న తక్కువ స్థలంలోనే  కూరగాయలు, ఆకుకూరలు సేంద్రియ పద్ధతిలో  పండించుకుంటూ ఆరోగ్యవంతమైన జీవనం  గడుపుతున్నారు. అటువంటి సహజాహార  ప్రేమికుల్లో యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్‌లో  అసిస్టెంట్ ప్రొఫెసర్‌గా పనిచేస్తున్న  డా. వసంత శ్రీనివాసరావు ఒకరు. ఇంటిపంటల సాగు ప్రారంభించిన వారికి తరచూ ఎదురయ్యే సందేహాల నివృత్తి కోసం.. కొన్ని పద్ధతులు, సూచనలను స్వీయానుభవంతో ఆయన వివరిస్తున్నారు.
 
 జీవామృతం
 
కావలసిన పదార్థాలు: తాజా(పది రోజుల్లోపు) నాటు లేదా దేశీ ఆవు పేడ 2 కేజీలు, నాటు ఆవు పంచితం ఒకటిన్నర లీటర్లు, బెల్లం (సేంద్రియ బెల్లం ఉత్తమం) అర కేజీ, ఏదైనా పప్పుల(కంది/శనగ/మినుము/పెసర..) పిండి అర కేజీ, మగ్గిన అరటిపండ్లు 3, చెట్ల కింద మట్టి 2 గుప్పిళ్లు, 35 లీటర్ల నీరు, 50 లీటర్ల డ్రమ్ము.

తయారీ విధానం: పేడ, తురుముకున్న బెల్లం, పప్పుల పిండి, మట్టి, అరటి పండ్ల గుజ్జు.. డ్రమ్ములో వేసి చేతితో బాగా కలపాలి. తరువాత ఆవు పంచితం వేసి మళ్లీ కలపాలి. ఈ మిశ్రమాన్ని డ్రమ్ములో వేసి 35 లీటర్ల నీటిని పోయాలి. దీన్ని నీడలోనే ఉంచాలి. ఉదయం, సాయంత్రం వేప కర్రతో ఒక నిమిషం పాటు కుడి వైపు తిప్పుతూ కలపాలి. 4వ రోజు నుంచి వాడొచ్చు.

వాడే విధానం: 7-10 రోజుల్లోగా జీవామృతాన్ని 1:10 నిష్పత్తిలో మొక్కలు, చెట్ల పాదుల్లో పోయవచ్చు లేదా పిచికారీ చేయొచ్చు.
 ఘన జీవామృతం

కావలసిన పదార్థాలు: తాజా ఆవు పేడ 2 కేజీలు, బెల్లం పావు కేజీ, ఏదైనా పప్పుల పిండి పావు కేజీ, ఆవు పంచితం తగినంత.
 తయారీ విధానం: తురిమిన బెల్లం, పిండి, ఆవుపేడ.. ఈ మూడిటిని బల్లపరుపుగా పరచిన ప్లాస్టిక్ షీట్ లేదా గోనెసంచిపై వేసి చేతితో బాగా కలిపి.. ఉండలు తయారు చేసుకోవడానికి వీలుగా తగినంత ఆవు పంచకం కలపాలి. ఈ మిశ్రమాన్ని ఉండల్లా చుట్టి, నీడలోనే ఆరబెట్టాలి. నీడలో పూర్తిగా ఎండిన ఈ ఉండల్ని పొడి చేసుకొని ఒక గోనె సంచిలో నిల్వ ఉంచి సంవత్సరమంతా వాడుకోవచ్చు.
 వాడే విధానం: ఘన జీవామృతాన్ని మొక్క మొదట్లో గుప్పెడు చొప్పున ప్రతి 10 నుంచి 15 రోజులకోసారి వేసుకోవాలి. ఇందులో నిద్రావస్థలో ఉండే మేలుచేసే సూక్ష్మజీవులు నీరు తగిలినప్పుడు చైతన్యవంతమవుతాయి. వీటి ద్వారా మొక్కలకు మంచి పోషకాలు అందుతాయి.
 
 వేపకషాయం

కావలసిన పదార్థాలు: తాజా వేపాకులు అర కేజీ, తాజా దేశీ ఆవు పేడ అర కేజీ, నాటు ఆవు పంచితం అర లీటరు.
 
తయారీ విధానం:
మెత్తగా నూరిన వేపాకు మిశ్రమానికి ఆవు పేడ, ఆవు పంచితం చేతితో కలిపి, 3 రోజులు పులియబెట్టాలి. నాలుగో
రోజున వస్త్రంతో వడబోసి వాడుకోవాలి. 1:10 నిష్పత్తిలో వేప కషాయం, నీరు కలిపి ప్రతి పది నుంచి 15 రోజులకోసారి పిచికారీ చేయాలి.
 కీటకాల నివారిణి (మల్టీ పెస్ట్ కంట్రోలర్)

కావలసిన పదార్థాలు:

పావు కేజీ చొప్పున జిల్లేడు, మారేడు, వేప, కానుగ, ఉమ్మెత్త, సీతాఫలం, గన్నేరు ఆకులతోపాటు దేశీ ఆవు పంచితం(డ్రమ్ములో వేసిన ఈ ఆకుల మిశ్రమం పూర్తిగా మునగడానికి) తగినంత.
 
తయారీ విధానం: పైన చెప్పిన అన్ని రకాల ఆకులను మెత్తగా నూరుకొని.. ఏదైనా ఒక ప్లాస్టిక్ పాత్రలో పెట్టి ఆకుల మిశ్రమం పూర్తిగా మునిగే వరకు ఆవు మూత్రం పోయాలి. ఈ మిశ్రమాన్ని 15 రోజులు ఊరబెట్టాలి. ఆ తర్వాత వడకట్టుకొని ఒక సీసాలో నిల్వ చేసుకోవాలి. కషాయాన్ని 1:30 నిష్పత్తిలో నీటిలో కలిపి పిచికారీ చేసుకోవాలి. ఎంతపాతదైతే అంత ఉత్తమం.
 
ఎగ్ అమైనో ఆమ్లం

 కావలసిన పదార్థాలు: నాటు కోడిగుడ్లు 2 లేక 3, మూత ఉన్న గాజు సీసా (లీటరు ద్రవం పట్టేది), నాటు కోడిగుడ్లు మునగడానికి కావలసినంత తాజా నిమ్మరసం, (సేంద్రియ)బెల్లం పావు కేజీ.

 
తయారీ విధానం: గాజు సీసాలో నాటు కోడిగుడ్లను (పగలగొట్టకుండా, పెంకు తీయకుండా) ఉంచాలి. గుడ్లు మునిగేంత వరకు తాజా నిమ్మరసం పోయాలి. మూత గట్టిగా పెట్టి 18 రోజులు వేడి తగలని ప్రదేశంలో ఉంచుకోవాలి. 18వ రోజున దీనిలో తురిమిన బెల్లాన్ని వేసి కలపాలి. మళ్లీ పది రోజుల వరకు నీడలో భద్రపరచాలి. 28 రోజులకు సిద్ధమవుతుందన్నమాట.

పిచికారీ విధానం: సిద్ధమైన ఎగ్ అమైనో ఆమ్లంను ఒక లీటరు నీటికి 2 మిల్లీలీటర్లు కలిపి మొక్కలపై పిచికారీ చేసుకోవాలి. పిచికారీలో

మరోపద్ధతి: 900 మిల్లీలీటర్ల నీటికి 100 మిల్లీలీటర్ల జీవామృతం, 2 మిల్లీలీటర్ల ఎగ్ అమైనో ఆసిడ్ కలిపి కూడా మొక్కలపై పిచికారీ చేసుకోవచ్చు. పూత పుష్కలంగా వస్తుంది. పూసిన పూత రాలకుండా ఉండడానికి ఉపయోగపడుతుంది.
 
 బూడిద -  పసుపు మిశ్రమం
 కావలసిన పదార్థాలు: నాటు ఆవు పేడతో చేసిన పిడకలు, పసుపు  తయారీ పద్ధతి: పిడకలను కాల్చి బూడిద చేసుకోవాలి. తర్వాత ఆ బూడిదను మట్టికుండలో నిల్వ చేసుకోవాలి. తగినంత బూడిద తీసుకొని.. అంతే పరిమాణంలో పసుపు కలపాలి. తీగజాతి మొక్కలపై చల్లితే పూత రాలడం తగ్గుతుంది.

ఆచ్ఛాదన (మల్చింగ్)

కుండీల్లోని మట్టిని నిత్యం తేమగా ఉంచడానికి ఆచ్ఛాదన (మల్చింగ్) పద్ధతి బాగా సహకరిస్తుంది. ఎండిన ఆకులు, గడ్డీగాదంతో 7 -10 అంగుళాల మందాన మల్చింగ్ చేయవచ్చు. దీనివల్ల కుండీల్లో మట్టి తేమను ఎక్కువ రోజులుంటుంది. వానపాములకు అనువైన వాతావరణం ఏర్పడి మొక్కలు ఆరోగ్యంగా పెరుగుతాయి. (డా. శ్రీనివాసరావును 94922 93299 నంబరులో
 సాయంత్రం 7-8 గంటల మధ్య మాత్రమే సంప్రదించాలి)
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement