సాక్షి, హైదరాబాద్: ఆహారం అంటేనే ఆరోగ్యం. ఆరోగ్యం అంటేనే ఆహారం. కానీ ఇప్పుడు ఆహారం అంటేనే దాదాపు భయపడాల్సిన పరిస్థితి. రసాయన ఎరువులు, క్రిమిసంహారక మందుల ద్వారా పండిన పంటలు ఒకవైపు.. కల్తీ ఆహార పదార్థాలు మరోవైపు మూకుమ్మడి దాడి చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో సేంద్రియ పంటలు అందుబాటులోకి వచ్చాయి. అయితే ఇందులో కూడా ఏది సేంద్రియం.. ఏది సేంద్రియం కాదనేది తెలుసుకోవడం కాస్త కష్టమే. అందుకే నమ్మకమైన ఫ్యామిలీ ఫార్మర్స్ వచ్చేశారు. ఫ్యామిలీ డాక్టర్ ఎలాగో.. ఫ్యామిలీ ఫార్మర్స్ అలాగన్న మాట. మనకు కావాల్సిన ఆరోగ్యకరమైన, నిజమైన సేంద్రియ పంటలు మన ముంగిళ్లకే తెచ్చి ఇచ్చేందుకు సిద్ధమవుతున్నారు. ఇప్పుడు మన రాష్ట్రంలో ‘ఫ్యామిలీ ఫార్మర్స్’ నయా ట్రెండ్ మొదలైంది. దీంతో ఆదాయంతో పాటు తృప్తి కలుగుతుందని ఈ ఫార్మర్స్ చెబుతున్నారు. రసాయనాల్లేని ఆహారాన్ని తమ వంట గదుల్లో అందుబాటులో ఉంచుకోవాలని కోరుకునే కుటుంబాలకు కొందరు రైతులు ‘ఫ్యామిలీ ఫార్మర్లు’గా మారుతున్నారు.
నేరుగా ఇళ్లకే సరఫరా..
పరిశుభ్రమైన, పురుగు మందులు, రసాయన ఎరువుల్లేకుండా పూర్తిగా సేంద్రియ పద్ధతిలో పండించే ఆహారపదార్థాలపై ఇప్పుడు జనంలో ఆసక్తి పెరిగింది. అలాంటి ఆహారం కోసం ఎదురుచూస్తున్నారు. అలాంటివారి కోసం కొందరు రైతులు సేంద్రియ ఆహారం పండించి ఇళ్లకు సరఫరా చేస్తు న్నారు. ఇప్పుడు హైదరాబాద్ సహా పలు పట్టణాలు, నగరాల్లో సేంద్రియ పద్ధతిలో పండించిన కూరగాయలు, వరి, పప్పుల కోసం జనం పరుగులు పెడుతున్నారు. కొందరు పాలు, కూరగాయలు, బియ్యం, పప్పులు, సుగంద ద్రవ్యాలన్నీ ఇలాగే కొంటున్నారు. కొందరు నేరుగా రైతుల నుంచి కొంటుండగా, మరికొందరు పలు సంస్థల నుంచి కొనుగోలు చేస్తున్నారు.
సాఫ్ట్‌వేర్ ఉద్యోగం వదిలి మరీ..
వనపర్తి జిల్లా పెబ్బేరుకు చెందిన ప్రవీణ్‌రెడ్డి బెంగళూరు, హైదరాబాద్‌లో సాఫ్ట్‌వేర్ ఇంజనీర్‌గా పనిచేశాడు. ఉద్యోగంలో సంతృప్తి చెందలేదు. తనకున్న 18 ఎకరాల్లో సేంద్రియ సాగు చేయాలని నిర్ణయించుకున్నాడు. వరి, కంది, పెసర, వేరుశనగ తదితర ఆహార పంటలతో పాటు సొర, కాకర, బీర వంటి కూరగాయలను సాగు చేస్తున్నాడు. హైదరాబాద్‌లో 20 ఇళ్లకు నేరుగా బియ్యం, కూరగాయలు సరఫరా చేస్తున్నాడు. కొందరేమో ప్రవీణ్ ఇంటికి వచ్చి కొనుగోలు చేస్తారు. హైదరాబాద్‌లో ఒక దుకాణానికి వేరుశనగ, ఉలవలు పండించి పంపుతారు. మామిడి పండ్లను కూడా సాధారణ పద్ధతిలో మాగబెట్టి అపార్ట్‌మెంట్లకు పంపుతున్నట్లు చెబుతున్నారు.
నేరుగా అపార్ట్‌మెంట్లకు..
రంగారెడ్డి జిల్లా కడ్తల్ గ్రామానికి చెందిన చల్లా పవన్‌రెడ్డి హైదరాబాద్‌లో కొందరిని అబ్బాయిలను నియమించుకున్నాడు. వారు నేరుగా అపార్ట్‌మెంట్లకు, ఇళ్లకు వెళ్లి పవన్ పండించే సేంద్రియ ఆహారపదార్థాలను అందజేస్తారు. తనకున్న 17 దేశవాళీ ఆవు పాలు రోజుకు 100 లీటర్ల వరకు ఇస్తాయి. వాటిని అబ్బాయిల ద్వారా విక్రయిస్తారు. టమాట, మిర్చి, వంకాయ, గోరుచిక్కుడు, కొత్తిమీర పండించి వినియోగదారులకు పంపిస్తాడు. 11 ఎకరాల్లో అతను సాగు చేసి వినియోగదారులకు ఇలా పంపుతున్నాడు. నియమించుకున్న ఒక్కో అబ్బాయికి నెలకు రూ.6 వేలు ఇస్తున్నాడు.
రమణారెడ్డి ఇంటికి ప్రజాప్రతినిధులు, ఐఏఎస్‌లు...
నాగర్‌కర్నూలు జిల్లా తెలకపల్లి మండలం కారువంగ గ్రామానికి చెందిన రమణారెడ్డి 30 ఎకరాల్లో సేంద్రియ వ్యవసాయం చేస్తాడు. తాను పండించే పంటల్లో 80 శాతం ఇంటి నుంచే అమ్ముతాడు. సేంద్రియ పద్ధతిలో పండించిన వరి నుంచి పాలీష్ బియ్యం, దంపుడు బియ్యం, తక్కువ దంపుడు బియ్యం మిల్లులో పట్టిస్తాడు. అలాగే మిర్చి, కంది, పెసర, మినుములు, శనగ, జొన్న, వేరుశనగ, ఆవాలు, ధనియాలు పండిస్తాడు. అన్నీ సేంద్రియ పద్ధతిలో పండించడం వల్ల తన ఇంటికి హైదరాబాద్, నిజామాబాద్, కరీంనగర్, కర్ణాటక నుంచి నుంచి జనం క్యూలు కడతారని చెబుతున్నాడు. ప్రస్తుత, మాజీ ఎమ్మెల్యేలు, కొందరు ఐఏఎస్‌లు కూడా తన ఇంటికొచ్చి తన పంటలు కొంటారని పేర్కొంటున్నాడు. హైదరాబాద్‌లోని ఒక దుకాణానికి కూడా తాను పండించేవి పంపుతున్నారు. తన వద్ద కొందరు క్యాన్సర్ రోగులు కూడా వచ్చి కొనుగోలు చేస్తున్నారని ఆయనంటున్నారు. సాధారణ పద్ధతిలో పండించే వాటికి, తాను సేంద్రియ పద్ధతిలో పండించే వాటికి ధరలో కేవలం కొద్ది తేడా మాత్రమే ఉంటుందని ఆయనంటున్నారు. తాను పండించే ఆహార పదార్థాలతో ఆరోగ్యం ఎంతో బాగుంటుందని వినియోగదారులు చెబుతున్నారని రమణారెడ్డి చెబుతున్నారు.
నాలుగెకరాల్లో పండిస్తున్న రజిత..
యాదాద్రి జిల్లా చౌటుప్పల్ మండలం పెద్ద కొండూరు గ్రామానికి చెందిన రజిత కూడా సేంద్రియ పద్ధతిలో పంటలు పండిస్తున్నారు. వరి, టమాట, వంకాయ, మిర్చి, బీరకాయ, గోరు చిక్కుడు, కాకరకాయ వంటివి సీజనల్‌గా పండిస్తున్నారు. తాను పండించే వీటిని ఓ ప్రముఖ సంస్థకు సరఫరా చేస్తున్నట్లు చెబుతున్నారు. సమీపంలో ఉన్న ఓ హోటల్‌కు కూడా సరఫరా చేస్తున్నారు. ఆ హోటల్ కూడా సేంద్రియ ఆహార పదార్థాలతో పండించే ‘విలేజ్ ఆహారం’పేరుతో ప్రజలకు పెడుతుండటం గమనార్హం.
Comments
Please login to add a commentAdd a comment