Dairy cattle nutrition
-
పాడి పశువుల ఆరోగ్యాన్ని ప్రభావితం చేసే అంశాలు
పాడి పశువుల పోషణ, నిర్వహణతోపాటు వాటి ఆరోగ్యం పట్ల కూడా శ్రద్ధవహించడం ఎంతో ముఖ్యం. పాడి పశువులు సక్రమంగా మేత మేస్తూ, ఇతర ఇబ్బందులు లేకుండా, దిగుబడి తగ్గకుండా పాలు ఇస్తున్నట్లయితే అవి ఆరోగ్యంగా ఉన్నాయని తెలుసుకోవాలి. అనారోగ్య సూచనలు: పశువు మందకొడిగా ఉండడం, ముట్టి తడి ఆరిపోయి ఉండడం, కళ్లు ఎర్రబడడం లేదా పుసులు కారడం, మేత తినదు, నెమరు వేయదు, పొట్ట కదలకుండా ఉబ్బరంగా ఉండడం, శరీరం వేడిగా జ్వరంతో ఉండడం, పలుచటి పేడ వేయడం, వణకటం, దద్దుర్లు రావడం, పాల ఉత్పత్తి ఒకేసారి తగ్గించడం/ క్రమేమీ తగ్గించడం, మూత్రం రంగు మారడం. ఈ లక్షణాలు పాడి పశువుల్లో కనిపించినట్లయితే ఊగిలెనంత త్వరగా పశువైద్యుడ్ని సంప్రదించి చికిత్స చేయించుకోవాలి. పశువుల ఆరోగ్యాన్ని ప్రభావితం చేసే అంశాలు వాతావరణం: విదేశీ ఆవులు వేడి వాతావరణాన్ని తట్టుకోలేవు. అందుకే 50% సంకర జెర్సీ ఆవును లేదా సంకరజాతి హెచ్.ఎఫ్. జాతి ఆవులను ఎన్నుకోవాలి. ఎండలో మేపకుండా ఇంటివద్దనే చెట్ల నీడలలో గానీ, పాక లేదా తాటాకు షెడ్ల కింద చల్లటి వాతావరణంలో పోషించినట్లయితే మంచి పాలదిగుబడినిస్తాయి. గేదెలు నల్ల చర్మం కలిగి ఉండటం వలన వేసవి తాపాన్ని తట్టుకోలేవు. వాటిని ఉదయం పూటనే మేతకు పంపాలి. పగటిపూట ఇంటి వద్ద చల్లటివాతావరణంలో పోషించాలి. అప్పుడే వాటి ఉత్పాదకత కోల్పోకుండా మంచి పాలదిగుబడినిస్తాయి. పరిసరాలు : పాడి పశువులను పెంచే స్థలాల వద్ద పరిసరాలు శుభ్రతగా ఉండే విధంగా చూసుకోవాలి. సరైన గాలి, వెలుతురు వచ్చే విధంగా చూసుకోవాలి. మురికి నీరు నిలవకుండా చూసుకోవాలి. దాని వల్ల దోమలు, ఈగలు మొదలగు వాటిని అరికట్టి కొన్ని రకాల వ్యాధులు సోకకుండా చూసుకోవచ్చు. మేత, తాగునీరు: పాడి పశువులకు మంచి పోషకాహార పదార్థాలు కలిగిన మేత సరిపోయేంత ఇవ్వాలి. పాడి పశువులకు ఇచ్చే మేత దాని శరీర అవసరానికి పోను పాల ఉత్పత్తి కోసం, ఒక వేళ సూడితో ఉన్నట్లయితే గర్భంలో పెరిగే పిండానికి అధిక పోషకాహారం అందించవలసి ఉంటుంది. అందుకే పాడి పశువులకు నాణ్యమైన మేత, దాణా సరిపోయేంత ఇవ్వాలి. పరిశుభ్రమైన తాగునీరు ఎల్లవేళలా అందుబాటులో ఉంచాలి. మురికినీరు, కలుషితప్రాంతాలలో నీరు తాగించడం వల్ల పాడి పశువులు అనారోగ్యానికి గురవుతాయి. రైతు ప్రతి రోజూ తన పాడి పశువులను గమనించి ఏవైనా అనారోగ్య లక్షణాలు కనిపిస్తే పశువైద్యునిచే చికిత్స చేయించాలి. అశ్రద్ధ కనపరిస్తే నష్టం అపారం కాబట్టి అప్రమత్తంగా ఉండాలి. -
మేలైన పద్ధతులతో పశుపోషణ పండగే..
చీరాల : పాడి పశువుల పోషణలో ఆశించిన లాభాలను గడించాలంటే మేలైన యాజమాన్య పద్ధతులు అవలంబించాలని అసిస్టెంట్ డెరైక్టర్ డాక్టర్ ఎం.హనుమంతరావు తెలిపారు. దాణా ఖర్చులు తగ్గించుకోవడం, పునరుత్పత్తి సామర్థ్యాన్ని పెంపొందించడం, ఆరోగ్య పరిరక్షణ ద్వారా అధిక లాభాలు పొందవచ్చన్నారు. పశుపోషణపై ఆయన సలహాలు, సూచనలు ఇచ్చారు. తాగునీటి యాజమాన్యం.. పాడిపశువులకు ఎప్పుడూ పరిశుభ్రమైన మంచినీటిని అందుబాటులో ఉంచాలి. రోజూ నీటి తొట్టెలను శుభ్రం చేయాలి. 15 రోజులకొకసారి బ్లీచింగ్ పౌడర్‌తో నీటి తొట్టెలను శుభ్రపరచాలి. మురుగు నీరు, కుంటల్లో నిల్వ ఉన్న నీటిని తాగించకూడదు. ఈ నీటిలో హానికర బ్యాక్టీరియా, నట్టలు ఉండడం వల్ల పారుడు వ్యాధి సోకవచ్చు. పోషణ.. రోజుకు 5 లీటర్ల పాలు ఇచ్చే పాడి పశువుకు రోజూ 20 కిలోల పచ్చిమేత, 7 కిలోల ఎండుమేత, కిలో దాణా ఇవ్వాలి. 3 లీటర్ల పాలు ఇచ్చే వాటికి 2 కిలోల దాణా అదనంగా ఇవ్వాల్సిఉంటుంది. ఖనిజ లవణ మిశ్రమం రోజూ 50 గ్రాముల చొప్పున దాణాలో కలిపి ఇస్తే పాల ఉత్పత్తి పెరుగుతుంది. పచ్చిమేత లభించని సమయంలో పాతరగడ్డి, సుపోషకం చేసిన వరిగడ్డిని వాడుకోవాలి. గడ్డిని కట్టర్ ద్వారా ముక్కలుగా చేసి పశువులకు వేయడం ద్వారా వృథాను అరికట్టవచ్చు. పునరుత్పత్తి సామర్థ్యం.. పాడిపశువుల పెంపకంలో లాభదాయకత పశువుల పునరుత్పత్తి సామర్థ్యంపై ఆధారపడి ఉంటుంది. ఈతకు-ఈతకు మధ్య 13-14 నెలల కంటే ఎక్కువ ఉండకూడదు. పశువు ఈనిన 90-120 రోజుల మధ్య కాలంలో ఎదకు వస్తుంది. ఈ ఎద చాలా ఫలప్రదమైంది. చాలామంది రైతులు ఈ సమయంలో గేదెను దాటిస్తే పాల ఉత్పత్తి తగ్గిపోతుందనే భ్రమతో ఆ ఎదను ఉపయోగించుకోరు. దీంతో కొన్ని పశువుల్లో గర్భకోశం నిద్రావస్థలోకి వెళ్లి మళ్లీ ఎద లక్షణాలు వెంటనే కనిపించవు. పూర్తిగా పాల ఉత్పత్తి తగ్గిన తర్వాత మాత్రమే పశువు ఎదకు రాలేదన్న సంగతి గుర్తించి, ఎద వచ్చేందుకు మందులు వాడుతారు. కొందరు పశుపోషకులు ఈ సమయంలో అలాంటి పశువులను అమ్మేయడమో లేక కబేళాకు తరలించడమో చేస్తుంటారు. దురదృష్టకరమైన విషయం ఏమిటంటే ఈ విధంగా కబేళాలకు తరలించే పశువుల్లో 8-12 శాతం పశువులు చూడివిగా ఉంటున్నాయి. పునరుత్పత్తి యాజమాన్యంపై రైతులకు అవగాహన లేమితో ఈ ఘోరం జరుగుతోంది. ఏమి చేయాలి.. పాడి పశువు ఈనిన 90-120 రోజుల మధ్య వచ్చే ఎదలో పశువును కచ్చితంగా కట్టించాలి. 3 నెలల తర్వాత చూడి పరీక్ష చేయించాలి. చూడి నిర్ధారణ అయితే మరో 4 నెలల (అంటే 7 నెలలు చూలు వచ్చేంత వరకు) పాలు పిండుకోవాలి. ఆ తర్వాత చివరి మూడు నెలలు చూడి గేదెకు విశ్రాంతి ఇవ్వాలి. ఈ విధంగా 10 నెలలు (300 రోజులు) పాల ఉత్పత్తిని పొందినట్లయితే మరో 3 నెలల తర్వాత గేదెమళ్లీ ఈని పాల ఉత్పత్తి ప్రారంభిస్తుంది. ఇది లాభదాయకం.