చీరాల : పాడి పశువుల పోషణలో ఆశించిన లాభాలను గడించాలంటే మేలైన యాజమాన్య పద్ధతులు అవలంబించాలని అసిస్టెంట్ డెరైక్టర్ డాక్టర్ ఎం.హనుమంతరావు తెలిపారు. దాణా ఖర్చులు తగ్గించుకోవడం, పునరుత్పత్తి సామర్థ్యాన్ని పెంపొందించడం, ఆరోగ్య పరిరక్షణ ద్వారా అధిక లాభాలు పొందవచ్చన్నారు. పశుపోషణపై ఆయన సలహాలు, సూచనలు ఇచ్చారు.
తాగునీటి యాజమాన్యం..
పాడిపశువులకు ఎప్పుడూ పరిశుభ్రమైన మంచినీటిని అందుబాటులో ఉంచాలి. రోజూ నీటి తొట్టెలను శుభ్రం చేయాలి. 15 రోజులకొకసారి బ్లీచింగ్ పౌడర్‌తో నీటి తొట్టెలను శుభ్రపరచాలి. మురుగు నీరు, కుంటల్లో నిల్వ ఉన్న నీటిని తాగించకూడదు. ఈ నీటిలో హానికర బ్యాక్టీరియా, నట్టలు ఉండడం వల్ల పారుడు వ్యాధి సోకవచ్చు.
పోషణ..
రోజుకు 5 లీటర్ల పాలు ఇచ్చే పాడి పశువుకు రోజూ 20 కిలోల పచ్చిమేత, 7 కిలోల ఎండుమేత, కిలో దాణా ఇవ్వాలి. 3 లీటర్ల పాలు ఇచ్చే వాటికి 2 కిలోల దాణా అదనంగా ఇవ్వాల్సిఉంటుంది. ఖనిజ లవణ మిశ్రమం రోజూ 50 గ్రాముల చొప్పున దాణాలో కలిపి ఇస్తే పాల ఉత్పత్తి పెరుగుతుంది. పచ్చిమేత లభించని సమయంలో పాతరగడ్డి, సుపోషకం చేసిన వరిగడ్డిని వాడుకోవాలి. గడ్డిని కట్టర్ ద్వారా ముక్కలుగా చేసి పశువులకు వేయడం ద్వారా వృథాను అరికట్టవచ్చు.
పునరుత్పత్తి సామర్థ్యం..
పాడిపశువుల పెంపకంలో లాభదాయకత పశువుల పునరుత్పత్తి సామర్థ్యంపై ఆధారపడి ఉంటుంది. ఈతకు-ఈతకు మధ్య 13-14 నెలల కంటే ఎక్కువ ఉండకూడదు. పశువు ఈనిన 90-120 రోజుల మధ్య కాలంలో ఎదకు వస్తుంది. ఈ ఎద చాలా ఫలప్రదమైంది. చాలామంది రైతులు ఈ సమయంలో గేదెను దాటిస్తే పాల ఉత్పత్తి తగ్గిపోతుందనే భ్రమతో ఆ ఎదను ఉపయోగించుకోరు. దీంతో కొన్ని పశువుల్లో గర్భకోశం నిద్రావస్థలోకి వెళ్లి మళ్లీ ఎద లక్షణాలు వెంటనే కనిపించవు.
పూర్తిగా పాల ఉత్పత్తి తగ్గిన తర్వాత మాత్రమే పశువు ఎదకు రాలేదన్న సంగతి గుర్తించి, ఎద వచ్చేందుకు మందులు వాడుతారు. కొందరు పశుపోషకులు ఈ సమయంలో అలాంటి పశువులను అమ్మేయడమో లేక కబేళాకు తరలించడమో చేస్తుంటారు. దురదృష్టకరమైన విషయం ఏమిటంటే ఈ విధంగా కబేళాలకు తరలించే పశువుల్లో 8-12 శాతం పశువులు చూడివిగా ఉంటున్నాయి. పునరుత్పత్తి యాజమాన్యంపై రైతులకు అవగాహన లేమితో ఈ ఘోరం జరుగుతోంది.
ఏమి చేయాలి..
పాడి పశువు ఈనిన 90-120 రోజుల మధ్య వచ్చే ఎదలో పశువును కచ్చితంగా కట్టించాలి. 3 నెలల తర్వాత చూడి పరీక్ష చేయించాలి. చూడి నిర్ధారణ అయితే మరో 4 నెలల (అంటే 7 నెలలు చూలు వచ్చేంత వరకు) పాలు పిండుకోవాలి. ఆ తర్వాత చివరి మూడు నెలలు చూడి గేదెకు విశ్రాంతి ఇవ్వాలి. ఈ విధంగా 10 నెలలు (300 రోజులు) పాల ఉత్పత్తిని పొందినట్లయితే మరో 3 నెలల తర్వాత గేదెమళ్లీ ఈని పాల ఉత్పత్తి ప్రారంభిస్తుంది. ఇది లాభదాయకం.
మేలైన పద్ధతులతో పశుపోషణ పండగే..
Published Thu, Nov 13 2014 3:33 AM | Last Updated on Wed, Apr 3 2019 4:08 PM
Advertisement