పోషకాలు పోకుండా... | Nutrients Being | Sakshi
Sakshi News home page

పోషకాలు పోకుండా...

Published Tue, May 19 2015 12:48 AM | Last Updated on Sun, Sep 3 2017 2:17 AM

పోషకాలు  పోకుండా...

పోషకాలు పోకుండా...

కూరగాయలు కరెక్ట్‌గా కడగండి
 
ఆహారాన్ని తినడం ఎంత ముఖ్యమో, దాన్ని అపాయకరం కాకుండా, సురక్షితంగా ఉండేలా చూసుకోవడమూ అంతే ముఖ్యం. తినేముందు మనం చేతులు కడుక్కోవడం ఎంత ప్రధానమో, మనం తినే కూరగాయలు, ఆకుకూరలు, పండ్లను శుభ్రం చేయడమూ అంతే అవసరం. అయితే అన్నిరకాల కూరగాయలనూ ఒకేరకంగా శుభ్రం చేయడం సరికాదు. పదార్థాన్ని బట్టి శుభ్రం చేసే తీరుతెన్నులేమిటో తెలుసుకుందాం.
 
 ఆహారం శుభ్రం చేయడానికి ముందు చేతులూ శుభ్రంగా ఉండాలి...

 మనం ఏదైనా ఆహారం శుభ్రం చేయడానికి ముందుగా మనం చేతుల్ని శుభ్రం చేసుకోవాలి. ఇందుకోసం యాంటీబ్యాక్టీరియల్ సబ్బుతో చేతుల్ని కడుక్కోవాలి. లేకపోతే మన చేతికి ఉన్న అపరిశుభ్రమే మన ఆహారాన్ని కలుషితం చేస్తుంది.
 
ఆహారం శుభ్రపరచడంలో చేయకూడనివి...

 
ఆహారాన్ని ఎప్పుడైనా సబ్బుతోగాని, డిటెర్జెంట్‌తో గాని, బ్లీచింగ్ పదార్థాలతో గాని, రసాయన పదార్థాలతోగాని శుభ్రం చేయకూడదని గుర్తుంచుకోండి. కేవలం పరిశుభ్రమైన నీటితో మాత్రమే శుభ్రం చేయాలని తెలుసుకోండి.
 
ఆహారాన్ని ఎలా శుభ్రం చేయాలంటే...

 
ఆహారాన్ని శుభ్రం చేసే ముందర వాటిని శుభ్రమైన నీటితో లేదా తగినన్ని నీళ్లు పోసి పలచగా చేసిన వెనిగర్ సొల్యూషన్‌తో శుభ్రం చేయాలి. ఈ సొల్యూషన్ తయారు చేయడానికి అవలంబించాల్సిన పద్ధతి... నాల్గింట మూడొంతుల నీళ్లు తీసుకొని అందులో కేవలం ఒక వంతు వెనిగర్ పోసి ఈ సొల్యూషన్‌ను తయారు చేయాలి. ఒకవేళ ఇవేవీ లేకుండా కేవలం కిచెన్‌లోని నీళ్లతోనే శుభ్రం చేస్తుంటే కడగబోయే కూరగాయలపైనా, పండ్లపైనుంచి నీరు కాసేపు పైనుంచి పడుతూ ప్రవహించేలా చేయాలి.
 
వేర్వేరు వెజిటబుల్స్ శుభ్రపరిచే పద్ధతులివి...

చిన్న తొడిమకు అంటి ఉండే పండ్లను బాగా శుభ్రం చేశాక... మురికి పేరుకునే అవకాశాలు ఎక్కువగా తొడిమ వద్ద ఉంటాయి. కాబట్టి ఇలా కాడ ఉన్న పండ్లను శుభ్రం చేశాక అటు తొడిమ, ఇటు కాడకు రెండోవైపున చెక్కు తీసినట్లుగా కత్తితో కోయడం మేలు. ఈ నియమం ఆపిల్, పియర్ పండు, పీచ్ పండ్లకు వర్తిస్తుంది.మందంగా ఉండే తోలు ఉన్న పండ్లు (ఉదాహరణకు నారింజ, కమలాలు) తినబోయే ముందు, మనం ఎలాగూ పండు తోలును తినకపోయినా.. ఒక్కసారి తేలిగ్గా కడగడం మేలు.ఆకుకూరల్ని శుభ్రంగా కడిగాక వాటిపై నీళ్లు ఆరేలా కాసేపు ఆగాలి. ఆ తర్వాత శుభ్రమైన టవల్‌తో వాటిని తుడవాలి. అప్పుడే వాటిని కోయాలి. అంతేగానీ ఆకుకూరల్ని కోశాక వాటిని కడగడం సరికాదు. అలా చేయడంవల్ల పోషకాలు కోల్పోతాం.
 
దుంపల్ని కూరల్ని శుభ్రం చేయడమిలా...

మట్టి కింద ఉండే బంగాళదుంప (ఆలుగడ్డ), క్యారట్ వంటి వాటిని వెంటనే శుభ్రపరచకుండా కొద్దినిమిషాల పాటు నీళ్లలో నాననివ్వాలి. వాటిని ఎలాగూ చెక్కుతీసి వాడినప్పటికీ, నాననిచ్చిన తర్వాత కోసే ముందుగా ధారగా పడే నీళ్లలో కడగాలి.కాలిఫ్లవర్, బ్రకోలీ లాగా ముడుతలు ముడుతలుగా ఉండి, ఆ ముడుతల్లో మట్టి చేరే అవకాశమున్న పువ్వుకూరలను కాసేపు నీళ్లలో నాననివ్వాలి. ఆ తర్వాత నీళ్లు కారిపోయేలా రంధ్రాలుండే పాత్ర (కొలాండర్)లోకి వాటిని తీసుకోవాలి.కాయగూరల పైపొర చెక్కు తీసేలా ఉండే దోసకాయ, బీరకాయ, సొరకాయ వంటివాటిని పైనుంచి ధారగా పడుతున్న నీటిలో ఒకటికి రెండుసార్లు కడిగి,కోయాలి.
     
కూరగాయలలో వంకాయలను కోసే పద్ధతి కాస్త వేరుగా ఉంటుంది. ముందుగా వంకాయలను ధారగా పడుతున్న నీటిలో కలగాలి. ఆ తర్వాత వాటిని కాస్తంత నిమ్మనీరు లేదా చిటికెడు ( 2 శాతం) చింతపండు నానేసిన నీరు లేదా చిటికెడు ఉప్పు లేదా 4 శాతం అసిటిక్ ఆసిడ్ ద్రవాలను ఒక పెద్ద పాత్రలోని నీళ్లలో కలిపి, ఆ ద్రవంలో ఒక్కొక్క వంకాయను విడివిడిగా కడగాలి. దీనివల్ల వంకాయల మీద చల్లి ఉన్న క్రిమిసంహారకాలు తొలగిపోతాయి.పుచ్చకాయ, కర్బూజకాయ లాంటి వాటిని ధారగా పడుతున్న నీటికింద కడుగుతూ మెత్తటి కుచ్చులున్న వెజిటబుల్ బ్రష్‌తో శుభ్రంగా కడిగాకే, ముక్కలుగా కోయాలి.
 
మొత్తం ఒకే కట్టగా ఉపయోగించే వాటిని కడగడం ఇలా...

కొత్తిమీర, కర్వేపాకులను సాధారణంగా మొత్తం కట్టకట్టనంతా ఒకేసారి కడుగుతుంటారు. ఇలా కడిగే వాటిని నీరు నిండి ఉన్న బౌల్‌లో రెండు మూడుసార్లు తిప్పుతూ కడగాలి. ఆ తర్వాత పేపర్ టవల్‌తో తుడవాలి. కొలరాడో స్టేట్ యూనివర్సిటీ వారి అధ్యయనం ప్రకారం ఇలాంటి వాటిని కడగడానికి ఉపయోగించే నీటిలో కాస్తంత నిమ్మరసం, కొంత వెనిగర్ వేయడం వల్ల కట్ట మీది బ్యాక్టీరియా, ఈ-కొలై శుభ్రంగా కడుక్కుపోవడంతో పాటు ఆకుకు కొత్త రుచి కూడా వస్తుంది. ఇక నేరేడు, బెర్రీపండ్ల వంటి వాటిని వెనిగర్ సొల్యూషన్‌లో కడగాలి. మనం షాపింగ్ చేస్తున్నప్పుడే పండుపై దెబ్బలేని వాటిని ఎంపిక చేయాలి.
 
 కడగటం అవసరం లేకున్నా ఒకసారి కడిగితే మేలు..


వాస్తవానికి ఈ కింద పేర్కొన్న ఆహారపదార్థాలను కడగాల్సిన అవసరం లేదు. కడగకున్నా పర్లేదు. అయినా ఒకసారి కడగడం వల్ల నష్టం లేదు. అవి...  ఉల్లిగడ్డ  అవకాడో  మొక్కజొన్నగింజలు  పైనాపిల్  మామిడిపండ్లు  కివీ  క్యాబేజీ  బొప్పాయి  పుచ్చకాయ  బ్రకోలీ  టొమాటో  చిలగడదుంప (మోరంగడ్డ)
 
వేటిని కడగకూడదు...

 లేబుల్స్ మీద అప్పటికే ‘రెడీ టు ఈట్’, ‘వాష్‌డ్’, ‘ట్రిపుల్ వాష్‌డ్’, ‘డోంట్ వాష్’ అని ప్రత్యేకంగా, నిర్దిష్టంగా రాసినవి మాత్రం కడగకూడదు. ఒకసారి శుభ్రంగా కడిగి, కట్ చేసుకున్న తర్వాత వెంటనే వాడుకోవాలి. ఒకవేళ ఏదైనా కారణాల వల్ల మళ్లీ నిల్వ చేయాల్సి వస్తే వాటిని ఫ్రిజ్‌లో 40 డిగ్రీల ఫారెన్‌హీట్ కంటే తక్కువ ఉష్ణోగ్రత వద్ద నిల్వచేయాలి. ఒకవేళ కట్ చేసి ఉన్న పదార్థాలే కొనాల్సి వస్తే అవి ఫ్రిజ్‌లో లేకుండా విడిగా ఉంటే మాత్రం కొనవద్దు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement