‘హాప్ షూట్స్’ని సాగు చేస్తోన్న బిహార్ రైతు అమ్రేష్ సింగ్
పట్నా: మన దేశంలో అత్యంత విలువైన వృత్తి.. అధికంగా నష్టాలు మిగిల్చే పని ఏదైనా ఉందా అంటే అది వ్యవసాయం మాత్రమే. ఆరు గాలం కష్టపడి.. కన్న బిడ్డలా పంటను కాపాడి.. శ్రమించే రైతన్నకు, అతడి పంటకు మార్కెట్‌లో విలువలేదు. దేశానికి అన్నం పెట్టే రైతన్నకు మూడు పూటలా తిండి దొరకడం లేదనేది అక్షర సత్యం. మన రాజకీయ నాయకులు రైతే రాజు.. దేశానికి వెన్నెముక అంటూ అతడి వెన్ను విరిచి.. కార్పొరేట్ సంస్థలకు లాభం చేకూరుస్తారు. అయితే వ్యవసాయం పూర్తిగా నష్టదాయకమేనా అంటూ కాదు. సేంద్రియ ఎరువులను వాడుతూ.. మారుతున్న అవసరాలకు తగ్గట్లుగా పంటలు పండించే వారికి సేద్యం కనక వర్షం కురిపిస్తుంది. అలాంటి కోవకు చెందినదే ఈ కథనం.
సంప్రాదాయ పంటలతో విసిగిపోయిన ఓ రైతు కొత్త రకం కూరగాయను పండించాడు. ప్రస్తుతం అది కేజీ అక్షరాల లక్ష రూపాయలకు అమ్ముడవుతోంది. నమ్మలేకపోయినప్పటికి ఇది మాత్రం వాస్తవం. మరి ఆ పంట ఏంటో.. సాగు విధానం తదితర వివరాలు తెలియాలంటే ఇది చదవాల్సిందే.. బిహార్‌లోని ఔరంగాబాద్ జిల్లా కరమ్‌దిహ్ గ్రామానికి చెందిన చెందిన అమ్రేష్ సింగ్ అనే 38 ఏళ్ల రైతు సంప్రదాయ పంటలను సాగుచేసి విసిగివేసారి పోయాడు. ఈ క్రమంలో ఈ ఏడాది తన పంథా మార్చిన అమ్రేష్ సింగ్ ‘హాప్ షూట్స్’ అనే కూరగాయను సాగుచేస్తున్నాడు. ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన కూరగాయగా ‘హాప్ షూట్స్’కు పేరుంది. మన కొనే కూరగాయల మాదిరి దీని ధర కేజీకి పదులు, వందల రూపాయలు ఉండదు. ‘హాప్ షూట్స్’ కిలో ధర కనిష్టంగా 85,000 రూపాయలు ఉంటుంది. డిమాండ్‌ను బట్టి కొన్ని సందర్భాల్లో కిలో లక్ష రూపాయల వరకూ పలుకుతుంది.
ఈ కూరగాయ సాగుకు తన సొంత పొలాన్ని సిద్ధం చేసిన అమ్రేష్ రూ.2.5 లక్షల పెట్టుబడి పెట్టాడు. పంట దిగుబడి కూడా ఆశించిన విధంగానే ఉంది. ఎలాంటి కెమికల్ ఫర్టిలైజర్స్, పురుగు మందులు వాడకుండా అమ్రేష్ ఈ పంటను పండించడం విశేషం. ‘హాఫ్ షూట్స్’ శాస్త్రీయ నామం హ్యుములస్ లుపులస్. ఈ కూరగాయ మొక్కలను వారణాసిలోని ఇండియన్ వెజిటబుల్ రీసెర్చ్ ఇన్‌స్టిట్యూట్‌లో అగ్రికల్చర్ సైంటిస్ట్ డాక్టర్ లాల్ పర్యవేక్షణలో పెంచుతున్నారు. అమ్రేష్ కూడా తన పొలంలో ఈ మొక్కలను నాటేందుకు అక్కడి నుంచే తెచ్చాడు. ఈ మొక్కకు పూచే పూలను ‘హాప్ కాన్స్’ అంటారు. బీర్ తయారీలో వీటిని వాడతారు.
ఈ మొక్క కొమ్మలను పొడిగా చేసి మెడిసిన్ తయారీలో వినియోగిస్తారు. అమ్రేష్ సింగ్ ‘హాప్ షూట్స్’ పండిస్తున్న విషయాన్ని సీనియర్ బ్యూరోక్రాట్, ఐఏఎస్ సుప్రియా సాహు ట్విట్టర్‌లో పోస్ట్ చేశారు. వ్యవసాయంలో ఓ కొత్త ప్రయత్నం చేసిన అమ్రేష్‌ను ఆమె అభినందించారు. అమ్రేష్ ప్రయత్నం ఇతర రైతులకు ఆదర్శంగా నిలుస్తుందని, వ్యవసాయంలో రైతులు అధిక మొత్తంలో లాభాలు గడించేందుకు వీలవుతుందని సుప్రియ ఆశించారు. ‘హాప్ షూట్స్’ సాగు చేసిన పొలంలో ఉన్న అమ్రేష్ ఫొటోలను సుప్రియా ట్విట్టర్‌లో షేర్ చేయడంతో ప్రస్తుతం ఇది తెగ వైరలవుతోంది.
One kilogram of this vegetable costs about Rs 1 lakh ! World's costliest vegetable,'hop-shoots' is being cultivated by Amresh Singh an enterprising farmer from Bihar, the first one in India. Can be a game changer for Indian farmers 💪https://t.co/7pKEYLn2Wa @PMOIndia #hopshoots pic.twitter.com/4FCvVCdG1m
— Supriya Sahu IAS (@supriyasahuias) March 31, 2021
హిమాచల్ ప్రదేశ్‌లో ఈ కూరగాయలను పండించే ప్రయత్నం చేశారని, కానీ.. సరైన మార్కెటింగ్ లేక రైతులు మళ్లీ సంప్రదాయ పంటల వైపే మొగ్గుచూపారని అమ్రేష్ చెప్పాడు. ‘హాప్ షూట్స్’ యాంటీ బాండీస్ ఏర్పడేందుకు కూడా తోడ్పడతాయని.. టీబీతో బాధపడుతున్నవారు ఈ కూరగాయను తినడం వల్ల ఆరోగ్య పరిస్థితి మెరుగుపడుతుందని కొన్ని అధ్యయనాల్లో వెల్లడైంది. అంతేకాదు, ప్రమాదకరమైన క్యాన్సర్ కణాలను, లుకేమియా కణాలను ఈ కూరగాయలో ఉడే యాసిడ్స్ నిరోధించగలవని తేలింది.
Comments
Please login to add a commentAdd a comment