నగరంలో జెంట్స్ కిట్టీపార్టీల ట్రెండ్
నెలకోసారి సమావేశం.. ఏడాదికోసారి విహారం
ఒకేవిధమైన ఆలోచన కలిగిన స్నేహితులకు వేదికలు
సాక్షి, సిటీబ్యూరో: కిట్టీపార్టీ.. ఇప్పుడు ట్రెండ్‌గా మారింది. మహిళలే కాదు. మగవాళ్లు కూడా తాము సైతం అంటూ నెలకోసారి కిట్టీ పార్టీలకు జై కొడుతున్నారు. పది, పదిహేనుమంది ఒక చోట చేరి సరదాగా గడిపేస్తున్నారు. అంతేకాదు.. ప్రతి నెలా కొంత మొత్తాన్ని పొదుపు చేస్తూ ఆర్థిక అవసరాలకు వినియోగించుకుంటున్నారు. ఆపదలో ఉన్నవాళ్లను ఆదుకుంటున్నారు. నెల నెలా పొదుపు చేసిన డబ్బుతో విహార యాత్రలకు వెళ్తున్నారు. నగరంలో ఈ తరహా కిట్టీ పార్టీలు విశేషంగా ఆకట్టుకుంటున్నాయి. ఒకే విధమైన ఆలోచన కలిగిన వారి మధ్య స్నేహసంబంధాలను బలోపేతం చేస్తున్నాయి. అపార్ట్‌మెంట్‌లు, విల్లాలు, గేటెడ్ కమ్యూనిటీల్లో ఉండే మహిళలు నెలకోసారి ఒక చోట చేరి ఈ వేడుకలను ఏర్పాటు చేసుకోవడం అందరికీ తెలిసిందే. కానీ లేడీస్ స్పెషల్ కిట్టీ పార్టీల తరహాలోనే ‘జెంట్స్ స్పెషల్’ కిట్టీ పార్టీలు కూడా నగర సంస్కృతిలో ఒక భాగంగా కనిపిస్తున్నాయి.
ఉరుకుల పరుగుల జీవితం. ఒకే కాలనీలో ఉన్నా, ఒకే అపార్ట్‌మెంట్‌లో ఉంటున్నా సరే ఒకరికొకరు అపరిచితులే. కనీస పలకరింపులు ఉండవు. చుట్టూ మనుషులే ఉన్నా ఆకస్మాత్తుగా ఏదో ఒక ఆపద ముంచుకొస్తే ఆదుకొనే వారెవరూ అంటే చెప్పడం కష్టమే. అలాంటి సాధారణ, మధ్యతరగతి జీవితాల్లో కిట్టీ పార్టీలు సరికొత్త సంబంధాలను, అనుబంధాలను ఏర్పాటు చేస్తున్నాయి. అదీ ఓ ఐదారు గంటల పాటు సరదాగా గడిపే సమయం. ఆట పాటలు, ఉరకలెత్తే ఉత్సాహాలు, సరదా కబుర్లు.. దైనందిన జీవితంలోని ఒత్తిళ్లను అధిగమించేందుకు అద్భుతమైన టానిక్‌లా పనిచేసే ఔషధం కిట్టీ పార్టీ. ఉప్పల్‌కు చెందిన కొందరు వాకింగ్ ఫ్రెండ్స్ కిట్టీ పార్టీకి శ్రీకారం చుట్టారు. వారిలో కొందరు ఉద్యోగులు, మరి కొందరు వ్యాపారులు. ప్రతి నెలా ఒక చోట సమావేశమవుతారు.
ఒకరికొకరు అండగా..
ఒక్కొక్కరూ నెలకు రూ.5000 చొప్పున 15 మంది కలిసి రూ.75000 పొదుపు చేస్తున్నారు. అందులో రూ.60 వేల వరకూ ఆ నెల అవసరమైన వారికి ఇచ్చేస్తారు. మిగతా రూ.15000 లతో సరదాగా గడిపేస్తారు. నెలకోసారి కిట్టీ పార్టీని నిర్వహించేందుకు ఆ గ్రూపులో ఒకరిని ఆతిథ్యం ఇచ్చే హోస్ట్‌గా ఎంపిక చేసుకుంటారు. ‘రోజంతా సరదాగా గడిపేస్తాం. అంతా చుట్టుపక్కల కాలనీల్లో ఉండేవాళ్లమే. కానీ కనీసం పరిచయాలు కూడా ఉండేవి కాదు. ఇప్పుడు మేమంతా మంచి స్నేహితులుగా ఉన్నాం. ఎవరికి ఎలాంటి ఆపద వచి్చనా ఆదుకునేందుకు మా టీమ్ రెడీగా ఉంటుంది.’ అని చెప్పారు టీమ్‌కు సారథ్యం వహించే రవి.
నగర శివారుకు..
అపార్ట్‌మెంట్‌లలో మహిళల బృందంలోని ఒకరి ఇంట్లో కానీ లేదా కమ్యూనిటీ హాల్‌లో కానీ నిర్వహిస్తారు. కానీ జెంట్స్ పార్టీల్లో ఔటింగ్ కల్చర్ ఎక్కువగా కనిపిస్తోంది. సిటీకి దూరంగా వెళ్లి ఒక రోజంతా గడిపేందుకే ఎక్కువ మంది ఆసక్తి చూపుతున్నారు.
విహారయాత్రలు కూడా..
కిట్టీ పార్టీల మరో ప్రత్యేకత ఏడాదికి ఒకసారి దేశ, విదేశాల్లోని పర్యాటక ప్రాంతాల్లో విహరించడం, ప్రతి నెలా పొదుపు చేసే డబ్బులతో గోవా, కేరళ, కాశ్మీర్, జైపూర్ వంటి ప్రాంతాల్లో పర్యటనలకు వెళ్తారు. అలాగే దుబాయ్, సింగపూర్, మలేసియా, బ్యాంకాక్, ఫిలిప్పీన్స్ వంటి దేశాలకు సైతం కిట్టీ పార్టీలు పరుగులు తీస్తున్నాయి. ఏటా ఓ పది రోజులు టూర్‌కు వెళ్లి రావడం కూడా ఈ పార్టీల కల్చర్‌లో భాగంగా కొనసాగుతోంది.
ఇదీ ‘కిట్టీ’ చరిత్ర..
దేశవిభజన అనంతరం 1950లో ఈ వినూత్నమైన కిట్టీపార్టీ సంస్కృతి ప్రారంభమైంది. ఒకే ప్రాంతంలో నివసించే మహిళల మధ్య స్నేహ సంబంధాలను ఏర్పాటు చేసుకోవడమే ప్రధాన లక్ష్యంగా మొదలయ్యాయి. దేశవిభజన ఫలితంగా ఆర్థికంగా తీవ్ర కష్టాలకు గురైన కుటుంబాలను ఆదుకునేందుకు పది మంది మహిళలు కలిసి రావడం ఒక ఉన్నతమైన సంప్రదాయంగా నిలిచింది. పంజాబ్, ఉత్తరప్రదేశ్‌లో మొదలైన ఈ సంస్కృతి 1980 తరువాత క్రమంగా అంతటా విస్తరించింది.
Comments
Please login to add a commentAdd a comment