భర్త సహకారంతో పంటల సాగు.. | Farming with the help of her husband | Sakshi
Sakshi News home page

భర్త సహకారంతో పంటల సాగు..

Published Mon, Sep 22 2014 1:09 AM | Last Updated on Wed, Aug 15 2018 5:57 PM

Farming with the help of her husband

నర్సాపూర్ (దండేపల్లి) : నర్సాపూర్ గ్రామానికి చెందిన నరెడ్ల సత్యనారాయ, విజయ దంపతులు పదిహేనుళ్లుగా వ్యవసాయం చేస్తున్నాయి. వారికి ఉన్న ఐదెకరాల భూమిలో ఏడేళ్లపాటు వరి సాగు చేశారు. దిగుబడి అంతంతమాత్రమే కావడంతో వరి సాగుకు స్వస్తి పలికారు. సత్యనారాయణ ఐటీఐలో మెటార్ మెకానిక్ చేశాడు. ఉద్యోగం రాకపోవడంతో వ్యవసాయన్నే వృత్తిగా మలుచుకున్నాడు.

వరి సాగుతో ఆశించిన లాభాలు రాకపోవడంతో వరికి బదులు ఐదెకరాల్లో వివిధ రకాల కూరగాయలు సాగు చేశారు. లాభాల పంట పండడంతో కూరగాయలే సాగు చేస్తున్నారు. సత్యనారాయణ కూరగాయలను జన్నారం, ముత్యంపేట, దండేపల్లి, మేదర్‌పేట, తాళ్లపేట, లక్సెట్టిపేట, ద్వారకలో జరిగే వారసంతలకు తరలించి విక్రయిస్తుంటాడు. సాగు పనులన్నీ విజయ ముందుండి చేస్తోంది.

 సాగు వివరాలు ఆ దంపతుల మాటల్లోనే..
 ఏడాది పొడవునా సాగు..
 వరి, పత్తి వంటి పంటల సాగు మూడు నుంచి నాలుగు నెలల్లోనే పూర్తవుతుంది. కూరగాయల సాగు ఏడాదంతా చేపట్టవచ్చు. సీజన్ వారీగా డిమాండ్ ఎక్కువ ఉన్న వాటిని సాగు చేసి లాభాలు సాధించవచ్చు. మిర్చి, వంకాయ, టమాటా, బెండ, అలసంద, బీరకాయ, కాకరకాయ వంటి కూరగాయలను సాగు చేస్తున్నాం. వీటి సాడు ఏడాదంతా చేపడుతాం.

 సేంద్రియ పద్ధతిలో..
 సత్యనారాయణ ఎన్‌పీఎం(నాన్ ఫెస్టిసైడ్ మేనేజ్‌మెంట్) వీఏ(విలేజ్ అక్టివిటిస్ట్)గా పని చేస్తుం డడంతో కూరగాయల సాగును పూర్తిగా సేంద్రి య పద్ధతిలో చేపడుతున్నాం. ఎలాంటి రసాయనిక ఎరువులు వాడకుండా ఇంటి వద్దనే సేం ద్రియ ఎరువులు తయారు చేసి పంటలకు వేస్తున్నారు. కూరగాయల దిగుబడి బాగా వచ్చేందు కు నాడెపు కంపోస్టు ఎరువు, ఘనజీవామృతం, ద్రవజీవామృతం, పంచగవ్వ, పేడ ఎరువును వాడడంతోపాటు రసం పీల్చే పురుగుల నివారణకు పంట చేళల్లో తెలుపు, పసుపు ప్లేట్ల ఏర్పాటు, వావిలాకు కషాయం, బ్రహ్మస్త్రం, అగ్రిహస్త్రం వంటి మందులు కూడా తయారు చేసి పిచికారీ చేస్తున్నట్లు విజయ పేర్కొన్నారు.

 డ్రిప్‌తో నీరు..
 కూరగాయల సాగుకు నీటిని డ్రిప్ పద్ధతిలో అందిస్తున్నాం. కాలువలు ఏర్పాటు చేసి నీళ్లందించడంతో ఎక్కువ నీరు పడుతుంది. కాబట్టి వ్యవసాయ బావికి డ్రిప్ సిస్టమ్‌ను బిగించాం. డ్రిప్ తో మొక్కకు నేరుగా నీరందడంతోపాటు నీరు వృథా కాదు.

 ఎరువుల తయారీ ఇలా..
 మనం పడేసే వ్యర్థ పదార్థాలు, పిచ్చిమొక్కలు, పశువుల పేడ, ఆవు మూత్రం వంటి వాటితో సేంద్రియ ఎరువులు తయారు చేసుకోవచ్చు.

 నాడెపు కంపోస్టు ఎరువు..
 దీంతో భూసారం పెరిగి పంట దిగుబడి వస్తుం ది. గడ్డి, కలుపు మొక్కలు ఒక చోట కుప్పగా వేయాలి వాటిపై ఆవుపేడ, మూత్రం చల్లాలి. ఒకసారి కుప్పగా వేసింది కొంత కుళ్లిపోగానే దానిపై మరో సారిగడ్డి, కలుపు మొక్కల కుప్ప వేసి మళ్లీ ఆవుపేడ, మూత్రం చల్లాలి ఇలా ఒకటి నుంచి 5 స్టెప్‌ల వరకు కుప్పగా వేయాలి 70 రోజుల్లో నాడెపు కాంపోస్టు ఎరువు తయారవుతుంది. దీనిని పంటలకు వేసుకోవచ్చు.

 ఘనజీవామృతం..
 ఇది కూడా భూసార పెంపునకు ఉపయోగ పడుతుంది. క్వింటాళు ఆవుపేడ, 2 కిలోల బెల్లం, 2 కిలోల పిండి(పప్పుధాన్యాలతో తయారు చేసిం ది)తో తయారు చేసుకోవాలి. గుప్పెడు మట్టి వీ టన్నింటిని చూర్ణం చేసి చెట్టు మొదట్లో వేసినట్లయితే కాత బాగా కాస్తుంది. మొక్క, చెట్టు బలం గా ఉంటుంది. ఇది ఒక ఎకరాకు సరిపోతుంది.

 ధ్రవ జీవామృతం..
 దీన్ని పిచికారీ చేయాలి.. 10 కిలోల ఆవుపేడ, 2 కిలోల బెల్లం, 2కిలోల పిండి(పప్పుదినుసులతో తయారు చేసింది) 200 లీటర్ల నీటిలో కలిపాలి. వారం రోజులపాటు నానబెట్టాలి. ప్రతి రోజు కలియ తిప్పాలి. ఆ తర్వాత పంటలకు పిచికారీ చేయవచ్చు. ఇది కూడా ఒక ఎకరానికి సరిపోతుంది. దీని ద్వారా చీడలను నివారించవచ్చు.

 పంచగవ్వ..
 ఇది సూక్ష్మధాతు లోపానికి వినియోగించవ చ్చు. పావుకిలో ఆవునెయ్యి, 2 లీటర్ల చొప్పున ఆవు పాలు, పెరుగు, డజను అరటి పండ్లు, 2 లీటర్ల కొబ్బరి నీళ్లతో తయారు చేసుకోవాలి. ఈ మిశ్రమాన్ని ఎకరాకు పిచికారీ చేయొచ్చు.

 పసుపు, తెలుపు ప్లేట్లు..
 చేనులో పసుపు, తెలుపు రంగుతో ఇనుప ప్లేట్లు ఏర్పాటు చేసి వాటికి నాలుగురోజులకోసారి గ్రీసు రాస్తే రసం పీల్చే పురుగులు వాటిపై వాలి అతుక్కుంటాయి. ఇలా చేయడంతో రసం పీల్చు పురుగులు నివారించవచ్చు. ఇవే కాకుండా వివిధ రకాల తెగుళ్ల నివారణకు వావిలాకు, వేప ఆకులతో తయారు చేసిన కషాయాలు, బ్రహ్మస్త్రం, అగ్రిహస్త్రం వంటి వాటిని కూడా ఉపయోగించవచ్చు.

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement