ఇంటిపైన పంటలు!
విశాఖపట్నం ఎంవీపీ కాలనీలో తన పిన్నిగారి ఇంట్లో నివసిస్తున్న ఎరకరాజు శివరామకృష్ణర రాజు అర్బన్ ఫార్మర్‌గా మారారు. వృత్తి రీత్యా వ్యాపారి అయిన ఆయన ఇంటిపంటల పెంపకాన్ని ప్రవృత్తిగా మార్చుకున్నారు. సేంద్రియ ఇంటిపంటలను సాగు చేస్తూ ఆరోగ్యకరమైన ఆహారాన్ని తమ కుటుంబ సభ్యులకు అందిస్తున్నారు. టైపైన 300కు పైగా కుండీల్లో గత ఐదు నెలలుగా సేంద్రియ ఇంటిపంటలు పెంచుతున్నారు. వేసవి ఎండల నుంచి మొక్కలను కాపాడుకునేందుకు రూ. 10 వేలు ఖర్చు చేసి షేడ్‌నెట్‌ను ఏర్పాటు చేశారు. బచ్చలి, పాలకూర, చుక్కకూర, తోటకూర, మెంతికూర వంటి ఆకుకూరలు, వంగ, బెండ, చిక్కుడు, పచ్చిమిర్చి వంటి కాయగూరలు, బీర, కాకర పెంచుతున్నారు. తీగజాతి మొక్కలకు ఆసరా కోసం వెదురు కర్రలు, ఇనుప తీగతో పందిర్లు ఏర్పాటు చేశారు.
కొబ్బరిపొట్టు 5 కిలోలు, వేపపిండి రెండున్నర కిలోలు, మట్టి రెండున్నర కిలోలు, వేపపిండి 300గ్రా॥చొప్పున కలిపిన మిశ్రమాన్ని మొక్కల పెంపకంలో వాడుతున్నారు. విత్తనాలను నేరుగా కుండీల్లో విత్తకుండా ప్లాస్టిక్ ట్రేలలో విత్తి 2 వారాల నారును కుండీల్లో నాటుతారు. చీడపీడలను నివారించేందుకు లీటరు నీటికి 5 ఎం. ఎల్. వేపనూనెను కలిపి వారానికోసారి మొక్కలపై పిచికారీ చేస్తున్నారు. పోషకాలను అందించేందుకు లీ. జీవామృతాన్ని 15 లీ. నీటికి కలిపి 10 రోజులకోసారి పిచికారీ చేస్తున్నారు.
ఇంటిపంటల పెంపకంతో రసాయన అవశేషాలు లేని కూరగాయలు లభిస్తాయి ఇంటికి పచ్చదనం, చల్లదనం.. వంటి బోలెడు లాభాలున్నాయి. ఈ ప్రయోజనాలతో పోల్చితే వాటి పెంపకం కోసం పడుతున్న శ్రమ చాలా తక్కువ’ అంటారు రామకృష్ణంరాజు (94919 70546). రామకృష్ణం రాజు స్ఫూర్తితో కొందరు స్నేహితులు వారి ఇళ్లపైనా ఇంటిపంటల సాగును ప్రారంభించటం విశేషం.
- బొల్లం కోటేశ్వరరావు, సాక్షి, విశాఖపట్నం